థర్డ్ ఫ్రంట్‌ను చూస్తే మోడీకి జ్వరం: నారాయణ
సాక్షి, విజయవాడ: మూడో ఫ్రంట్‌ను చూస్తే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి జ్వరం వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. మంగళవారం విజయవాడలోని వేదిక కల్యాణ మంటపంలో ‘నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తులు పెట్టుకునేందుకు ఏ ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదని వివరించారు. ఈనెల 8, 9 తేదీలలో ఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో ఈ అంశాన్ని చర్చిస్తామని తెలిపారు.
రాష్ట్ర సదస్సు సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని 2000 సంవత్సరంలోనే వరంగల్ డిక్లరేషన్‌లో పేర్కొన్నామనీ, అయితే కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదన్నారు. ఆ డిక్లరేషన్ అమలుచేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు. విభజన జరగడానికి ముందే సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందన్నారు. సీడబ్యూసీ నిర్ణయం రాగానే ఇదే విషయం తాను కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, అయితే చివర బంతి వరకు అవకాశం ఉందంటూ ఈ ప్రాంత ప్రయోజనాలను విస్మరించారని ఆరోపించారు.
రాజ్యసభలో ప్రధాని హామీ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన రాష్ట్రాల్లో సైతం అభివృద్ధి నామమాత్రంగానే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కొన్ని అంతరాష్ట్ర సమస్యలు వస్తున్నాయని వాటిని అధిగమించి, ప్రాజెక్టు నిర్మించి తీరాల్సిందేనన్నారు. ఈప్రాజెక్టు వల్ల ముంపు బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. ఉత్తరాంధ్రలోని పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాడానికి వీలుగా ఒడిశాతో ఉన్న విభేదాలు పరిష్కరించాలని సూచించారు. మొదటి సంవత్సరం లోటు బడ్జెట్‌ను కేంద్రమే పూర్తి చేస్తుందని హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేసుకోవాలని, రానున్న ఐదు సంవత్సరాలు లోటు బడ్జెట్‌ను కేంద్రమే భరించాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రయివేటు పరిశ్రమలను ఆకర్షించేందుకు పది సంవత్సరాలు టాక్స్ హాలిడే ప్రకటించాలని, ఎక్సైజ్, ఆదాయ పన్నుల్లో నూరు శాతం మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని సూచించారు. రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనే అంశంపై తమ పార్టీలో చర్చించిన తరువాత ప్రకటిస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని, తీరప్రాంత పర్యాటక కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ఈ సమావేశంలో నూతన ఆంధ్రప్రదేశ్‌కు తయారు చేసిన ముసాయిదా తీర్మానాన్ని చర్చించి ఆమోదించారు. సమావేశంలో 13 జిల్లాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.