సమైక్య తీర్మానానికి పట్టుపడదాం
వాయిదా తీర్మానానికి వైఎస్సార్ సీఎల్పీ నిర్ణయం
ప్రభుత్వం అంగీకరించకపోతే.. ప్రైవేటు బిల్లు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సభలో తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. బుధవారం సాయంత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్ర రైతాంగానికి జరిగే అన్యాయం, కరెంటు చార్జీల పెంపు, వరుస తుపానుల వల్ల నష్టపోయిన రైతుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో చర్చకు తేవాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం సభలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయాలని వాయిదా తీర్మానాన్ని ఇస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం అంగీకరించకపోతే శుక్రవారం ఇదే అంశంపై ప్రైవేటు బిల్లును సభలో ప్రతిపాదించడానికి సిద్ధపడుతున్నామని తెలిపారు. ఈ దశలో సమైక్య తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని, అపుడు మాత్రమే ఎవరు సమైక్యవాదులో.. ఎవరు విభజనవాదులో అందరికీ తెలుస్తుందని చెప్పారు.
చంద్రబాబే.. రాష్ట్రాన్ని చీల్చేయమన్నారు: రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల సిద్ధాంతం, ఇద్దరు పిల్లల సిద్ధాంతాలను వల్లె వేస్తూ రాష్ట్రాన్ని చీల్చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి చెప్పారని భూమన, కాపు పేర్కొన్నారు. ప్రణ బ్ కమిటీకి, కేంద్ర హోంమంత్రి షిండేకు కూడా రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారని, ఇప్పటికీ ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడం లేదన్నారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు గంగిరెద్దులాగా తలూపి విభజనకు సహకరించారని, ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాన్ని చూసి తర్వాత 15 రోజులకు నిద్రలేసి సమైక్యరాగం ఆలపించారని కరుణాకర్ దుయ్యబట్టారు. ఆ తరువాత 60 రోజుల సుదీర్ఘ నిద్రలోకి వెళ్లి ఇపుడు సమైక్యం అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. కొందరు టీడీపీ ఎంపీలు విభజనకు హేతువైన చంద్రబాబు వైఖరిని ప్రశ్నించకుండా సమైక్యం అంటూ జిమ్మిక్కులు చేయడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. వైఎస్సార్ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, సి. ఆదినారాయణరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ముఖ్యనేతలు కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డిలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.