K. Narayana
-
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు
‘‘కరోనా సమయంలో ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయమంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఓ బటన్ నొక్కి, దాని గురించి విష్ చెబితే అయిపోతుంది. అయితే ఇలా వచ్చి కళాభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలుసుకుంటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నారాయణ్ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడయ్యాడు. ‘లవ్ స్టోరీ’ అనగానే చాలా ఆసక్తి కలిగింది.. ఎందుకంటే ప్రేమకథా చిత్రాలు చూసి చాలా రోజులైంది. నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగచైతన్య వెరీ కూల్ బాయ్. యంగ్‌స్టర్స్ అంతా ఎగసి పడుతుంటారు.. కానీ ఎప్పుడూ కంపోజ్డ్గా ఉంటాడు చైతన్య. కూల్ ఫాదర్‌కి (నాగా ర్జున) కూల్ సన్ నాగచైతన్య. తను నిలకడగా వెళుతుంటాడు.. అది ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నా మిత్రుడు ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సాయిపల్లవిని తొలిసారి మా వరుణ్ తేజ్ ‘ఫిదా’చిత్రంలో చూశాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక వరుణ్ వచ్చి, ‘డాడీ.. డ్యాన్స్ ఎలా చేశాను నేను’ అన్నాడు. ‘సారీ రా.. నేను నిన్ను చూడలేదు.. సాయిపల్లవిని మాత్రమే చూశా’ అన్నాను. నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు.. అయితే తను కుదరదు అంది.. నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్‌తో నేను డ్యాన్స్ చేయాలనుకుంటాను కానీ ‘చెల్లెమ్మా’ అని పిలవగలనా?.. పిలవలేను. నా పక్కన రొమాంటిక్ హీరోయిన్గా చేయగలిగితే ఓకే. శేఖర్ కమ్ముల ఎవరి వద్దా పనిచేయకపోయినా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో నో డౌట్’’ అన్నారు. హీరో ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ – ‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, బాగుందని చైతూకు(నాగచైతన్య) మెసేజ్ చేశా. నా ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రంలో తను నటించారు. నా సినిమా సెట్స్‌లో చైతన్యను ఫస్ట్‌టైమ్ చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉన్న ఫీలింగ్ కలిగింది. చైతూ చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, సంస్కారవంతుడు. ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే చూస్తాను. ముంబయ్‌లో థియేటర్స్‌లో స్క్రీనింగ్‌కు ఇబ్బందులు ఉంటే అధికారుల అనుమతితో ప్రత్యేక స్క్రీనింగ్‌లో అయినా చూస్తాను’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ–‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు విడుదల చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ‘లవ్ స్టోరీ’ నిర్మాతలకు అభినందనలు. ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టా ర్లలో పుంజుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకకి వచ్చిన చిరంజీవి, ఆమిర్ ఖాన్‌గార్లకు థ్యాంక్స్. నాగచైనత్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మా ‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు కె. నారాయణ్ దాస్ నారంగ్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మీరు(చిరంజీవి) నాకు ఆన్‌స్క్రీన్ మెగాస్టార్. ఆఫ్ స్క్రీన్ మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా కష్టకాలంలో మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ చేసిన తీరు స్ఫూర్తిదాయకం. ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, అభినందించి ఈ వేడుకకు వస్తానని ఆమిర్ఖాన్గారు వచ్చారు. ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా కోసం 45 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆమిర్‌గారి నుంచి నేను నేర్చుకున్న విషయాలు నాకు జీవితాంతం ఉపయోగపడతాయి. ‘లవ్ స్టోరీ’ లో ఇంతలా పెర్ఫార్మ్ చేశానంటే అందుకు కారణం శేఖర్ కమ్ములగారే. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నందుకు మా నిర్మాతలకు ధన్యవాదాలు. యాభైఏళ్ల క్రితం తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ‘ప్రేమ్‌నగర్’ సినిమా విడుదలైన తేదీనే ‘లవ్‌స్టోరీ’ వస్తోంది.. అన్నీ రాసిపెట్టినట్లుగా అనిపిస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శరత్ మరార్, భరత్ నారంగ్, అభిషేక్ అగర్వాల్, కెమెరామెన్ విజయ్ సి.కుమార్, సంగీత దర్శకుడు పవన్ సి.హెచ్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, పాటల రచయితలు భాస్కర భట్ల, సురేంద్ర, ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా, నటి ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్ మహా అయితే 20శాతం. ఈమాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందనుకుంటారు. కానీ, కష్టాలు పడేవారు, సాధక బాధకాలు అనుభవించే వారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కలిస్తే కాదు. కరోనా సమయంలో షూటింగ్స్ ఆగిపోవడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ప్రత్యక్షంగా చూశాం. ఏ విపత్తు వచ్చినా సాయానికి ముందుండేది మా సినిమా ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున సంక్షోభంలో పడిపోయింది.. సినిమా నిర్మాణం ఖర్చు పెరిగిపోయింది.. ఈ వేదికగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను మా విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ – చిరంజీవి -
‘బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే ఫ్రంట్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది బీజేపీ అనుకూల ఎజెండా, రహస్య ఎజెండా అని తాము ముందు నుంచీ చెబుతున్నామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్..మళ్లీ మోదీ వద్దకు వెళ్లడాన్ని బట్టి ఈ ఎజెండాను అర్థం చేసుకోవచ్చన్నారు. కాళేశ్వరంప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానిని కలిశానని కేసీఆర్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని అన్నారు. ఐదేళ్లలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ సాధించలేదని మండిపడ్డారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడంతోపాటు బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేసీఆర్ తీరు గతంలోనే బయటపడిందని పేర్కొన్నారు. -
ధర్నాలు నిషేధించడం నియంతృత్వం
సీపీఐ నేత నారాయణ సాక్షి, న్యూఢిల్లీ: ధర్నాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఇందిరా పార్కు వద్ద ధర్నాలను నిషేధించడం ద్వారా తన నియంతృతత్వాన్ని ప్రదర్శించుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండి పడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లా డుతూ.. ఉద్యమాలు చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉందన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని, దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే వారిని అణచాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ సాయిబాబా జీవితఖైదును పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులివ్వండి:శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఓయూలో మౌలికసదుపాయాలకై రూ.500 కోట్లు కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్జవదేర్ను ఏఐఎస్ఎఫ్ నేతలు కోరారు. ఎంపీ డి.రాజా ఆధ్వర్యంలో నాయకులు స్టాలిన్, వలీఉల్లా ఖాద్రీ ఆసిఫ్ తదితరులు కేంద్రమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. -
న్యాయ వ్యవస్థకే అవమానకరం
జస్టిస్ రూపన్వాల్ ప్రకటనపై నారాయణ సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల దళితు డు కాదని జస్టిస్ రూపన్వాల్ ప్రకటించడం న్యాయ వ్యవస్థకే అవమానకరమని సీపీఐ నేత కె.నారాయణ మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులపై విచారణ చేయమని కేంద్రం ఆదేశిస్తే.. అతను దళితుడు కాదని కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషనర్ విచారణాంశాలలో రోహిత్ ఏ కులం వాడో విచారించమని పేర్కొనలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీలోని వ్యవస్థీకృత హింస వల్లనే రోహిత్ ప్రాణం కోల్పోయాడన్నారు. రోహిత్ దళితుడేనని గతంలో గుంటూరు కలెక్టర్ నివేదిక ఇచ్చారని, ఎమ్మార్వో కుల ధృవీకరణ సర్టిఫికెట్ జారీ చేశారని, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా రోహిత్ దళితుడేనని తెలిపిందన్నారు. మరి ఇప్పుడు రూపన్వాల్ చెప్పింది నిజమైతే గుంటూరు జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రూపన్‌వాలా నివేదికను చెత్తబుట్టలో వేయాలని నారాయణ డిమాండ్ చేశారు. -
వారిద్దరూ మోదీ చేతిలో బకరాలు
వెంకయ్య,బాబులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీ చేతిలో బకరాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కదా అని అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో క లసి నారాయణ విలేకరులతో మాట్లాడారు. వెంకయ్య, చంద్రబాబు హోదా వల్ల ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి జరిగిందో లేదో చూద్దామా? అని నారాయణ సవాల్ విసిరారు. -
బీజేపీది సంకుచిత మార్గం
సీపీఐ నేత నారాయణ సాక్షి, హైదరాబాద్: చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీ పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని సీపీఐ నేత కె.నారాయణ గుర్తుచేశారు. ఈ పోరాటానికి భయపడి నిజాం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగి పోయాక సెప్టెంబర్ 17 తర్వాత.. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు ఖద్దరు చొక్కాలు ధరించి కాంగ్రెస్ వారి రూపంలో మళ్లీ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినందున పోరాటాన్ని కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ మహత్తర పోరాటాన్ని హిందువుల ఆధిపత్యం, ముస్లింల ఓటమి కింద చూపేందుకు బీజేపీ సంకుచిత ప్రయత్నం చేస్తోందన్నారు. నిజాంపైనే పోరాటానికి కమ్యూనిస్టులు పిలుపునిచ్చి సాయుధ పోరాటంలో పాల్గొంటే ఆయనకు సహకరించే పరిస్థితే ఉత్పన్నం కాదన్నారు. గతంలో ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ఉత్సవాలను జరపలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే కోవలోకి చేరకుండా ఈ ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
చేతనైతే ఏపీకీ హోదా తీసుకురా...
వెంకయ్యనాయుడుకి నారాయణ సవాల్ సాక్షి, హైదరాబాద్: ఒక్కసారి కూడా ప్రజల చేత ఎన్నిక కాకుండా పార్లమెంట్లో ప్రవేశించి.. మూడుసార్లు దొడ్డిదారిన కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడికి కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే అర్హత లేదని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ ధ్వజమెత్తారు. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి వరహాలేనని, కమ్యూనిస్టు పార్టీలు కూడా అంతేనన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల చేత లోక్‌సభకు ఎన్నిక కాలేక... యాచకత్వం ద్వారా కర్ణాటక నుంచి రెండుసార్లు, రాజస్థాన్ నుంచి ఒకసారి వెంకయ్య రాజ్యసభకు నామినేటయ్యారన్నారు. వెంకయ్యకు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచన మంచిదేనని, అయితే మధ్యలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. కేసీఆర్... రెండూ ఎలా సాధ్యం? ఒకవైపు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మను కొలుస్తూ, మరోవైపు నిజాం చక్రవర్తిని పొగడడం సీఎం కేసీఆర్‌కు ఎలా సాధ్యమని నారాయణ ప్రశ్నించారు. ‘‘ కేసీఆర్ ఎర్రగడ్డలో ఉండాల్సిన వాడు. అందుకే సచివాలయాన్ని ఎర్రగడ్డలో పెట్టాలని చూశాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. నిజాం పాలనను వ్యతిరేకించడమో లేక పొగడడమో చేయాలి తప్ప రెండూ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక ఏపీ అసెంబ్లీ కుక్కలు చింపిన విస్తరిగా తయారైందన్నారు. -
హోదా సాధించు.. లేదంటే వైదొలగి పోరాడు
సీపీఐ నారాయణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా సీఎం చంద్రబాబు బీజేపీతో అధికారంలో కులుకుతూ ఎంజాయ్ చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండిపడ్డారు. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలసి శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి భాగస్వాములుగా ఉండి ప్రత్యేక హోదా తీసుకరాకపోతే చంద్రబాబు అంత పచ్చి అవకాశవాది మరొకరుండని దుయ్యబట్టారు. ‘హోదా సాధించండి. లేకపోతే కేంద్రం నుంచి వైదొలగి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కండి. రెండూ చేయకపోతే తెలుగు ప్రజలను నట్టేట ముంచిన వారవుతారు’అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
రైతులకు బతుకునిచ్చే తెలంగాణ కావాలి
దుబ్బాక: బంగారు తెలంగాణ కాదు.. రైతులకు బతుకునిచ్చే తెలంగాణ కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కరువు పరిశీలనలో భాగంగా గురువారం చేగుంటలో కూరగాయల పంటలను పరిశీలించారు. వల్లూర్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నీరులేక ఉల్లి, టమాటా పంటలు ఎండిపోయాయని సాయిలు నారాయణకు వివరించాడు. అప్పుల బాధతో గత ఏడాది తమ మామ పెద్ద సాయిలు, ఈ ఏడాది తన భర్త బాలరాజు ఆత్మహత్య చేసుకున్నారని వల్లూర్‌లో బాధితురాలు అనురాధ రోదిస్తూ తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి లేకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ అధికారులతో ఎండిన పంటల వివరాలు తీసుకుని తగిన సహకారం అందించాలన్నారు. రైతుల బాధలను పట్టించుకోని కే సీఆర్.. మాటల గారడీతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. పదిలక్షల పరిహారం, ఎండిన పంటలకు ఎకరాకు రూ. పదివేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వేసవిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రజలకు ఉచిత భోజనం అందించాలన్నారు. కరువును దృష్టిలో ఉంచుకొని రేషన్‌షాపుల్లో ప్రతి వ్యక్తికి 10కిలోల చొప్పున బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
'దెబ్బలు తినటమే కాదు.. తిరిగి కొట్టడానికి సిద్ధమే'
విజయవాడ : త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో వామపక్షాలదే పైచేయి కానుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలసి కె నారాయణ విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరుతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో అక్కడ స్థానిక ప్రజలు స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు. అలాగే పశ్చిమబెంగాల్లో కూడా మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ, అసోంలలో బీజేపీ పరిస్థితి పైన పటారం, లోన లొటారంలా ఉందని వ్యాఖ్యానించారు. మతోన్మాద పోరాటం ద్వారానే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే ఆ పార్టీ నాయకత్వం దాడులకు పూనుకుంటోందని ఆరోపించారు. వామపక్షాలు ప్రధాన శత్రువుగా తయారవుతున్నాయనే దాడులు చేయిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. అయితే, దెబ్బలు తినటానికి కాదు.. తిరిగి కొట్టడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చివరికి విద్యార్థులుపైన కూడా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలపై దృష్టి పెట్టిన విద్యార్థి సంస్థ ఏబీవీపీ.... తన ప్రాబల్యం పెంచటానికి ఇతర సంఘాలపై దాడులు చేస్తోందని విమర్శించారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ వాస్తవాలు చెబుతుంటే... ఎందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కన్నయ్యపై దాడులకు ఢిల్లీ నుంచే పథకం రచిస్తున్నారని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావు నియామకం కూడా కుట్ర పూరితమేనన్నారు. అమరావతి డిజైన్ చేసిన వారికి లక్ష డాలర్లు ఇవ్వటం సమంజసం కాదని రామకృష్ణ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో ఎమ్మెల్యేలు అక్రమ సంపాదన చేస్తున్నారని ఆరోపించారు. క్యాంపు కార్యాలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఇసుక దందా జరుగుతుంటే ఏమీ చేయలేకపోతున్నారని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. -
అజయ్‌భవన్‌కు కొండంత అండ
నివాళి ‘ఏమిటిలా నిరుత్సాహపరిచావ్? నీవు కేంద్రానికి వచ్చి జాతీయ స్థాయిలో పని చేస్తావని అంతా ఆశించాం!’ అన్నారు ఏబీ బర్దన్ గారు (సెప్టెంబర్ 24, 1924- జనవరి 2, 2016). గడచిన నవం బర్ నెలాఖరున నేను కేంద్ర కార్య వర్గ సమావేశాలకి ఢిల్లీ వెళ్లిన ప్పుడు నన్ను చూడగానే బర్దన్ గారు అన్నమాట ఇదే. నిజానికి ఆయనే నన్ను తీవ్రంగా నిరుత్సాహ పరిచారు. ఆయన ఆదేశించినట్టుగానే నేను ఢిల్లీకి మకాం మార్చడానికి నిర్ణయం తీసుకున్నాక, వారు అజయ్భవన్ను శాశ్వతంగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. నన్ను తన సొంతమనిషిని చేసుకుని చనువుగా అలా గదమాయించారాయన. అందులో ఒక ఆప్యాయత ఉంది. అంతేనా! నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం ఎలాంటిదో కూడా గమనించాను. తీరా నేను విషయం గుర్తు చేశాక వెన్న లాగా కరిగిపోయారు. వెంటనే, ‘సరే కానీ!’ అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు. పాండిచ్చేరి మహాసభలో నాకు కేంద్ర బాద్యతలు అప్పగిం చారు. ఆ మహాసభ ఆదేశం మేరకు నేను ఢిల్లీకి మకాం మార్చాలి. తీసుకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే మనిషికి సంతృప్తి. కానీ కార్యదర్శిగా ఉండగా, తీసుకున్న ఒక బాధ్యతను అసంపూర్తిగా వదలి నూతన నాయకత్వం మీద భారం పడేసి పోవడానికి నా మనసు అంగీకరించలేదు. వాస్తవంగా ఆ బాధ్య తలను పూర్తి చేయడానికి ఆచరణలో అనేక సమస్యలు ఎదురై నాయి. దానితో నేను హైదరాబాద్‌లోనే ఉండవలసి వచ్చింది. దాని ఫలితమే కేంద్రంలో నాకప్పగించా లనుకున్న బాధ్యతలను స్వీకరించలేకపోయాను. తరువాత నేను బిహార్‌లో అప్పుడు జరిగిన ఆ రాష్ర్ట పార్టీ సమావేశాలకు బయలుదేరాను. ఎక్కడికీ ప్రయాణం అనడిగారు బర్దన్. బిహార్కని చెప్పగానే ఎంతో ఆనందించి,వెళ్లి రమ్మని సైగ చేశారు. బిహార్ నుంచి తిరిగి వచ్చే లోపుననే మాటామంతీ లేకుండా ఆస్పత్రిలో మంచం మీద అలా అచేతనంగా కనిపించారు. ఒక్కసారైనా పలకరించలేకపోతామా అని చివరి దాకా ఎదురుచూశాను. చివరికి నిరాశనే మిగిల్చారు. మమ్మ ల్నందరినీ విడిచి నిర్దయగా నిష్ర్కమించారు కామ్రేడ్ బర్దన్. వామపక్ష ఉద్యమానికి తలమానికం బర్దన్. పదవీ విరమణ చేశారు గానీ, శక్తి మేరకు కొన్ని బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు. అనారోగ్యం పాలు కాగానే వారి అమ్మాయి అల్క వారి ఇంటికి తీసికెళ్లి బాగోగులు చూసు కోవడానికి ప్రయత్నించారు. అల్కా అహ్మదాబాద్‌లో పేరెన్నిక గన్న డాక్టరు. ఆమె భర్త సమీర్ బారువా ఐఐఎం డెరైక్టర్. అక్కడే వింత సమస్య ఎదురైంది. బంధువులు ఎవరు వచ్చి పలకరించినా స్పందించేవారు కాదట. బర్ధన్ కుమారుడు సాహిల్ గుర్గావ్లో వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. మరో కుమారుడు అశోక్ రష్యాలో ఫిజిక్స్, మ్యాథ్స్ లలో ఎంఎస్ చేసి ఆ తర్వాత అమెరికాలోని బర్క్లీ యూని వర్సిటీలో అర్ధశాస్త్రంలో పీహెచ్డీ చేసి పలు గ్రంథాలు రచించారు. కుటుంబసభ్యులు అప్పుడప్పుడు వచ్చి బర్ధన్‌ను కలవడమే తప్ప వారి దగ్గరకు ఆయన వెళ్లింది లేదు. న్యూఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్భవనే 2006 వరకూ ఆయన నివాసగృహం. ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాక పార్టీ ఎంపీకి చెందిన క్వార్టర్స్‌కి మారారు. తన కుమార్తె ఇంట సకల సౌకర్యాలూ ఉన్నా ఏమీ లేని వారిగా, పార్టీ కార్యాల యంలో పరిమిత సౌక ర్యాలే ఉన్నా అక్కడే ఆయన ఎంతో ఆనందంగా, తృప్తిగా గడపడం గమనించాం. చివరికి తనకు సుతరామూ ఇష్టం లేకున్నా, తండ్రి ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉంచుదామని నిర్ణయించుకున్న వారి కుమార్తె ఆయనను ఢిల్లీకే పంపించేశారు. శేష జీవితాన్ని కమ్యూనిస్ట్ కుటుంబంతోనే గడపాలని ఆయన దృఢంగా కోరుకున్నారు. ఇది నిశ్చయం. కార్యకర్తలతో ఆయన వ్యవహారసరళి ఆదర్శనీయంగా ఉండేది. చురుకైన కార్యకర్తలు తొందరపాటు పనులు చేసినా ఆప్యాయంగా మందలించే వారే తప్ప కోపగించుకొనేవారు కాదు. నాపైన కూడా ఒకటి రెండు దఫాలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ మందలింపు, విమర్శ కార్యకర్తను ముందుకు నడిపించేదిగా ఉండేది. అజయ్భవన్లో బర్దన్ ఉంటేనే పార్టీకి కొం డంత అండ. ఆయన వెన్నలాంటి మనసు కలిగిన కఠినాత్ముడు. బర్దన్గారు భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆ గంభీరస్వరం, ఆత్మీయ స్పర్శ, ఆప్యాయత నిండిన పలకరింపు మనతోనే ఉంటాయి. బర్దన్ గారి జీవితం ప్రజాస్వామ్యానికి, సెక్యుల రిజానికి, సోషలిస్ట్ వ్యవస్థ స్థాపనకు అంకితమైంది. ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచి ఉండే ఆ విప్లవమూర్తికి ఇదే శ్రద్ధాంజలి. కళాహృదయుడీ కామ్రేడ్ తీరిక లేకుండా సదా ఉద్యమాల్లో పాల్గొనే బర్దన్‌కు కవిత్వ మన్నా, పాటలన్నా ప్రాణం. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్నీ, మహ్మద్ రఫీ పాటల్ని వినడానికి ఇష్టపడేవారు. ఇక్బాల్ బానో రాసిన ‘హమ్ దేఖేంగే...’ గీతమైతే ఆయన నోట్లో నానేది. సాహిర్ లుధ్యాన్వి, కైఫీ ఆజ్మీ వంటి మహాకవులు పార్టీలో ఉండేవారని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మహా రాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించి అక్కడే ట్రేడ్ యూనియన్ రంగంలో చురుగ్గా పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీలోకి ప్రవేశించారు. 2004లో తొలిసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వామ పక్షాలు దానికి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ఆయన తరచు మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడేవారు. అయితే మన్మోహన్పై ఆయనకంత సదభిప్రాయం లేదు. దేశాన్ని అమెరికాకు సన్నిహితం చేయడమే ఆయన ఎజెండా అని అనేవారు. చిత్రంగా తనకు మన్మోహన్కంటే వాజపేయి అంటేనే సదభిప్రాయం ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆర్ధిక, విదేశీ వ్యవహారాల్లో కాంగ్రెస్, బీజేపీల విధానాలు ఒకటేనని భావించేవారు. - కె.నారాయణ వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు. మొబైల్ : 9490952222 -
విద్యా వ్యవస్థలో స్మగ్లర్లు, మాఫియా లీడర్లు
విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు ఉద్యమించాలి ఏఐఎస్ఎఫ్ సదస్సులో సీపీఐ నేత నారాయణ తిరుపతి కల్చరల్: విద్యా వ్యవస్థలోకి స్లగ్లర్లు, మాఫియా లీడర్లు, రాజకీయ నాయకులు ప్రవేశించి భ్రష్టు పట్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. ఎస్వీయూలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవం రెండో రోజు గురువారం విద్యారంగంలో కాషాయీకరణ-సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సును నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యారంగాన్ని పరిరక్షించుకునేందుకు విద్యార్థులు ఉద్యమిం చాల్సిన అవసరం ఉందన్నారు. బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఏఐఎస్ఎఫ్కు ఉందన్నారు. నేడు దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, అవి పరిష్కారం కావాలంటే వామపక్ష ఉద్యమం బలోపేతం కావాలని అన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ వీసీ విభూది నారాయణరాయ్ మాట్లాడుతూ పాఠ్యాంశాలను వక్రీకరించి విద్యార్థులకు బోధించడమంటే చరిత్రను హత్య చేసినట్లేనని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకువచ్చి వారికి అనుకూలంగా చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, దీన్ని విద్యార్థి లోకం ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తులు మతోన్మాదం వైపు విద్యావ్యవస్థను లాగేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముస్లిం, మైనారిటీ, మహిళలు, దళితుల వ్యతిరేక భావాలను పాఠ్యాంశాల్లో చొప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థుల మనస్సులో హిందుత్వ భావజాలం ఎక్కించి వారివైపు తిప్పుకునే కుట్ర చేస్తున్నారన్నారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీ ఉల్లా ఖాదరి, విశ్వజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రీట్స్‌లోకి హైదరాబాద్‌లోని ఫోరం మాల్
ప్రెస్టిజ్ గ్రూప్ సీఎఫ్ఓ వెంకట్ కె. నారాయణ సాక్షి, హైదరాబాద్ : రీట్లతో పెట్టుబడిదారులకు ప్రతి నెలా ఆదాయంతో పాటు, ఆ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంటుంది. అందుకే చాలా నిర్మాణ సంస్థలు రీట్లను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని ప్రెస్టిజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఫైనాన్స్ అండ్ సీఎఫ్ఓ వెంకట్ కె. నారాయణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. కాకపోతే నిబంధనలు, స్టాంప్ డ్యూటీ, పన్నుల విధానంలోనే ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. మరో 6-8 నెలల్లో దేశంలోని పలు వాణిజ్య, ఆఫీసు స్పేస్‌ను రీట్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ► ప్రస్తుతానికైతే ప్రెస్టిజ్ ప్రాజెక్ట్‌లు దక్షిణాదిలోనే ఉన్నాయి. 65 మిలియన్ చ.అ.ల్లో 68 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. ఇందులో ఆఫీసు స్థలం 8.46 మిలియన్ చ.అ., షాపింగ్ మాల్స్ స్థలం 2.88 మిలియన్ చ.అ. ఉంది. ఏటా ఆఫీసు స్థలం నుంచి రూ.430 కోట్లు, మాల్స్ నుంచి 254 కోట్లు అద్దె వస్తుంది. తొలి విడతగా ఈ ప్రాజెక్ట్‌లను రీట్లకు తీసుకొస్తున్నాం. మొత్తం 7 షాపింగ్ మాల్స్ కాగా.. ఇందులో ప్రెస్టిజ్, సుజాన కంపెనీల జాయింట్ వెంచర్ అయిన హైదరాబాద్‌లో ది ఫోరం సుజనా మాల్ కూడా ఉందని ఆయన చెప్పారు. ► మరో 8 మిలియన్ చ.