సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై ఏకాభిప్రాయానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాజకీయ పక్షాల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ‘ది హిందూ సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ’ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన చర్చా గోష్టిలో తెలుగుదేశం మినహా అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ), యూపీఏ ప్రకటన చేసిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైందని, అందుకే ఏకాభిప్రాయం కోసం ఏమి చేయాలనే అంశంపై ఈ సదస్సు పెట్టామని సదస్సుకు అధ్యక్షత వహించిన హిందూ సెంటర్ డెరైక్టర్ డాక్టర్ మాలినీ పార్థసారథి తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని గాదె వెంకటరెడ్డి(కాంగ్రెస్) అన్నారు. ఆంధ్రలో తెలంగాణను కలిపినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరిందని, దాని అమల్లో విఫలమైతే ఇరు రాష్ట్రాలు విడిపోవచ్చనే షరతు ఉం దని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు.
సమైక్య రాష్ట్రమే పరిష్కారమార్గం
ప్రపంచంలో ఎక్కడా మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులు లేవని, మన రాష్ట్రంలో మాత్రం మూడు ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఉండటం అతిక్లిష్టమైన సమస్య అని వైఎస్సార్‌సీపీ నేత ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ‘తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, రాయలసీమలో తెలుగుగంగ, హంద్రీ - నీవా, కోస్తాలో వెలిగొండ ప్రాజెక్టులు కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవే. రేపు రాష్ట్రం విడిపోతే ఈ మూడు ప్రాంతాల్లోని ఈ ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అనే భావంతో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టలేదని, వ్యాపారం కోసమే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారని కేటీ రామారావు(టీఆర్‌ఎస్) వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రకటన తర్వాత ఇరు ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీల్లో స్పష్టమైన విభజన వచ్చిందని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నేత కె.నారాయణ కోరారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సమస్యగా కాకుండా సొంత వ్యవహారంలా చూడటంవల్లే సమస్య ఉత్పన్నమైందని కె.హరిబాబు(బీజేపీ) వ్యాఖ్యానించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 35 శాతం మంది సీమాంధ్రులు ఉన్నారని, తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో 50 నియోజకవర్గాల్లో సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవారు ఉన్నారని సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి(ఎంఐఎం) అన్నారు. రాజకీయ పక్షాలు స్వల్పకాల ప్రయోజనాలు కాంక్షించడంవల్లే సమస్య ఏర్పడిందని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు.
తెలంగాణ ‘ఏకాభిప్రాయం’పై భిన్నాభిప్రాయాలు
Published Sun, Sep 22 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement