సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. తనను నమ్ముకున్న అక్కలు (సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్ధేశించి)మంత్రులయ్యారని.. వారిని అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నానని తెలిపారు.
వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్ జైలులో ఉందని, సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దని సీఎం పేర్కొన్నారు. సొంత చెల్లి జైల్లో ఉంటే దాని గురించి మాట్లాడలేదని, మైక్ ఇస్తే శాపనార్ధాలు, లేకుంటే పోడియం ముందుకు.. వాళ్ల పనే అంత అంటూ మండిపడ్డారు. తనను అయిదేళ్ల పాటు సభలోకి రానివ్వలేదని, వచ్చినా మార్షల్స్‌ను పెట్టి బటయకు గెంటారని గుర్తు చేశారు.
చెల్లి జైల్లో ఉంటే బజార్ల రాజకీయాలు చేసే నీచుడిని కాదని సీఎం తెలిపారు. మంత్రి సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని, ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కూడా సొంత అక్కల్లాగే భావించానని అన్నారు. అయితే ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళితే.. మరో అక్క కోసం ప్రచారానికి వెళ్తే తనపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారన్న సీఎం.. దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలని సూచించారు.
కాగా అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమనించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బుధవారం మీడియాతో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను టార్గెట్ చేసిన రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి తానే ఆహ్వానించానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా? అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment