మళ్లీ టీ టైమ్...
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మలి విడత శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి మొదలవుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా పలు సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన వేళ ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై చర్చ కోసం నిర్వహిస్తున్న ఈ సమావేశాలు జనవరి 23 వరకు జరుగుతాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ బంద్‌కు పిలుపునివ్వడం, తెలంగాణకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు నుంచి శాసనసభ వ్యవహారాల శాఖను తప్పించడం వంటి పరిణామాల ప్రభావం సమావేశాలపై పడటం ఖాయంగా కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విభజన బిల్లుపై చర్చ సాఫీగా జరిగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
శాసనమండలిలో, అసెంబ్లీలో విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి, ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించాలి’ అని ఉభయ సభల్లోనూ వైఎస్సార్‌సీపీ పట్టుబడుతుండటంతెలిసిందే. ముందుగా సమైక్య తీర్మానం చేయాల్సిందేనని తొలి విడత సమావేశాల్లో డిమాండ్ చేసిన ఆ పార్టీ, మలి విడతలోనూ అందుకు పట్టుబట్టే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీలతో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన తెలంగాణ నేతలు చర్చ సాఫీగా జరగాలని కోరుతుండటం తెలిసిందే. శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత విభజన బిల్లుపై చర్చను కొనసాగించనున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యపడుతుందన్నది ప్రస్తుత పరిస్థితుల్లో అనుమానమే. విభజన బిల్లుపై సభలో ప్రాంతాలవారీగా, పార్టీలవారీగా భిన్నాభిప్రాయాలున్న తరుణంలో చర్చ అంత సులభం కాదంటున్నారు.
తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గురువారం ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. సభా వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్‌బాబును తొలగించడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినందున ఈ పరిణామంపై శుక్రవారం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మల్లగుల్లాలు పడ్డారు. విభజన బిల్లుపై తెలంగాణ నేతలంతా ఒక్కతాటిపై నడిచేందుకు వీలుగా శుక్రవారం వుధ్యాహ్నం వుంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో అఖిలపక్ష ప్రజాప్రతినిధుల సవూవేశం కానున్నారు. ఇక సీవూంధ్ర నేతలు పార్టీలవారీగా ఎవరికి వారే వ్యూహరచన చేస్తున్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఆ మేరకు అసెంబ్లీలో ముందుగానే తీర్మానం కూడా చేయాలని డిమాండ్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అందుకోసం 77, 78 నిబంధనల కింద స్పీకర్‌కు ఇప్పటికే నోటీసులిచ్చింది కూడా. సమైక్య తీర్మానం కోసం సభలో ఆ పార్టీ పట్టుబట్టే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలవారీగా అభిప్రాయాలు వెల్లడిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ టీడీపీ మాత్రం పార్టీపరంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, ఆ పార్టీ సభ్యులు సభలో ప్రాంతాలవారీగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చ జరగాలని తెలంగాణ నేతలు, అడ్డుకోవాలని సీమాంధ్ర సభ్యులు పట్టుబట్టే అవకాశం ఉంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభకు హాజరు కాకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడత సమావేశాల్లో కూడా ఆయన అసెంబ్లీకి వచ్చినా సభకు గానీ బీఏసీ సమావేశానికి గానీ రాకపోవడం తెలిసిందే.
అయోమయంలో సీఎం: తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్ తీవ్ర అయోమయంలో పడిపోయినట్టు తెలుస్తోంది. విభజన బిల్లుపై జనవరి 23 వరకు చర్చ జరగాలని సభా నాయకుడి హోదాలో ఆయనే కోరినందున, సమావేశాల్లో ఏ వైఖరి అనుసరించాలన్న గందరగోళంలో పడినట్టు కిరణ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. విభజన బిల్లు రాకముందే శాసనసభలో సమైక్య తీర్మానం చేసి పంపుదామంటూ వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించినా ఆయన స్పందించకపోవడం తెలిసిందే. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదని కిరణ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో ఏం చేయాలో అర్థం కాక శాసనసభా వ్యవహారాలను శ్రీధర్‌బాబు నుంచి తప్పించి శైలజానాథ్‌కు అప్పగించారు. సభలో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే ఈ నెల 23 వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కిరణే కోరడం, విభజన బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని బీఏసీలో సీమాంధ్ర నేతలు వాదించినప్పుడు, ‘దాన్ని వివాదం చేయొద్దు’ అని స్వయంగా వారించడం తెలిసిందే. ఆయన తీరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు అంతుబట్టడం లేదు.
బాధ్యతలు స్వీకరించిన శైలజానాథ్
ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ గురువారం శాసనసభా వ్యవహారాల శాఖ బాధ్యతలను చేపట్టారు. అనంతరం స్పీకర్ వునోహర్, డిప్యుటీ స్పీకర్ వుల్లు భట్టి విక్రవూర్కలతో భేటీ అయ్యూరు. అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం తదితరులు కూడా వుంత్రిని కలసి వూట్లాడారు. శుక్రవారం నుంచి అసెంబ్లీలో చేపట్టాల్సిన కార్యక్రవూలపై గత బీఏసీలో చేసిన తీర్మానాలను శైలజానాథ్ చదివారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై శైలజానాథ్, ఇతర సీవూంధ్రకు చెందిన వుంత్రులు, విప్‌లతో కిరణ్ కూడా భేటీ అయ్యూరు. బిల్లుపై సభ్యులంతా వూట్లాడాలని, దానికి వ్యతిరేకంగా అభిప్రాయూలు చెప్పాలని కిరణ్ సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి సీఆర్ కుంతియూను తెలంగాణ వుంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి కిరణ్ తీరుపై చర్చించారు.
విభజన నష్టంపై వైఎస్సార్‌సీపీ లేఖలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచాలని కోరుతున్నదీ వివరిస్తూ సమగ్ర వివరాలతో కూడిన లేఖలను స్పీకర్‌తో పాటు సభ్యులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సభలో అందించనుంది. విభజన వల్ల ప్రాంతాలవారీగా ఎలా నష్టం జరుగుతుందన్న అంశాలన్నింటినీ అందులో పొందుపరచనుంది.