Telangana activists
-
గుర్తింపు కార్డులివ్వాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావును బుధవారం కలసి వినతిపత్రం సమర్పించా రు. ‘టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఎప్పుడు పిలుపు ఇచ్చినా ఉద్యమం చేశాం. కేసులు నమోదై జైళ్లకు వెళ్లాం. అయినా తెలంగాణ సాధించిన ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యమంలో కేసుల నమోదు, రిమాండ్, బెయిల్, కోర్టు కేసులు తదితర అంశాల ఆధారంగా పోలీసుల రికార్డుల ప్రకారం ఉద్యమకారులను గుర్తించి గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఉద్యమకారులందరినీ సమరయోధులుగా గుర్తించి నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలి. అర్హులైన విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని కోరారు. అన్ని అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేశవరావు ఉద్యమకారులకు తెలిపారు. నీరాను ప్రభుత్వమే విక్రయించాలి: గౌడ సంఘం ఔషధ గుణాలున్న కల్లును నీరాగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే బాటిలింగ్ చేసి విక్రయించాలని సర్వా యి పాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘం) టీఆర్ఎస్కు విజ్ఞప్తి చేసింది. కల్లు గీత కార్మికుల సంక్షేమంపై మేనిఫెస్టోలో చేర్చాలని కోరింది. గౌడ ఫెడరేషన్ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. గౌడ సంఘం నేతలు ఈడిగ ఆంజనేయులుగౌడ్, మల్లాగౌడ్, సునీల్‌గౌడ్ బుధవారం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో 80 లక్షల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారని, వీరికి 20% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో పది ఎకరాల స్థలం కేటాయించి హరితహారం కింద హైబ్రిడ్ చెట్లను నాటాలని పేర్కొన్నారు. -
డిమాండ్లు పరిష్కరించకపోతే.. ఎమ్మెల్యేలుగా పోటీ
సాక్షి, వరంగల్ అర్బన్: తెలంగాణ ఉద్యమ కారుల డిమాండ్లు నెరవేర్చాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయలేదంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలు చేసేవారు తప్పా ఉద్యమ కారుల గురించి పోరాడే నాయకుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యలయం ముందు ఆందోళనలు చేస్తుంటే మేయర్ చూసుకుంటూ వెళ్తున్నాడు.. కానీ సమస్యలేంటని ఆడగకపోవడం సిగ్గుచేటన్నారు. ‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి ఉద్యమ కారులను గుర్తించి ప్రశంస పత్రం ఇవ్వాలి. అర్హత కలిగిన ఉద్యమ కారులకు పది వేల పింఛన్, వ్యాపారానికై పది లక్షల సబ్సిడీ లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా కల్పించాలి’అంటూ ఉద్యమకారుల కోరారు. ఒకవేళ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లు చేర్చకుంటే తామే ఎమ్మెల్యేలుగా పోటీచేస్తామని ఉద్యమకారులు స్పష్టం చేశారు. -
చేటు చేసే ముస్లింవాదుల మౌనం
ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది. అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు. స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు ఆ పరిస్థితి లేదు. వారు తెలుగులో రాయడం, అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండింది. కానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి. ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి. తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి. అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం, విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తించడం లాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది. నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది. కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి. మొత్తంగా ఇండియన్ ఇస్లాం(లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు. ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్‌లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. చస్తే ఆ శవంపై కాఫిర్ల నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు. వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది. ఈ నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది. - స్కైబాబ 9885420027 -
'కేసీఆర్‌కు ఆంధ్రాలోనూ ఆదరణ'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) డిక్షనరీలో సెటిలర్స్ అనే పదం లేదని టీఆర్ఎస్ నాయకుడు ధర్మపూరి శ్రీనివాస్ (డీఎస్) వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణవాదులేనని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆదరణ లభిస్తోందని డీఎస్ తెలిపారు. -
తెలంగాణవాదులకు ఇదేనా గౌరవం?
మైకు ఇవ్వక పోవడంపై కోమటిరెడ్డి నిరసన పదవికి రాజీనామా చేస్తా.. సభపై అలిగితే ఎలా అని సీఎం అనునయింపు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కొద్ది సేపు హల్ చల్ చేశారు. గురువారం అసెంబ్లీలో కొత్త పారిశ్రామిక విధానంపై అన్ని పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న తరుణంలో, తన కు ఒక నిమిషం అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, స్పీకర్ స్థానంలోఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని కోరారు. ఆయన రెండు సార్లు అభ్యర్థించినా పార్టీ నుంచి ఒకరికే అవకాశం ఇస్తామంటూ డిప్యూటీ స్పీకర్ మైక్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన విసురుగా బయటకు వచ్చేశారు. ‘ తెలంగాణ కోసం మేమూ పోరాడాం. నా మంత్రి పదవినే వదులుకున్నా. తెలంగాణ వాదులకు సభలో ఇచ్చే గౌరవం ఇదేనా ’? అంటూ ఆయన లాబీల్లో విలేకరులతో వ్యాఖ్యానించారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హడావుడిగా బయటకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ‘ఇప్పుడు రాను, రేపు రాను, ఎల్లుండి రాను. రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఆయన సీరియస్‌గా వ్యాఖ్యానించడంతో, సీఎం రమ్మంటున్నారంటూ బాలరాజు మరీమరీ చెప్పడంతో తిరిగి సభలోకి వెళ్లారు. కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ అయినా తనకు మైక్ ఇవ్వక పోవడంపై నిరసన తెలిపారు. దీంతో సీఎం సమాధానం చెబుతూ ‘ తెలంగాణ కోసం కొట్లాడిన కోమటిరెడ్డి అంటే మాకు గౌరవం ఉంది. సభపై అలిగితే ఎలా’? అని వ్యాఖ్యానించంగా, తాను సభపై అలగలేదని, స్పీకర్‌పై అలిగానని కోమటిరెడ్డి ప్రతిస్పందించారు. ఆతర్వాత వెంటనే సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి సభనుంచి బయటకు వచ్చి ఇదే విషయంపై వాదించారు. ‘నన్ను సభకు రమ్మని ఇబ్బంది పెట్టొద్దు. రేపే రాజీ నామా చేస్తా’ అంటూ పేర్కొనడంతో జానారెడ్డి, కోమటిరెడ్డిని బుజ్జగించారు. ‘మాట్లాడడానికి అవకాశం ఇమ్మని నీ పేరునే రాసిస్తా’ అంటూ అనునయించారు. -
‘మన ఊరు - మన ప్రణాళిక’ను అడ్డుకున్న ఆందోళనకారులు
మహేశ్వరం: తెలంగాణ బంద్‌లో భాగంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్, టీజేఏసీ, సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు అంబేద్కర్- జగ్జీవన్ రామ్ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి ఎంపీడీఓ సమా వేశం హాలులో మన ఊరు-మన ప్రణాళి రూపకల్పనపై జరుగుతున్న అవగాహన సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు చేసేదేమి లేక సమావేశాన్ని కొంతసేపు నిలి పివేశారు.కార్యక్రమంలోటీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రా మకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, రాజేష్ నాయక్,సంజయ్, అలీ,బాలయ్య, తడకల యాదయ్య, అంజనేయులు, రవి, సలీంఖాన్, మునాఫ్, సీపీఎం మండల కార్యదర్శి దత్తునాయక్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి యాదగిరి, టీఆర్ఎస్, టీజేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు. కందుకూరులో.. కందుకూరు: మండల పరిషత్ కార్యాలయంలో మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక అనే అంశంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ప్రారంభించిన కొద్ది సేపటికే నిలిచిపోయింది. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సమావేశపు హాల్లో మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా సీపీఎం నేతలు సమావేశాన్ని అడ్డుకుని నిలిపివేశారు. దీంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామాల్లో వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. -