అ. ఆఫీసు స్పేస్ నిర్మాణ దశలో ఉంది. రెండేళ్లలో ఈ స్థలాన్ని కూడా రీట్లలోకి తీసుకొస్తాం. ఆఫీసు స్పేసుల్లో కంటే షాపింగ్ మాళ్లలోనే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్, రిక్రియేషన్, గేమింగ్ జోన్స్ ఇలా ప్రతిదాంట్లోనూ ఆదాయం ఉంటుంది. ► {పస్తుతం హైదరాబాద్‌లో అప్పా జంక్షన్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం 4 ప్రాజెక్ట్‌లున్నాయి. ఇందులో కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రాజెక్ట్‌లను సెప్టెంబర్ ముగింపు నాటికి ప్రారంభిస్తాం. రెండేళ్లలో మరో మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తాం. ► 2015-16లో ప్రెస్టిజ్ గ్రూప్ నుంచి రూ.5,013 కోట్ల విక్రయాలు చేశాం. ఈ ఏడాది రూ.3,518 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. వచ్చే ఏడాది రూ.4,000 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రెస్టిజ్ కొనుగోలుదారుల్లో 8-10 శాతం ఎన్నారైలే. మిగతా వారిలో వ్యాపారులు, స్థానికులు. ► ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే దగ్గర్లో రెసిడెన్షియల్ ఎలా ఉంది? అనేది చూస్తాం. అదే రెసిడెన్షియల్ అయితే ఏ సెగ్మెంట్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు? ఏ లోకేషన్లో కట్టాలి. వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తాం. -
టీటీడీ మానవసేవ చేస్తోంది: నారాయణ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మానవసేవ చేస్తోంద ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. తిరుమలలోని నిత్యాన్నప్రసాద భవనంలో ఆయన బుధవారం రాత్రి ఉచిత అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులతో పాటు ఇతర ఆలయ కేంద్రాల్లో రోజుకు లక్షలాది మందికి అన్నప్రసాదాలు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి చోట యాత్రికులకు వడ్డించే అవకాశం తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. -
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరం
నారాయణకు ప్రమోషన్ 9 మందితో కేంద్ర కార్యదర్శివర్గం కేంద్ర కమిటీలో చాడ, రామకృష్ణ పుదుచ్చేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. ఐదు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల ఆఖరి రోజైన ఆదివారం వచ్చే మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం ఎన్నిక కావడం ఇది రెండో సారి. చాలా కాలం తర్వాత పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేసి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్ గుప్తాకు అప్పగించారు. ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణకు ప్రమోషన్ ఇచ్చి కేంద్ర కార్యదర్శివర్గంలోకి తీసుకున్నారు. 125 మందితో జాతీయ సమితిని, 31 మందితో కేంద్ర కమిటీని, 9 మంది చొప్పున కార్యదర్శివర్గాన్ని, కేంద్ర కంట్రోల్ కమిషన్‌ను ఎన్నుకుంది. జాతీయ కార్యదర్శివర్గానికి ఎన్నికైన వారిలో ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శితో పాటు డి.రాజా (తమిళనాడు), కె.నారాయణ (ఆంధ్రప్రదేశ్) తదితరులు ఉన్నారు. శాశ్వత ప్రోగ్రాం కమిషన్ చైర్మన్ హోదాలో పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్దన్ కేంద్ర కార్యదర్శివర్గ భేటీకి హాజరవుతారు. కేంద్ర కమిటీకి ఎన్నికైన తెలుగువారిలో కె.నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ ఉన్నారు. జాతీయ సమితికి తెలంగాణ నుంచి 9మంది, ఏపీ నుంచి ఆరుగురు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, సిద్ది వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, రామనరసింహారావు, గుండా మల్లేష్ (కంట్రోల్ కమిషన్ సభ్యునిగా), వలి ఉల్లా ఖాద్రీ (ఏఐఎస్ఎఫ్ కోటా), ఏపీ నుంచి కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, పీజే చంద్రశేఖర్, జల్లి విల్సన్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు (కంట్రోల్ కమిషన్ చైర్మన్) జాతీయ సమితికి ప్రాతినిధ్యం వహిస్తారు. సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి కార్మికరంగం నుంచి జాతీయ సమితి సభ్యులుగా ఉంటారు. ఏపీ తెలంగాణ విభేదాలను విడనాడండి: సురవరం విభజనతో వచ్చిన విభేదాలను విడనాడి సమైక్యత, సమభావంతో తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలు కమ్యూనిస్టుల ఐక్యత, దేశ, రాష్ట్ర రాజకీయాల వరకు అనేక అంశాలపై పార్టీ మహాసభ దిశానిర్దేశం చేసిందని సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
హైటెక్ నారాయణ
నేటి ప్రపంచంతో పాటు దూసుకెళ్లాలంటే సాంకేతిక పరిజ్ఞానం తోడు అవసరమని చెప్పడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం. తాను నమ్మిన సిద్ధాంతాలు.. విలువలను భుజానికి తగిలించుకుని.. నేటి తరం వారితో పాటుగా పయనానికి అన్నట్లు ఒకచేత్తో సెల్‌ఫోన్.. మరో చేత్తో ట్యాబ్ పట్టుకుని ముందడుగు వేస్తున్నారు సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ. కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో గురువారం నిర్వహించిన ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సంస్మరణ సభకు వచ్చిన నారాయణను సాక్షి క్లిక్ మనిపించింది. -
'పునరేకీకరణతోనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి'
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ ద్వారానే దేశంలో కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనే శక్తిమంతమైన ప్రత్యామ్నాయం అవతరిస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే పార్టీగా ఉండాలని ఆకాక్షించారు. కాగా, సీపీఐ మిగిలిన కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఐక్య పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణ, తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చిలో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానంలోనూ కమ్యూనిస్టుల పునరేకీకరణ ప్రాధాన్యంపై చర్చిస్తామని సురవరం తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని విమర్శించారు. నల్లధనం దేశానికి రప్పిస్తే ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షలు అందుబాటులోకి వస్తాయని చెప్పి, గత ప్రభుత్వం లాగే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూనే.. ఆయుధాలు తయారు చేయవద్దని, వాటిని తామే సరఫరా చేస్తామన్న అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి సాగిలపడుతోందని సురవరం ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సే విగ్రహాలను దేశమంతా పెడతామని ప్రకటనలు చేస్తుంటే దానిపై ప్రధాని, బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. గాంధీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నిరసనగా గాంధీ జయంతి రోజును మత సామరస్య- జాతీయ సమైక్య దినంగా జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాం ప్రభుత్వ పాలన పాఠ్యాం శంగా చేర్చాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అప్పటి పాలనలో పోరాటాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించే తీరు కూడా వాటిలో చేర్చాలని సూచించారు. అంత మోజుంటే ప్రభుత్వాన్ని సింగపూర్‌కే లీజుకివ్వొచ్చుగా : చంద్రబాబు తీరుపై నారాయణ మండిపాటు ప్రతిదానికి సింగపూర్, జపాన్ గురించే మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు అంతగా మోజుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగపూర్‌కే లీజుకివ్వొచ్చుగా అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సలహా ఇచ్చారు. ప్రభుత్వాన్ని లీజుకిస్తే ఇక్కడా వాళ్లే పాలన చేస్తారుగా అని ఎద్దేవా చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తుంటే చంద్రబాబు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. -
'ప్రభుత్వ భూమి ఆక్రమించిన బొజ్జల అనుచరుడు'
శ్రీకాళహస్తి: ‘మంత్రిగారూ.. మీ నియోజకవర్గంలో భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. మీ అనుచరులే కబ్జాచేసి ఇతరులకు లీజుకిస్తున్నారు.’ అంటూ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలపై సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో భూసదస్సు నిర్వహించా రు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ నాయకులు భూదాహంతో పరితపించిపోతున్నారన్నారు. మంత్రి బొజ్జల అనుచరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు వాసులకు లీజుకివ్వడం సిగ్గుచేటన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీపురం, సత్యవేడు మండ లాల్లోని ప్రభుత్వ భూములను ఆయా మండలాల నాయకులు ఆక్రమించి తమిళనాడు వాసులకు విక్రయిస్తున్నారని విమర్శించారు. -
సీఎంలిద్దరూ ప్రజలను రెచ్చగొడుతున్నారు
బాబు, కేసీఆర్‌పై సీపీఐ నారాయణ మండిపాటు హైదరాబాద్: రాజకీయంగా తమ తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ఆరోపించారు. ఇద్దరు నేతలు ఒక పీలిక నుంచి చీలిన ముక్కలేనని చెప్పారు. ‘వారి మధ్య ఘర్షణ ఉండొచ్చు. ఇద్దరు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవచ్చు. కానీ తెలుగు ప్రజల మధ్య విభేదాలు లేవు’ అని నారాయణ అన్నారు. 2 రాష్ట్రాల మధ్య వివాదాలను నాయకుల మధ్య వివాదాలుగా చూడాలన్నారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు(సీఆర్) శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో ఈ నెల 11న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు శనివారం పరిశీలించారు. -
'కార్పొరేట్ కంపెనీల కృత్రిమ బొమ్మ మోడీ'
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ కంపెనీలు కలసి చేసిన కృత్రిమ బొమ్మే నరేంద్ర మోడీ అని సీపీఐ నేత కె. నారాయణ అన్నారు. ఈ ప్రభుత్వం వెనక ఉన్న మతోన్మాద శక్తులను కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా బయట పెడుతామని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 11న నిజాం కాలేజీలో భారీ బహిరంగా సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. రుణమాఫీ విషయంలో కౌలు దారులకు ఏ లాభం జరగడం లేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం వెంటనే 30 లక్షల మంది కౌలు దారులకు గర్తింపు కార్డు ఇచ్చి రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని కోసం వేసిన కమిటీతో చంద్రబాబు నిజస్వరూపం అర్ధమవుతోందన్నారు. కార్పొరేట్ వర్గాలకు ఈ కమిటీలో స్థానం కల్పించారని తెలిపారు. స్థానికతకు 1956 ప్రామాణికత అసమంజమని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో ఉస్మానియా విద్యార్ధులతో చర్చలు జరపాలని సూచించారు. పోలవరం, స్థానికత, ఉద్యోగాల విషయంలో వెంటనే సీఎం కేసీఆర్- అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. -
'భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుండదు'
ఖమ్మం: భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని, ఆ పార్టీ తనంతట తానుగా సముద్రంలో మునిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడటం వలనే ఎన్నికల్లో వైఫ్యలం చెందామన్నారు. భారతదేశంలో ఎక్కడా కాంగ్రెస్‌తో పొత్తు లేదనీ, తెలంగాణ ఇచ్చారనే కారణంతోనే ఇక్కడ పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రైతాంగ రుణాల విషయంలో రైతులందరినీ అయోమయానికి గురి చేస్తోందన్నారు. 2013 జూన్ నుంచి 2014 జూన్ వరకు రైతులు తీసుకున్న లక్ష లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని బ్యాంకర్ల సమావేశంలో తెలంగాణ మంత్రులు వెల్లడించడం దారుణమని, వెంటనే వారు దీనిపై పునః సమీక్షించాలని కోరారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలను చేసిన విధంగా రైతులందరి రుణాలు మాఫీ చేయాలని, రైతుల బంగారం రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం సమస్యపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కూర్చుని మాట్లాడి పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో సమస్యలపై తమ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. -
నారాయణ వలస పక్షి: పొంగులేటి
ఖమ్మం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణపై వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నారాయణ వలస పక్షిలా ఖమ్మం వచ్చి పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గెలుపు కోసం దోపిడీ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో తనదే విజయమని పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్నది రాజ్యమని అన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సువర్ణయుగం సాధ్యమవుతుందని పొంగులేటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
450 ‘నామా’లు పెడతాడు: నాగేశ్వర్రావు
టీడీపీ నేత నాగేశ్వర్రావుపై నారాయణ విసుర్లు కుక్కునూరు,న్యూస్‌లైన్ : ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ప్రజలకు ఇప్పటికే మూడు పంగనామాలు పెట్టాడని, కార్పొరేట్ సంస్థల పేరుతో బ్యాంకులకు రూ.450 కోట్లను ఎగ్గొట్టిన అతను, అదే సంఖ్యలో ప్రజలకు నామాలు పెడతాడని ఖమ్మం పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నారాయణ కుక్కునూరులో ప్రసంగించారు. సీపీఐ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముంపుప్రాంతాల సమస్యను అసెంబ్లీ, పార్లమెంట్లో వినిపిస్తామని తెలిపారు. పోలవరం ముంపు భూములకు ఎకరాకు రూ.10 లక్షలు ఆర్ఆర్ ప్యాకేజీ కింద, నిర్వాసిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ, సీపీఎంలు రెండుకళ్ల సిద్ధాంతాలను పాటిస్తున్నాయని నారాయణ విమర్శించారు. -
ఖమ్మం నుంచి నారాయణ పోటీ
సాక్షి, హైదరాబాద్: సీపీఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ సిఫార్సుల మేరకు నారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు సీపీఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న నారాయణ నామినేషన్ వేయనున్నారు. తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడం ఖాయమని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాస్తవానికి పొత్తులో భాగంగా.. ఖమ్మం, నల్లగొండ లోక్‌సభ సీట్లను సీపీఐ కోరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని మాత్రమే కేటాయించింది. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును పోటీ చేయించాలని సీపీఐ భావించింది. అయితే, ఖమ్మం అసెంబ్లీ సీటును పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు అజయ్ కుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. తండ్రీ కుమారులిద్దరూ ఒకే లోక్‌సభ స్థానం పరిధిలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తే.. ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ సీపీఐని హెచ్చరించింది. దీంతో సీపీఐ తన అభ్యర్థిని మార్చుకోవాల్సి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో నారాయణను ఎలాగూ ఢిల్లీకి తీసుకువెళ్లాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం ఆయన పేరును ఖమ్మం స్థానానికి ఖరారు చేసింది. -
పవన్‌కు గడ్డమోపదేశం!
నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉండే కామ్రేడ్ కె నారాయణ ఈసారి ఓ గొప్ప వాస్తవం వెల్లడించారు. గడ్డం థియరీతో కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. జనసేన పేరుతో ఫోర్స్‌గా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్‌కు గడ్డమోపదేశం చేశారు. గడ్డంను చూసి మోసపోవద్దని, గడ్డాలన్ని ఒకటి కాదని చెప్పారు. నారాయణ గడ్డం థియరీ ప్రవచించడానికి కారణం మోడీతో పవన్ భేటీ. పవర్‌స్టార్ పాలిటిక్స్ తనకు అర్థం కావడం లేదంటూ బుర్ర గోక్కున్నారు కామ్రేడ్ నారాయణ. పవన్‌కల్యాణ్ రాజకీయాలేమిటో, ఆయన చెప్పిన విషయాలేమిటో.. తనకేమీ అర్థం కాలేదని ఈ సీపీఐ నాయకుడు వ్యాఖ్యానించారు. పవన్ మోడీని కలవడం, ఆయన ద్వారా ప్రచారం సాగించాలనుకోవడం సరికాదన్నారు. ‘‘చేగువేరాను ఎక్కువగా ఆరాధించే పవన్ ఒకటి తెలుసుకోవాలి. మోడీ గడ్డం, చేగువేరా గడ్డం ఒక్కటి కాదు! చేగువేరా గడ్డం సమాజాన్ని మార్చేది.. మోడీ గడ్డం సమాజాన్ని ధ్వంసం చేసేది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు బూర్జువా పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని నారాయణ పేర్కొన్నారు. -
థర్డ్ ఫ్రంట్‌ను చూస్తే మోడీకి జ్వరం: నారాయణ
సాక్షి, విజయవాడ: మూడో ఫ్రంట్‌ను చూస్తే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి జ్వరం వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. మంగళవారం విజయవాడలోని వేదిక కల్యాణ మంటపంలో ‘నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తులు పెట్టుకునేందుకు ఏ ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదని వివరించారు. ఈనెల 8, 9 తేదీలలో ఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో ఈ అంశాన్ని చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర సదస్సు సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని 2000 సంవత్సరంలోనే వరంగల్ డిక్లరేషన్‌లో పేర్కొన్నామనీ, అయితే కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదన్నారు. ఆ డిక్లరేషన్ అమలుచేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు. విభజన జరగడానికి ముందే సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందన్నారు. సీడబ్యూసీ నిర్ణయం రాగానే ఇదే విషయం తాను కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, అయితే చివర బంతి వరకు అవకాశం ఉందంటూ ఈ ప్రాంత ప్రయోజనాలను విస్మరించారని ఆరోపించారు. రాజ్యసభలో ప్రధాని హామీ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన రాష్ట్రాల్లో సైతం అభివృద్ధి నామమాత్రంగానే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కొన్ని అంతరాష్ట్ర సమస్యలు వస్తున్నాయని వాటిని అధిగమించి, ప్రాజెక్టు నిర్మించి తీరాల్సిందేనన్నారు. ఈప్రాజెక్టు వల్ల ముంపు బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. ఉత్తరాంధ్రలోని పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాడానికి వీలుగా ఒడిశాతో ఉన్న విభేదాలు పరిష్కరించాలని సూచించారు. మొదటి సంవత్సరం లోటు బడ్జెట్‌ను కేంద్రమే పూర్తి చేస్తుందని హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేసుకోవాలని, రానున్న ఐదు సంవత్సరాలు లోటు బడ్జెట్‌ను కేంద్రమే భరించాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రయివేటు పరిశ్రమలను ఆకర్షించేందుకు పది సంవత్సరాలు టాక్స్ హాలిడే ప్రకటించాలని, ఎక్సైజ్, ఆదాయ పన్నుల్లో నూరు శాతం మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని సూచించారు. రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనే అంశంపై తమ పార్టీలో చర్చించిన తరువాత ప్రకటిస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని, తీరప్రాంత పర్యాటక కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ఈ సమావేశంలో నూతన ఆంధ్రప్రదేశ్‌కు తయారు చేసిన ముసాయిదా తీర్మానాన్ని చర్చించి ఆమోదించారు. సమావేశంలో 13 జిల్లాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
సురవరం, నారాయణలకు కేసీఆర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ తరఫున రాజ్యసభ బరిలోకి దిగిన కె.కేశవరావు గెలుపొందేందుకు సహకరించినందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కేసీఆర్ వారికి ఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొట్టమెదటి సారిగా పెద్దల సభలో టీఆర్ఎస్కు ప్రాతినిధ్యం దక్కినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. -
కిరణ్ది రాజ్యాంగ ఉల్లంఘన
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లుపై రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఆదివారం 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు అసమగ్రంగా ఉందన్న విషయం అసెంబ్లీకి వచ్చిన రోజు కిరణ్ కుమార్ రెడ్డికి తెలిదా అని ప్రశ్నించారు. ఆయనేమన్నా కళ్లు మూసుకున్నారా అని ఎద్దేవా చేశారు. బీజేపీపై నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ నేతృత్వంలో మతోన్మాద అరాచక శక్తులను బీజేపీ బలోపేతం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి పంపిన టి.బిల్లు సమగ్రం లేదని, అదంతా తప్పుల తడక అని సీఎం కిరణ్ నిన్న అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపాలని సభ నాయకుడిగా స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిపై విధంగా స్పందించారు. -
వోల్వో బస్సు ప్రమాద బాధితుల కమిటీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన జరిగి 18 రోజులైనప్పటికీ యజమానులను అరెస్టు చేయకపోవటాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బస్సు ప్రమాద బాధితుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. రాష్ర్టంలో చేతకాని ప్రభుత్వం ఉందని దుయ్యబ ట్టారు. 45 మందిని పొట్టనపెట్టుకున్న వోల్వో బస్సు యజమానులను అరెస్టు చేయలేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అక్రమ ప్రైవేటు బస్సులను ప్రభుత్వం నిషేధించకపోతే ప్రజలే వాటిని తగలబెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బస్సును ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినందున ఆ మరణాలు సర్కారు హత్యలేనని చెప్పారు. మహబూబ్‌నగర్ ఘటనను నిరసిస్తూ ఈనెల 18న హైదరాబాద్‌లోని వోల్వో షోరూమ్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ధర్నాకు సంఘీభావం ప్రకటించిన అనంతరం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిల రాజకీయ ప్రాబల్యం కారణంగానే కేసులు పెట్టడంలేదని ఆరోపించారు. వారిద్దరినీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వోల్వో బస్సులకు అనుమతిచ్చే విషయంలో సమగ్రంగా పరిశీలన జరగాలని కాం గ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సూచించారు. బాధితుల కమిటీ సభ్యుడైన అబ్దుల్ మాట్లాడుతూ దుర్ఘటన జరిగి 18రోజులైనా దోషులను ప్రకటించపోవడం బాధాకరమన్నారు. ఇదే వేరే దేశంలోనైతే బహిరంగంగా కాల్చేసేవారని పేర్కొన్నారు. -
సీఎంను బర్తరఫ్ చేయాలి: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. విభజనపై తలెత్తిన ఆందోళనలు, భయాలను తొలగించి, అనుమానాలను నివృత్తి చేయాల్సిన సర్కారే వాటిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కేంద్ర మంత్రులే సభ్యులుగా ఉన్న జీవోఎం ఎదుట ఆ పార్టీ రాష్ట్ర నేతలు భిన్న వాదనలు వినిపించడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. విభజన పూర్తిచేసే క్రమంలో రాయలసీమ అభివృద్ధికి మండలిని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. -
సీఎం భవిత తేలిపోతుంది: నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై మొండికేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపిస్తున్నందున ఆయన భవిష్యత్ ఏమిటో ఒకట్రెండ్రోజుల్లో తేలిపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసి కూడా ముఖ్యమంత్రి గొప్పగా నటిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజులుగా జరుగుతున్న పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నారాయణ రాష్ట్ర సమితి తీర్మానాలను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి, పార్టీ నిర్మాణం, వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల గుర్తింపు తదితర అంశాలను క్షుణ్ణంగా చర్చించి.. ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 45 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలను పోటీకి గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైనందున రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల రాజకీయ పరిస్థితిని బట్టి తమ పార్టీ విధానానికి అనుగుణంగా పొత్తులు ఉంటాయని అన్నా రు. విభజన తర్వాతే పార్టీకి రెండు కమిటీలు ఏర్పాటు చేస్తామని, తాను రెండు రాష్ట్రాలకూ కాపలాదారుగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై తమకు ఎటువంటి అనుమానాలు లేవన్నారు. తాము రాష్ట్ర విభజన కోరుకుంటున్నాం తప్ప ప్రజల మధ్య కాదని చెప్పారు. ప్రధాని కావాలన్న నరేంద్ర మోడీ కల నెరవేరదని, మిణుగురు పురుగు లాగ మోడీ వెలుగూ తాత్కాలికమేనని ఎద్దేవా చేశారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలండి: తాను ప్రవేశపెట్టిన కార్యకలాపాల నివేదికపై జరిగిన చర్చకు నారాయణ సుదీర్ఘ జవాబు ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను విడదీయవద్దు: రాష్ట్రాన్ని విభజించాలేగానీ, ప్రజలలో కల్మషాలు కలిగించి వారిని విడదీయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కేంద్రానికి సూచించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాం గ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిపై శ్రద్ధ చూపి ఉంటే తెలంగాణ వాదం బలపడి ఉండేది కాదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి కార్పొరేట్ కంపెనీల ను కాపాడుకోవడానికి ఉద్యమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సీపీఐదేనని ఎమ్మెల్యే గుండా మల్లేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, సిటీ కార్యదర్శి బోస్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
అఖిలపక్షంలో వైఖరి చెబుతాం: నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన భాగస్వామ్య పక్షాలన్నిటితో మాట్లాడేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తామే కోరామని, దానికి విధిగా హాజరవుతామని సీపీఐ స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాము ఇప్పటికే కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు నివేదిక ఇచ్చామన్నారు. జీవోఎంకు నివేదించాల్సిన సూచనలు, సలహాలపై కూడా నివేదికను తయారుచేశామని, పార్టీ రాష్ట్ర కౌన్సిల్లో చర్చించి మంగళవారం సమర్పిస్తామని చెప్పారు. కాగా, సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నగర శివార్లలోని యాప్రాల్‌లోని ఒక ప్రైవేటు క్లబ్లో జరుగనున్నాయి. -
ఎన్నికల దాకా లాగుతుందేమో!
విభజనపై కాంగ్రెస్ తీరును శంకించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జీఓఎంకు సమర్పించే నివేదికపై సీపీఐ కసరత్తు ప్రారంభించింది. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు మంగళవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకుడు ఈర్ల నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని ప్రశంసిస్తూనే తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అయినా, కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని, 2014 ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సమస్యను లాగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న అనుమానాన్నీ వ్యక్తంచేశారు. మూడు ప్రాంతాలకు చెందిన జిల్లాల కార్యదర్శులు తమ నివేదికల్ని అందజేశారు. రాయలసీమ నేతలు తమ ప్రాంత వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరారు. కర్నూలు కేంద్రంగా రాజధాని ఉండాలని సూచించారు. భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాలను సీమాంధ్రలో కలిపితే పోలవరం ప్రాజెక్టుకు చిక్కులు రాకుండా ఉంటాయని కోస్తా జిల్లాల నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీకి రెండు కమిటీలు ఏర్పాటుచేయాలని సీమాంధ్ర నేతలు కోరినప్పటికీ రాష్ట్ర నాయకత్వం తోసిపుచ్చింది. -
విభజన అనివార్యం.. అర్థం చేసుకోండి: సురవరం
telangana, state bifurcation, suravaram sudhakar reddy, తెలంగాణ, రాష్ట్ర విభజన, సురవరం సుధాకర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన అనివార్యం.. అర్థం చేసుకోండి.. ఆందోళన విరమించండి’’ అని సీపీఐ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ సీమాంధ్ర ప్రజలకు పిలుపుఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి బాగా దిగజారిందని, తెలంగాణ ఉద్యమం ఆగితే సీమాంధ్ర ఉద్యమం పెరిగిందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో అనేక అనుమానాలు, అపోహలున్న మాట నిజమేనని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. పార్టీ నేతలు గుండా మల్లేష్, పీజే చంద్రశేఖర్, కె.రామకృష్ణ, జల్లి విల్సన్, చాడా వెంకటరెడ్డితో కలిసి వారు గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సురవరం మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో వామపక్షాలు నిర్వహించబోయే పాత్రను వివరించారు. ఎన్నికల తర్వాతే పొత్తుల గురించి మాట్లాడతామన్నారు. విధానాల ప్రాతిపదికన ప్రత్యామ్నాయంకోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయం పేరిట బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందన్నారు. మోడీని తెరపైకి తెచ్చాక మతకలహాలు పెరుగుతున్నాయన్నారు. చంద్రబాబు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్టు తమకూ సమాచారం ఉందని, అదే జరిగితే లౌకికవాదానికి ద్రోహం చేసినట్టేనన్నారు. నేతలకు గుణపాఠం సీమాంధ్ర ఉద్యమం: నారాయణ రాజకీయ నేతలను దగ్గరకు రానివ్వకుండా నిలువరించి సీమాంధ్ర ఉద్యమకారులు మంచి గుణపాఠం నేర్పారని నారాయణ అభిప్రాయపడ్డారు. నేతలపై విశ్వాసం కోల్పోయిన ఫలితమే ఈ పరిస్థితని విశ్లేషించారు. సీమాంధ్ర సమస్యల్ని జాతీయస్థాయి దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యమకారులు విజయవంతమయ్యారన్నారు. ఇకపై జరగాల్సిన ప్రక్రియను రాజకీయ పార్టీలకు అప్పగించాలని కోరారు. ఇప్పటికైనా రాజకీయపార్టీలు అవకాశవాద వైఖరిని విడనాడాలని సూచించారు. పదిమంది మంత్రుల కమిటీ అని ఏడుగురితోనే ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. మంత్రుల కమిటీ ఆరు వారాల్లోపు నివేదిక ఇస్తుందన్నారని, ఇప్పుడా గడువును ఎందుకు ఎత్తివేశారో చెప్పాలని నిలదీశారు. 2014 ఎన్నికలదాకా ఈ సమస్యను సాగదీయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించాలని తమ పార్టీ అందరికంటే ముందే ప్రధానికి లేఖ రాసిందని చెప్పారు. కాంగ్రెస్ నాటకంలో రాష్ట్ర ప్రజలు సమిధలవుతున్నారని ధ్వజమెత్తారు. -
పీనుగును పెట్టి పరిపాలన చేస్తున్నారు: కె.నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అనిశ్చితి కారణంగా వెనకబడిపోయిన ప్రజాసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలో పలు చోట్ల జైల్‌భరో ఆందోళన జరిగింది. ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అలక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అరెస్ట చేసి వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పీజే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని రోజులుగా పరిపాలన స్తంభించిందన్నారు. రాష్ట్రంలో ఓ పీనుగును పెట్టి కేంద్రం పరిపాలన చేస్తోందని ధ్వజమెత్తారు. దీంతో ప్రజాసమస్యలేవీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టే నాథుడే కనిపించడం లేదన్నారు. ప్రతినెలా వచ్చే పింఛన్లు, సరుకులు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేరస్తులను చట్టసభల నుంచి వెలివేసే ఆర్డినెన్స విషయంలో జరిగిన తతంగం ప్రధానిని అవమానించేలా ఉందని మండిపడ్డారు. తానైతే క్షణం కూడా ఆ పదవిలో ఉండేవాణ్ణి కాదన్నారు. ‘ఇసుకకు తక్కువ పేడకు ఎక్కువయిన రాహుల్ చెబితే ఓ ప్రధాని వినాలా?’ అని ప్రశ్నించారు. 3 ప్రజాప్రతినిధులకు ఎదురుదెబ్బ సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉపయోగపడాల్సిన రైల్వే ‘ఇజ్జత్’ పాస్‌లను లక్షల సంఖ్యలో పక్కదారి పట్టించిన ప్రజాప్రతినిధులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీల వల్లనే ఈ పాస్‌లు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించిన రైల్వేబోర్డు వారి ఆటలు సాగకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పటి వరకు ఇజ్జత్పాస్ పొందాలనుకున్నవారికి ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉండగా.. తాజాగా వారి పెత్తనానికి కత్తెర వేస్తూ రైల్వేబోర్డు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఇకనుంచి ప్రజాప్రతినిధులు జారీ చేసే ధ్రువపత్రాలను పరిశీలించి అవి సరైనవేనని అధికారులు కూడా ధ్రువీకరించాలని మెలికపెట్టింది. దీనిప్రకారం ఆయా మండలాల తహసీల్దార్లు ఎంపీలు జారీచేసే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని ధ్రువీకరిస్తేనే రైల్వే అధికారులు ఆయా అభ్యర్థులకు ఇజ్జత్ పాసులు జారీ చేస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో దాదాపు ఏడు లక్షల ఇజ్జత్ పాసులు అనర్హుల చేతుల్లో ఉన్నట్టు ఇటీవల అంచనాకొచ్చిన స్థానిక అధికారులు... ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని తొలగించి ఆదాయ ధ్రువపత్రాల జారీని అధికారులకే అప్పగించేలా నిబంధనలు మార్చాలంటూ చేసిన ప్రతిపాదనకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించి రెండు రోజులక్రితం ఈ ఆదేశాలు జారీ చేసింది. -
నిజాం కళాశాలలో.. ప్రజా సమస్యలపై 10న సభ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాలని నాలుగు వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. భావోద్వేగాలపై ఆధారపడి ఇతర సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని లెఫ్టపార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఈనెల 10న నిజాం కళాశాలలో నాలుగు వామపక్షాలు నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బీవీ రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర నేత కె.రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకుడు జానƒ కి రాములు, ఫార్వర్డ బ్లాక్ నాయకుడు సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విలేకరులతో వారు మాట్లాడారు.బహిరంగ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, ఆర్ఎస్పీ నేత అబనీరాయ్, ఫ్వారర్డ బ్లాక్ నేత దేబబ్రత బిశ్వాస్‌లు పాల్గొంటారని కె.నారాయణ చెప్పారు. రాష్ట్ర, జాతీయ అంశాలను ఇందులో ప్రస్తావిస్తామన్నారు.పాలనలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నిన్నటి వరకూ రాహుల్ గాంధీ బొమ్మ చూపించి వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఆ పార్టీ చూసిందని, ప్రస్తుతం అది సాధ్యం కాదని తెలిసి ప్రియాంక గాంధీని తెరపైకి తెస్తోందన్నారు. బీజేపీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జపం చేయడం ద్వారా లబ్ధికి యత్నిస్తోందన్నారు. ఇక రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు, సోనియా గాంధీని ధిక్కరిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల సమ్మె వల్ల సీమాంధ్రలోని చౌకధరల దుకాణాల్లో సరుకులు ప్రజలకు అందడం లేదన్నారు. సమ్మె జరగని తెలంగాణ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్రలో ప్రవేట్ బస్సులు నడుస్తున్నాయని, కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, అది తీసివేస్తే ఊపిరి పోతుందన్నారు. .గతంలో జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాలు జరిగినపుడు కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు.దసరా పండుగకు తెలంగాణ ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులకు మాత్రమే అడ్వాన్స ఇస్తామని,సమ్మెలో ఉన్నందు వల్ల సీమాంధ్ర ప్రాంతంలోని వారికి ఇవ్వబోమని సంస్థ యాజమాన్యం చెప్పడం సరికాదన్నారు. రాఘవులు మాట్లాడుతూ, భూ సంస్కరణలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉపయోగించని భూములను తిరిగి సొంత దారులకు కేటాయించాలని,కౌలు రైతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, -
తెలంగాణ ‘ఏకాభిప్రాయం’పై భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై ఏకాభిప్రాయానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాజకీయ పక్షాల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ‘ది హిందూ సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ’ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన చర్చా గోష్టిలో తెలుగుదేశం మినహా అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ), యూపీఏ ప్రకటన చేసిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైందని, అందుకే ఏకాభిప్రాయం కోసం ఏమి చేయాలనే అంశంపై ఈ సదస్సు పెట్టామని సదస్సుకు అధ్యక్షత వహించిన హిందూ సెంటర్ డెరైక్టర్ డాక్టర్ మాలినీ పార్థసారథి తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని గాదె వెంకటరెడ్డి(కాంగ్రెస్) అన్నారు. ఆంధ్రలో తెలంగాణను కలిపినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరిందని, దాని అమల్లో విఫలమైతే ఇరు రాష్ట్రాలు విడిపోవచ్చనే షరతు ఉం దని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. సమైక్య రాష్ట్రమే పరిష్కారమార్గం ప్రపంచంలో ఎక్కడా మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులు లేవని, మన రాష్ట్రంలో మాత్రం మూడు ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఉండటం అతిక్లిష్టమైన సమస్య అని వైఎస్సార్సీపీ నేత ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ‘తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, రాయలసీమలో తెలుగుగంగ, హంద్రీ - నీవా, కోస్తాలో వెలిగొండ ప్రాజెక్టులు కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవే. రేపు రాష్ట్రం విడిపోతే ఈ మూడు ప్రాంతాల్లోని ఈ ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అనే భావంతో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టలేదని, వ్యాపారం కోసమే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారని కేటీ రామారావు(టీఆర్ఎస్) వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రకటన తర్వాత ఇరు ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీల్లో స్పష్టమైన విభజన వచ్చిందని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నేత కె.నారాయణ కోరారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సమస్యగా కాకుండా సొంత వ్యవహారంలా చూడటంవల్లే సమస్య ఉత్పన్నమైందని కె.హరిబాబు(బీజేపీ) వ్యాఖ్యానించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 35 శాతం మంది సీమాంధ్రులు ఉన్నారని, తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో 50 నియోజకవర్గాల్లో సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవారు ఉన్నారని సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి(ఎంఐఎం) అన్నారు. రాజకీయ పక్షాలు స్వల్పకాల ప్రయోజనాలు కాంక్షించడంవల్లే సమస్య ఏర్పడిందని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. -
ప్రధాని దొంగలను కాపాడే మేస్త్రీ : నారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను దొంగలను కాపాడే మేస్త్రీ అని పిలిస్తే సమంజసంగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని చర్యలను పరిశీలిస్తే ఈ పదమే సరిపోతుందని పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయున ప్రధానిని తీవ్రంగా దుయ్యబట్టారు. ‘ఆర్థికవేత్తగా పేరొందిన మన్మోహన్సింగ్ను ‘దొంగ’ అని తోటి పార్లమెంటు సభ్యులు అనటంతో ప్రధాని ఆక్రోశం వ్యక్తంచేశారు. సభ్య సమాజ ం దీన్ని ఖండించాల్సిందే. మన్మోహన్‌ను దొంగ అనడాన్ని నేను ఆమోదించను. ఆ పదం ప్రధానికి ఎలా వర్తిస్తుంది? కనీస రాజకీయ-ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారు ఆ విధంగా సంబోధించరు. అరుుతే కాపలాదారుడిని అంటున్న మన్మోహన్ ఖజానా ఖాళీ అవుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. దోపిడీ చేసే వాళ్లపై ఈగ వాలనీయకుండా చూసే వారిని ఏవునాలో.. ఆయునను అలానే పిలివాలి’ అని వ్యాఖ్యానించారు. ‘బ్యాంకులకు బకాయిపడ్డ సంపన్నులనుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయకపోగా, నిరర్ధక ఆస్తులుగా పరిగణించి సంతృప్తి పడుతున్నారు. పార్లమెంటును నడపడానికి బెదిరింపులు, ప్రలోభాలతో ప్రయుత్నిస్తున్నారు’ అని వివుర్శించారు. -
ఒకేరోజు రెండు సభలకు అనుమతి వద్దు : కె. నారాయణ
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ వాదులు వచ్చే నెల ఏడున హైదరాబాద్‌లో తలపెట్టిన సభలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతల పరిస్థితి తలెత్తవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ రెండు వర్గాల్లో ఎవరికి అనుమతి ఇచ్చినా ఇబ్బందేనన్నారు. రాష్ట్రప్రభుత్వం నియంత్రించగలిగే స్థితిలో ఉంటే వేర్వేరుగా అనుమతులివ్వాలని సూచించారు. ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇరుప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడానికి కేంద్రమే కారణమన్నారు. ఒకవైపు సీఎంను, మరోవైపు ఉప ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌సహా రాష్ట్రాన్ని శ్మశానవాటికగా మార్చాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జరిగే ఘర్షణలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రజలు రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే లగడపాటి తదితరులపై రాళ్ల దాడులని ఆయన చెప్పారు.