రాతపూర్వకంగా అభిప్రాయాలు వెల్లడిస్తాం
శాసనసభ సమావేశాలు ఇలాగే వాయిదాలతో కొనసాగితే మా(టీఆర్‌ఎస్) అభిప్రాయాలను రాతపూర్వకంగా కేంద్రానికి అందజేస్తాం. లోక్‌సభ, రాజ్యసభలో ఇలాంటి సంప్రదాయమే ఉంది. సీమాంధ్రులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదు. డ్రాఫ్టు బిల్లుపై అసెంబ్లీలో చర్చించడానికి మరింత సమయం కోరతామంటూ సీమాంధ్రనేతలు చేసిన కామెంట్లను రాష్ట్రపతికి, కేంద్రానికి పంపించాం. స్పీకర్ కూడా సీమాంధ్ర నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదు. - టి.హరీష్‌రావు(టీఆర్‌ఎస్)
టీడీపీ ‘యూ’ టర్న్ తీసుకుందా?
సమన్యాయమంటూ చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ లైన్ మారిందా? సభలో సమైక్య ప్లకార్డు పట్టుకోవడంలో ఉద్దేశమేంటీ? దీన్ని తెలంగాణ టీడీ పీ నేతలెందుకు ప్రశ్నించడంలేదు? ఇంకా ఆ పార్టీలో ఎందుకుంటారు? సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. సమైక్యమంటూ ఆరుగురే ముందుకొచ్చారు. అందులో నలుగురే దీక్షకు కూర్చున్నారు. దీనినిబట్టి వారి చిత్తశుద్ధి అర్థమవుతోంది.
- యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి(బీజేపీ)
ముగ్గురు బాబులూ ద్రోహులే
కిరణ్‌బాబు, చంద్రబాబు, జగన్‌బాబు ముగ్గురూ తెలంగాణ ద్రోహులే. తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. రాష్ట్ర విభజనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందంటూ స్పీకర్‌కు విజయమ్మ లేఖ ఇవ్వడం సిగ్గుచేటు. తెలంగాణకోసం 2000లో 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపింది వైఎస్సే కదా! 2004లో మాతో పొత్తు పెట్టుకున్న విషయం మరిచారా? ఇక రెండు కళ్ల సిద్ధాంతాన్ని వినిపించే చంద్రబాబు పూర్తిగా బరితెగించి తెలంగాణకు అడ్డుపడుతున్నారు. బాబును ఇరుప్రాంతాల్లో నమ్మే పరిస్థితిలేదు. అధిష్టాన నిర్ణయమే తన నిర్ణయమంటూ ఇన్నాళ్లు చెప్పిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. - ఈటెల రాజేందర్(టీఆర్‌ఎస్)