మోదుగుపూలకు వందనం
నవ తెలంగాణే అమరులకు నివాళి ఎలక్షన్ సెల్: ఒక్కరా ఇద్దరా.. వందలు వేలు. ప్రాణాలను తృణప్రాయమనుకున్నారు. త్యాగాల బాటలో నెత్తుటి పూలై పూశారు. వీరోచిత పోరాటం చేశారు. తెలంగాణ ఆకాంక్షను చాటారు. దిక్కులు పిక్కటిల్లే నినాదమయ్యారు. కవాతులు, తుపాకులు మోపిన ఉక్కుపాదాన్ని లెక్కచేయకుండా పోరాడారు. ఆత్మ బలిదానాలతో తాము కలలు కన్న తెలంగాణ కోసం అమరువీరులయ్యారు. ఆనాటి 1969 ఉద్యమ కారుడు ఉమేందర్ నుంచి నేటి శ్రీకాంతాచారి, యాదయ్యల వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం త్యాగాల బాటలోనే నడిచింది. ఇలాంటి అమరుల త్యాగాలు వృథా కాలేదు, వారి ఆకాంక్షలు నెరవేరి తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో నవ తెలంగాణ నిర్మాణమే వారికి నిజమైన నివాళి... వారు రాసిన ‘సూసైడ్’నోటే ఎన్నికల ప్రణాళికా అంశాలు కావాలని అమరుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. 1969 జ్ఞాపకం.. పగిడిపాల ఆంజనేయులు, హైదరాబాద్: అది 1968 సెప్టెంబర్. తుపాను ముందరి ప్రశాంతతను తలపిస్తోంది హైదరాబాద్ నగరం. తెలంగాణ ఉద్యమకారులు భారీ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. ప్రభుత్వం ససేమిరా అంది. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ వరకు మహాప్రదర్శనగా వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రాన్ని అందజేసేందుకు అన్ని స్కూళ్లు, కళాశాలలు కదులుతున్నాయి. అనుమతిని నిరాకరించిన ప్రభుత్వం అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించింది. పోలీసు పహారాలో చార్మినార్ వద్ద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అప్పటికే సిటీ హైస్కూల్ కాలేజీ దగ్గర విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ర్యాలీకి సిద్ధమయ్యారు. చార్మినార్ వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు ఆచార్య కేశవరావు జాదవ్, మరో ఇద్దరు ఆందోళనకారులు పూజారుల్లా వెళ్లారు. భాగ్యలక్ష్మి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఒక్కసారిగా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. ఆ నినాదాన్ని అందుకున్న విద్యార్థులు వందలు, వేలుగా కదిలి వచ్చారు. పోలీసు వలయాలను ఛేదించుకొని సాగిన ఆ నాటి ప్రదర్శన లో దారి పొడవునా నెత్తురు పారింది. పోలీసుల లాఠీలు విరిగాయి. విచక్షణా రహితంగా తూటాలు పేలాయి. చార్మినార్ వద్ద పేలిన మొట్టమొదటి తూటా శాలిబండ విద్యార్థిని అరుణ గుండెలను చీల్చుకుంటూ వెళ్లింది. చార్మినార్ వద్ద ప్రారంభమై, పబ్లిక్‌గార్డెన్స్, అసెంబ్లీ, లకిడికాపూల్ మీదుగా పోలీసు లాఠీలను, తూటాలను లెక్కచేయకుండా రాజ్‌భవన్‌కు దూసుకుపోతున్న విద్యార్ధులను పోలీసులు రాజ్‌భవన్ సమీపంలో అడ్డుకున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. సికింద్రాబాద్ నుంచి ఉద్యమానికి నేతృత్వం వహించిన ఉమేందర్రావు ఆందోళనకారులను ఉద్దేశించి ‘అందరూ ప్రశాంతంగా రోడ్డుపై బైఠాయించాలని’ చెబుతూనే పోలీసుల తూటాలు నేలకొదిలారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆ పోరాటంలో 30 మందికి పైగా అమరులయ్యారు. ఇలా మొదలైన ఉద్యమం ఉధృతమై కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎందరో అమరులయ్యారు. 1969 నాటి ఉద్యమంలో తెలంగాణ అంతటా వీరోచిత మరణాలే. 360 మందికి పైగా అసువులు బాశారు. ఆ నాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్ధం నగరంలో గన్‌పార్కు వద్ద స్థూపాన్ని కట్టించారు. ప్రముఖ శిల్పి డాక్టర్ ఎక్కా యాదగిరిరావు అద్భుతమైన అమరుల స్థూపానికి ప్రాణప్రతిష్ట చేశారు. ఈ స్థూపమే నేడు అన్నింటికీ స్ఫూర్తిగా నిలిచింది. ‘తెలంగాణ’ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వారిలో ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారే. తెలంగాణ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని నమ్మి.. అందుకోసం ఆత్మత్యాగం చేసుకుని కన్న తల్లులకు పుట్టెడు శోకం మిగిల్చారు. ఆ ‘అమ్మలు’పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్రత్యేక తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాడారు. ఆ క్రమంలో ప్రాణాలు సైతం వదులు కున్నారు. తమ ఆకాంక్ష కోసం ఇంత పెద్దమొత్తంలో ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సుమారు 1003మంది ప్రాణ త్యాగం చేశారు.. వీరిలో 630మంది ఆత్మబలిదానాలు చేసుకోగా.. 373మంది తెలంగాణ రాదేమోనన్న బాధతో గుండెపోటుకు గురై చనిపోయారు. తెలంగాణను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు వారు రాసిన సూసైడ్ నోట్స్ చెబుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినట్లుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలి. కొందరు నాయకులు అమరుల కుటుంబాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాలి. - శంకరమ్మ, శ్రీకాంతాచారి తల్లి చట్టసభల్లో అమరవీరుల కుటుంబాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక అమరుల కుటుంబాల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక ఫైలుపై మొదటి సంతకం చేయాలి. - చిర్రా లక్ష్మీబాయి, జీవన్‌కుమార్ తల్లి తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. వారి కుటుంబాల్లో ఒకరిద్దరికైనా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే బాగుంటుంది. ఎవరైనా వచ్చి నన్ను ప్రతిపాదిస్తారని అనుకున్నా. కానీ ఎవరూ రాలేదు. - పి.పద్మావతి, కానిస్టేబుల్ కిష్టయ్య భార్య చిదంబరం ప్రకటనతో.. 2009 డిసెంబర్ 10న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పార్లమెంటులో ఆనాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. దీనిపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు కొనసాగడంతో అదే నెల 28న తెలంగాణపై మరో ప్రకటన చేశారు. తెలంగాణపై పూర్తిస్థాయి అధ్యయనానికి ఓ కమిటీ వేస్తామని చెప్పడంతో ఉవ్వెత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో యువతలో అశాంతి నెలకొంది. ఇది ఆత్మహత్యలకు ప్రేరేపించింది. ఈ సందర్భంలోనే హోంమంత్రి షిండే చేసిన ప్రకటనలకు.. ఆజాద్ తదితర కాంగ్రెస్ పెద్దల పొంతనలేని ప్రకటనలతో ఆత్మహత్యలు మొదలయ్యాయి. తెలంగాణపై నిర్ణీత గడువు లేదని ఆజాద్ చేసిన ప్రకటనతో ఆరుగురు యువకులు ప్రాణాలు తీసుకున్నారు. దీంతోపాటు కేసీఆర్ దీక్ష, స్థానిక కాంగ్రెస్ నేతల వైఖరి, అస్పష్టమైన శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు ఆత్మహత్యలకు కారణాలయ్యాయి. ఉద్యమం ఉవ్వెత్తుకు... హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ కోర్సు చదువుతున్న నల్లగొండ యువకుడు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం డిసెంబర్ 3, 2009న ఎల్బీనగర్లో ఒంటికి నిప్పంటించుకుని బలిదానం చేసుకున్నాడు. ఆయన ఆత్మార్పణం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. ఇక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఎం.యాదిరెడ్డి(28) పదో తరగతి చదువుకున్నాడు. తెలంగాణపై జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని భావించి జూలై 20, 2011న ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి రాసిన పదిపేజీల సూసైడ్‌నోట్‌లో..‘సోనియాగాంధీజీ.. మా తెలంగాణ మాకు ఇచ్చేయండి.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను హింసిసున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ బలిదానం తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది. అలాగే జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న ఆర్.శ్రీకాంత్.. తన తల్లిదండ్రులకు తానొక్కడినే కొడుకునని, అయినా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నానని లేఖ రాసి చనిపోయాడు. తెలంగాణకు మద్దతు ఇవ్వని జైపాల్‌రెడ్డి, దానం నాగేందర్ లాంటి వారిని చూసి సిగ్గుపడుతున్నానని అందులో రాశాడు. తన ఆత్మబలిదానం ఉద్యమానికి మరింత ఊపునివ్వాలని ఆకాం క్షించాడు. ఇంకా.. నిజామాబాద్ జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిష్టయ్య.. నవ తెలంగాణ కోసం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోగా, కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన జీవన్‌కుమార్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీలో వేణుగోపాల్‌రెడ్డి ఆత్మార్పణం చేసుకున్నాడు. వీరి ప్రాణత్యాగాలతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. వీళ్లే కాకుండా మరెందరో చేసుకున్న ఆత్మార్పణలు తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాయి. అమరుల త్యాగ ఫలితంగా ఏర్పాటు కాబోతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాల సాధనే ధ్యేయంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి. వారి సూసైడ్ నోట్లే తెలంగాణ కోసం పాటుపడే పార్టీల ఎన్నికల మేనిఫెస్టో కావాలని తెలంగాణ అమరుల కుటుంబాలు కోరుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అమరులను ఆదుకోవాలి మాకు హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఇస్తానని కేసీఆర్ చెప్పారు. ఇస్తే మేం అమరుల కుటుంబాల కోసం పోరాడ తాం. కొందరు నాయకులు అమరుల కుటుంబాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాలి. - శంకరమ్మ (అమరుడు శ్రీకాంతాచారి తల్లి) ----- బతుకులు మారాలి అమరుల కుటుంబాల్లో ఒకరిద్దరికైనా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే బాగుంటుంది. ఎవరైనా వచ్చి నన్ను ప్రతిపాదిస్తారని అనుకున్నా. పెద్దదిక్కు కోల్పోయి బాధలు పడుతున్న మమ్మల్ని ఆదుకోవాలని కోరినా గాలికి వదిలేశారు. పింఛన్, ఇంటి స్థలం అన్నారు కానీ ఇవ్వలేదు. - పి.పద్మావతి (అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య) ----- సంక్షేమ ఫైలుపై మొదటి సంతకం చేయాలి నా బిడ్డ జీవన్‌కుమార్ డిగ్రీ చదువుతూ తెలంగాణ కోసం చనిపోయిండు. నా బిడ్డలాగా మరొకరు బలిదానాలు చేసుకోకూడదని నేను, నా మరో కొడుకు సతీష్ కలిసి ప్రచారం చేశాం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక అమరుల కుటుంబాల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక ఫైలుపై మొదటి సంతకం చేయాలి. - చిర్రా లక్ష్మీబాయి ----- బలిదానాలకు రాజకీయ పార్టీలే కారణం ఆంక్షలు లేని పూర్తి హక్కులతో కూడిన తెలంగాణను తెలంగాణ అమరవీరులు కోరుకున్నారు. తెలంగాణలో ప్రజ లకు ప్రతీ విషయంలోనూ హక్కులుండాలి. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి. బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలి. - వేదకుమార్ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అమరవీరుల పేరున పార్కులు కట్టాలి. వాళ్ల స్మారకార్థం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. చెరువులు తవ్వించాలి. ప్రాజెక్టులు, పాఠశాలలు కట్టించాలి. అమరుల ఆశయాలు సాకారం కావాలంటే నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. అదే వారు కోరుకున్నారు. - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఎమ్మెల్సీ ------ అమరుల ఆశయాలే లక్ష్యంగా.. సాయుధ పోరాటం దగ్గర నుంచి తెలంగాణలో అన్నీ త్యాగాలే. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకోవడం విషాద చరిత్ర. అమరులు కలలుగన్న తెలంగాణ సాధించుకోవాలంటే వారి ఆశయాలనే పార్టీలు తమ ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకురావాలి. - దేవీప్రసాద్, అధ్యక్షుడు, టీఎన్జీవో -
అసెంబ్లీ మీడియా పాయింట్
‘‘ సీఎం, స్పీకర్లు చేసింది పనికిమాలిన చర్య. సొంతపార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దోపిడీ దొంగల్లా వ్యవహరించారు. స్పీకర్‌కు తెలంగాణవాదులు బుద్ధి చెప్తారు. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ ఏర్పడుతుంది’’ - కేటీఆర్ (టీఆర్ ఎస్) ‘‘మూడు ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయాన్ని వెలువరించేలా కాంగ్రెస్, బీజేపీలు కృషి చేయాలి. తెలంగాణ ఏర్పాటుకు సమగ్ర పరిష్కారాన్ని మా పార్టీ చూపింది. సవరణలతో కూడిన బిల్లుతో సీమాంధ్రకు న్యాయం చేయాలి.’’ - జ యప్రకాశ్ నారాయణ్ (లోక్‌సత్తా) ‘‘తెలంగాణ బిల్లును ఓడించి పంపించాం. నేటి పరిణామాలు చరిత్రలో నిలిచిపోతాయి’’ - పయ్యావుల కేశవ్ (టీడీపీ) ‘‘తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఖాయం. సీఎం కిరణ్ పిరికిపందలా సభలో లేకుండా పారిపోయారు.’’ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్ ‘‘తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోంది. బిల్లు రాష్ట్రపతికి వెళ్లడం సంతోషం. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పార్లమెంటులో ఆమోదం పొందుతుంది. సభలో స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు.’’ - ఈటెల రాజేందర్ (టీఆర్ఎస్) ‘‘స్పీకర్ నాదెండ్ల మనోహర్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. ఆంధ్ర నాయకులంతా ప్రజాస్వామ్య ద్రోహులుగా మిగిలారు. నైతిక విజయం మాదే.’’ - ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీతక్క (టీడీపీ) ‘‘సీమాంధ్ర నాయకుల సంబరాలు చూస్తుంటే వారికి పిచ్చి ముదిరిందని స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్, సీఎం కిరణ్ ఇద్దరూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు. బిల్లు పార్లమెంటులో నెగ్గడం ఖాయం.’’ - గుండా మల్లేష్, కూనంనేని సాంబశివరావు (సీపీఐ) ‘‘సభలో స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. బిల్లును తిరస్కరించే హక్కు సభకు లేదు. ఓటింగ్, తీర్మానాలు చేసే అధికారంలేదు. పార్లమెంటులో బిల్లును బీజేపీ నెగ్గిస్తుంది.’’ - నాగం జనార్దన్‌రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి (బీజేపీ) ‘‘బిల్లు విషయంలో అసెంబ్లీ వెల్లడించేది అభిప్రాయాలు మాత్రమే. అంతిమ నిర్ణయం పార్లమెంట్‌దే’’ - జూలకంటి రంగారెడ్డి (సీపీఎం) ‘‘ఆఖరి బంతికి 5 రన్స్ చేయాల్సి ఉండగా.. సీఎం కిరణ్ సిక్స్ కొట్టారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజారంజకం’’ - ఆనం వివేకానందరెడ్డి (కాంగ్రెస్) -
బిల్లు దహనం.. రాజ్యాంగ ఉల్లంఘనే
టీ ముసాయిదా బిల్లు దహనంపై తెలంగాణ నేతల ఆగ్రహం వారిని అరెస్టు చేయాలి: హరీష్‌రావు దేశబహిష్కరణ చేయాలి: శ్రీనివాస్‌గౌడ్ రాజ్యాంగాన్ని కాల్చినట్లే: దిలీప్‌కుమార్ విభజన గీత గీయాల్సిందే: గౌరీశంకర్ న్యూస్‌లైన్ నెట్వర్క్: సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో వేసి తగులబెట్టడంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.దీలీప్‌కుమార్, టీఆర్ఎల్డీ సెక్రటరీ జనరల్ చెరుకూరి శేషగిరిరావులు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బిల్లును కాల్చడం.. రాజ్యాంగాన్ని కాల్చడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, పోరాట ఫలితాన్ని కాల్చి బూడిద చేసిన సీమాంధ్ర నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును భోగిమంటల్లో దహనం చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన అక్కడి నేతలు ఇప్పుడు పండుగను కూడా అపవిత్రం చేశారన్నారు. వారు తమ విచక్షణను, జ్ఞానాన్ని కూడా అదే భోగి మంటల్లో కాల్చి బూడిద చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రతులను దహనం చేసిన వారిని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో డిమాండ్ చేశారు. ఇది సీమాంధ్రుల దురహంకారానికి నిదర్శనమన్నారు. ఒక ప్రాంత ప్రజల ఆంక్షాలను కాల్చివేసి కలిసుందాంరా అనే సమైక్య నినాదం పైశాచికత్వంగా కనిపిస్తుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరిశంకర్ ఒక ప్రకటనలో ఖండించారు. భోగి మంటల సాక్షిగా రెండు ప్రాంతాల మధ్య విభజన గీతలు గీయాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అశోక్‌బాబుపై తెలంగాణ సాధన సమితి అధ్యక్షుడు వెంకటనారాయణ నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిల్లును తగులబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
గందరగోళం మధ్యన ఎమ్.పిలు దీక్ష విరమణ
-
తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి
హైదరాబాద్: తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి, గందరగోళం మధ్య సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సంకల్పదీక్ష ముగిసింది. శుక్రవారం ప్రారంభించిన దీక్షను ఈ రోజు మంత్రి శైలజానాథ్ విరమింపజేశారు. ఆ సమయంలో కొందరు తెలంగాణవాదులు వచ్చి తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి చేశారు. ఎంపిలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్‌లు నిన్న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సంకల్ప దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరయ్యారు. సంకల్ప దీక్షకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సమైక్యవాదులు మద్దతు తెలిపారు. -
అలాయ్.. బలాయ్..
