సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన రచ్చబండలో ఉత్తమ్‌ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ‘పల్లె పల్లెకు కాంగ్రెస్’పేరుతో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట (తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం)లో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వరంగల్ డిక్లరేషన్‌ను రైతులకు కూలంకషంగా వివరించడంతోపాటు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. గ్రామంలో దళితరైతు ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ కెప్టెన్. ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎనిమిది గ్రామాల్లో తొలిరోజు ‘రైతు రచ్చబండ’నిర్వహించారు. సూర్యాపేట జిల్లా బుగ్గ మాదారం, వజినేపల్లి, నెమలిపురి, యర్రకుంట తండా, కొత్తగూడెం తండా, మల్లారెడ్డిగూడెం, గుడి మల్కాపురం, దొండపాడులోని రైతులకు వరంగల్ డిక్లరేషన్ గురించి వివరించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం నేదునూరులో నిర్వహించిన ‘రచ్చబండ’కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు.. ధరణి వెబ్‌సైట్‌తో ఇబ్బందులు పడుతున్నామంటూ ఆయనకు ఏకరువు పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్‌లో ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా నగునూరు పంచాయతీ వద్ద మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కామారెడ్డి జిల్లా గూడెం శబ్దిపూర్, శబ్దిపూర్ తండాల్లో మాజీమంత్రి షబ్బీర్ అలీ, జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిలు తొలిరోజు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, మే 21 నుంచి నెలరోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వీలును బట్టి చేపట్టేందుకు నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment