Jabbar travels
-
'ఢీ'వాకర్!
నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్, కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలను పొట్టనపెట్టుకుందో తెలిసిందే. అనుభవం లేని డ్రైవర్లు.. విశ్రాంతి లేని డ్యూటీలు.. కండీషన్ లేని బస్సులు.. వీటన్నింటికీ మించి అధికారుల బాధ్యతారాహిత్యం.. వెరసి ప్రైవేటు జర్నీ ‘డేంజర్ హారన్’ మోగిస్తోంది. గతంలో పాలెం, ముండ్లపాడు వద్ద జరిగిన రెండు బస్సులతో పాటు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలకు సంబంధించిన ట్రావెల్స్ బస్సులు ‘అనంతపురం’ జిల్లాకు చెందినవి కావడం.. అందునా ఒకే ప్రైవేటు ట్రావెల్స్‌వి కావడం కలకలం రేపుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో 28 మంది ఆపరేటర్లు ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు. వీరంతా అనంతపురంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర కేంద్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అనంతపురంలో 28 బస్సులకు స్టేట్, 8 బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులతో కలిపి 230 వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రధానంగా ఈ బస్సులు వెళ్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో చాలా వరకు అనుభవం కలిగిన డ్రైవర్లు లేరు. చాలా ట్రావెల్స్ ఒకే డ్రైవరుతో సర్వీసులను తిప్పుతున్నారు. రవాణాశాఖ నిబంధనలు పాటించకుండా తిప్పే సర్వీసులు చాలా ఉన్నాయి. అక్కడక్కడా ప్రమాదాలు జరిగినా, కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండా మధ్యలోనే బస్సులు మెరాయించినా, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. దీనికి కారణం ట్రావెల్స్ యజమానులకు, ఆర్టీఏ అధికారులకు ఉన్న సత్ససంబంధాలే. తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యం జిల్లాలోని చాలా ట్రావెల్స్‌లో బస్సులకు కిటికీలు లేవు. పూర్తిగా అద్దంతో క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న హైటెక్ బస్సులలో ఏదైనా ప్రమాదం జరిగితే డోర్‌లాక్ అయిపోతుంది. ప్రయాణికులు బస్సులో నుంచి బయట పడే మార్గమే ఉండట్లేదు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఏ అద్దాన్నైనా పగులగొట్టవచ్చనే సూచీలు ఎక్కడా లేవు. అద్దాలు పగులకొట్టినా పగిలే పరిస్థితి లేదు. కనీసం ఎమర్జెన్సీ విండోస్ కూడా అమర్చలేదు. స్లీపర్ కోచ్‌లలో అయితే పరిస్థితి మరీ దారుణం. చాలా ట్రావెల్స్‌లో స్మోక్ అలారమ్‌లు లేవు. బస్సులో ఏదైనా రిపేరు వచ్చినా, ప్రమాదవశాత్తు పొగవస్తే వెంటనే అలారమ్ మోగుతుంది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగే లోపు ప్రయాణికులు బస్సు దిగే అవకాశం ఉంది. ఈ అలారమ్‌లు ఎక్కడా కనిపించవు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు సర్వీసులు ఒకే డ్రైవర్ నడిపే పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఈ నిబంధనను ట్రావెల్స్ పట్టించుకోవడం లేదు. దీనిపై ఆర్టీఏ తనిఖీలు లేవు. చర్యలు అసలే ఉండవు. బస్సు టాప్‌పై స్థాయికి మించి లగేజీని తీసుకెళ్తున్నా ఎవరూ ప్రశ్నించారు. చాలా ప్రైవేటు ట్రావెల్స్‌లలో బస్సులు నడిపే వారు లారీ డ్రైవర్లు అని తెలుస్తోంది. వీరు ఒకసారి డ్యూటీకి వెళితే 10–15రోజుల వరకూ ఇళ్లకు రారని సమాచారం. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయడం కూడా ప్రమాదానికి కారణమే. ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్న ట్రావెల్స్‌లో ఒకటి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే జేసీ బ్రదర్స్‌ది కావడంతో ఏ ప్రమాదం జరిగినా.. ఎలా నడిచినా అడిగే నాథుడే కరువయ్యాడు. ఆర్టీసీ బస్‌స్టాప్‌ల వద్దే స్టాపింగ్‌లు ప్రైవేటు ట్రావెల్స్ ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆపి ప్రయాణికులను ఎక్కించడం, దింపడం చేయకూడదు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బస్టాప్‌లకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపాలి. కానీ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాప్‌ల వద్దే ప్రైవేటు బస్సులు ఆపుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా దీన్ని అరికట్టలేకపోవడం గమనార్హం. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి గతంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఆగ్నికి ఆహుతై 45మంది దుర్మరణం చెందారు. అప్పట్లో కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేసి భారీగా బస్సులను నిలిపేశారు. బస్సులు ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా గమ్యం చేరుస్తామని అప్పట్లో లెటర్లు తీసుకుని బస్సులను అనుమతించారు. నిజానికి లెటర్లో చూపినట్లు ట్రావెల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ తర్వాత అధికారులు కూడా ట్రావెల్స్‌ను తనిఖీ చేద్దాం? నిబంధనల మేరకు నడుస్తున్నాయా? లేదా? అనే దిశగా ఆలోచించని పరిస్థితి. ఈ కారణంగా ‘డేంజర్ జర్నీ’ తరచూ ప్రాణాలను బలితీసుకుంటోంది. తనిఖీలు చేస్తున్నాం ప్రయాణం 8 గంటలు దాటితే కచ్చితంగా రెండో డ్రైవర్ ఉండాల్సిందే. డ్రైవర్లకు హెవీలైసెన్స్ తప్పనిసరి. బస్సు 80–100 కిలోమీటర్ల వేగంతోనే నడపాలి. ఇప్పుడు చాలా బస్సులకు జీపీఎస్‌లు కూడా ఏర్పాటు చేశారు. బస్సు ఎంత స్పీడ్‌తో వెళ్తుందో వివరాలు ఎప్పటికప్పుడు ట్రావెల్స్ హెడ్ ఆఫీసుకు తెలిసిపోతుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. – సుందర్, డీటీసీ -
పాలెం బస్సు ప్రమాదం : స్పెషల్ డ్రైవ్
-
ఆ మంటలు ఆరలేదూ.. ఆ కన్నీళ్ళూ ఆగలేదు!
-
పాలెం దుర్ఘటనకు నేటితో ఏడాది
-
పాలెం దుర్ఘటన కు నేటితో ఏడాది
* కొంతమంది బాధితులకు నేటికీ అందని పరిహారం * జబ్బర్ ట్రావెల్స్‌లో సజీవదహనమైన 44 మందికి నేడు శ్రద్ధాంజలి బెంగళూరు : మహబూబ్‌నగర జిల్లా, కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 44 మంది సజీవదహనమైన సంఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. నేటికీ కొంతమంది బాధితులు పరిహారం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 29వ రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడి కలాసిపాళ్యలోని జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (ఏపీ 02- టిఏ,0963) హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ఫిరోజ్ బాష బస్సును అతి వేగంతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రయాణికులు గాఢనిద్రలోకి జారుకున్నారు. అక్టోబర్ 30వ తేదీ వేకువజామున 5.10 గంటల సమయంలో మహబూబ్‌నగర జిల్లా, కోత్తకోట మండలంలోని పాలెం-కనుమెట్ట గ్రామం మధ్యలోని జాతీయ రహదారిలో కారును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ వోల్వో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. 15 సెంకెడ్లలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది సజీవదహమయ్యారు. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి పల్లే మోహన్‌కుమార్ కుమార్తె ప్రియాంక (గర్బిణి), చిరంజీవి అభిమానుల సంఘం కర్ణాటక అధ్యక్షుడు కోటే వెంకటేష్, ఆయన సోదరి అనితతో పాటు, దంపతులు, చిన్నారి, వ్యాపారులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాదంలో సజీవదహనమైన వారికి బెంగళూరు కలాసిపాళ్యలో గురువారం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిర ణ్ కుమార్‌రెడ్డి కేసు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బస్సుకు ఉన్న ఇన్సూరెన్స్‌ను క్లయిమ్ చేసి మృతుల కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. అయితే నేటికీ మృతుల కుటుంబ సభ్యులు కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల చుట్లూ తిరుగుతూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో వారు మహబూబ్నగరలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో ఉంది. -
పాలెం బస్సు ఘటనపై సీఐడీ చార్జిషీటు
-
పాలెం బస్సు ఘటన: జేసీ ప్రభాకర్ భార్య సహా 10 మందిపై చార్జిషీటు
పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనపై సీఐడీ విభాగం చార్జిషీటు దాఖలుచేసింది. వోల్వో బస్సు తయారీలోనే లోపాలున్నాయని, అందులోని డీజిల్ ట్యాంక్ టైర్లకు దగ్గరగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అందులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు సీట్ల డిజైన్ మార్చారని, అదికూడా ఈ ప్రమాదానికి కారణంగా మారిందని తెలిపారు. (చదవండి: వోల్వో బస్సు దగ్ధం - 44 మంది దుర్మరణం) ఈ కేసులో అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, జబ్బార్ ట్రావెల్స్, ఆర్అండ్బీ శాఖతో పాటు మొత్తం పదిమంది నిందితులపై చార్జి షీటు దాఖలైంది. ఈ బస్సు ప్రమాదంపై 400 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సీఐడీ పంపింది. మహబూబ్‌నగర్ కోర్టులో మే 7వ తేదీన చార్జిషీటు దాఖలు చేశారు. (చదవండి: ఎవరినీ వదిలిపెట్టం.. 40 రోజుల్లో ఛార్జిషీటు) -
నలుగురు జబ్బార్ ట్రావెల్స్ సిబ్బంది అరెస్టు!
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దగ్ధం కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు బెంగళూరులో మరో నలుగురిని గురువారం అరెస్టు చేశా రు. వీరిని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోం ది. అరెస్టు అయిన వారిలో అక్రం, షబ్బీర్, అమానుల్లా షరీఫ్, మహ్మద్జ్రాక్ ఉన్నారు. వీరు జబ్బార్ ట్రావెల్స్ యాజమాన్యానికి సన్నిహితులని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు టికెట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, దుర్ఘటన రోజున బెంగళూరులో ఆ బస్సుకు ఎక్కువ టికెట్లు అమ్మింది వీరేనని సమాచారం. -
జబ్బర్ ట్రావల్స్ కార్యాలయం ఎదురుగా ఓయూ జెఎసి ఆందోళన
-
జేసీ బ్రదర్స్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: ఓయూ జేఏసీ
జేసీ ట్రావెల్స్ యజమానులైన జేసీ బ్రదర్స్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఓయూ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లక్డీకపూల్లో జబ్బార్ ట్రావెల్స్ ఎదుట ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఆ ఆందోళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు. జబ్బార్ ట్రావెల్స్, జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జబ్బార్ ట్రావెల్స్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలిన ఓయూ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో పోలీసులు ఓయూ విద్యార్థులును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో ఇటీవల వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది ప్రయాణికులు మరణించారు. అయితే ఆ బస్సు జబ్బార్ ట్రావెల్స్ పేరుతో తిరుగుతున్న కాగితాలు మాత్రం జేసీ బ్రదర్స్పేరుపై ఉన్నాయని దర్యాప్తులో తెలింది. దాంతో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం వారి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుంది. దాంతో పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజల నుంచి ప్రభుత్వానికి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆర్టీఏ సిబ్బందిపై దూసుకెళ్లిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు
-
ఆర్టీఏ సిబ్బందిపై దూసుకెళ్లిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు
అమీర్‌పేటలో ప్రవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆర్టీఏకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆర్టీఏ అధికారులు స్థానికుల సహయంతో క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 11 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 4 ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. -
హావేరి జిల్లాలో ఓల్వో బస్సు దగ్ధం
దావణగెరె, న్యూస్‌లైన్/సాక్షి, బెంగళూరు : మితిమీరిన వేగం మరో ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30న చోటు చేసుకున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన ఇంకా కళ్ల ముందు నుంచి చెరిగిపోక మునుపే రాష్ట్రంలోని హావేరి జిల్లా సవనూరు తాలూకా, కణిమళ్లళ్లి వద్ద నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైంది. మాజీ మంత్రి, చామరాజపేట నియోజవర్గం ఎమ్మెల్యే(జేడీఎస్) ఎన్టీ జమీర్ అహ్మద్ ఖాన్ అండ్ అసోసియేట్స్ పేరుతో ఈ బస్సు రిజిస్ట్రేషన్ అయింది. బెంగళూరులోని కలాసీపాళ్య కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన సంస్థ ముంబై, గోవా, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలకు నిత్యం 30 బస్సులను నడుపుతోంది. ఇందులో ఆరు బస్సులు బెంగళూరు - ముంబై మధ్య సంచరిస్తుంటాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఆ సంస్థకు చెందిన కే.ఎ- 01 ఏసీ 8642 వోల్వో బస్సు 982 కి.మీ దూరమున్న ముంబైకి బయలుదేరింది. బెంగళూరులోని మారతహళ్లి వద్ద ప్రారంభమైన ఈ బస్సు జయనగర్ ఫోర్త్ బ్లాక్, కలాసీపాళ్య, మెజిస్టిక్, ఆనందరావు సర్కిల్, యశ్వంతపూర్, జాలహళ్లి ప్రాంతాల్లో సంచరిస్తూ 50 మంది ప్రయాణికులను ఎక్కించుకుంది. రాత్రి 9.45 గంటలకు సిటీ విడిచింది. ఈ బస్సు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబైకి చేరాల్సి ఉంది. మొత్తం ప్రయాణికుల్లో 36 మంది ముంబై, 12 మంది పూణే, ఇద్దరు సాతరా బై పాస్ వద్ద దిగాల్సి ఉంది. వీరితో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ ఉన్నారు. బెంగళూరు నుంచి 334 కి.మీ దూరంలో నాల్గవ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు 135 కి.మీ వేగంతో ఈ బస్సు వెళ్తూ అదుపు తప్పింది. వరదా నదిపై నిర్మించిన బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొంది. అదే ఊపులో బస్సు ముందుకు దూసుకెళ్లడంతో డీజిల్ ట్యాంక్ క్షిద్రమై మంటలు వ్యాపించాయి. దీనికి గాలి తోడు కావడంతో ఒక్కసారిగా మంటలు బస్సును చుట్టుముట్టాయి. బస్సు డ్రైవర్(2) గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తాకిడికి మేల్కొన్న ఓ ప్రయాణికుడు మంటలను గమనించి నిద్రమత్తులో ఉన్న తన తోటి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. అరగంటలోపు బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. బస్సు డ్రైవర్(1), మరో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హుబ్లీ లోని కిమ్స్, హావేరిలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనవాలు కూడా చిక్కకుండా కాలిపోయిన శరీరాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు. -
పాలెం బస్సు దుర్ఘటనపై పూర్తి వివరాలివ్వండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం.. బొత్సకు నోటీసులు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ఇటీవల జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దుర్ఘటనపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్, కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, జబ్బార్ ట్రావెల్స్, శ్రీకాళేశ్వరి ట్రావెల్స్, ఓల్వో ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సుల నిర్వాహకులపై, అలాగే దర్యాప్తు నివేదిక ఆధారంగా బస్సు దుర్ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎస్.రాజు, రిటైర్డ్ ఇంజనీర్ రామ్మోహనరావు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న తర్వాత పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
వోల్వో బస్సు ప్రమాదంపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించి వోల్వో కంపెనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అలాగే రవాణా శాఖ, ఆర్టీసీలకు నోటీసులు ఇచ్చింది. వారంలోగా జవాబు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద సంఘటనపై విచారణ పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు వెల్లడి అయ్యింది. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
జబ్బార్ ట్రావెల్స్ ఘటనలో దోషుల పై చర్యలేవి?
-
వోల్వో బస్సు ప్రమాద ఘటనపై విచారణ పూర్తి
మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద సంఘటనపై విచారణ పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు బృంద సభ్యులు మంగళవారమిక్కడ తెలిపారు. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. గతనెల 30న కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు నేటి వరకూ ఆధారాలను సేకరించారు. మరో 16 మృతదేహాలు గుర్తింపు ఇక బస్సులో అగ్నికి ఆహుతై గుర్తించరాని విధంగా ఉన్న మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి త రలించి మార్చురీలో ఉంచారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. వాటి ఆధారంగా మంగళవారం మరో 16 మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. వాటిని ఈరోజు సాయంత్రం బంధువులకు అప్పగించనున్నారు. నిన్న 19 మృతదేహాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. ప్ర స్తుతం డీఎన్ఏ పరీక్షల ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతోందని, మరో ఒకటి రెండు రోజుల్లో మిగిలిన మృతదేహాలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు. -
దర్యాప్తు ముమ్మరం
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన సంఘటనపై పోలీసుశాఖ విచారణను వేగవంతం చేసింది. గతనెల 30వ తేదీన కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు 24గంటల పాటు పనిచేస్తూ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగానే కొత్తకోట సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒక బృందం హైదరాబాద్‌లోనే ఉంటూ మృతదేహాలకు సంబంధించి డీఎన్ఏ పరీక్షలు చేయించడం నుంచి బాధితుల బంధువులకు ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సమాచారం ఇస్తున్నారు. మరోబృందం వనపర్తి డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ మహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో దుర్ఘటన జరిగిన ప్రాంతంలో, దగ్ధమైన బస్సులో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే మృతులకు సంబంధించిన కొన్ని వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట ఎస్ఐ గిరి బాబు ఆధ్వర్యంలో మరో బృందం రెండు రో జులుగా బెంగళూరులో మకాం వేసి వాస్తవంగా ఆ రోజు బస్సులో ప్రయాణానికి ఎంతమంది ప్రయాణికులు సీటు రిజర్వ్ చేసుకున్నారు, ప్ర యాణంలో ఎవరెవరు ఏయే ప్రాంతంలో బ స్సులో ఎక్కారనే వివరాలను సేకరిస్తున్నారు. సోమవారం బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. పోలీసుశాఖ నుంచి విచారణ వేగవంతమవుతున్నా రవాణాశాఖ అధికారులు సంఘటన జరిగిన రోజు, మరుసటి రోజు హడావుడి చేసినా ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. వాహనాలను తనిఖీచేయడం మినహా ప్రమాదానికి గల కారణాలు ఆ శాఖ నుంచి సేకరించడంలో కొంత మేర విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటింగ్ కెపాసిటీ మొదలుకొని ఇతర అంశాలపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఓల్వో కంపెనీ ప్రతినిధులు, ఎల్అండ్టీ, ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రమాదం సంభవించిన మరుసటి రోజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వెళ్లినా ఇప్పటి వరకు వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వలేదని తెలుస్తోంది. బస్సులోనే మాంసపు ముద్దలు కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్: కొత్తకోట మండ లం పాలెం వద్ద 45 మందిని పొట్టన పెట్టుకున్న ఓల్వో బస్సు వద్ద ఇంకా మృతుల ఆనవాళ్లు బ యటపడుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన మరుసటి రోజు బస్సును ప్రమాదస్థలం నుంచి మరోచోటుకు తరలించారు. ఆ సమయంలో బ స్సు సీట్లలో మృతదేహాల మాంసపు ముద్దలు, మృతులకు సంబంధించిన ఆనవాళ్లు అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం కోత్తకోట ఎస్ఐ డీకే. మహేశ్వర్‌రావు, శిక్షణ ఎస్ఐ రమేష్‌ల ఆధ్వర్యంలో కొన్ని ఆనవాళ్లను తొలగించారు. ప్రమాదం జరిగినప్పుడు మం టల్లో కాలిపోయిన మృతుల నగలు, వాచీలు బ స్సులో ఇరుక్కున్నాయి. వాటిని బయటకు తీ శారు. అందులో నాలుగు బంగారు పుస్తెలతా డు ముక్కలు, రెండు పుస్తెలతాడు గుండ్లు, ఒక లాకెట్, ఒక చెవి దుద్దు, ఒక గోల్డ్‌చైన్, రెండు కాలిపోయిన వాచీలు ఉన్నాయి. వాటిని మృతు ల బంధువులకు అప్పగించేందుకు పోలీసులు భద్రపరిచారు. 44వ జాతీయ రహదారిపై ట్రా ఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఇప్పటి వరకు ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బస్సు ప్రమాదంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించగా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారులు కూడా ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. 19 మృతదేహాల గుర్తింపు: కలెక్టర్ బస్సులో అగ్నికి ఆహుతై గుర్తించరాని విధంగా ఉన్న మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి త రలించి మార్చురీలో ఉంచారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. వాటి ఆధారంగా సోమవారం నా టికి 19 మృతదేహాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. సోమవారం ఆ య న తన చాంబర్లో వివరాలు వెల్లడించారు. ప్ర స్తుతం డీఎన్ఏ పరీక్షల ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతోందని, మరో ఒకటి రెండు రోజు ల్లో మిగిలిన మృతదేహాలను గుర్తించి వారి కు టుంబసభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు. గుర్తించిన మృతదేహాలు ప్రశాంత్ గుప్త, శివకిరణ్, వేదవతి, రవి, ఎండీ.సర్దార్, ఆశుతోష్ పాండా, అక్షయ్‌సింగ్, ఎం.ఫణికుమార్, ఎన్ఎస్. గిరిధర్, జి.బాలసుందరరాజు, జి.మేరి విజయకుమారి, జ్యోతి రంజన్సాహు, సయ్యద్ మహ్మద్ జమాలుద్దీన్, ఎన్.రోహియా, వెంకటేష్, మోహసిన్ పాషా, రఘువీర్, కె.రమ్య, సాకిబ్ అహ్మద్ ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. అత్యాధునిక పరికరాలతో నిఘా జిల్లాలో జాతీయ రహదారిపై తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల వేగంపై అత్యాధునిక పరికరాలతో నిఘా పెంచాం. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. - ఎస్పీ డి.నాగేంద్రకుమార్ -
వద్దు... వద్దంటున్నా...
= కుటుంబ సభ్యులు వారించినా.. వినకుండా... = మహబూబ్‌నగర్ ప్రమాదంలో చిక్కుకున్న గోల్ఫ్ కోచ్ = కాలిన గాయాలతో హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అతను పచ్చ కామెర్లతో బాధ పడుతున్నాడు. విశ్రాంతి కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. జబ్బు కాస్త నయం అయింది. మళ్లీ హైదరాబాద్‌కు పయనం కాగా కుటుంబ సభ్యులు వారించారు. ‘మరింత విశ్రాంతి అవసరం. దీపావళి పండుగ అయ్యాక వెళ్దువు గానీ’ అని నచ్చజెప్పజూశారు. అతను వినలేదు. ఘోర ప్రమాదానికి గురైన జబ్బార్ ట్రావెల్స్ బస్సులో ఆ రోజు ప్రయాణిస్తున్నాడు. బస్సు నుంచి బయటకు దూకేశాడు కానీ, అప్పటికే 45 శాతం దాకా ఒళ్లు కాలిపోయింది. నగరానికి చెందిన యోగేష్ గౌడ ప్రస్తుతం హైదరాబాద్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని అన్న తిమ్మేగౌడ తెలిపిన సమాచారం మేర కు... హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో యోగేశ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ప ని చేస్తున్నాడు. నెలలో మూడు రోజులు బెంగళూరుకు వ చ్చి వెళ్లే వాడు. అతని కళ్లు పచ్చబడుతుండడాన్ని హైదరాబాద్‌లో గోల్ఫ్ ఆడే ఓ డాక్టరు గమనించి చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో అతను వారం కిందట బెంగళూరుకు వచ్చేశాడు. తల్లి భాగ్యమ్మ అతని ఆలనా పాలనా చూసుకునేది. బోర్ కొడుతుండడంతో హైదరాబాద్‌కు వెళ్లి పోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులు వద్దని చెబుతున్నా, హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుం టానంటూ వారికి నచ్చజెప్పి వెళ్లాడు. బస్సు వెనుక సీటు లో యోగేష్ కూర్చున్నాడు. బస్సును అగ్ని కీలలు ఆవరిస్తున్న తరుణంలో ఒక్క ఉదుటున డోర్ వద్దకు వెళ్లాడు. మధ్యలో ఓ మహిళ భయంతో అతని చేయి పట్టుకున్నా, విదిలించుకుని కిందకు దూకేశాడు. అప్పటికే అతని శరీ రంలో చాలా భాగం కాలిపోయింది. అక్కడి డీఆర్డీఓ అ పోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పొగ కారణంగా శ్వాస కోశం బాగా దెబ్బ తింది. ప్రస్తుతం కృత్రిమ శ్వాసపై ఉ న్నాడు. ‘కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, మా లో ధైర్యం సడలిపోకుండా చూస్తూ వచ్చిన తమ్ముడు ఇ ప్పుడు చావు బతుకుల మధ్య గడుపుతున్నాడు’ అని తి మ్మే గౌడ భోరుమన్నాడు. కాగా కొన్నేళ్లుగా యోగేష్‌గౌడ కుటుంబంతో విధి వింత నాటకం ఆడుతోంది. రెండేళ్ల కిందట తండ్రి మరణించాడు. ఆ దుఃఖం నుంచి కోలుకునే లోపే పెద్ద అక్క భర్త కేన్సర్‌తో కన్ను మూశాడు. -
అక్రమ మార్గం.. వక్రభాష్యం
