సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇప్పటికే 1,000 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్ర విద్యుత్ ధరలతో పోల్చితే తక్కువ ధరకే విద్యుత్ లభ్యత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కాకుండా కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మరో 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) తాజాగా టెండర్లను ఆహ్వానించింది. వచ్చే జూలై 16–సెప్టెంబర్ 30 మధ్య కాలంలో రోజూ పగటి వేళల్లో 12 గంటలపాటు విద్యుత్‌ను కొనుగోలు చేయనుంది. సెప్టెంబర్ తర్వాత ఉండే పరిస్థితులను అంచనా వేసి.. అవసరమైనంత మేర విద్యుత్ కొనుగోలు చేసేందుకు మళ్లీ టెండర్లు నిర్వహించనుంది.
ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రభుత్వంతో 2014 నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌తో ఈ ఒప్పందం చేసుకున్నారు. దీని ఆధారంగా ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ను 12 ఏళ్ల పాటు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2015 సెప్టెంబర్ 22న ఛత్తీస్‌గఢ్ డిస్కంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకున్నాయి. రాష్ట్రానికి మరో 1,000 మెగావాట్ల విద్యుత్‌ను విక్రయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేయగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్పట్లో సానుకూలంగా స్పందించింది.
ధరలు పెంచే సూచనల నేపథ్యంలో..
ఉత్తర–దక్షిణ భారత దేశాన్ని అనుసంధానం చేస్తూ 4,350 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యంతో నిర్మించిన ‘వార్ధా–డిచ్‌పల్లి 765 కేవీ డబుల్ సర్క్యూట్ పవర్ ట్రాన్స్‌మిషన్ కారిడార్’లో 1,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కారిడార్‌ను ఛత్తీస్‌గఢ్‌తో కుదుర్చుకున్న ఎంఓయూ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో బుక్ చేసుకుంది. ఈ కారిడార్ ద్వారానే గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి 1,000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. యూనిట్‌కు రూ.3.90 చొప్పున ఛత్తీస్‌గఢ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన తాత్కాలిక ధరతో కొనుగోళ్లు జరుగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు మరో 1,000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను వచ్చే సెప్టెంబర్ నుంచి కొనుగోలు చేయాలని చాలా కాలం కింద ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు 2017 సెప్టెంబర్ నుంచి మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేసేందుకు వీలుగా, వార్ధా–డిచ్‌పల్లి ట్రాన్స్‌మిషన్ కారిడార్‌లో మరో 1,000 మెగావాట్ల కారిడార్‌ను ముందే బుక్ చేసుకుని పెట్టుకుంది. అయితే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరను యూనిట్‌కు రూ.4.70 వరకు పెంచాలని కోరుతూ ఆ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ నుంచి నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇప్పటికే కొనుగోలు చేస్తున్న 1,000 మెగావాట్ల విద్యుత్ ధరలు రాష్ట్రానికి భారంగా మారే సూచనలు ఉండటంతో ఆ రాష్ట్రం నుంచి ముందే నిర్ణయించిన మేరకు మరో వెయ్యి మెగావాట్లను కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది.
కొనుగోలు చేయం: డి.ప్రభాకర్ రావు, ట్రాన్స్‌కో సీఎండీ
ఛత్తీస్‌గఢ్ నుంచి మరో 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికే 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేసేందుకు టెండర్లను ఆహ్వానించాం. అవసరమైతే ఇంకో 1,000 మెగావాట్లకు టెండర్లను నిర్వహిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment