కొత్త పార్టీకే సై.. | kiran kumar reddy ready to launch new party | Sakshi
Sakshi News home page

కొత్త పార్టీకే సై..

Published Mon, Feb 24 2014 1:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కొత్త పార్టీకే సై.. - Sakshi

కొత్త పార్టీకే సై..

రేపే తిరుపతిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన?
 
 సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దానిపై బుధవారం తిరుపతిలో ప్రకటన చేయవచ్చని తెలిసింది. సమైక్యాంధ్ర పేరుతో ఇప్పటికే రిజిస్టరైన ఒక రాజకీయ పార్టీని తీసుకుని, దానితో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. పార్టీ జెండా, ఎజెండా రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం కాంగ్రెస్ బహిష్కత ఎంపీలు, కొందరు మంత్రులతో భేటీ అయ్యారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణకుమార్, సాయిప్రతాప్, సబ్బంహరి, హర్షకుమార్, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర మంత్రి శైలజానాథ్ పాల్గొన్నారు. అయితే తాను వేరే పనిపై కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశానే తప్ప ఎంపీలతో భేటీలో పాల్గొనలేదని శైలజానాథ్ చెప్పారు.
 
 మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా ఆదివారం నాటి భేటీకి హాజరయ్యారు. మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, పితాని సత్యనారాయణ విడిగా సాయంత్రం కిరణ్‌ను కలిశారు. మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా కిరణ్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న తన తమ్ముడికి సంబంధించిన విలాసవంతమైన భవ నంలో కార్యాలయాన్ని తెరిచి, అక్కడ ఈ సమావేశాలు చేపట్టారు. దాదాపు మూడు గంటలసేపు సాగిన భేటీల్లో సీమాంధ్రలో సమైక్య సెంటిమెంట్ ఆధారంగానే ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచన చేశారు. ఇదివరకు ‘చెప్పులు (జోళ్లు)’ గుర్తు లభించిన జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో తూర్పు గోదావరి జిల్లా మాచవరంలో కొందరు వ్యక్తులు రిజిస్టర్ చేయించిన పార్టీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది. ఇవే కాకుండా ఇప్పటికే రిజిస్టరై ఉన్న సమైకాంధ్ర పార్టీ (గుర్తు గాలిపటం), ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్ర సమితి (గుర్తు బ్యాట్స్‌మెన్)పైనా చర్చ జరిగింది. ఈ విషయంలో కిరణ్ సోమవారం సన్నిహిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయానికి రానున్నారు. సోమవారం నాటి సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కిరణ్ అనుచరులు ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు.
 
 ఆదివారం జరిగిన సమావేశంలో కొత్త పార్టీ గురించి కిరణ్ తన మనసులో ఏముందో చెప్పకుండా ఎంపీల అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల నడుమ సీమాంధ్రలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు వీలైన రాజకీయ పరిస్థితులున్నాయా? అన్న విషయంపై చర్చ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని ఎంపీలు కిరణ్‌కు సూచించారు. విభజన  బిల్లును తిరస్కరించాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్టీకి ఆయుధంలా వాడుకోవాలని చెప్పారు.

 

ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలోనే వెలువడే అవకాశాలు ఉండటం, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన ను ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయరాదన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో పార్టీ ప్రకటన ఎప్పుడు చేయాలి? జెండా, ఎజెండా ఎలా ఉండాలి? అన్న అంశాలపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లోనే కొత్త పార్టీని ప్రకటించి, ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే నియోజకవర్గాల పర్యటనల్లో ఉన్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పరిస్థితిపై అంచనాలను సోమవారం నాటి సమావేశంలో కిరణ్‌కు వివరించనున్నారు. విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళ, యువజన విభాగాలతో వేర్వేరుగా సమావేశాలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో వచ్చే అభిప్రాయాలను క్రోడీకరించి ఎజెండాను ఖరారు చేయనున్నారు. మంగళ లేదా బుధవారం కొత్త పార్టీ ప్రకటన చేసి, తదుపరి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంల్లో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
 లగడపాటి రాక వెనుక?...
 
 తెలంగాణ బిల్లుకు ఆమోదంతో రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ సీఎంతో సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ సమావేశంలో కొత్త పార్టీ ఆవశ్యకత గురించి కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు లగడపాటి, సబ్బం హరి ఎక్కువగా మాట్లాడారని సమాచారం. వచ్చే సాధారణ ఎన్నికల్లో కొత్త పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయంటూ లగడపాటి చేసిన విశ్లేషణ వెనుక వేరే వ్యూహం ఉందా? అన్న అనుమానం వస్తోందని ఈ సమావేశంలో పాల్గొన్న ఒక నేత వ్యాఖ్యానించడం విశేషం. ప్రజలు కొత్త పార్టీని కోరుకోవట్లేదన్న విషయం తమకు తెలుసునని, కానీ లగడపాటి పదేపదే పార్టీ పెట్టాలని ఒత్తిడి చేయడం వెనుక టీడీపీకి ఏదో రకంగా ప్రయోజనం చేకూర్చాలన్న రహస్య ఎజెండా ఉండొచ్చన్న అనుమానాన్ని మరో నేత వ్యక్తం చేశారు. పార్టీ పెట్టాల్సిందేనని లగడపాటి గట్టిగా ఒత్తిడి చేస్తుండటం చూస్తుంటే ఏదో మతలబు ఉన్నట్టుందని ఆయన వ్యాఖ్యానించారు.


 
 ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణకే...
 
 పార్లమెంట్ సాక్షిగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ పార్టీ దాడులు చేయించిందని, ఈ తరుణంలో ఆంధ్రప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకు కొత్త పార్టీ ఏర్పాటు ఎంతో ఆవశ్యకమని అమలాపురం ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దేశప్రజలకు చాటి చెప్పడానికే కొత్త పార్టీ అవతరిస్తుందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలతో కూడా చర్చించాక, మళ్లీ అందరమూ మరోమారు సీఎంతో సమావేశమవుతామని ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఎన్టీ రామారావు, చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ వారి వెంట లేరని, కానీ కిరణ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎమ్మెల్యేలను ముందుకు తీసుకువెళ్లినందున వారితో మంతనాలు సాగిస్తున్నారని చెప్పారు.
 
 
 ఇదీ కాంగ్రెస్ దుస్థితి...
 
 రాష్ట్రంలో కాంగ్రెస్ దుస్థితికి తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి... మరోవైపు కాంగ్రెస్‌ను చీల్చి కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీని ధిక్కరించి బహిష్కృతులైన ఆరుగురు ఎంపీలు ఆయనతో సమావేశమయ్యారు. అలాగే ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొందరు నేతలు కూడా అదేబాటలో నడిచారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కిరణ్‌తో సమావేశమై ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయాలన్న సమాలోచనల్లో భాగస్వాములవుతున్నారు. విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర పడగానే తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్‌లో ఎవరికి వారే నడుచుకుంటున్నారు. కొందరు ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తుంటే... మరికొందరు కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో అంతుబట్టని నేతలు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తమ పార్టీని చీల్చుతూ వేరే కుంపటి పెట్టుకోవడానికి కిరణ్ భేటీలు నిర్వహిస్తున్నా పార్టీ పెద్దల నుంచి కూడా కనీస స్పందన లేకపోవడం గమనార్హం. పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ స్థానంలో ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించకుండా ఆయననే ఇంకా కొనసాగిస్తున్నారంటే ఏమనుకోవాలో అర్థంకావడం లేదని సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ వ్యవహారం మొత్తం పార్టీ అధిష్టానమే దగ్గరుండి నడిపిస్తున్నదా? అన్న సందేహం కలుగుతోందని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement