
సాక్షి, హైదరాబాద్: ప్రొటోకాల్ అంశం మొదలుకుని ప్రభుత్వ బిల్లుల ఆమోదం వరకు ప్రగతిభవన్, రాజ్‌భవన్ నడుమ రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. గవర్నర్, ముఖ్యమంత్రి కార్యాలయాల నడుమ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు పలు సందర్భాల్లో వెల్లడైంది. గవర్నర్ వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రాజ్‌భవన్ బీజేపీ కార్యాలయంగా మారిందని టీఆర్‌ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ప్రొరోగ్ అంశం కూడా తెరమీదకు వస్తోంది. డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సుమారు ఏడాదిన్నరగా మూడు పర్యాయాలు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ప్రొరోగ్ కాకపోవడం ఈ వివాదాన్ని కొత్త మలుపులు తిప్పుతోంది. అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం దక్కడం లేదు. నిబంధనల మేరకు అసెంబ్లీ ప్రొరోగ్ కానంత వరకు అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే అవకాశం లేదు. తాజాగా ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగిసేంత వరకు అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుండానే సమావేశాలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే అప్పటివరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
11 సమావేశాలు .. ఏడుసార్లు ప్రొరోగ్
తెలంగాణ రెండో శాసనసభ 2018లో ఏర్పాటు కాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 11 పర్యాయాలు సమావేశమైంది. ఏడుసార్లు ప్రొరోగ్ అయ్యింది. రాష్ట్ర గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్ పదవీ కాలంలో మూడు పర్యాయాలు రాష్ట్ర రెండో శాసనసభ సమావేశాలు జరిగాయి. తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సార్లు జరిగాయి. అయితే 2020 మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకసారి మాత్రమే తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ ప్రొరోగ్ కాలేదనే కారణంతో 2021, 2022 బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. గత ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల అనంతరం 2021 జూన్‌లో శాసనసభ చివరిసారిగా ప్రొరోగ్ అయింది. ఆ తర్వాత గత ఏడాది సెప్టెంబర్, ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాలు, సెప్టెంబర్‌లో జరిగిన వర్షాకాలం సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు ముగిసినా నేటికీ ప్రొరోగ్ నోటిఫికేషన్ వెలువడలేదు.
రెండో శాసనసభ చివరివరకు ఇలాగే?
తెలంగాణ రెండో శాసనసభ కాల పరిమితి వచ్చే ఏడాది డిసెంబర్‌లో ముగియనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని చివరి సమావేశం వరకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం లేదని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉభయ సభల ప్రొరోగ్‌ను ప్రభుత్వం కోరే అవకాశం లేదని తెలిపాయి. అసెంబ్లీని ప్రొరోగ్ చేసితీరాలనే ఖచ్చితమైన నిబంధన ఏదీ రాజ్యాగంలో లేదని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రొరోగ్ చేసినా గవర్నర్ ప్రసంగించాలనే నిబంధన కూడా లేదని అంటున్నాయి. నిబంధనల మేరకు అసెంబ్లీ సమావేశమయ్యేందుకు కేవలం స్పీకర్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుందని చెప్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏడాదికి పైగా అసెంబ్లీ ప్రొరోగ్ కాలేదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి.
కౌశిక్‌రెడ్డి వివాదం మొదలుకుని బిల్లుల దాకా
గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని శాసన మండలి సభ్యుడిగా నామినేట్ చేస్తూ గత ఏడాది ఆగస్టులో కేబినెట్ తీర్మానించింది. సుమారు రెండు నెలల అనంతరం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తిరస్కరించడంతో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ అంశం మొదలుకుని రాజ్‌భవన్, ప్రగతి భవన్ నడుమ విభేదాలు బహిర్గతమై తర్వాతి కాలంలో తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.
ఇదీ చదవండి: సామాన్యుడి కోసం ధర్మపీఠం