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలసాకరమయ్యే ప్రస్తుత తరుణంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం హన్మకొండకు రావడంతో తెలంగాణవాదులు అభినందనలతో ముంచెత్తారు. హన్మకొండ పీజీఆర్గార్డెన్లో జరిగిన మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె రమ్య, శేషశయనదాస్ల వివాహానికి కేసీఆర్ హాజరయ్యారు. హన్మకొండకు ఉదయం 11.20 సమయంలో చేరుకున్న ఆయన మధ్యాహ్నం 1.20లకు తిరిగి హైదరాబాద్ వెళ్లి పోయారు. కేసీఆర్ ఉన్నంతసేపు అక్కడి వాతావరణం అలాయ్..భలాయ్ను తలపించింది. కడియం శ్రీహరి కుమార్తె వివాహ వేడుకలో కేసీఆర్, మంత్రి బస్వరాజు సారయ్యలు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం కేసీఆర్ మాజీ డీజీపీ పేర్వారం రాములు నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌ను టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు నేతృత్వంలో తలపాగా పెట్టి సన్మానించారు. పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో దూరదృష్టితో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ప్రధాన భూమిక పోషించారని అన్నారు. అనేక దూషణలు, శ్రమకోర్చి అరవైయేండ్ల కలను నిజం చేయడంలో గొప్ప పరిణతిని ప్రదర్శించారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు తమపాత్రను నిర్వర్తిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఉద్యోగసంఘాల నాయకులను కేసీఆర్ ఆలింగనం చేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక స్కీం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్‌గౌడ్, హుస్సేన్, వెంకటేశ్వర్లు, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ న్యాయవాద జేఏసీ నేత గుడిమల్ల రవికుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులను గెజిటెడ్ హోదా కల్పించాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలని కోరారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. పునర్నిర్మాణంలో కలిసికట్టుగా సాగాలన్నారు. ఈ బృందంలో గునిగంటి శ్రీనివాస్, తాళ్ళపెల్లి జనార్దన్‌గౌడ్, మొలుగూరి రంజిత్, నీలా శ్రీధర్‌రావు, సూరం నర్సింహస్వామి, వెంకటేశ్వర్రావు, సూదుల వేణుగోపాల్, అంజయ్యగౌడ్, శ్రీనివాస్, రాజేందర్, సాంబశివరావు, కోటేశ్వర్ తదితరులు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి నేతృత్వంలో ఈ బృందం కలిసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యావేత్తల పాత్రపై కొద్ది సేపు మాట్లాడారు. ఈ బృందంలో ప్రొఫెసర్ దినేష్‌కుమార్, సీతారామరావు తదితరులు ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ దడువాయిల ప్రతినిధి బృందం కేసీఆర్‌ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తమను మార్కెట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కాంటాతో తూకం వేశారు. ఈ కార్యక్రమంలో మార్త శ్యామ్, నూరవీరస్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, యూత్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కలసాకారమవుతుందనే ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ నేతలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, పేర్వారం రాములు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, తక్కెళ్ళపెల్లి రవీందర్రావు, ఆరూరి రమేష్, చందూలాల్, ఇండ్ల నాగేశ్వర్రావు తదితరులు ఉన్నారు. ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా ప్రయోజనాలు కల్పిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. నగరంలో జరిగిన వివాహానికి హాజరైన కే సీఆర్‌ను పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర గణనీయమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో ఇబ్బందులు పడిన ఉద్యోగులను గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కేసీఆర్‌ను కలసిన వారిలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాదుల ప్రసాద్, డిప్లొమో ఇంజనీర్స్ అసోసియేషన్ సంఘం నాయకులు గట్ల మహీపాల్‌రెడ్డి, పులి ప్రభాకర్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఊరూరా.. రేలారేలా.. తెలంగాణలో ఆనంద హేల
సాక్షి, నెట్వర్క్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో శుక్రవారం తెలంగాణలోని పది జిల్లాల వ్యాప్తంగా తెలంగాణవాదులు, జేఏసీలు, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, వాటి అనుబంధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పలు జిల్లాల్లో సోనియా, సుష్మాస్వరాజ్, కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కరీంనగర్లో జిల్లాలో తెలంగాణ సంబరాలు మిన్నంటాయి. సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొంటూ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు వేడుకలు జరిపారు. సోనియా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సుల్తానాబాద్‌లో ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్లో స్వీట్లు పంచిపెట్టారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సింగరేణి కార్మికులు నృత్యాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, టీజేఏసీ, సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, న్యాయవాదులు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించి బాణ సంచా పేల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. వరంగల్ జిల్లా పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. వరంగల్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పాలాషేకం చేశారు. హన్మకొండలో న్యాయవాదులు అమరవీరులకు నివాళులర్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండలో ఆ పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పాలాషేకం చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విజయోత్సవాలను నిర్వహించారు. టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట, తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండు కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. ఖమ్మం, కూసుమంచిలలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కూసుమంచిలో సోనియాగాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఖమ్మం జడ్పీ సెంటర్లో ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. భధ్రాచలం, కొత్తగూడెం, వైరా, మణుగూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు, జేఏసీ అధ్వర్యంలో స్వీట్లు పంచుతూ ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ పార్లమెంటరీ పక్షనేత సుష్మాస్వరాజ్ చొరవతోనే పదిజిల్లాల తెలంగాణ వచ్చిందంటూ ఆ పార్టీలు నేతలు నల్లగొండల్లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్లగొండలో సోనియగాంధీకి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పలుచోట్ల బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి ఆధ్వర్యంలో, దేవరకద్రలో ఆటో యూనియన్ నాయకులు ‘జై తెలంగాణ’ నినాదాలతో స్వీట్లు పంపిణీ చేశారు. గద్వాలలో సోనియా, రాహుల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలంపూర్, అచ్చంపేటలో సంబరాలు హోరెత్తాయి. వనపర్తి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్దగూడెం తిరుమలనాథ స్వామి ఆలయంలో మోకాళ్లపై నడుస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తాండూరు, చేవెళ్ల, పరిగి, శంషాబాద్, వికారాబాద్, మొయినాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో తెలంగాణవాదులు సంబరాలు జరుపుకొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ జై తెలంగాణ నినాదాలు చేశారు. పరిగిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు, కూలీలకు, దుకాణదారులకు మిఠాయిలు పంచి పెట్టారు. సంగారెడ్డి, జోగిపేట, నర్సాపూర్ల్లోనూ తెలంగాణవాదులు బాణసంచా కాల్చి సందడి చేశారు. -
విజయమ్మపై కక్ష.. చంద్రబాబుకు రక్ష...
* విజయమ్మ అడుగు పెట్టకుండా అడ్డంకులు * చంద్రబాబు పర్యటనకు పోలీసుల రెడ్ కార్పెట్ * తోక ముడుచుకున్న జిల్లా మంత్రులు * ఆద్యంతం పోలీసు పహారా నడుమ టీటీడీ అధినేత పర్యటన మొన్న.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నల్లగొండ జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దుల్లోనే మంత్రుల ప్రోద్బలంతో పోలీసులు అడ్డుతగిలారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆదేశాల మేరకు పోలీసులు ఆటో యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించారు. రాత్రికి రాత్రే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపి రాళ్లు వేశారు. వీటిని సాకుగా చూపి.. పోలీసులు రెచ్చిపోయి జిల్లాలో పర్యటించకుండా విజయమ్మను హైదరాబాద్ పంపించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నిన్న.. రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించే చంద్రబాబుకు కాంగ్రెస్ నాయకులు రెడ్ కార్పెట్ పరచి జిల్లా పర్యటన కు స్వాగతిం చారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి పర్యటన సజావుగా సాగేలా సహకరించారు. తెలంగాణ పౌరుడిగా సమైక్యవాదులను అడ్డుకున్నామని ప్రకటన చేసిన ఓ మంత్రి... చంద్రబాబును అడ్డుకోవడంలో మాత్రం తీవ్రంగా విఫలమయ్యారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి మినహా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కనీసం నినదించిన, నిరసన వ్యక్తం చేసిన దాఖలాలూ లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు ఇది పరాకాష్ట. సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఖాకీల పహారాలో సాగింది. దామరచర్ల మండలం విష్ణుపురంలోని ఇండియా సిమెంట్ కంపెనీ అతిథి గృహం నుంచి బయలుదేరింది మొదలు.. కట్టంగూరులో రాత్రి పర్యటన ముగిసే దాకా పోలీసులు చంద్రబాబును నీడలా వెన్నంటే ఉన్నారు. వందల సంఖ్యలో ఖాకీలు అడుగడుగునా బందోబస్తు నిర్వహించారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాగా, వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు. ఇది మినహా బాబు పర్యటనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి నిరసన వ్యక్తం కాలేదు. ఈ ఘటన ద్వారా కాంగ్రెస్, టీడీపీల తెరవె నుక బాగోతం మరోసారి బట్టబయలైంది. జిల్లాలో గురువారం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు అడ్డుతగిలిన తీరు.. సజావుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన పర్యటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. విజయమ్మ పర్యటన సందర్భంగా సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి నానా రభస చేశారు. రెండు రోజులూ తన నియోజకవర్గంలోనే మకాం వేసి స్థానికులు, పక్క నియోజకవర్గాలకు చెందిన తన అనుయాయులను ఉసిగొల్పిన విషయం తెలిసిందే. ఎస్పీని సైతం క్షేత్రంలోకి తీసుకొచ్చి పలు జిల్లాలకు చెందిన పోలీసులను మోహరించారు. ఎలాగైనా విజయమ్మను అడ్డుకోవాలన్న ముందస్తు వ్యూహంలో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేగాక పర్యటనను అడ్డుకుంటామని జిల్లాకు చెందిన సీనియర్ మంత్రితోపాటు ఎంపీ కూడా ప్రకటనలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి వారు తెలంగాణ అంశంపై ఎటూ తేల్చని చంద్రబాబు పర్యటన సాఫీగా జరిగేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా సహకరించడం విశేషం. తరచూ ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ఓ ఎంపీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అదే చంద్రబాబు తిరిగినా పట్టించుకోలేదు. తెలంగాణవాదులను చితకబాదిన పోలీసులు బాబు పర్యటన సందర్భంగా తెలంగాణవాదులపై పోలీ సులు లాఠీ ఝుళిపించారు. చంద్రబాబు కాన్వాయ్ దామరచర్లకు చేరుకోగానే తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలుపుతూ, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణవాదులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. ఇదే సమయంలో పోలీసులు తెలంగాణవాదులపై లాఠీ ఝుళిపించారు. -
బాబును అడ్డుకున్న తెలంగాణవాదులు
నల్గొండ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర విభజన విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్న ఆయనకు తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడును శుక్రవారం దామరచెర్ల వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. బాబు కాన్వాయ్‌కు అడ్డుపడి ....జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో బాబు పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. గురువారం రాత్రి గుంటూరు నుంచి జిల్లాలోని వాడపల్లికి చేరుకున్న ఆయన స్థానిక ఇండియా సిమెంట్స్ కంపెనీ అతిథి గృహంలో రాత్రి బసచేశారు. దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెంలో రైతులను బాబు కలుస్తారు. అక్కడి నుంచి మిర్యాలగూడ మండలం ఏడుకొండల తండాలో పర్యటిస్తారు. జేఎస్ఆర్ ఫంక్షన్‌హాల్ భోజనం అనంతరం వేములపల్లి మండలంలోని బుగ్గబావితండాలో పంట నష్టం తెలుసుకుంటారు. తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడుతారు. ఆ తర్వాత నేరుగా కట్టంగూరు చేరుకుంటారు. అక్కడ జరిగిన పంట నష్టం వివరాలు రైతులను అడిగి తెలుకుంటారు. మరోవైపు చంద్రబాబు పర్యటించే ఆయా మండలాల్లో తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాకుండా టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
'దయచేసి పర్యటనకు ఆటంకం కలిగించవద్దు'
ఖమ్మం : మూడు ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. రైతుల కష్టాలు తెలుసుకోవడానికే వస్తున్నాని..దయచేసి తన పర్యటనకు ఆటంకం కలిగించవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. 90 శాతం పత్తి, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతాలోనే దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న విజయమ్మ గురువారమిక్కడ నేలకొండపల్లిలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే..ఒక్క తెలంగాణలోనే ఐదుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయమ్మ చెప్పారు. 28 వేల మగ్గాలు పనికి రాకుండా పోయాయని తెలిపారు. గత నాలుగేళ్లుగా రైతులకు ఎక్కడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. బతకడానికే కష్టంగా ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. 2010 - 13 మధ్య 7 వందల కోట్ల రూపాయలు పంట నష్టమని చెప్తున్న పాలకులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. -
ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ అడ్డుకునే యత్నం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణావాదులు షాక్ ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో నివాళలర్పించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎదుట తెలంగాణ ఆందోళనకారులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరోవైపు అసెంబ్లీలోని సచివాలయంలో గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్ అంజలి ఘటించారు. ఇక గాంధీ భవన్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ...జాతిపితకు నివాళులు అర్పించారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కూడా గాంధీజీకి నివాళులు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. -
