పాలెం బస్సు దుర్ఘటనపై పూర్తి వివరాలివ్వండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం.. బొత్సకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ఇటీవల జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దుర్ఘటనపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్, కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, జబ్బార్ ట్రావెల్స్, శ్రీకాళేశ్వరి ట్రావెల్స్, ఓల్వో ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది.
చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సుల నిర్వాహకులపై, అలాగే దర్యాప్తు నివేదిక ఆధారంగా బస్సు దుర్ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎస్.రాజు, రిటైర్డ్ ఇంజనీర్ రామ్మోహనరావు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న తర్వాత పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.