ఒకేరోజు రెండు సభలకు అనుమతి వద్దు : కె. నారాయణ
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ వాదులు వచ్చే నెల ఏడున హైదరాబాద్‌లో తలపెట్టిన సభలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతల పరిస్థితి తలెత్తవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ రెండు వర్గాల్లో ఎవరికి అనుమతి ఇచ్చినా ఇబ్బందేనన్నారు. రాష్ట్రప్రభుత్వం నియంత్రించగలిగే స్థితిలో ఉంటే వేర్వేరుగా అనుమతులివ్వాలని సూచించారు.
ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇరుప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడానికి కేంద్రమే కారణమన్నారు. ఒకవైపు సీఎంను, మరోవైపు ఉప ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌సహా రాష్ట్రాన్ని శ్మశానవాటికగా మార్చాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జరిగే ఘర్షణలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రజలు రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే లగడపాటి తదితరులపై రాళ్ల దాడులని ఆయన చెప్పారు.