తెలంగాణను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీకి : కడియం శ్రీహరి
వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. సోమవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తమ్ముళ్లకు చిత్తశుద్ధి, దమ్ముంటే చంద్రబాబుతో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రధాని, రాష్ట్రపతికి లేఖ ఇప్పించాలని ఆయన కోరారు. ఏనాడూ ఉద్యమం చేయని కాంగ్రెస్ ప్రతినిధులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీఎం కిరణ్ , పీసీసీ అధ్యక్షుడు బొత్స, చంద్రబాబు చేస్తున్న కుట్రలను అడ్డుకుని, కేంద్రంపై ఒత్తిడి చేయాలని కడియం డిమాండ్ చేశారు. -
మేం తలచుకుంటే తెలంగాణలో అడుగుపెట్టలేరు: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేతల సహకారం వల్లే ఏపీఎన్జీవోల సంఘం హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిం చగలిగిందని, అదే తెలంగాణవాదులు తలచుకుంటే ఇక్కడ అడుగుకూడా పెట్టేవారుకాదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే.. ఆ తరువాత ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులకు సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం వస్తే సీఎం సహా ఎవరైనా హైకమాండ్ చెప్పినట్లు వినాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. -
సీమాంధ్ర సభకు హాజరు కావొద్దు: టీజేఎఫ్
సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్రకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు.. ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు హాజరుకావద్దని పలువురు తెలంగాణ ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు. సీఎం , డీజీపీ ఇద్దరూ ఏపీఎన్జీవోల రూపంలో హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అత్యవసర వైద్యసేవలు మినహా తెలంగాణలో జనజీవనాన్ని, రహదారులను స్తంభింపచేయాలని పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ‘బంద్ విజయవంతంలో మన పాత్ర’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఏపీఎన్జీవోల సభకు అనుమతించడం హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించడానికేనని దుయ్యబట్టారు. బంద్ సందర్భంగా ప్రతిఘటన ఏదైనా ఎదురైతే... దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సమావేశంలో ఈటెల రాజేందర్, స్వామిగౌడ్, మందకృష్ణమాదిగ, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, వేదకుమార్, అద్దంకి దయాకర్, విమలక్క, బాలరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తే ఊరుకోం : ప్రజాసంఘాల జేఏసీ ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనవల్ల ఎదురయ్యే సమస్యలు, ఇతర అనుమానాలపై చర్చిస్తే తమకేమీ అభ్యంతరంలేదని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం సహించబోమని తెలంగాణవాదులు స్పష్టం చేశారు. ‘శాంతియుతంగా విడిపోయి కలిసుందాం..’ నినాదంతో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు సంఘాలకు చెందిన తెలంగాణవాదులు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు ప్రసంగించారు. ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాలు సృష్టించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు లాంటివారు నీటి, ఉద్యోగ సమస్యలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ లాంటివారు చేసే బెందిరింపులను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. గజ్జెల కాంతం, సతీశ్ మాదిగ మాట్లాడుతూ..హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే ఇక్కడుండే తెలంగాణ-సీమాంధ్ర ప్రజల మధ్య భారత్-పాకిస్తాన్ తరహా సంబంధాలే ఉంటాయన్నారు. ఈనెల 24న ప్రజా తెలంగాణ సభ నిర్వహిస్తామని, మరోమారు చర్చలకు ఏపీఎన్జీవోలను ఆహ్వానిస్తామన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కార్యదర్శి కృష్ణయ్య, వైస్‌చైర్మన్ బెన్సన్లు మాట్లాడుతున్నప్పుడు... తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, విభజనతో మీకొచ్చే ఇబ్బందేంటో చెప్పాలంటూ పలువురు విలేకరులు అడ్డుతగిలారు. వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు నాలుగంచెల భద్రత
తెలంగాణవాదులు అడ్డుకోకుండా పటిష్ట చర్యలు తెలంగాణ జిల్లాల నుంచి రాకుండా నగరం చుట్టూ చెక్‌పోస్టులు హైవేలపై సీమాంధ్ర వాహనాలను అడ్డుకోకుండా పెట్రోలింగ్ ఎల్బీ స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పారా మిలటరీ డీజీపీ, సీఎస్‌లతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసుశాఖ పటిష్ట భద్రతాచర్యలు తీసుకుంటోంది. పోలీసులు, పారా మిలటరీ బలగాలతో నాలుగంచెల భద్రత ద్వారా ఏపీఎన్జీవోల సభ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎల్బీ స్టేడియాన్ని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు గురువారం అదీనంలోకి తీసుకున్నాయి. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా ఇనుపకంచెలు, బ్యారికేడ్లను ఏర్పాటుచేయనున్నారు. ఆందోళనకారులెవరైనా ఈ వలయాన్ని దాటి స్టేడియం సరిహద్దులోకి చేరుకుని నిరసన తెలిపిన పక్షంలో తక్షణమే అరెస్టుచేసేందుకు పోలీసు పార్టీలను ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియం లోపలికి గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే అనుమతిస్తామని పోలీసుశాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే.. తెలంగాణ జిల్లాల నుంచి భారీసంఖ్యలో నిరసనకారులు నగరంలోకి రాకుండా శివార్లలో చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. ఏపీఎన్జీవో సభ కోసం సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చే వాహనాలను తెలంగాణవాదులు అడ్డుకోకుండా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ ఏర్పాటుచేస్తున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే రైల్వేస్టేషన్ల వద్ద కూడా భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ఇదిలావుంటే.. ఏపీఎన్జీవో సభకు భద్రతాచర్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎస్ ప్రసన్నకుమార్ మహంతి, డీజీపీ దినేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మలతో సమీక్షించారు. సభ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఏపీఎన్జీవోల సభ జరగనీయండి: డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సభకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణవాదులను కోరారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించకుండా, విభజన వల్ల ఉద్యోగులకు వచ్చే సమస్యల పరిష్కారానికి మాత్రమే సభను వేదికగా ఉపయోగించుకోవాలని ఏపీ ఎన్జీవోలకు సూచించారు. టీఎన్జీవోల సభకు కూడా అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీవోలు, టీఎన్జీవోలతో ప్రభుత్వం మాట్లాడి చెరో తేదీని కేటాయిస్తే బాగుండేదన్నారు. హైదరాబాద్ మెట్రో అథారిటీ డెవలప్మెంట్ (హెచ్ఎండీఏ) పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, సీమాంధ్రకు ఒరిగేది కూడా ఏమీ ఉండదని అన్నారు. 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని, ఈ ప్రక్రియలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కూడా భాగస్వాములను చేసిందని తెలిపారు. హైకమాండ్‌తో సీఎం ఏం చెప్పారో తనకు తెలియదని, అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఆయన వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. విభజన జరిగితే సీఎం కాంగ్రెస్‌ను వీడి, వేరే పార్టీలోకి వెళతారని తాను అనుకోవడంలేదన్నారు. రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంగీకరించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటీకీ, ఒక్కోసారి రాజ్యాంగ ప్రక్రియను కొనసాగించాల్సి వస్తుందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్యబద్దంగా విభజన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విభజనపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, రేపు ఇంకేమి మాట్లాడతారోనని ఎద్దేవా చేశారు. -
వైఎస్ పథకాలు వట్టిపోతాయి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని, ఆయన తదనంతరమే తెలంగాణ ప్రత్యేకవాదం బలపడిందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజాసంక్షేమ పథకాలతో వైఎస్ మహానేతగా ఎదిగారని, ఇప్పుడు రాష్ట్రం విడిపోతే ఆ పథకాలన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు విజయమ్మ, జగన్ చేస్తున్న పోరాటానికి తెలుగువారంతా సంఘీభావం ప్రకటించాలని కోరారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో గురువారం కర్నూల్లో ‘ఎవరెటు..?’ అనే అంశంపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఐక్యంగా ఉన్న రాష్ట్రాన్ని స్వార్థరాజకీయ శక్తులు చీల్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ భాగస్వామ్యమున్న ఆ నగరాన్ని వదిలివెళ్లాల్సిందేనా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా విద్యాసంస్థల జేఏసీ వైస్ చైర్మన్ జి. పుల్లయ్య మాట్లాడుతూ ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఏ ప్రాంతం అభివద్ధి చెందినా అది తమదిగా భావించామని, ఇప్పుడు దాన్ని లాగేసుకుంటామంటే ఎలాగని ప్రశ్నించారు. జిల్లా జూనియర్ కళాశాలల జేఏసీ చైర్మన్ కే చెన్నయ్య మాట్లాడుతూ సమైక్య వాదాన్ని సీమాంధ్రకు చెందిన ఏ నాయకుడూ వినిపించకపోవడంవల్లే కాంగ్రెస్ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉస్మానియా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్‌హుసేన్ మాట్లాడుతూ అరవై ఏళ్లు కష్టపడితే హైదరాబాద్ మహానగరం అయిందని, పదేళ్లలో సీమాంధ్రలో అంతటి నగరం ఎలా రూపుదిద్దుకుంటుందని ప్రశ్నించారు. విభజనవల్ల విద్య-ఉద్యోగ-ఉపాధి-సాగునీటి రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంటుందని, విడిపోతే సీమాంధ్రలో ఉద్యోగుల జీతాలకూ దిక్కులేకుండా పోతుందని హైదరాబాద్ అందరి ఉమ్మడి ఆస్తి మిగిలిన వక్తలు అన్నారు. -
ఒకేరోజు రెండు సభలకు అనుమతి వద్దు : కె. నారాయణ
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ వాదులు వచ్చే నెల ఏడున హైదరాబాద్‌లో తలపెట్టిన సభలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతల పరిస్థితి తలెత్తవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ రెండు వర్గాల్లో ఎవరికి అనుమతి ఇచ్చినా ఇబ్బందేనన్నారు. రాష్ట్రప్రభుత్వం నియంత్రించగలిగే స్థితిలో ఉంటే వేర్వేరుగా అనుమతులివ్వాలని సూచించారు. ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇరుప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడానికి కేంద్రమే కారణమన్నారు. ఒకవైపు సీఎంను, మరోవైపు ఉప ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌సహా రాష్ట్రాన్ని శ్మశానవాటికగా మార్చాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జరిగే ఘర్షణలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రజలు రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే లగడపాటి తదితరులపై రాళ్ల దాడులని ఆయన చెప్పారు. -
సంస్థానాల కాలానికి తిరోగమనం
విశ్లేషణ: తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనదనే ఆరోపణతో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణవాదులు ఉద్యమం చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ వెల్లడించిన వాస్తవాలను వారి ముందు ఉంచితే చాలు, వారు అభివృద్ధి మాట ఎత్తడం మానేస్తున్నారు! తమ ఉద్యమానికి తెలంగాణ సెంటిమెంటే కారణమని అంటున్నారు! తెలంగాణ ‘సెంటిమెంటు’ను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని తెలంగాణవాదులు చేస్తున్న వాదన చివరికి ఐదు వందల రాష్ట్రాలతో కూడిన భారతదేశానికి దారి తీస్తుంది. అసఫ్జాహీలు దక్కన్ ప్రాంతాన్ని రెండు వందల ఏళ్లకు పైగా (1724-1948) పాలించారు. వారి పాలన తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సాంస్కృతిక విభజనను సృష్టించింది. బ్రిటిష్ పాలనలో ఉన్న కోస్తా, రాయలసీమ జిల్లాల తెలుగు ప్రజలు ఆర్థిక, విద్య, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి చెందారు. కాగా, నిజాం ప్రాంతంలోని వారి సోదరులు కాలంచెల్లిన ఫ్యూడల్ రాచరిక పరిపాలన కింద దోపిడీకి గురై వెనుకబడిపోయారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఉర్దూ లేదా మరాఠీ భాషలలోనే సాగుతుండటంతో తెలుగు భాష అణచివేతకు గురైంది. ప్రధానంగా ఉత్తరాదికి చెందిన భాష, సంస్కృతులు, పాకశాస్త్రం కలగలిసి ‘హైదరాబాదీ సంస్కృతి’ చలామణిలోకి వచ్చింది. స్థానిక భాష, సంస్కృతులకు అందులో దాదాపు స్థానం లేదు. ఇందూరు, నిజామాబాద్‌గా, పాలమూరు మెహబూబ్నగర్గా, ఎలగందల కరీంనగర్‌గా మారగా, హైదరాబాద్ సమీపంలోని ఈదులకంటి గ్రామం ఇందర్-కరన్గా మారింది. తెలంగాణ చరిత్ర కుతుబ్-షాహీలతో మొదలై, అసఫ్జాహీలతో ముగిసిపోయిందన్న భావనను కలుగజేసే ప్రయత్నం జరిగింది! ఒక్క యజ్దానీ దక్కన్ చరిత్రను మినహాయిస్తే, ప్రాచీన తెలంగాణ చరిత్రను సమగ్రంగా చెప్పడానికి శ్రద్ధతో కూడిన ప్రయత్నమేదీ జరగలేదు. కాకతీయుల పాలన గురించి కొంత తెలుసు. అయితే శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యుల పాలన మాటేమిటి? బౌద్ధ, జైన వారసత్వం పట్ల ఏమైనా గుర్తింపు ఉన్నదా? ఇంచుమించుగా అసఫ్జాహీలంత పురాతన సంస్థానాల చరిత్ర గురించి తెలిసింది స్వల్పం. అవన్నీ నిజాం పాల నను సుదీర్ఘకాలం ప్రతిఘటించినవే. స్థానిక ప్రజల భాష, సంస్కృతులకు రక్షణను కల్పించే షరతుపై చివరికి అవి నిజాం ఆధిపత్యాన్ని ఆమోదించాయి. అయినా అవి చాలా వరకు తమ స్వయంప్రతిపత్తిని నిలుపుకుని తెలుగు భాష, సంస్కృతులను ప్రోత్సహించాయి. నిజాం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థలు పటిష్టమైనవి కాకపోవడంతో రోహిల్లాలు, తదితర బందిపోటు ముఠాలు నిజాం ప్రాంతాలను కొల్లగొట్టి బీభత్సం సృష్టిస్తుండేవి. సంస్థానాలు అలాంటి విపత్తుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాయి. అధికారిక డాక్యుమెంట్లన్నీ ప్రజలదికాని పరాయి భాషలోనే ఉండేవి. గ్రామ రికార్డులు మాత్రమే కొంత వరకు అందుకు మినహాయింపు. దీనినే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సంస్కృతిగా ప్రచారం చేశారు. అదే గనుక కాస్మోపాలిటన్ సంస్కృతి అయితే అది కుతుబ్‌షాహీల నాటి కాస్మోలిటన్ సంస్కృతి మాత్రం కాదు. కుతుబ్ షాహీల హయాంలో స్థానిక భాష, సంస్కృతులకు సముచిత స్థానం ఉండేది. ఆ కారణంగానే వారు ఔరంగజేబు ఆగ్రహాన్ని చవి చూడాల్సివచ్చింది. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలన్నీ ఉర్దూలోనే సాగేవి. ప్రభుత్వాధికారులంతా ఉత్తర భారతం నుంచి వచ్చినవారే. ముల్కీ ఉద్యమం సాగి, 1919లో నిజాం పాలనకింద ముల్కీ నిబంధనలు రూపొందే వరకు అదే పరిస్థితి కొనసాగింది. ఉర్దూ, మరాఠీ మాట్లాడే ప్రజలు హైదరాబాద్ తమదేనని భావించేవారు. ఆనాటికి తెలుగు భాషకు దక్షిణాపథంలో సాంస్కృతికంగా సుసంపన్నమైన భాషగా గుర్తింపు ఉంది. అయినా వారు దాన్ని ఏ మాత్రం ప్రాధాన్యం లేనిదిగా భావించేవారు. తెలుగువారి ఇళ్లల్లో వాడుక భాషగానూ, సేవకులకు ఆజ్ఞలను జారీ చేసే భాషగానూ మాత్రమే అర్హమైనదని భావించేవారు! రాజబహదూర్ వెంకట్రామ్రెడ్డి 1930లలో హైదరాబాద్‌లో బాలి కల తెలుగు పాఠశాలను ప్రారంభించారు. విద్యాబోధన ఉర్దూ లేదా ఇంగ్లిషు భాషలలో లేని కారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆ పాఠశాలకు గుర్తింపును ఇవ్వడానికి నిరాకరించింది. వెంకట్రామ్రెడ్డి హైదరాబాద్ కొత్వాల్ హోదా సైతం అందుకు దోహదపడలేదు. దీంతో ఆయన పూణెలో మహర్షి కార్వే ఏర్పాటు చేసిన మహిళా విద్యాపీఠం నుంచి గుర్తింపును తెచ్చుకోవాల్సివచ్చింది. ఆ సెంటిమెంటునే ప్రతిధ్వనింపజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్... తెలుగు ప్రజలు తమకు సొంత రాష్ట్రం కావాలనుకుంటే హైదరాబాద్నుగాక వరంగల్‌ను రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు! సాంస్కృతిక అణచివేత చెర ను తప్పించుకోడానికి హైదరాబాద్ తెలుగువారు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న సమయం కూడా అదే. ఎవరికి ఎలాంటి పక్షపాతాలు ఉన్నాగానీ, తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా విలీనమైన తర్వాత విద్య, వైద్య రంగాలలో, ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందనేది ఎవరూ కాదనలేని వాస్త వం. సమగ్ర రాష్ట్రంగా విలీనమైన తర్వాతనే తెలంగాణలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దృశ్య కళలలో, జానపద సంప్రదాయాల పునరుద్ధరణలో తెలంగాణ రాష్ర్టంలోనే అగ్రగామిగా ఉంది. గతించిపోయిన పేరిణి, చిందు వంటి కళా రూపాలకు ప్రాణం పోసి, ప్రాచుర్యంలోకి తేవడం సైతం జరుగుతోంది. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, పాపన్నపేట, సీర్నపల్లి, సంస్థానాలలో వికసించిన సాహిత్యాన్ని సేకరించి, పునర్ముద్రించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే తెలంగాణలోని తెలుగు వాడుక భాషే అత్యున్నత స్థాయికి చెందినది. తెలంగాణ జానపద సాహిత్యంలో కనిపించే పల్లెవాసుల వాడుక భాషలోని సంస్కృతం కల వని అచ్చ తెలుగు మాధుర్యం భాషాభిమానులను అల రిస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజ లలోని భూస్వామ్యేతర విలువల కారణంగానూ, తెలంగాణలో నిలకడగా కొనసాగిన వామపక్ష ఉద్యమాల ఫలితంగానూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దుచేయడం మూలంగానూ తెలంగాణలో పెనుమార్పులు సంభవించాయి. ఫలితంగా 1950ల వరకు కొనసాగిన భూస్వామ్య విధానపు అవశేషాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. కుతుబ్‌షాహీల కాలం నుంచి తెలుగు ప్రజల ఆవాస ప్రాంతానికి ఉన్న చారిత్రక నామం తెలంగాణ! సమగ్ర తెలుగు రాష్ట్ర నిర్మా ణకర్తలైన పెద్దలు ఆ చారిత్రక నామాన్ని విస్మరించి, విలీ నానంతర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టి పెద్ద తప్పు చేశారు. దానిని అవకాశంగా తీసుకొని తెలంగాణ ఉద్యమ నేతలు ఊహాజనితమైన సాంస్కృతిక, భాషాపరమైన విభజనలను సృష్టించడానికి ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాలు చేశారు. తెలుగు నేలను విభజించి, ఎక్కడా లేని రెండు ప్రాంతాలుగా తెలంగాణ, సీమాంధ్ర అని పిలుస్తున్నారు. వెయ్యేళ్లకు పైగా తెలుగు భాషకు ఉన్నది ఒకటే లిపి. అలాగే వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం కూడా ఉమ్మడిదే. చారిత్రక తప్పిదాలను సరిదిద్దుకొని, వివిధస్థాయిలలో సమైక్యత సాధ్యమవుతున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తడం ఆసక్తికరం. చిన్న, పురా తన పట్టణమైన హైదరాబాద్ మహానగరంగా మారడమేగాక, అంతర్జాతీయస్థాయిని అందుకోడానికి వడివడిగా సాగుతోంది. హైదరాబాద్‌లోనూ, ఆ పరిసరాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరిగిన ఫలితంగా యువత తీవ్రవాదం పట్ల విముఖత చూపుతోంది. అన్నిటికీ మించి నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాలు వ్యవసాయంలో, ఆహార ఉత్పత్తిలో కొన్ని కోస్తాంధ్రజిల్లాలను మించి అభివృద్ధి చెందాయి! తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనదనే ఆరోపణతో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణవాదులు ఉద్యమం చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ వెల్లడించిన వాస్తవాలను వారి ముందు ఉంచితే చాలు, వారు అభివృద్ధి మాట ఎత్తడం మానేస్తున్నారు! తమ ఉద్యమానికి తెలంగాణ సెంటిమెంటే కారణమని అంటున్నారు! ‘సెంటిమెంట్లను’ గౌరవించాలని అనుకునేట్టయితే భారత దేశం, ఒకప్పుడు 500 సంస్థానాల సమూహంగా ఉన్న కాలానికి తిరోగమించాల్సి ఉంటుంది! అలాగే సెంటిమెం టు కారణంతో రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే, చెంచు, కోయ ఆదివాసుల మాతృభూమిని విభజించడానికి వీల్లేదు. వారి ఆవాసాలు ఇటు తెలంగాణలోనూ, అటు కోస్తాంధ్రలోనూ కూడా విస్తరించి ఉన్నాయి. మనం గోం డుల సెంటిమెంట్లను గౌరవించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి గోండ్లు కాని ఇతరులందరమూ వెళ్లిపోవాల్సిందే. ఎందుకంటే అది గోండుల మాతృభూమి. లంబాడాలు పెద్ద సంఖ్యలో శతాబ్ద కాలంగా ఆదిలాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. వారిని కూడా మనం అక్కడి నుంచి పంపేయాల్సి ఉంటుంది! జిల్లా పరిషత్తులకు స్వయం పాలనాధికారాలను ఇవ్వాలని రాజ్యాంగం చేసిన ప్రతిపాదనలను అమలుపరచి ఉంటే, ఇలాంటి ఉప ప్రాంతీయ సెంటిమెంట్లను నివారించగలిగేవారం. ఏదో ఒక సాకుతో కొన్ని రాష్ట్రాలు ఆ రాజ్యాంగ నిర్దేశనను అమలుచేయకుండా తప్పించుకున్నాయి. జిలా ్లపరిషత్తులకు ఉద్దేశించిన అధికారాలను, వనరులను తామే అట్టిపెట్టుకున్నాయి. దురదృష్టవశాత్తూ అలాంటి రాష్ట్రాలలో అంధ్రప్రదేశ్దే ప్రథమ స్థానం. ప్రాం తీయ సెంటిమెంట్లను ఉపయోగించుకొని తతెత్తున్న విభజన ఉద్యమాల రూపంలో అందుకు మూల్యాన్ని చెల్లిం చాల్సి వస్తోంది! నేడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆందోళన చేస్తున్న పార్టీ ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోలేకపోయింది. గత రెం డు ఎన్నికల్లోనూ అది ఒంటరిగా పోటీచేయలేక, రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలలో ఏదో ఒక దానితో జతకట్టక తప్పలేదు. అయినాగానీ తెలంగాణ ప్రజలందరి తరఫున మాట్లాడుతున్నానని చెప్పుకునే ప్రజ్ఞ దానిది! రాష్ట్రాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించాలని విశ్వసిస్తున్నవారిని... అదే డిమాండుతో రాబో యే ఎన్నికల బరిలోకి దిగి, ప్రజా తీర్పును గౌరవించమని చెప్పండి. నిర్ణయరాహిత్యానికి, వివేచనారాహిత్యానికి ఆల వాలమైన ఢిల్లీ దర్బారే ఇన్నేళ్లుగా ఈ ఉద్యమాన్ని పెంచిపోషించింది. ఉద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రజలను ఆకట్టుకోవడం, ఢిల్లీ దర్బారులో లాబీయింగ్ చేయడం ప్రజాభీష్టానికి ప్రత్యామ్నాయం కాజాలవు. వారు ప్రజాస్వామిక ప్రక్రియను గౌరవించి, అనుసరించడం నేర్చుకోవడం మంచిది.