సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో వేసి తగులబెట్టడంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు.
టీ ముసాయిదా బిల్లు దహనంపై తెలంగాణ నేతల ఆగ్రహం
వారిని అరెస్టు చేయాలి: హరీష్‌రావు
దేశబహిష్కరణ చేయాలి: శ్రీనివాస్‌గౌడ్
రాజ్యాంగాన్ని కాల్చినట్లే: దిలీప్‌కుమార్
విభజన గీత గీయాల్సిందే: గౌరీశంకర్
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో వేసి తగులబెట్టడంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.దీలీప్‌కుమార్, టీఆర్‌ఎల్‌డీ సెక్రటరీ జనరల్ చెరుకూరి శేషగిరిరావులు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బిల్లును కాల్చడం.. రాజ్యాంగాన్ని కాల్చడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, పోరాట ఫలితాన్ని కాల్చి బూడిద చేసిన సీమాంధ్ర నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును భోగిమంటల్లో దహనం చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
ఇప్పటిదాకా పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన అక్కడి నేతలు ఇప్పుడు పండుగను కూడా అపవిత్రం చేశారన్నారు. వారు తమ విచక్షణను, జ్ఞానాన్ని కూడా అదే భోగి మంటల్లో కాల్చి బూడిద చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రతులను దహనం చేసిన వారిని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో డిమాండ్ చేశారు. ఇది సీమాంధ్రుల దురహంకారానికి నిదర్శనమన్నారు. ఒక ప్రాంత ప్రజల ఆంక్షాలను కాల్చివేసి కలిసుందాంరా అనే సమైక్య నినాదం పైశాచికత్వంగా కనిపిస్తుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరిశంకర్ ఒక ప్రకటనలో ఖండించారు. భోగి మంటల సాక్షిగా రెండు ప్రాంతాల మధ్య విభజన గీతలు గీయాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అశోక్‌బాబుపై తెలంగాణ సాధన సమితి అధ్యక్షుడు వెంకటనారాయణ నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిల్లును తగులబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.