ఐదు నెలల్లోనే అంచనా వేయొద్దు
మందమర్రి : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు మాత్రమే అయిందని, అప్పుడే ప్రభుత్వ పనితీరుపై అంచనా వేయొద్దని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి అన్నారు. ఆదివారం మందమర్రిలో నిర్వహించిన తెలంగాణ వికాస సమితి మొదటి జిల్లా మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు అవలంభిస్తున్న నీతిమాలిన రాజకీయాలతో ఈ ప్రాంతానికి కరెంటు తిప్పలు తప్పడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణలో పాలన సక్రమంగా లేదని ప్రచారం చేసేందుకు సీమాంధ్ర నాయకులు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నిత్యానందరెడ్డిపై జరిగిన కాల్పులను సాకుగా చూపుతూ హైదరాబాద్‌లో ఉండేవారికి రక్షణ లేదంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత తెలంగాణ వికాస సమితిపై ఉందని అన్నారు. చెరువుల ద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రభుత్వ ఓఎస్‌డీ దేశ్‌పతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నా సీమాంధ్ర భావజాలం ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి గని కార్మికుల పోరాట పటిమను ఎన్నటికీ మరిచిపోలేమని చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. సభకు తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు సుందిళ్ల రాజయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి హెచ్.రవీందర్ పలు తీర్మానాలు ప్రతిపాదించారు. జేఎన్‌టీయూ ప్రొఫెసర్ వినయ్‌బాబు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామారావు, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, కరీంనగర్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, భిక్ష పతి పాల్గొన్నారు.