కొత్త జిల్లాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన
సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి, గవర్నర్‌ల విశేషాధికారాలను అతిక్రమిస్తూ కొత్త జిల్లాల పేరుతో సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీటిని చూస్తూ గవర్నర్ ఊరుకుంటే ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. కొత్త జిల్లాలపై సీఎం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పి పంపాలన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు.
కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటులో వివక్ష, ఆదివాసీ హక్కులకు భంగం, జోనల్ వ్యవస్థను భగ్నం చేయడం, నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అణగారిపోయేలా కొత్త ప్రాంతాల ఏర్పాటు వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. 31 జిల్లాల వల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు డీలిమిటేషన్‌లో రిజర్వేషన్లన్నీ తారుమారు అవుతాయన్నారు.