చేతనైతే ఏపీకీ హోదా తీసుకురా...
వెంకయ్యనాయుడుకి నారాయణ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారి కూడా ప్రజల చేత ఎన్నిక కాకుండా పార్లమెంట్‌లో ప్రవేశించి.. మూడుసార్లు దొడ్డిదారిన కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడికి కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే అర్హత లేదని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ ధ్వజమెత్తారు. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి వరహాలేనని, కమ్యూనిస్టు పార్టీలు కూడా అంతేనన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల చేత లోక్‌సభకు ఎన్నిక కాలేక... యాచకత్వం ద్వారా కర్ణాటక నుంచి రెండుసార్లు, రాజస్థాన్ నుంచి ఒకసారి వెంకయ్య రాజ్యసభకు నామినేటయ్యారన్నారు.
వెంకయ్యకు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచన మంచిదేనని, అయితే మధ్యలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.
కేసీఆర్... రెండూ ఎలా సాధ్యం?
ఒకవైపు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మను కొలుస్తూ, మరోవైపు నిజాం చక్రవర్తిని పొగడడం సీఎం కేసీఆర్‌కు ఎలా సాధ్యమని నారాయణ ప్రశ్నించారు. ‘‘ కేసీఆర్ ఎర్రగడ్డలో ఉండాల్సిన వాడు. అందుకే సచివాలయాన్ని ఎర్రగడ్డలో పెట్టాలని చూశాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. నిజాం పాలనను వ్యతిరేకించడమో లేక పొగడడమో చేయాలి తప్ప రెండూ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక ఏపీ అసెంబ్లీ కుక్కలు చింపిన విస్తరిగా తయారైందన్నారు.