ప్రక్రియపై ప్రభావముండదు | no affect on t.process, says congress | Sakshi
Sakshi News home page

ప్రక్రియపై ప్రభావముండదు

Published Fri, Jan 31 2014 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రక్రియపై ప్రభావముండదు - Sakshi

ప్రక్రియపై ప్రభావముండదు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన తీర్మానం రాష్ట్ర విభజన ప్రక్రియపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని, రాజ్యాంగం ప్రకారం దానికి పెద్ద విలువేమీ లేదన్నది కేంద్ర ప్రభుత్వ మనోగతమని తెలుస్తోంది. తెలంగాణను ఏర్పాటు చేసేందుకు, ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాజ్యాంగంలో కేంద్రానికున్న అధికారాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛ తమకుందని ప్రభుత్వంలోని, కేంద్ర హోంశాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. ‘‘కేవలం అసెంబ్లీని అభిప్రాయం కోసమే బిల్లును పంపారు తప్ప నిర్ణయం చెప్పేందుకు కాదు. కనుక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి అసెంబ్లీ తీర్మానం ఎలాంటి అవరోధమూ కాబోదు. కేంద్రం ఇప్పటిదాకా రాజ్యాంగం ప్రకారమే నడుస్తూ వచ్చింది.

 

ఇకపై కూడా అదే బాటలో ప్రక్రియను పూర్తి చేస్తుంది. రాజ్యాంగంలోని 3, 4 అధికరణలు ఇచ్చిన అధికారాలతో రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది’’ అని స్పష్టీకరించాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను రాజ్యాంగబద్ధంగా ముగించడానికి న్యాయపరంగా కూడా ఇబ్బందులేమీ తలెత్తబోవన్నాయి. ఆ విషయంలో కేంద్రం అన్ని జాగ్రత్తలూ తీసుకుందని చెప్పాయి. ఇప్పుడున్న దశలో న్యాయపరమైన జోక్యాలకు ఆస్కారమే లేదని అభిప్రాయపడ్డాయి.
 
 ఊపందుకోనున్న సన్నాహాలు
 
 అసెంబ్లీకిచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో ఇక విభజన ప్రక్రియను పార్లమెంటుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు ఊపందుకోనున్నాయి. ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ చర్చ తాలూకు వివరాలు అధికారికంగా అందగానే తుది బిల్లుకు ఓ రూపం వస్తుందని హోం శాఖ వర్గాలు తెలిపాయి. ‘‘ఫిబ్రవరి 4న కేంద్ర మంత్రుల బృందం సమావేశమై బిల్లుకు చేయాల్సిన సవరణలపై చర్చిస్తుందని, ఆ నిర్ణయాల మేరకు తుది బిల్లును తయారు చేసి కేబినెట్ ముందుంచుతాం’’ అని పేర్కొన్నాయి. బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపాక దాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదం తర్వాత బిల్లు రాష్ట్రపతికి వెళ్తుంది. ఆయన సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ రాగానే చట్టరూపం దాలుస్తుంది. పార్లమెంటులో బిల్లుకు ఆమోదం సాధించడమే ఈ ప్రక్రియలో కీలకమైన ఘట్టం. అందుకోసం కేంద్రం ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికతో ముం దుకు కదలనుందని హోం శాఖ వర్గాలంటున్నాయి.
 
 మాకేమీ ఇబ్బంది కాదు: మొయిలీ
 
 ముఖ్యమంత్రి తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడం తెలంగాణ బిల్లుకు ఏమాత్రం అడ్డంకి కాదని పెట్రోలియం మంత్రి, తెలంగాణపై ఏర్పాటైన జీవోఎం సభ్యుడు వీరప్ప మొయిలీ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అసెంబ్లీ తీర్మానంపై ప్రశ్నించగా, ముసాయిదా బిల్లుపై కేంద్రం కోరింది అసెంబ్లీ అభిప్రాయాన్నే తప్ప తీర్మానాన్నో, ఓటింగునో కాదన్నారు. అసెంబ్లీ తీర్మానం తమకేమాత్రమూ ఇబ్బంది కాదని, అసెంబ్లీలో వచ్చిన సవరణలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, తుది బిల్లును కేబినెట్ ఆమోదించాక పార్లమెంట్‌లో పెడతామని చెప్పారు. తెలంగాణ బిల్లుకు చేయాల్సిన సవరణలు, దానిపై వచ్చిన సూచనలు సహా అన్ని అంశాలపైనా ఫిబ్రవరి 4న జీవోఎం సమావేశంలోనే చర్చిస్తామని జీవోఎంలోని కీలక సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మీడియాప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
 
 స్పీకర్‌తో బొత్స, ఆనం, రఘువీరా, కన్నా భేటీ
 సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ మనోహర్‌తో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలు భేటీ అయ్యారు. గురువారం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన వెంటనే స్పీకర్ తన నివాసానికి వెళ్లిపోయారు. తర్వాత మంత్రులు ఆయన నివాసానికి వెళ్లారు. సభలో పునర్విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా సభలో స్పీకర్‌కు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలిగించి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై తదుపరి పరిణామాలపైనా వారు స్పీకర్‌తో చర్చించారు.
 
 ‘టీఆర్‌ఎస్ మాటమీద నిలబడుతుందని ఆశిస్తున్నా’
 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదానికి కాంగ్రెస్ తరఫున చేయాల్సినదంతా చేస్తున్నామని, అయితే ప్రతిపక్షాల మద్దతు లేకుండా అది కుదరదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. అందుకే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని చెప్పలేకపోతున్నామన్నారు. బీజేపీ సహకరిస్తే మాత్రం బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజున టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన గురువారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement