సీన్ ఢిల్లీకి!
సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
జానారెడ్డి చాంబర్లో తెలంగాణ నేతల సమావేశం
రాష్ర్టపతిని, పార్టీ పెద్దలను కలిసేందుకు 3, 4 తేదీల్లో హస్తినకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగియడంతో ఇక సీన్ మొత్తం హస్తినకు మారుతోంది. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక ఇరు ప్రాంతాల నేతలు ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు పార్టీ ముఖ్యనేతలను కలవాలని వారు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్, పార్థసారధి, తోట నర్సింహం తదితరులు... అయిదుగురు ఎంపీలు, 22 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు.
విభజన బిల్లును తిరస్కరిస్తూ సీఎం తీర్మానం పెట్టడం, సభ దాన్ని ఆమోదించడంతో కిరణ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. సభలో తిరస్కార తీర్మానానికి సహకరించిన నేతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా రాష్ట్రపతిని విన్నవించేందుకు ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. బిల్లు రాష్ట్రపతినుంచి కేంద్రానికి వెళ్లకముందే ఆయన్ను కలవాల్సి ఉన్నందువల్ల, ఫిబ్రవరి 4న కేంద్ర మంత్రుల బృందం భేటీకి ముందుగానే ఢిల్లీ వెళ్లాలని కొందరు సూచించారు. దీంతో రెండురోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మేధోమధన సదస్సును నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుందామని సీఎం చెప్పారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో మౌన దీక్షలు చేయాలని, ఏపీ భవన్‌నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పరేడ్‌గా వెళ్లాలని కొందరు సూచించారు. రాష్ట్ర సమైక్యతకోసం ఏ కార్యక్రమం చేపట్టినా తామంతా వెన్నంటే ఉంటామని మంత్రి శైలజానాధ్ చెప్పారు. అవసరమైతే రాష్ట్ర బంద్‌కు సీఎం పిలుపునివ్వాలని, ధర్నాలు, దీక్ష లకు దిగితే తామంతా వాటిని విజయవంతం చేస్తామని తెలిపారు. బిల్లు తిరస్కరణ తీర్మానంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నూతనోత్సాహం వచ్చిందని, ఇతర పార్టీలవారందరినీ ముందుకు తీసుకువస్తామని శైలజానాధ్, గంటా శ్రీనివాసరావులతోసహా ఇతర మంత్రులు వివరించారు.
మరోవైపు మంత్రి జానారెడ్డి చాంబర్లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతితో పాటు పార్టీ పెద్దలందరినీ కలవాలని నిర్ణయించారు.
నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని, ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లనే సాధ్యమైందన్న ప్రచారం మరింత ముమ్మరం చేయాలని తీర్మానించారు. ఆ మేరకు అందరూ నియోజవకర్గాలకు బయలుదేరారు. ఆదివారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.