హోదా సాధించు.. లేదంటే వైదొలగి పోరాడు
సీపీఐ నారాయణ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా సీఎం చంద్రబాబు బీజేపీతో అధికారంలో కులుకుతూ ఎంజాయ్ చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండిపడ్డారు. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలసి శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి భాగస్వాములుగా ఉండి ప్రత్యేక హోదా తీసుకరాకపోతే చంద్రబాబు అంత పచ్చి అవకాశవాది మరొకరుండని దుయ్యబట్టారు. ‘హోదా సాధించండి. లేకపోతే కేంద్రం నుంచి వైదొలగి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కండి. రెండూ చేయకపోతే తెలుగు ప్రజలను నట్టేట ముంచిన వారవుతారు’అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.