‘బస్సు’ దగ్ధం కేసు నుంచి తప్పించుకొనేందుకు యత్నాలు ‘జబ్బార్’ ట్రావెల్స్‌ను ముందు పెట్టి వ్యవహారం నడిపిస్తున్న జేసీ బ్రదర్స్? చట్టంలోని లొసుగులను వినియోగించుకునే ప్రయత్నం బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణం 8 గంటలేనట.. రెండో డ్రైవర్ అవసరం లేదట ఇరుకు వంతెన కారణంగానే ప్రమాదం జరిగిందంటూ బుకాయింపు మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: చట్టంలోని లొసుగులను సాకుగా చూపుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం చట్టంలోని నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ తప్పు తమదికాదని వాదిస్తోంది. అయితే ఈ కేసు తమ మీదికి వచ్చే అవకాశం ఉండడంతో.. జబ్బార్ ట్రావెల్స్‌ను ముందుపెట్టి ‘జేసీ’ బ్రదర్స్ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివార్లలో దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌తో పాటు మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే, అసలు ఈ కేసులో తమ తప్పేమీ లేదనేందుకు నిబంధనల్లోని లొసుగులను వాడుకొనేందుకు బస్సు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు ఎనిమిది గంటలు మాత్రమే పడుతుందని.. దాంతోపాటు ప్రమాదానికి గురైన బస్సుకు జాతీయ రహదారి పర్మిట్ లేనందున ఇద్దరు డ్రైవర్లు అవసరం లేదని, నిబంధనల ప్రకారం ఒక్కరే సరిపోతారని ట్రావెల్స్ యాజమాన్యం అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు పాలెం సమీపంలో కల్వర్టు జాతీయ రహదారిపైకి చొచ్చుకువచ్చిందునే ప్రమాదం జరిగిందని వారు వాదిస్తున్నట్లు సమాచారం. ఏడో నంబర్ జాతీయ రహదారి విస్తరణ సమయంలో పాత కల్వర్టును తొలగించి.. కొత్త కల్వర్టు నిర్మించకపోవడం వల్ల అక్కడ రహదారిపైకి కల్వర్టు నిర్మాణం కొంత చొచ్చుకువచ్చినట్లుందని.. అందువల్లే దుర్ఘటన జరిగిందని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా.. బస్సు ఢీ కొన్న కల్వర్టు నిర్మాణాన్ని ఢిల్లీకి చెందిన జాతీయ రహదారి శాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. -
జేసీ ట్రావెల్స్‌పై కేసుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర బస్సు దుర్ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డికి సంబంధించి ట్రావెల్స్‌పై కేసు నమోదుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. 45 మంది మృతికి కారణమైన ఆ బస్సు దివాకర్ రోడ్ లైన్స్‌కు చెందినట్టుగా రవాణాశాఖ రికార్డుల్లో ఉన్నందున దానిపై కేసు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ బస్సును రెండేళ్ల కిందటే జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించామని, ఆ బస్సుతో తమకు సంబంధం లేదని జేసీ దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి మీడియాకు స్పష్టంచేసినా... రికార్డుల్లో ఎక్కడా జబ్బార్ ట్రావెల్స్ ప్రస్తావన లేదు. ఈ అమ్మకాలు, లీజు వ్యవహారాలను పట్టించుకోమని గురువారం రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పష్టం చేశారు. రికార్డుల్లో యజమాని పేరు ఎవరిది ఉందో వారిపైనే నిబంధనల ప్రకారం కేసు పెట్టాల్సి ఉంటుందని, ఆ నిబంధనలనే ఈ ప్రమాదం విషయంలోనూ అనుసరిస్తామని పేర్కొన్నారు. ఆ బస్సును జబ్బార్ ట్రావెల్స్‌కు అమ్మినందున దానితో తమకు సంబంధం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెబుతున్న నేపథ్యంలో కర్ణాటక ఆర్టీఏ పరిధిలో ఉన్న డాక్యుమెంట్లను ఇక్కడి అధికారులు తెప్పించుకున్నారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ బస్సు దివాకర్ రోడ్ లైన్స్ పేరుతోనే ఉన్నట్లు అధికారికంగా ధ్రువీకరించుకున్నారు. ప్రమాద సమయంలో రెండో డ్రైవర్ లేకపోవడం, సామర్థ్యానికి మించి బస్సులో ప్రయాణికులు ఉండడం, బస్సు నడిపిన డ్రైవర్‌కు సరైన శిక్షణ లేకపోవడం.. తదితర కారణాల నేపథ్యంలో దివాకర్ ట్రావెల్స్‌పై తీవ్రమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు కర్ణాటక రవాణా శాఖ అధికారులు కూడా గురువారం హైదరాబాద్ చేరుకొని ఈ ప్రమాదంలో వారి వైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. నెపం రోడ్డుపై నెట్టే యత్నం: ప్రభుత్వ ఆదేశం ప్రకారం ప్రస్తుతం ఘటనపై ప్రాథమిక విచారణ జరుగుతోంది. ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ విచారణ ప్రారంభించారు. ఇక్కడే జేసీ అనుచరులు రంగప్రవేశం చేశారు. ఈ విచారణ వీలైనంత వరకు ఇతర అంశాలపై ఫోకస్ కావటం ద్వారా దివాకర్ రోడ్ లైన్స్ అంశం పైకి రాకుండా చూడాలనేది వారి ఉద్దేశం. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినా, ప్రమాదం జరిగినచోట రోడ్డూ లోపభూయిష్టంగా ఉన్నందున ప్రధాన కారణం రోడ్డేనని తేల్చేలా చూస్తున్నారు. బస్సులో వాస్తవానికి రెండో డ్రైవర్ లేనప్పటికీ.. ఉన్నాడని, మార్గమధ్యంలో అతడు దిగిపోయాడని నివేదికలో చేర్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక రవాణా శాఖ నిబంధనల్లో ఉన్న లొసుగుల ఆధారంగా బస్సు యాజమాన్యం విషయంలోనూ ఏమార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. అయితే నిబంధనల మేరకు పక్కాగా విచారణ జరిపి ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక ఇస్తానని విచారణాధికారి ప్రసాదరావు ‘సాక్షి’తో చెప్పారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. ఈ ప్రమాదం
వనపర్తి, న్యూస్‌లైన్: బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు డీఐజీ నవీన్‌చంద్ వెల్లడించారు. ఘటనా స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ప్రమాదంలో 45 మంది దుర్మరణం పాలవగా ఐదుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కొత్తకోట దాటగానే పాలెం సాయి దాబా వద్ద రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. దాంతో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో వ్యాపించడంతో ప్రయాణికులు నిస్సహాయంగా సజీవ దహనమయ్యారు’’ అని వివరించారు. ‘‘దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. అతన్ని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతాం. ఘటనపై ఐపీసీ 337, 338, 309, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయన్నారు. ముగ్గురి శవాలను మాత్రం వారి బంధువులు గుర్తించడంతో పోస్టుమార్టం అనంతరం వారికప్పగించామని తెలిపారు. బస్సుకు దివాకర్ రోడ్‌లైన్స్ పేర అనుమతి ఉందని, నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు నుంచి బయల్దేరినప్పుడు బస్సులో 37 మంది పేర్లు మాత్రమే నమోదై ఉన్నాయని, మధ్యలో అక్కడక్కడ ఎక్కిన వారి వివరాలు తెలియరాలేదని అన్నారు. మృతుల కుటుంబీకులు తమవారి వివరాల కోసం జిల్లా ఎస్పీ, ఓఎస్డీలను సంప్రదించాలని సూచించారు. ఏ మాంసపు ముద్ద ఎవరిదో? ప్రమాదం గురించి తెలిసి హుటాహుటిన తరలివచ్చిన మృతుల బంధువుల రోదనలతో ఘటనా స్థలి శోకసంద్రమైంది. గుర్తించలేనంతగా కాలిపోయిన శవాల ముద్దలను చూసి వారంతా గుండెలవిసేలా రోదించారు. ప్రయాణికుల బంధువుల్లో పలువురు హైదరాబాద్ లక్డీకపూల్ చౌరస్తాలోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సరైన సమాచారం లభించక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం అర్థమైన వారు ట్రావెల్స్ ముందే కుప్పకూలారు. వారి రోదనలు, పెడబొబ్బలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. -
చట్టాల్లో మార్పులవసరం: బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బస్సుల దూకుడుకు కళ్లెం వేసేందుకు పటిష్టమైన ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అవసరమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర మోటారు వాహన చట్టాల్లో మార్పులు అవసరమని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆయన బుధవారం రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి లక్ష్మీపార్థసారథి, కమిషనర్ అనంతరాం, అదనపు కమిషనర్ శ్రీనివాస్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. కల్వర్టు దాటే క్రమంలో డ్రైవర్ తన ముందున్న కారును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడని, అదే సమయంలో ముందు టైర్ పేలిందని, దాంతో బస్సు కల్వర్టుకు ఢీకొని డీజిల్ ట్యాంకర్ పగిలిందని చెప్పారు. క్షణాల్లో మంటలంటుకొని బస్సు పూర్తిగా కాలిపోయిందని, ఈ ఘటనలో మొత్తం 45 మంది అక్కడికక్కడే చనిపోయారని చెప్పారు. గాయపడిన మరో ఐదుగురు డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బస్సుసీటింగ్ సామర్ధ్యం 43 మాత్రమేనని, ఇద్దరు డ్రైవర్లతో కలుపుకుని 45 మంది ప్రయాణించవలసి ఉండగా, ఐదుగురు ఎక్కువగా ఉన్నారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. రవాణా అధికారులు తనిఖీలు చేయకపోవడమే ఓవర్ లోడింగ్‌కు కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా తిరగాల్సిన బస్సులు స్టేజీ క్యారేజీలుగా ఎందుకు తిరుగుతున్నాయన్న ప్రశ్నకు.. ప్రయాణికుల డిమాండ్‌ను ఆర్టీసీ భర్తీ చేయలేకపోతోందని, దీంతో స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోలేకపోతున్నామని మంత్రి చెప్పారు. బస్సులకు వేగ నియంత్రణ పరికరాలు(స్పీడ్ గవర్నర్స్) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కోర్టుల జోక్యం వల్ల ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. కాగా దివాకర్ ట్రావెల్స్ రోడ్ లైన్స్‌కు చెందిన ఈ బస్సు(ఏపీ 02 టీఏ 0963) బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్స్‌కు 2011 అక్టోబర్‌లో బదిలీ అయిందని మంత్రి చెప్పారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించాక ప్రకటిస్తామని బొత్స తెలిపారు. -
ఆ బస్సు ‘జేసీ’లదే!
