
వోల్వో బస్సు ప్రమాద బాధితుల కమిటీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన జరిగి 18 రోజులైనప్పటికీ యజమానులను అరెస్టు చేయకపోవటాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బస్సు ప్రమాద బాధితుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. రాష్ర్టంలో చేతకాని ప్రభుత్వం ఉందని దుయ్యబ ట్టారు. 45 మందిని పొట్టనపెట్టుకున్న వోల్వో బస్సు యజమానులను అరెస్టు చేయలేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అక్రమ ప్రైవేటు బస్సులను ప్రభుత్వం నిషేధించకపోతే ప్రజలే వాటిని తగలబెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
బస్సును ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినందున ఆ మరణాలు సర్కారు హత్యలేనని చెప్పారు. మహబూబ్‌నగర్ ఘటనను నిరసిస్తూ ఈనెల 18న హైదరాబాద్‌లోని వోల్వో షోరూమ్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ధర్నాకు సంఘీభావం ప్రకటించిన అనంతరం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిల రాజకీయ ప్రాబల్యం కారణంగానే కేసులు పెట్టడంలేదని ఆరోపించారు. వారిద్దరినీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వోల్వో బస్సులకు అనుమతిచ్చే విషయంలో సమగ్రంగా పరిశీలన జరగాలని కాం గ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సూచించారు. బాధితుల కమిటీ సభ్యుడైన అబ్దుల్ మాట్లాడుతూ దుర్ఘటన జరిగి 18రోజులైనా దోషులను ప్రకటించపోవడం బాధాకరమన్నారు. ఇదే వేరే దేశంలోనైతే బహిరంగంగా కాల్చేసేవారని పేర్కొన్నారు.