వోల్వో 'బాధితుల ఆరని మంటల దీక్ష'
హైదరాబాద్ : మహబూబ్నగర్ వోల్వో బస్సు ప్రమాద బాధితులు ఇందిరా పార్కు వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిరసన తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలన్నారు.
బాధితుల ధర్నాకు సీపీఐ ఎమ్మెల్యే చంద్రవతి సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు, ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రమాదానికి గురైన బస్సు యాజమానులు ఎవరో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా చేయగలదని చంద్రావతి అన్నారు. దేశం మొత్తం దిగ్ర్భాంతి వ్యక్తం చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలు చెబుతుందే కానీ, చేతల్లో శూన్యమని ఆమె విమర్శించారు.