కాగితాలపై మాత్రమే ‘జబ్బార్ ట్రావెల్స్’ ఇప్పటికీ పర్మిట్లు తదితరాలు ‘దివాకర్’ పేరిటే సాక్షి నెట్వర్క్: 45 నిండు ప్రాణాలను బలిగొన్న ఓల్వో బస్సు యజమాని ఎవరన్నది వివాదంగా మారింది. బస్సుపై జబ్బార్ ట్రావెల్స్ పేరు రాసి ఉన్నా, దాని అసలు యాజమాన్యం, అజమాయిషీ మాత్రం పూర్తిగా మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డిలవేనని తెలుస్తోంది. బస్సుకు సంబంధించిన పర్మిట్లు, పన్ను చెల్లింపులు తదితరాలన్నీ ఇప్పటికీ జేసీ సోదరులకు చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరుతోనే జరుగుతుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. ప్రభాకర్‌రెడ్డి నడుపుతున్న దివాకర్ రోడ్ లైన్స్ ఈ బస్సును (ఏపీ02 టీఏ 0963) 2010లో ఆయన భార్య జేసీ ఉమారెడ్డి పేరుతో కొనుగోలు చేసింది. కర్ణాటక రవాణా శాఖ వెబ్సైట్లో కూడా బస్సు యజమానిగా ఇప్పటికీ ఆమె పేరే ఉంది. ప్రమాదం గురించి తెలియగానే జేసీ బ్రదర్స్ ఉలిక్కిపడ్డారు. ప్రభాకర్‌రెడ్డి ఘటనా స్థలికి వచ్చి, బస్సును 2010లోనే జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించామని చెప్పుకొచ్చారు. తమ ప్రతినిధులను కూడా హుటాహుటిన లక్డీకాపూల్ కార్యాలయానికి పంపించి లీజు అగ్రిమెంట్‌ను కూడా చూపించారు. మరి బస్సు ఇప్పటికీ మీ సంస్థ పేరిటే ఎందుకు నడుస్తోందన్న విలేకరుల ప్రశ్నకు, ఫైనాన్షియల్ సమస్య అంటూ పొంతన లేని సమాధానమిచ్చారు. పైగా వారు చూపిన లీజ్ ఒప్పందం కూడా మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఎందుకంటే 2010 అక్టోబర్ 10న ఒప్పందం కుదుర్చుకున్నట్టు దానిపై రాసి ఉంది. కానీ సదరు బాండ్ పేపర్‌ను మాత్రం 2010 డిసెంబర్ 8న కొనుగోలు చేసినట్టు దానిపై ఉన్న తేదీని బట్టి స్పష్టమవుతోంది! 2010 డిసెంబర్ 8న కొన్న బాండ్ పేపర్‌పై అక్టోబర్ 10న ఒప్పందం చేసుకోవడం ఎలా సాధ్యమో జేసీ సోదరులకే తెలియాలి. అసలు జబ్బార్ ట్రావెల్స్ సంస్థే జేసీ సోదరుల బినామీ సంస్థేనంటున్నారు. పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు గతంలో చాలాసార్లు ఇదే విషయం చెప్పాయి కూడా. జేసీ సోదరుల కనుసన్నల్లో రవాణా మాఫియా నడుస్తోందని అవి ఆరోపించాయి. పైగా ఒకే నంబర్‌తో పలు బస్సులను నడుపుతున్నట్టు దివాకర్ ట్రావెల్స్‌పై ఇప్పటికే చాలా ఫిర్యాదులున్నాయి. ఇది రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో 200కు పైగా బస్సులు నడుపుతోంది. జేసీ సోదరుల రాజకీయ పలుకుబడి, ఫ్యాక్షన్ నేపథ్యం, వారిచ్చే మామూళ్ల కారణంగా రవాణా శాఖ అధికారులు వాటిని తూతూమంత్రంగా మాత్రమే తనిఖీ చేస్తారని చెబుతారు. బుధవారం 45 మందిని పొట్టన పెట్టుకున్న వోల్వో బస్సును ఎన్‌హెచ్-44పై అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని రవాణా శాఖ చెక్‌పోస్టులో మంగళవారం అర్ధరాత్రి సరిగా తనిఖీ చేయలేదని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న ఎంవీఐ వై.ప్రసాద్ దాన్ని తనిఖీయే చేయలేదు. బుధవారం ఉదయం ప్రమాద వార్త తెలియగానే.. బస్సును తనిఖీ చేసినట్లు మూవ్మెంటు రిజిస్టర్లో హడావుడిగా చేర్చారని రవాణా శాఖ అధికారులే అంటున్నారు. దీనిపై ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తనిఖీ చేశానని, అప్పుడు 46 మందే ఉన్నారని చెప్పుకొచ్చారు. చిన్న విషయమది: ప్రభాకర్‌రెడ్డి బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ‘ఓ చిన్న విషయం’గా జేసీ ప్రభాకర్‌రెడ్డి తీసిపారేశారు. ఇలాంటివి జరగడం, జరగకపోవడం అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని ఘటనా స్థలి వద్ద వ్యాఖ్యానించారు! ‘‘ప్రమాదంలో డ్రైవర్ తప్పిదం కన్పించడం లేదు. కల్వర్టును రోడ్డుపైకి కట్టిన అధికారులదే తప్పు. ఈ బస్సు ఇండియాది కాదు, స్వీడన్లో తయారైంది. రూ.1.20 కోట్లకు కొన్నాం. ఇంత మంచి బస్సు అయ్యుండీ ప్రమాదం జరిగింది. దానికి మనమేం చేస్తాం? ’ అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రమాదానికి గురైన బస్సు జబ్బార్ ట్రావెల్స్‌కు సంబంధించింది కాదని, దివాకర్ ట్రావెల్స్దేనని ప్రమాదంలో మరణించిన అక్షయ్‌సింగ్ బాబాయ్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. ఇదెక్కడి గ‘లీజు’ సాక్షి, హైదరాబాద్: అక్టోబర్‌లో చేసుకున్న లీజు ఒప్పందం డిసెంబర్లో కొన్న స్టాంపు పేపరుపై రాయడం సాధ్యమేనా? వేరొకరికైతే కాదు కాని... దివాకర్ ట్రావెల్స్‌కు మాత్రం ఇది సాధ్యమే. ప్రమాదానికి గురైన బస్సును 10.10.2010న జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చినట్లు ఒప్పందం రాసుకున్నారు. దీన్ని అదే తేదీన నోటరీ చేయించారు. అయితే ఈ ఒప్పందం రాసుకున్న స్టాంప్ పేపర్ మాత్రం విక్రేత వద్ద 8.12.2010న కొన్నట్లు ఉంది. ఇదే అనుమానాలకు తావిస్తోంది. డిసెంబర్ విక్రయించిన స్టాంప్ పేపర్‌పై... దానికి రెండు నెలల ముందు అక్టోబర్‌లో లీజు ఒప్పంద పత్రం రాసుకోవడం ఎలా సాధ్యమో దివాకర్ ట్రావెల్స్ చెప్పాలి. అలాగే ఒకసారి ఈ బస్సును (ఏపీ 02 టీఏ 0963) జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకిచ్చామని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి... తర్వాత దాన్ని తాము అమ్మివేశామని, అయితే యాజమాన్య బదిలీ జరగలేదని మరోసారి చెప్పడం కూడా సందేహాలకు తావిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ఈ బస్సుకు కడుతున్న పన్నులన్నీ దివాకర్ ట్రావెల్స్ పేరిటే చెల్లించడం గమనార్హం. -
ఘోరం
* పాలమూరు బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం * కొత్తకోట మండలం పాలెం శివారులో దుర్ఘటన * కల్వర్టును ఢీకొనటంతో పేలిన డీజిల్ ట్యాంకు * చూస్తుండగానే కాలిపోయిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు * 15 క్షణాల్లో బస్సును చుట్టుముట్టిన అగ్నికీలలు * మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు * బతికింది డ్రైవర్, క్లీనర్ సహా ఏడుగురే * విచారణకు సీఎం ఆదేశం.. దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి ఘటనా స్థలం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కోరలు సాచి క్షణాల వ్యవధిలో చుట్టుముట్టిన అగ్నికీలలు. రెప్పపాటులో ఒళ్లంతా అంటుకున్న పెను మంటలు. నిలువునా కాలిపోతూ హాహాకారాలు. కాపాడండంటూ నిస్సహాయంగా ఆర్తనాదాలు. నిమిషాల్లోనే సర్వం భస్మీపటలం. తెల్లవారుజామున తెల్లారిపోయిన 45 నిండు ప్రాణాలు. వింటేనే ఒళ్లంతా జలదరించేతటి దారుణమిది. గుండెల్ని పిండే మహా విషాదమిది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదమిది. బెంగళూరు నుంచి 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరుతో ఉన్న ఈ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారులో అగ్నికి ఆహుతైంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఓ కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు పేలిపోయి ఒక్కసారిగా నిప్పంటుకుంది. కేవలం 15 క్షణాల వ్యవధిలో అగ్నికీలలు బస్సంతటినీ చుట్టుముట్టాయి. డ్రైవర్, క్లీనర్ వెంటనే డ్రైవర్ సీటు పక్కనుండే తలుపు తెరుచుకుని బయటకు దూకేయడంతో పెద్దగా గాయాలేమీ కాకుండానే బతికి బయటపడ్డారు. డ్రైవర్ క్యాబిన్లో, ముందు వరస సీట్లలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు కూడా వెంటనే తేరుకుని అదే తలుపు గుండా బయటకు దూకేశారు. మిగతా వారెవరూ ముంచుకొచ్చిన మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. 45 మంది ప్రయాణికులు బస్సులోనే నిలువునా కాలి బుగ్గయ్యారు. వారంతా గాఢ నిద్ర నుంచి తేరుకుని, జరిగిన ఘోరాన్ని అర్థం చేసుకునే లోపే సమయం మించిపోయింది. అన్నివైపుల నుంచీ మంటలు చుట్టుముడుతుండటంతో బస్సులోంచి బయట పడే మార్గం లేక నిస్సహాయంగా ప్రాణాలు వదిలారు. వారిలో ఒక్కరి ముఖం మాత్రమే గుర్తు పట్టగలిగే స్థితిలో ఉంది. మిగతావన్నీ కాలి బుగ్గయ్యాయి. కొన్ని శవాలైతే రెండు మూడు శరీర భాగాలు మినహా మొత్తం బూడిదగా మారిపోయాయి. పుట్టింట్లో పురుడు పోసుకునేందుకు వస్తున్న ఓ నిండు చూలాలు.. తల్లి ఒడిలో పడుకున్న ముక్కుపచ్చలారని చిన్నారి.. సోదరి పెళ్లి పిలుపు కోసం వస్తున్న అన్నాచెల్లెళ్లు.. సాఫ్ట్వేర్ కంపెనీలో చేరేందుకు కోటి ఆశలతో, అపాయింట్మెంట్ లెటర్‌తో బయల్దేరిన 24 ఏళ్ల యువకుడు.. కాలి మాంసపు ముద్దలుగా మారిన వారిలో ఇలాంటి వారెందరో ఉన్నారు! ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యుల బృందం బుధవారం ఉదయమే ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాలకు అక్కడే శవపరీక్షలు చేసింది. బంగారు గొలుసులు, రింగులు తదితరాల ఆధారంగా గుర్తించగలిగిన నాలుగు మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించి, మిగతా 41 శవాలను రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం తర్వాత ప్రయాణికుల క్యాబిన్ తలుపు అసలు తెరుచుకుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. బతికి బయటపడ్డ వారిలో కొందరు తాము ముందు వరసలో కూర్చున్నామంటున్నా, మళ్లీ అడిగితే ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రమాదంపై ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఐటీ, ఎన్ఫోర్స్మెంట్, రోడ్ సేఫ్టీ) ఎస్.ఎ.వి.ప్రసాదరావును విచారణాధికారిగా నియమించింది. ప్రమాదానికి కారణమేమిటి, బాధ్యులెవరు వంటి వివరాలతో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపై విచారించి నివేదిక సమర్పించాల్సిందిగా మహబూబ్‌నగర్ ఎస్పీని ఆదేశించింది. గాఢ నిద్రలో ఉండగానే... ఏపీ02 టీఏ 0963 నంబర్ బస్సు బెంగళూరులో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయల్దేరింది. తెల్లవారుజామున దాదాపు 5.10 సమయంలో పాలెం-కనుమెట్ట గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు వద్దకు రాగానే, ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సును డ్రైవర్ కుడివైపు తిప్పాడు. ఆ సమయంలో దాని వేగం గంటకు 130 కిలోమీటర్లకు పైనే ఉంది. కల్వర్టు తాలూకు పిట్టగోడ రోడ్డుపైకి ఉండటంతో బస్సు హెడ్‌లైట్ భాగం గోడ పై భాగానికి బలంగా గుద్దుకుంది. వంపు తిరిగినట్టుగా ఉన్న గోడ దిగువ భాగాన్ని బస్సు డీజిల్ ట్యాంకు ఢీకొట్టి అతివేగం కారణంగా ఒక్కసారిగా పగిలిపోయింది. అందులోని డీజిల్ మొత్తం బయటకు చిమ్మినట్టుగా పడింది. బస్సు టైర్లు కూడా డీజిల్‌తో తడిసిపోయాయి. హెడ్‌లైట్ పగలగానే నిప్పురవ్వలు ఎగిసి పడి డీజిల్‌కు అంటుకున్నాయి. డీజిల్ అంతటా విస్తరించి ఉండటంతో క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. బస్సు లోపల ఏసీ వ్యవస్థ ఉండటంతో అందులోని గ్యాస్ కూడా మంటలు పెరగటానికి కారణమైంది. అదే సమయంలో బస్సు కుడి వైపు టైర్ కూడా పేలిపోయింది. దాంతో బస్సు 300 మీటర్ల వరకు అలాగే దూసుకెళ్లి రోడ్డుకు ఎడమ వైపు నిలిచిపోయింది. బస్సు బాడీ ఫైబర్‌తో చేసింది కావడం, లోపల కర్టెన్లు, సీటు కవర్లు... ఇలా అన్నీ మంటలంటుకునే వస్తువులే ఉండటంతో చూస్తుండగానే అగ్నికీలలు బస్సంతటినీ చుట్టుముట్టాయి. లగేజీ బాక్సులో జరీ చీరలకు ఉపయోగించే దారం చుట్టలు భారీగా ఉండటం కూడా మంటలు పెరిగేందుకు కారణమైంది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు కల్వర్టు గోడను ఢీకొనగానే వారంతా కుదుపుతో ఎగిరి ముందు సీట్లకు గుద్దుకుని ఒక్కసారిగా మెలకువలోకి వచ్చారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే మంటలు శరవేగంగా లోపలికి వ్యాపించడంతో పాటు బస్సంతా దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు ముందు భాగం నుంచే లోనికి విస్తరించటంతో ప్రాణాలు దక్కించుకునేందుకు అంతా వెనక వైపు పరుగులు తీశారు. అప్పటికే అద్దాలు పగిలిన రెండు కిటికీల్లోంచి బయటకు దూకేందుకు ప్రయత్నించారు. కానీ ఆసరికే చాలామందికి ఒళ్లంతా మంటలంటుకోవడంతో ఒక్కరు కూడా బయటకు రాలేకపోయారు. దాదాపుగా శవాలన్నీ వెనుక భాగంలో ఒకే చోట కుప్పలా పడి ఉన్నాయి. ఒకరు ముందువైపు కిటికీలోంచి బయటకు దూకే ప్రయత్నంలో శరీరం సగం బస్సు బయటికి, సగం లోపలి వైపు ఉన్న దశలోనే ప్రాణాలొదలడం అందరినీ కలచివేసింది. సామర్థ్యం 43... ఉన్నది 50 మంది.. కాసులకు కక్కుర్తిపడే అధికారులు ప్రైవేటు బస్సుల ఆగడాలకు కళ్లెం వేయకపోతుండటం అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనటానికి ఈ ప్రమాదం మరో నిదర్శనం. ఈ బస్సు సామర్థ్యం డ్రైవర్, క్లీనర్ కాకుండా 43 మందే. కానీ టికెట్ బుకింగ్ వివరాల ప్రకారమే అందులో 44 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద సమయంలో వారి సంఖ్య 50కి చేరింది! సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్న వారిలో కొందరు డ్రైవర్ క్యాబిన్‌లోని డ్రైవర్ విశ్రాంతి సీటు, ఇతర చోట్ల ఇరుక్కుని కూర్చున్నట్టు సమాచారం. వేరే వాహనాల్లోని వారు స్పందించి ఉంటే... ప్రమాదం జరిగి బస్సు అగ్నికీలలో చిక్కుకుని ప్రయాణికులంతా హాహాకారాలు చేస్తున్నా దాని ముందూ, వెనకా వెళ్తున్న వాహనాల్లోని వారిలో చాలామంది గుడ్లప్పగించి చూశారే తప్ప రక్షించేందుకు పెద్దగా ప్రయత్నించలేదు. బస్సు ఏ కారును ఓవర్టేక్ చేయబోయి ప్రమాదానికి గురైందో ఆ కారు కూడా ఆగకుండానే వెళ్లిపోయింది. సరిగ్గా బస్సు వెనకే వస్తున్న ఇన్నోవా డ్రైవర్ శ్రీనివాస్ ప్రయాణికులను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఇన్నోవాలోని నలుగురు ప్రయాణికులు కూడా కిందకు దిగి బస్సు అద్దాలపైకి రాళ్లు విసిరినా అవి పగల్లేదు. వారు 100, 108లకు సమాచారమిచ్చి వెళ్లిపోయారు. అదే సమయంలో వెనకే మరో ప్రైవేటు బస్సు వచ్చి కూడా ఆగకుండానే పోయింది. పక్కనున్న దాబా సిబ్బంది మాత్రం వెంటనే వచ్చి సాయపడే ప్రయత్నం చేశారు. 15 నిమిషాల్లో పోలీసులు వచ్చేసరికే అంతా అయిపోయింది. దాదాపు అంతే వ్యవధిలో వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది, కిటికీల్లోంచి దూకి బతికి బయటపడ్డ వారికి ప్రాథమిక చికిత్స చేశారు. 45 నిమిషాల తర్వాత ఫైరింజన్... పోలీసులు, 108 అంబులెన్స్ సకాలంలో వచ్చినా, మంటలార్పాల్సిన ఫైరింజన్ మాత్రం దాదాపు ముప్పావుగంట తర్వాత వచ్చింది. ఘటనా స్థలికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తి నుంచి అది వచ్చేసరికే అంతా బుగ్గిగా మారింది. -
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి... పరలోకానికి
బెంగళూరు, న్యూస్‌లైన్ : మేనకోడలు పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచడానికి వెళ్లిన అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు కోటె వెంకటేశ్ యాదవ్ (45) జబ్బార్ ట్రావెల్స్ బస్సులో సజీవ దహనమయ్యారు. సోదరి అనిత కుమారి (43)తో కలసి మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులకు పత్రికలు పంచాలన్నది ప్రధానోద్దేశం. వారిద్దరి దుర్మరణం వార్త తెలియడంతో పెళ్లి ముచ్చట్లతో సందడిగా ఉన్న ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్ నివాసం ఇక్కడి కళాసిపాళ్యలో ఉండగా, అనిత బాణసవాడిలో కాపురం ఉంటున్నారు. ఆమె కుమార్తె అనూషకు సతీశ్ అనే అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. నవంబరు 14న ఇక్కడి బసవనగుడిలోని కళ్యాణ మంటపంలో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెంకటేశ్...చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు సన్నిహితుడు. వారిని ఆహ్వానించడానికే సోదరితో కలసి హైదరాబాద్‌కు బయలుదేరాడు. కుమారుడు శ్రీనివాస్ స్వయంగా బస్సు ఎక్కించాడు. బుధవారం వేకువ జామున వారు సజీవ దహనం అయ్యారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆభిమానులు విషాదంలో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు జబ్బార్ ట్రావెల్స్ దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ట్రావెల్స్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తరువాత పోలీసులు వారికి నచ్చజెప్పారు. 22 సంవత్సరాలుగా తెలుసు.... నాగేంద్రబాబు వెంకటేశ్ 22 సంవత్సరాలుగా తనకు తెలుసునని చిరంజీవి సోదరుడు, నిర్మాత నాగేంద్రబాబు అన్నారు. ప్రమాద స్థలికి వెళ్లిన ఆయన అక్కడి నుంచే ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. వెంకటేశ్ మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంకటేశ్ కుటుంబాన్నిఆదుకుంటాం ...అల్లు అరవింద్ హామీ కోటె. వెంకటేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మాత అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి ఆయనిక్కడ వెంకటేశ్ కుటుంబ సభ్యులను కలుసుకుని సాంత్వన వచనాలు పలికారు. వెంకటేశ్ మృతితో కుటుంబ సభ్యుని కోల్పోయామని, ఆయన 25 ఏళ్లుగా తమకు తెలుసునని గద్గద స్వరంతో అన్నారు. బెంగళూరులో చిరంజీవి కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా వెంకటేశ్ ముందుండే వారని తెలిపారు. అలాంటి వెంకటేశ్ కుటుంబాన్ని అనాథగా మిగలబోనివ్వమని అన్నారు. ఆయన పిల్లల చదువులు, పెళ్లిళ్లకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. దశ దిన కర్మ లోపు మరో సారి ఇక్కడికి వచ్చి వారికి సాయం అందిస్తామని కూడా ఆయన చెప్పారు. తరలి వచ్చిన అభిమానులు, స్నేహితులు 1992 ఆగస్టు 22న వెంకటేశ్ కర్ణాటక చింరజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేవలం చిరంజీవి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆయనతో స్నేహ పూర్వకంగా వ్యవహరించే వారు. ఆయనిక లేరని తెలియడంతో చిరంజీవి అభిమానులతో పాటు నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ప్రభృతులు వెంకటేశ్ నివాసం దగ్గరకు చేరుకున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వెంకటేశ్ తండ్రి సుందర్ రాజ్‌ను ఓదార్చారు. స్థానిక శాసన సభ్యుడు ఆర్వీ. దేవరాజ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకుడు చింతామణి మహేష్, జేడీఎస్ నాయకుడు రవిప్రసాద్, తమిళనాడు చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు నాగేష్, కర్ణాటక బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు మాణిక్య, చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు అంజి, మార్కండేయ, కర్ణాటక రామ్‌చరణ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు మార్టిన్, ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, చిక్కబళ్లాపురం మొబైల్ బాబు, కేఆర్ పురం మార్కెట్ బాబు, ప్రేమ్, రాజబాబు, గోవిందస్వామి, సంతోష్, టెంట్ నాగేంద్ర, బాలాజీ, రమేష్,శీన, మోనిష్, కళ్యాణ్, మురళి, బాలయ్య అభిమానుల సంఘం నాయకులు మార్క్ శీను, అమ్ములు, శ్రీనివాస్, గోపీ, మిలటరి శివ, ఖాన్, హొసూరు బాబు, వీజీ. మంజునాథ్, గోపాల్ తదితరులు వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ధైర్య వచనాలు పలికారు. -
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘోరం
= మృత్యుశకటం... = 45 మంది సజీవ దహనం = మృతుల్లో 28 మంది బెంగళూరు వాసులు? = ఆహుతైన ప్రైవేట్ బస్సు = బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘోరం = ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్, మరో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణపు అలసటతో కాస్తంత సేపు అలా కునుకుతీశారు. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరిపోతాం అనుకుంటూ ఆదమరిచి రెప్పలువాల్చారు. కానీ వాళ్లకేం తెలుసు.. తాము ప్రయాణిస్తున్న బస్సే మృత్యుశకటమై వాళ్లను కాటేస్తుందని.. తమను గమ్యస్థానాలకు చేరుస్తుందనుకున్న బస్సే చితిమంటలను రగిల్చి తమ నిండు జీవితాలను బుగ్గిపాలు చేస్తుందని... తెలతెల వారకుండానే తమ బతుకులు తెల్లారిపోతాయని... బుధవారం తెల్లవారుఝామున ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలం గ్రామం వద్ద సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం 45 మంది జీవితాలను బలిగొని, వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబాన్ని షోషించే పెద్దదిక్కును కోల్పోయిన వారు ఒకరైతే, అనురాగాన్ని పంచే తల్లిని దూరం చేసుకున్న వారు ఇంకొకరు. ఇలా ప్రమాదంలో మరణించిన ఒక్కో వ్యక్తికి, ఒక్కో కుటుంబానికి ఒక్కో కన్నీటి గాధ, తీరని వ్యధ... వెరసి వారి జీవితంతో అదో కాళరాత్రిగా మిగిలింది. సాక్షి, బెంగళూరు : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 45 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలంలో ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. వివరాలు... బెంగళూరుకు చెందిన షకీల్ జబ్బర్, జబ్బార్ ట్రావెల్స్ పేరుతో హైదరాబాద్, ముంబై,చెన్నై, కేరళాలోని తిరుచ్చి ప్రాంతాలకు 30 బస్సులను నడుపుతున్నారు. అందులో ఐదు బస్సులు ప్రతి రోజూ బెంగళూరు, హైదరాబాద్ మధ్య సంచరిస్తున్నాయి. రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు గంటకో బస్ చొప్పున జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నగరం నుంచి బయలుదేరతాయి. ఇందులో భాగంగా ఈనెల 29 (మంగళవారం) రాత్రి 10 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కళాసిపాళ్య బస్టాండ్ నుంచి ఓల్వో బస్సు (ఏపీ 02టీఏ 0963) హైదరాబాద్‌కు బయలు దేరింది. ఈ బస్సు బెంగళూరులోని బీటీఎంలే అవుట్ వద్ద ప్రారంభమై కోరమంగళ, బెలందూర్, మారతహళ్లి, దొమ్మలూరు, కళాసిపాళ్య, ఆనందరావ్సర్కిల్, మైత్రివనం, హెబ్బాల్ వద్ద మొత్తం 44 మంది ప్రయాణికులను ఎక్కించుకుని సరిగ్గా రాత్రి 10:30 గంటలకు బెంగళూరు నగరాన్ని వీడింది. ఈ బస్సు హైదరాబాద్‌కు బుధవారం ఉదయం సుమారు 6:30 గంటలకు చేరాల్సి ఉంది. అయితే తెల్లవారుఝామున 5.25 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా పాలం గ్రామం వద్దకు చేరుకోగానే బస్సు ప్రమాదానికి గురైంది. క్షణాల్లో బస్సులో మంటలు వ్యాపించడంతో... అందులోని 45 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో దాదాపు 28 మంది వరకు బెంగళూరుకు చెందిన వారు కాగా, మిగతా వారు ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధికి నగరానికి వచ్చిన వారిగా తెలుస్తోంది. కాగా మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అజ్మతుల్ల, అతని భార్య జబీన్‌తాజ్ వీరి ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. కాగా ఈ దుర్ఘటన నుంచి బెంగళూరుకు చెందిన డ్రైవర్ ఫైరోజ్, కోలారుకు చెందిన క్లీనర్అయాజ్, ప్రయాణికులు శ్రీకర్, యోగేష్, మజర్ భాష, జై సింగ్, రాజేష్ ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలతో బయటపడిన వీరికి వైద్య సేవలు అందిస్తున్నట్లు ట్రావెల్స్ యజమాని షకీల్ జబ్బర్ సోదరుడు జమీల్ జబ్బర్ బెంగళూరులో మీడియాకు వెల్లడించారు. ప్రమాదఘటనపై భిన్న వాదనలు... ఘటన గురించి తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ బెంగళూరు కళాసిపాళ్య వద్ద ఉన్న జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. సంస్థ మేనేజర్ ఇంతియాజ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తీసుకున్నారు. అనంతరం ప్రమాద కారణాలను మీడియాకు వివరించారు. ‘బస్సు మహబూబ్‌నగర్ పాలం వద్దకు చేరుకోగానే వాహనం ముందు టైర్ పేలిపోవడంతో డ్రైవర్ వాహనాన్ని పక్కగా ఆపి ఆ విషయాన్ని వాహనం యజమాని షకీల్ నవాజ్ జబ్బర్‌కు తెలియజేశాడు. వాహనం పక్కగా నిలబడి డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతుండగానే పేలిన టైర్ నుంచి అగ్గిరవ్వలు వెలువడి సమీపంలో ఉన్న డీజిల్ ట్యాంకర్‌పై పడ్డాయి. దీంతో బస్సు మొత్తం క్షణాల్లో తగలబడిపోయింది.’ అని వివరించారు. అయితే ప్రమాదానికి మరో కారణం కూడా వినిపిస్తోంది....ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు డ్రైవర్ చాలా వేగంగా బస్సును నడుపుతూ ముందు వెలుతున్న కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించి అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. వేగంగా బస్ డివైడర్‌ను ఢీ కొట్టిన తక్షణమే ముందు టైర్ వెనకనే ఉన్న డీజిల్ ట్యాంకర్ కూడా డివైడర్‌ను బలంగా తాకింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలిపోయి క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో తగలబడిపోయింది. ఇక ప్రమాదం జరిగే సమయానికి ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్న కారణంగా అసలు ఏం జరుగుతోందనేది తెలిసేలోపే ప్రయాణికులందరూ మంటల్లో సజీవదహనమయ్యారు. ఇక డ్రైవర్ క్లీనర్ కాస్తంత మెలకువలోనే ఉంటారు కాబట్టి ప్రమాదాన్ని గ్రహించి తమ పక్కనే ఉన్న అద్దాలను బద్దలుకొట్టుకొని బయటకు దూకేసినట్లు తెలుస్తోంది. పరిహారం అందించలేమన్నకర్ణాటక ప్రభుత్వం బస్ ప్రమాదం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందించలేమని కర్ణాటక సర్కారు తెలిపింది. ఈ విషయమై ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాట్లాడుతూ... ఘనటకు సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడానని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందిగా కోరానని చెప్పారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేఎస్ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం తరఫున పరిహారం అందించడానికి వీలవుతుందని చెప్పారన్నారు. అయితే బస్సుకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మృతుల కుటుంబాలకు రూ.4 నుంచి రూ.5 లక్షల పరిహారం అందించడానికి అవకాశం ఉందన్నారు. కాగా కర్ణాటక శాసనసభ ప్రతిపక్షనాయకుడు కుమారస్వామి మాత్రం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి దర్యాప్తు జరపడానికి రాష్ట్ర రవాణా శాఖలో కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అమర్‌నారాయణ అనే సీనియర్ అధికారిని విచారణ అధికారిగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్... ప్రమాదానికి గురైన వోల్వో బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 2010, అక్టోబర్ 6న దివాకర్ రోడ్లైన్, జేసీ ఉమారెడ్డి పేరున రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. అయితే ఈ బస్సును బెంగళూరుకు చెందిన దివంగత సీఏ జబ్బర్ భార్య షాహీన్జబ్బర్, ఆయన కుమారులు షకీల్జబ్బర్, జమీల్జబ్బర్కు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి జబ్బర్ ట్రావెల్స్ పేరుతోనే బెంగళూరుకు, హైదరాబాద్‌కు మధ్య బస్సు నడుస్తోంది. కాగా బస్సు లీజుకు ఇచ్చినట్లు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తుంటే, జేసీ సోదరులు మాత్రం బస్‌ను తాము మూడేళ్ల క్రితమే అమ్మేశామని, బస్తో తమకేం సంబంధం లేదని అనడం గమనార్హం. అంతేకాకుండా దాదాపు రూ.1.70 కోట్లు విలువజేసే బస్సును లీజుకు ఇస్తే దానికి కనీసం సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లీజును రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం నోటరీతో సరిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తేరుకులోనే లోపే.. మృతుఒడిలోకి
మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలోఐదుగురు ప్రయాణికులు, బస్సు డ్రైవర్, క్లీనర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో బెంగళూరుకు చెందిన యోగేష్‌గౌడ అనే ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారికి తొలుత మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మినహా ఆరుగురు క్షతగాత్రులు 12-25 శాతం గాయాలతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ సమి స్పష్టం చేశారు. దట్టమైన పొగ, మంట కారణంగా వ చ్చిన వేడిగాలి లోపలికి వెళ్లడం వల్ల (రెస్పిరేటరీ బర్నింగ్స్) గుండె, ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతిని ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. గాయపడ్డవారందరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం గురించి బాధితులు వెల్లడించిన వివరాలు.. - సాక్షి, సిటీబ్యూరో కళ్లు తెరిచి చూసే సరికి... ‘‘సైబర్ టవర్స్‌లోని ఐఐఐ లోటస్ ఇన్ఫోటెక్లో పని చేస్తున్నాను. ప్రాజెక్టు పనిమీద బెంగళూరు వెళ్లి, తిరిగి వస్తున్నాను. డ్రైవర్ వెనకాలే ఉన్న సీటులో విండో పక్కన మరోవ్యక్తి, ఇటువైపు నేను కూర్చున్నాం. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక్కసారిగా ఒంటికి మంటలు అంటుకోవడంతో కళ్లు తెరిచి చూశాను. అప్పటికే బస్సులో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వెంటనే నా పక్కన ఉన్న ఆయనను లేపేందుకు ప్రయత్నించాను. కానీ, ఆయన లేవలేదు. నేను కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి దూకాను. అప్పటికే ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. తేరుకుని చూసేలోపే నా పక్కన కూర్చున్న వ్యక్తి మంటల్లో కాలిపోయాడు. నాకు అయిన గాయాల కన్నా.. పక్కన కూర్చున్న వ్యక్తిని కాపాడుకోలేకపోయాననే బాధే నన్ను ఎక్కువగా వేధిస్తోంది. ఒక నిమిషం ముందు మేల్కొన్నా.. అతడిని కాపాడే వాడిని’’ - రాజేష్ (28) స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఆయన భార్య శైలజ. ఉద్యోగరీత్యా వారు హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో ఉంటున్నారు. సైబర్‌టవర్స్‌లోని లోటస్ ఐఐఐ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాదంలో కుడి చేతికి, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఒంటిపై 12 శాతం కాలిపోయింది. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వ్యాపారం కోసం వచ్చి... మజర్ పాషా(30) స్వస్థలం బెంగళూరు. రెడీమేడ్ వస్త్రాలు సరఫరా చేస్తుంటారు. వారానికి ఒకసారి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. ఇక్కడి దుకాణాల యజమానుల నుంచి ఆర్డర్లు తీసుకువెళతారు. అనంతరం వస్త్రాలు సరఫరా చేస్తారు. మంగళవారం కూడా అదే తరహాలో హైదరాబాద్‌కు బయలుదేరి ప్రమాదంలో గాయపడ్డారు. తల, ఛాతీ, వీపు భాగాలతో పాటు 25 శాతం శరీరం కాలిపోయింది. ప్రధాన ద్వారం తెరుచుకోకనే.. ‘‘రెండేళ్ల కింద బెంగళూరులోని హెచ్‌పీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరాను. దీపావళి పండుగ కోసం మంగళవారం ఇంటికి బయలుదేరాను. నేను స్టాప్‌కు వచ్చేసరికి బస్సు బయలుదేరింది. దాంతో ఆటోలో వెళ్లి మరీ బస్సు ఎక్కాను. ప్రయాణంలో ఉండగా తెల్లవారుజామున బస్సు దేన్నో ఢీ కొట్టినట్లు భారీ శబ్దం విన్పించింది. కళ్లు తెరిచి చూసే సరికి బస్సులో దట్టమైన పొగ వ్యాపించింది. నాలుగు వైపుల నుంచి మంటలు బస్సు లోపలికి వ్యాపించాయి. ఓ ప్రయాణికుడు ప్రధాన ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. కానీ, అవి తెరుచుకోకపోవడం వల్లే అంతా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో నేను చేతులతో కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి దూకాను. అప్పటికే ఛాతీ ఎడమ భాగానికి, వీపుపై మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న మరో వ్యక్తిని బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. కానీ, అతని కుడి కాలు కిటికీ ల మధ్య ఇరుక్కుపోవడంతో కాపాడలేకపోయాను.’’ - చేనం సాయి శ్రీకర్(32), హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో నివస్తున్నారు. హెచ్‌పీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాదంలో ముఖం, కాళ్లు, చేతులు, వీపు భాగంలో 12 శాతం గాయాలయ్యాయి. డ్రైవర్ వెంటే దూకిన క్లీనర్ ప్రమాదంలో బయటపడిన వారిలో ఒకరైన ఇజాజ్‌పాషా (25)ది బెంగళూరు. ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్. ఆయన రెండేళ్లుగా ఈ బస్సులో క్లీనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రమాద సమయంలో డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్న ఇజాజ్‌పాషా.. డ్రైవర్ బస్ నుంచి దూకిన వెంటనే దూకేశాడు. ఆయనకు వనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో.. బుధవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. ఇజాజ్‌పాషా 15 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నారు. గుర్తొస్తే.. భయమేస్తోంది... ‘‘నేను. హిందూవర్ ఇన్నోవేషన్ సంస్థలో లిఫ్ట్‌లకు అద్దాలు అమర్చేపని చేస్తున్నాను. ఇదే పనిమీద వారం క్రితం బెంగళూరుకు వెళ్లి, తిరిగి వస్తున్నాను. ఆ బస్సులో నాతో పాటు 50 మంది దాకా ప్రయాణికులున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. నేను మేల్కొని చూసేసరికి మంటలు వ్యాపించాయి. బస్సులో కనిపించిన ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటకు దూకేశా. నాతోపాటు మరికొందరూ దూకేశారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.’’ - జైసింగ్(40) ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఉపాధి కోసం ఐదేళ్ల కింద కోసం హైదరాబాద్‌కు వచ్చి, తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. హిందూవర్ ఇన్నోవేషన్ సంస్థలో లిఫ్ట్‌లకు అద్దాలు అమర్చే పనిచేస్తున్నారు. అదే పనిమీద ఇటీవల బెంగళూరు వెళ్లి వస్తూ ప్రమాదంలో గాయపడ్డాడు. కాళ్లు, చేతులు సహా శరీరంపై 10-12 శాతం కాలినగాయాలయ్యాయి. వద్దన్నా వినకుండా వచ్చా... ‘‘మాది బెంగళూరు. మాదాపూర్ గోల్ఫ్‌కోర్టులో పది నెలల నుంచి కోచ్‌గా పని చేస్తున్నాను. టోలీచౌకి సమీపంలో నివాసం. కొద్ది రోజుల కింద అనారోగ్యంగా ఉండడంతో విశ్రాంతి కోసం బెంగళూరులోని ఇంటికి వెళ్లాను. దీపావళి పండుగ అనంతరం వెళ్లాల్సిందిగా సోదరులు చెప్పినా వినిపించుకోకుండా హైదరాబాద్‌కు బయలుదేరాను. తెల్లవారు జామున ఒక్కసారిగా వెనుక నుంచి మంట శరీరానికి తాకింది. దాంతో ఒక్క ఉదుటున బయటికి దూకేశా. అయినా మంటలు నన్ను వదిలి పెట్టలేదు. తర్వాత ఏం జరిగిందో తెలియదు.’’ - యోగేష్ గౌడ(29) స్వస్థలం బెంగళూరు. మాదాపూర్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడు. ప్రమాదానికి గురైన బస్సులో డ్రైవర్‌కు వెనుక బి-3 సీటులో కూర్చున్నాడు. ముఖం, తల, ఛాతీ, కాళ్లు, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. శరీరం 45 శాతం కాలిపోయింది. వైద్యులు వెంటిలేటర్ అమర్చి, చికిత్స అందిస్తున్నారు. ‘డీఎన్ఏ’తోనే గుర్తింపు.. బస్సు ప్రమాద ఘటనలో మృతులను గుర్తించడం ప్రధాన సమస్యగా మారింది. ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మృతుల సంఖ్యను అంచనా వేయగలుగుతున్నారు కానీ ఏ మృతదేహం ఎవరిదనేది గుర్తించడం కష్టమవుతోంది. కొన్ని మృతదేహాలకు కొన్ని ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరికొన్ని మృతదేహాలు అస్తిపంజరంలా ఎముకల గూడులా కనిపిస్తున్నాయి. ముఖం, బట్టలు, ఆభరణాలను గుర్తించే అవకాశం ఉన్నప్పుడే మృతులను గుర్తించడం సాధ్యమవుతుంది. కానీ ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపిస్తున్నాయి. అందువల్ల డీఎన్ఏ పరీక్ష ద్వారా మాత్రమే మృతులు ఎవరనేదీ గుర్తించే అవకాశం ఉంది. డీఎన్ఏ నమూనాల సేకరణ, ప్రమాదం జరిగిన తీరుపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ఫొరెన్సిక్ లాబొరేటరీ(ఏపీఎఫ్ఎస్ఎల్) నిపుణుల బృందం ఘటనాస్థలికి వెళ్లింది. డీఎన్ఏ నిపుణులు, ఏపీఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డెరైక్టర్ ఫణిభూషణ్, క్లూస్‌టీం నిపుణులు వెంకన్న, సైంటిఫిక్ ఆఫీసర్ గోపినాథ్‌లను అక్కడికి పంపినట్లు ఏపీఎఫ్ఎస్ఎల్ డెరైక్టర్ శారద తెలిపారు. వారు ప్రమాద స్థలానికి వెళ్లి నమూనాలు సేకరించారు. వారం పట్టొచ్చు: డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతులను గుర్తించేందుకు ఐదు నుంచి వారంరోజుల సమయం పట్టొచ్చని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ నారాయణరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. బస్సులో నుంచి మృతదేహాల కాలర్ బోన్, దవడ ఎముకలు తదితర నమూనాలను సేకరించి ఆసుపత్రిలో భద్రపరిచి, అనంతరం వాటి డీఎన్ఏలను రక్తసంబంధీకుల డీఎన్ఏతో సరిపోలుస్తారని ఆయన వివరించారు. విషాదం.. వివాదం బస్సు ప్రమాదంలో తమ వారు మరణించడంతో ఆ రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఇప్పుడు వారికి తమ వారి మృతదేహాన్ని గుర్తించడం ఇబ్బందిగా మారింది. రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన వేదపతి (27) మృతదేహం కోసం ఆయన తండ్రి విఠల్ బుధవారం ఉదయమే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించడంతో అక్కడి నుంచి ఉస్మానియాకు వచ్చారు. అక్క డ ఆనవాళ్ల ఆధారంగా తన కుమారుడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఆ మృతదేహం తమ వారిదని హైదరాబాద్‌కు చెందిన ఓ మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొనడంతో పోలీసులు మృతదేహాన్ని ఎవరికీ ఇవ్వలేదు. అక్షయ్‌సింగ్ భౌతికకాయుంపైనా..: బస్సు ఘటనలో వుృతి చెందిన చిక్కడపల్లికి చెందిన అక్షయ్‌సింగ్ వుృతదేహం విషయుంలోనూ వివాదం నెలకొంది. బుధవారం అక్షయ్ కుటుంబ సభ్యులు వుృతదేహాన్ని వాహనంలో తీసుకువస్తుండగా జడ్చర్ల వద్ద పోలీసులు ఆపారు. ఇదే ప్రమాదంలో దుర్మరణం పాలైన చిక్కడపల్లిలోని రైట్స్పాట్ యూడ్ ఏజెన్సీ యుజవూని వుంజునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ వుృతదేహం తవుదని అంటున్నారని వారు పేర్కొన్నారు. దీంతో వుృతదేహాన్ని పోలీసులు ఉస్మానియూ వూర్చురీకి తరలించారు. డీఎన్ఏ పరీక్షల తర్వాతే అప్పగిస్తామని ప్రకటించారు. ఈ ఫోన్ నంబర్లెవరివి? సాక్షి, మహబూబ్‌నగర్: టికెట్ బుకింగ్ సందర్భంగా చాలామంది ప్రయాణికులు చిరునామా ఇవ్వకుండా కేవలం సెల్ నంబర్‌తో సరిపెట్టారని మహబూబ్‌నగర్ ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. ఈ నంబర్లలో ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానివే ఉన్నాయని చెప్పారు. 93412 85804, 72049 74748, 74062 14742, 9164 75305, 78934 51498, 99897 89652, 91779 20128, 91773 694961, 96201 82997, 97394 97377, 97431 23467 నంబర్ల వారి బంధుమిత్రులు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కంట్రోల్ రూంను సంప్రదించాలని కోరారు. తప్పుల తడకగా జాబితా... సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ప్రయాణికుల పేర్లతో జబ్బార్ ట్రావెల్స్ విడుదల చేసిన జాబితాను ప్రమాదం అనంతరం హడావుడిగా రూపొందించినట్టు తెలుస్తోంది. అందులోని ఫోన్ నంబర్లే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఫోన్ చేస్తే చాలా నంబర్లకు ‘ఇది వాడుకలో లేదు.. నంబరు సరిచూసుకోండి’ అని సమాధానం వస్తోంది. అంతేగాకుండా ప్రయాణికులకు కేటాయించిన సీట్ల నెంబర్లు కూడా తికమకగా ఒకే నంబర్‌ను రెండుమూడుసార్లు పేర్కొన్నారు. అందులో ప్రయాణించినట్లుగా చెబుతున్న వారికి జాబితాలోని కొందరి పేర్లకు అసలు పొంతనలేకుండా ఉంది. -
నడిరోడ్డుపై నరమేథం!
సంపాదకీయం: ఆదమరిచివున్న అధికారుల సాక్షిగా, బాధ్యత గుర్తెరగని సర్కారు సాక్షిగా మరోసారి నడిరోడ్డుపై రాకాసి వాహనం 45 నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. ఎన్నో కుటుంబాల్లో పండుగముందు పెను విషాదాన్ని నింపింది. బెంగళూరునుంచి బయల్దేరిన వోల్వో బస్సు మరొక్క గంటలో గమ్యస్థానం హైదరాబాద్ చేరుతుందనగా హఠాత్తుగా మంటలంటుకుని క్షణాల్లో భస్మీపటలమైంది. అయినవారూ, ఆప్తులూ కనీసం తమవారి భౌతికకాయాలనైనా చూసుకుందామనుకుంటే అక్కడ మిగిలివున్నవి కేవలం మాంసపు ముద్దలే. లభ్యమైన బంగారు ఆభరణాల ఆధారంగా మాత్రమే తమవారి జాడల్ని పోల్చుకోగలిగారంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సోదరి పెళ్లి పిలుపు కోసం హైదరాబాద్ బయల్దేరిన ఇద్దరు అన్నాచెల్లెళ్లు... పుట్టింట్లో పురుడు పోసుకుందామని బస్సెక్కిన నిండు చూలాలు... సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి విజయోత్సాహంతో ఇంటికొస్తున్న యువకుడు... బతుకుతెరువు కోసం బెంగళూరు వెళ్లి అయినవారిని చూసుకోవడానికి వస్తున్న ఉద్యోగి... ఇలా ఎందరెంద రి జీవితాలో మాడి మసైపోయాయి. వోల్వో బస్సు చూడ్డానికి రాకాసి బస్సులా ఉంటుంది. దాని వేగమూ, దూకుడూ భాగవతంలో చిన్ని కృష్ణుణ్ణి చిదిమేయడానికి వచ్చిన శకటాసురుణ్ణి గుర్తుకు తెస్తాయి. అది ప్రాథమికంగా బస్సు అనే సంగతిని బస్సు యజమానిగానీ, నడిపే డ్రైవర్గానీ, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులుగానీ గుర్తించడంలేదు. బుల్లెట్ ట్రెయిన్‌ను నడుపుతున్నట్టో, విమానాన్ని నడుపుతున్నట్టో గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దాన్ని పోనిస్తే అస్తవ్యస్థంగా, అడ్డదిడ్డంగా ఉండే మన రహదారులపైన ఏమైనా జరగవచ్చన్న స్పృహ వీరెవరికీ కలగడం లేదు. వెళ్లాల్సిన దూరమెంతనే లెక్కేలేదు. అది 500 కి లోమీటర్లు కావొచ్చు, వెయ్యి కిలోమీటర్లు కావొచ్చు... చిమ్మ చీకట్లను ఛేదిస్తూ వాయువేగంతో అక్కడికి చేరడమే లక్ష్యం. రాత్రి ఎప్పుడో 11 గంటలకు బయల్దేరే బస్సు తెల్లవారడానికి ముందే గమ్యస్థానంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే దూరాన్ని ఆర్టీసీ బస్సులు చేరడానికీ, ప్రైవేటు బస్సులు చేరడానికీ మధ్య గంటల తేడా ఉంటున్నదంటే ప్రైవేటు బస్సుల దూకుడు ఏ స్థాయికి చేరుతున్నదో అంచనా వేసుకోవచ్చు. ప్రయాణికులనూ, వారికి సంబంధించిన లగేజీని మాత్రమే మోసుకు పోవాల్సిన ఈ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా యధేచ్ఛగా సరుకులను చేరేస్తున్నాయి. ఆ సరుకులు ఎలాంటివైనా కావొచ్చు. రసాయనాలైనా కావొచ్చు... టపాసులైనా కావొచ్చు... దుస్తులైనా కావొచ్చు... అన్ని రకాలైన సరుకులనూ ఈ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్నాయి. అందుకోసం నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో గంటల తరబడి ఆగుతున్నాయి. అలా ఆగడంవల్ల కలిగే ఆలస్యాన్ని అధిగమించడానికి అటు తర్వాత పెనువేగంతో వెళ్తున్నాయి. ప్రయాణికుల్ని మాత్రమే ఎక్కించుకోవాల్సిన బస్సులు ఇలా కళ్లముందే సరుకుల్ని చేరేస్తున్నా, అందుకోసమని బస్సు ఆపరేటర్లు గోడౌన్లను నిర్వహిస్తున్నా రవాణా శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారు. హైదరాబాద్‌లో రాత్రి 8 దాటాక రోడ్లమీదకొచ్చే ఈ బస్సులు ఏంచేస్తున్నాయో, ఎక్కడెక్కడ ఆగుతున్నాయో, ఏమేమి తీసుకెళ్తున్నాయో చూసే నాథుడు లేడు. బెంగళూరులో అయినా, చెన్నైలో అయినా, ముంబైలో అయినా ఇంతకన్నా మెరుగైన పరిస్థితులేమీ లేవు. బస్సుల నిర్వహణ ఎలా ఉంటున్నదో, నిబంధనలన్నిటినీ పాటిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సివున్న వ్యవస్థలు పనిచేయడం లేదు. జరుగుతున్న లోటుపాట్లన్నీ అధికారులకూ, ఇతర సిబ్బందికీ తెలుసు. వారికి మార్గ నిర్దేశనం చేయాల్సిన అమాత్యులకూ తెలుసు. కానీ, అటు లాభాపేక్ష... ఇటు కాసుల కక్కుర్తి అన్నిటినీ కప్పెడుతోంది. కొందరు ఆరోపిస్తున్నట్టు ప్రైవేటు బస్సు ఆపరేటర్ల వ్యవస్థ మాఫియాగా తయారైతే తప్ప పరిస్థితులు ఇంతగా క్షీణించవు. దూర ప్రయాణాలు చేసే బస్సులకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. వారు మద్యం సేవించకుండా ఉండాలి. ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సులో ఒక్క డ్రైవరే ఉన్నాడు. అతను మద్యం సేవించి ఉండొచ్చని కొందరంటున్నారు. వోల్వో బస్సులు చూడటానికి అందంగా తీర్చిదిద్దినట్టే ఉంటాయి. ఏసీ బస్సులు గనుక బయటినుంచి గాలి చొరబడే అవకాశం లేదు. అందులో వాడే సిల్కు తెరలు, ఫైబర్, రెగ్జిన్లను వినియోగించి తయారుచేసే సీట్లు క్షణాల్లో అంటుకునే స్వభావం గలవి. పొరపాటున బస్సు మంటల్లో చిక్కుకుంటే ప్రయాణికులకు బయటకు వచ్చే తోవే ఉండదు. నిబంధనల ప్రకారం అత్యవసర సమయాల్లో అద్దాలను బద్దలు కొట్టడానికి ప్రతి సీటువద్దా ఇనుప వస్తువు ఉంచాలి. ఎమర్జెన్సీ డోర్ అందరికీ తెలిసేలా ఏర్పాటుచేయాలి. కానీ, బస్సులో బిగించే తెరలు దేన్నీ గుర్తించకుండా చేస్తున్నాయి. విమానాల్లో అయితే బయల్దేరే ముందు ప్రయాణికులకు భద్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే ఏర్పాటు ఉంటుంది. కానీ, వోల్వో బస్సుల్లో అలాంటిదేమీ కనబడదు. రోడ్డు ప్రమాదాల్లో మన దేశానిది ప్రపంచంలోనే అగ్రస్థానమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ఇక్కడ ఏటా లక్షా 10 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. నిరుడు దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం వాటా 10.8 శాతం. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యాచరణ అవసరమో గుర్తించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి అవసరమైన సంఖ్యలో బస్సులనూ ఉంచక, ప్రైవేటు ఆపరేటర్లపైన అవసరమైన నిఘానూ ఉంచక ప్రభుత్వమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికైనా పాలకులు తమ బాధ్యతను గుర్తెరిగి అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
మంటల్లో వోల్వో బస్సు
మంగళవారం రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయల్దేరింది. ఇది బుధవారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాలి. ఇంకో రెండు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న పాలెం అనే గ్రామానికి సమీపానికి రాగానే మృత్యుదేవత బస్సును ఆవహించింది. ఈ రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. 49 మంది ప్రయాణీకులున్న ఈ బస్సులో కేవలం ఐదురుగు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండటంతో అగ్నికి ఆహూతి అయ్యారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు.బస్సులో మృతిచెందిన ప్రయాణికుల వస్తువులను పరిశీలిస్తున్న పోలీసులు ప్రమాదానికి గురైన వోల్వో బస్సును పరిశీలిస్తున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు -
అసలు ఏం జరిగింది?
-
వెళ్లొస్తాం.. అమ్మానాన్నల చివరి మాటలు
గుంటూరు : అమ్మా వెళ్లొస్తామంటూ.. తమ కుమార్తెకు ఆప్యాయంగా చెప్పిన ఆ మాటలే వారికి చివరి పలుకులయ్యాయి. హైదరాబాద్‌లో బస్సు దిగాక తల్లీతండ్రుల నుంచి క్షేమ సమాచారంతో మళ్లీ ఫోన్ వస్తుందని ఆ కూతురు ఎంతగానో ఎదురు చూసింది. అయితే ఫోన్ వచ్చిందికానీ.. అది మోసుకొచ్చింది.. క్షేమ సమాచారాన్ని కాదు. కన్నవారి మరణ వార్తను. మహబూబ్ నగర్ బస్సు దగ్ధం ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సజీవ దహనమయిన ఘటన అందరి హృదయాలనూ ద్రవింపచేస్తోంది. గాలి బాలసుందర్ రాజు, మేరీవిజయలక్ష్మి దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమార్తె సౌమ్య బెంగళూరులోని రామయ్య ఐఐటీలో ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. సౌమ్య మొదట్లో కళాశాల హాస్టల్ ఉండి చదువుకునేది. అయితే హాస్టల్ భోజనం పడకపోవటంతో బాలసుందర్ రాజు దంపతులు నుంచి వెళ్లి సంవత్సర కాలంగా కుమార్తె దగ్గరే బెంగళూరులో ఉంటున్నారు. కాగా బాలసుందర్ రాజు చాలాకాలంగా షుగర్ తో బాధపడుతున్నాడు. ప్రతి మూడు నెలలకోసారి హైదరాబాద్ వెళ్లి అక్కడే చెకప్ చేయించుకుని మందులు తెచ్చుకుంటున్నాడు. అలాగే ఈసారి కూడా భార్య మేరీ విజయలక్ష్మిని వెంటపట్టుకుని బెంగళూరులో రాత్రి పది గంటల సమయంలో బస్సు ఎక్కాడు. అయితే ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావటంతో దంపతులిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు తోటి ప్రయాణీకులతోపాటు వీరిని కూడా ఆహుతి చేసేశాయి. ఈ ఘటనతో బాలసుందర్ రాజు స్వస్థలమైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరులో విషాదం నెలకొంది. కనీసం శవాలను కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడటంతో వారి కుటుంబ సభ్యులు భోరుమంటున్నారు. కనీసం చివరిచూపు కూడా చూడలేకపోయామంటూ రోదిస్తున్నారు. -
కెమికల్స్ రవాణా చేస్తున్న ప్రైవేటు బస్సు ఆఫరేటర్లు
-
మహబూబ్‌నగర్ ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ట్రావెల్స్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. -
అసలు ఏం జరిగింది?
జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు.. మంగళవారం రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయల్దేరింది. ఇది బుధవారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాలి. ఇంకో రెండు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న పాలెం అనే గ్రామానికి సమీపానికి రాగానే మృత్యుదేవత బస్సును ఆవహించింది. ఉదయం నాలుగున్నర గంటలు దాటిన తర్వాత బస్సు ముందు ఉన్న కారును ఓవర్టేక్ చేసింది. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొట్టింది. ఈ సమయంలో భారీ కుదుపు వచ్చింది. దాంతో బస్సులోని డీజిల్ ట్యాంకు తీవ్రమైన ఒత్తిడి కలిగింది. ఒత్తిడి ఎక్కువయి ట్యాంకులో మంటలు రేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. డ్రైవర్ చెబుతున్న దాని ప్రకారం బస్సు కల్వర్టును ఢీకొట్టడం వల్ల ముందు టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు భారీ కుదుపునకు లోనయింది. ఈ క్రమంలో డీజిల్ ట్యాంకులో మంటలు లేచాయి. బస్సులో మంటలు లేచిన తీరును రెండున్న భిన్నమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ప్రమాదం కచ్చితంగా ఎలా జరిగింది? అనే విషయాన్ని నిపుణులు తేల్చాల్సి ఉంది. బస్సులో మంటలు లేచిన విషయాన్ని డ్రైవర్ క్యాబిన్లో ఉన్న వారు గుర్తించారు. డ్రైవర్‌తో పాటు క్లీనర్ కూడా కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైవర్ క్యాబిన్‌కు, ప్రయాణికులు ఉన్న పోర్షన్‌కు మధ్యలో ఉన్న డోర్ తెరుచుకోలేదు. ఈ డోర్ గనుక తెరుచుకుని ఉంటే కొంత మంది ప్రయాణికులు అయినా ప్రాణాలతో బయటపడి ఉండేవారు. డోర్ తెరుచుకోకపోవడం.. గాఢ నిద్రలో ఉండటం వల్ల ప్రయాణికులకు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దారి లేకుండా పోయింది. మంటలు వచ్చిన విషయాన్ని గుర్తించే సరికి పొగ, మంటలు దట్టంగా వ్యాపించాయి. ఏసీ గ్యాస్ వల్ల కూడా మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఒకరిద్దరు ప్రయాణికులు కాలుతున్న శరీరాలతోనే కిందకు దూకేశారు. అయినా ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యం.. సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బస్సులో మొత్తం 49మంది ప్రయాణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా వీరిలో 45 మంది చనిపోయారు. డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో అయిదుగురు ప్రాణాలుతో బయటపడ్డారు. కాగా డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అనే అనుమానంతో వైద్యులు అతని రక్త నమునాలు పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు. ఇక బస్సులో పెద్ద ఎత్తున ఊలు బయటపడటంతో.... బస్సులో సరుకు రవాణాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ బస్సులో ఎంత మంది ఉన్నారు? అనే దానిపై ఇంకా స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. అయితే ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలు..... అమాయక జనం నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్....వెరసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రైవేట్ బస్సెక్కిన ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలే. కరెన్సీతో కళ్లుమూసుకుపోయి చూసిచూడనట్టుగా వదిలిస్తున్న అధికారులు.....ప్రజాభద్రతను బాధ్యత వహించాల్సిన పాలకులు కూడా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుంటే... సామాన్యులు ప్రాణాలు వోల్వో బస్సుల్లో బూడిదై పోవాల్సిందే. -
రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జెసి ప్రభాకర్ రెడ్డి
-
బస్సు ప్రమాదంలో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట సమీపంలో బుధవారం ఉదయం 5.30 గంటలకు జరిగిన ఘోర ప్రైవేట్ వోల్వో బస్సు ప్రమాదంలో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మరణించినట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న ఈ బస్సు నేషనల్ హైవే-44 పై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐబీఎమ్, ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో కేప్ జెమినీలో పనిచేస్తున్న అమరేందర్ (కరీంనగర్) ఉన్నట్టు తెలిసింది. మిగితా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు 45 మంది మృతదేహాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెలికితీశారు. మరణించిన వారిలో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వివరాలను జబ్బర్ ట్రావెల్స్ సేకరించారు. -
మహబూబ్ నగర్ బస్సు ప్రమాదంలో 45 మంది మృతి - 10 ప్రధానాంశాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 1. మహబూబ్‌నగర్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 9494600100, 08542-245927/08542-245930/08542-245932 2. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ట్రావెల్స్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారి వివరాలు చెప్పాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు పోలీసులు జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు 3. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 4. ప్రమాద వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్‌గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు....జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. 2010 అక్టోబర్ 6న రిజిస్ట్రర్ అయ్యింది. 5. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యంతెలిపారు. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు వారు బుధవారమికర్కడ పేర్కొన్నారు. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని... టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు. 6. కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రయివేట్ వోల్వో బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ....ముఖ్యమంత్రి ఫోన్‌తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో 42మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు డీఐజీ వెల్లడించారు. 7. ప్రమాదానికి గురైన జబ్బర్ ట్రావెల్స్ బెంగుళూరు కార్యాలయం యజమాని షకీల్ పరారీలో ఉన్నాడు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న షకీల్ ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకపోవటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, మిగతా కార్యాలయాల వద్ద బెంగళూరు సివిల్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బస్సు ప్రయాణికుల వివరాలను బెంగళూరు పోలీసులు సేకరిస్తున్నారు. రెండు బస్సుల ప్రయాణికులను ఒకే బస్సులో తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు రిజిస్ట్రేషన్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. 8. బుధవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగినా..ప్రభుత్వం, అధికారులు స్పందిచలేదని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలకు చెందిన మంత్రి డీకే అరుణ, రవాణశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జేసీ దివాకరరెడ్డిలపై మండిపడ్డారు. 9. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద ఈ రోజు తెల్లవారుజామున వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోర్టు ఆంక్షల కారణంగా ప్రమాద ఘటన స్థలానికి వెళ్లలేకపోతున్నాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లాల్సిందిగా వైఎస్ జగన్ పార్టీనేతలను ఆదేశించారు. 10. మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎమ్ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి), యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్ ) .... వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. -
ఆఫర్ లెటర్ ఆలస్యం కాకుంటే బతికి ఉండేవాడు
కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైన ఘోర దుర్ఘటనలో హృదయవిదారకమైన ఉదంతాలలో కాలిబూడిదైపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆడారు రవి (27)ది భిన్నమైన ఉదంతం. అంతా సజావుగా జరిగి ఉంటే, తను కలలుగన్న మల్టీనేషనల్ కంపెనీ ఆక్సెంచుర్ (Accenture) హైదరాబాదు ఆఫీసులో ఈ పాటికి చేరి ఉండేవాడు. ఈ ఒక్క రోజు ఆగి ఉన్నట్టైతే మరో మల్టీనేషనల్ కంపెనీ కెటి & టి (KT &T) లో తానిప్పుడు చేస్తున్న బెంగలూరులోనే చేరి ఉండేవాడు. "ఒక విధంగా వాడి చావుకు నేను కూడా బాధ్యుడ్నేనేమో. వాడు ఎటూ తేల్చుకోలేక పోతుంటే కెటి & టి కంటే ఆక్సెంచుర్ పెద్ద కంపెనీ అని సలహా ఇచ్చాను. మంగళవారానికి కెటి & టి ఆఫర్ లెటర్ వస్తే, ఉండిపోతానని, లేకపోతే హైద్రాబాద్ బయిల్దేరతానని అన్నాడు," అని చెప్పుకొచ్చాడు ఆడారు రవి ప్రాణ స్నేహితుడు కె. లీలా శివ ప్రసాద్. మిత్రుడ్ని రిసీవ్ చేసుకోవాలన్న ఆత్రుతలో ఉన్న తాను, గుర్తు పట్టడం కూడా కష్టమైన ఆ మిత్రుడి శవాన్ని చూడటానికి వెళ్తున్నానని దుర్ఘటనా స్తలానికి వెళ్లబోయే ముందు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం, విజయనగరానికి చెందిన రవి చదువులో చాలా చురుకైన వాడు. మాచర్ల న్యూటన్ కాలేజీలో ఇంజినీరింగ్ 2003- 2007 బ్యాచ్. 2007 ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, బెంగలూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు. రవికి ఒక అన్నయ్య, ఓ చెల్లి ఉన్నారు. అన్నయ్య విజయనగరంలోనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ, ఇంటర్నెట్ సెంటర్ నడుపు కుంటున్నాడు. రవి ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. త్వరలో చెల్లి పెళ్ళి చేయాలని, మంచి కంపెనీలో మరింత మంచి జీతం వచ్చే ఉధ్యోగంలో చేరాలని పట్టుదలగా కొన్ని పెద్ద కంపెనీలలో ప్రయత్నించి సఫలమయ్యాడు. నిజానికి కెటి & టి ఆఫర్ చేసిన జీతం ఎక్కువ అయినా, ఆఫర్ లెటర్ ఇవ్వడంలో జాప్యం జరగడం, ఆక్సెంచుర్ ఇంకా పేరున్న కంపనీ కావడంతో రవి మంగళవారం రాత్రి తన మృత్యువుని వెదుక్కుంటూ బయిల్దేరినట్టైయింది. "రాత్రి బస్సు ఎక్కిన తర్వాత కూడా ఫోన్ చేశాడు. రేపు జాయిన్ అయ్యాక, సాయంత్రం కె ఎఫ్ సీ లో పార్టీ చేసుకుందాం అన్న వాడిని ఇప్పుడు గుర్తు పట్టడానికి కూడా లేదు,' అని ఆడారు రవి స్నేహితుడు లీలా ప్రసాద్ భోరుమన్నాడు. -
రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్
-
బెంగళూరులో జబ్బర్ ట్రావెల్స్ యజమాని పరారీ
బెంగళూరు : మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన జబ్బర్ ట్రావెల్స్ బెంగుళూరు కార్యాలయం యజమాని షకీల్ పరారీలో ఉన్నాడు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న షకీల్ ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకపోవటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, మిగతా కార్యాలయాల వద్ద బెంగళూరు సివిల్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బస్సు ప్రయాణికుల వివరాలను బెంగళూరు పోలీసులు సేకరిస్తున్నారు. రెండు బస్సుల ప్రయాణికులను ఒకే బస్సులో తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు రిజిస్ట్రేషన్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. రాత్రి పది గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరిన బస్సులో చాలామంది బెంగళూరుకు చెందినవారు ప్రయాణికులే ఉన్నారు. బస్సు నుంచి ఇప్పటివరకూ 44 మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. -
రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్
అనంతపురం : మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు యాజమాన్యం బుధవారమికర్కడ తెలిపింది. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని... అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు. ప్రమాదం జరిగిన జబ్బార్ బస్సు (AP 02 TA 0963) దివాకర్ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఈ బస్సును 2010 అక్టోబర్‌లో విక్రయించినట్టుగా ఆర్టీఏ రికార్టులు చెబుతున్నాయి. కాగా ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 42 మంది అగ్నికి అహుతైపోయారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు. -
బస్సు దగ్ధం - 44 మంది దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎమ్ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి), యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్ ) .... వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం నలుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రయాణీకుల ఆర్తనాదాలు విన్న సాక్షి ప్రతినిధి 108కి సమాచారం అందించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 44 మంది సజీవ దహనమైనట్టు సమాచారం. నలుగురైదుగురు బస్సు అద్దాలు పగలకొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. -
ప్రమాదానికి గురైన బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్
-
ప్రమాదానికి గురైన బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్‌గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు....జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. -
బాధితుల సమాచారం కోసం బంధువుల ఆందోళన
-
బాధితుల సమాచారం కోసం బంధువుల ఆందోళన
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమవారి వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నాయి. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమవారి వివరాలు చెప్పాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రయాణికుల వివరాల కోసం వారి బంధువులను మీడియా ప్రతినిధులు కోరగా... ప్రస్తుతం తాము మాట్లాడే స్థితిలో లేమని తెలిపారు. మరోవైపు పోలీసులు జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.