మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి:
జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన సంఘటనపై పోలీసుశాఖ విచారణను వేగవంతం చేసింది. గతనెల 30వ తేదీన కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు 24గంటల పాటు పనిచేస్తూ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగానే కొత్తకోట సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒక బృందం హైదరాబాద్‌లోనే ఉంటూ మృతదేహాలకు సంబంధించి డీఎన్‌ఏ పరీక్షలు చేయించడం నుంచి బాధితుల బంధువులకు ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సమాచారం ఇస్తున్నారు. మరోబృందం వనపర్తి డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ మహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో దుర్ఘటన జరిగిన ప్రాంతంలో, దగ్ధమైన బస్సులో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే మృతులకు సంబంధించిన కొన్ని వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట ఎస్‌ఐ గిరి బాబు ఆధ్వర్యంలో మరో బృందం రెండు రో జులుగా బెంగళూరులో మకాం వేసి వాస్తవంగా ఆ రోజు బస్సులో ప్రయాణానికి ఎంతమంది ప్రయాణికులు సీటు రిజర్వ్ చేసుకున్నారు, ప్ర యాణంలో ఎవరెవరు ఏయే ప్రాంతంలో బ స్సులో ఎక్కారనే వివరాలను సేకరిస్తున్నారు.
సోమవారం బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. పోలీసుశాఖ నుంచి విచారణ వేగవంతమవుతున్నా రవాణాశాఖ అధికారులు సంఘటన జరిగిన రోజు, మరుసటి రోజు హడావుడి చేసినా ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. వాహనాలను తనిఖీచేయడం మినహా ప్రమాదానికి గల కారణాలు ఆ శాఖ నుంచి సేకరించడంలో కొంత మేర విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటింగ్ కెపాసిటీ మొదలుకొని ఇతర అంశాలపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఓల్వో కంపెనీ ప్రతినిధులు, ఎల్‌అండ్‌టీ, ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రమాదం సంభవించిన మరుసటి రోజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వెళ్లినా ఇప్పటి వరకు వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వలేదని తెలుస్తోంది.
బస్సులోనే మాంసపు ముద్దలు
కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్: కొత్తకోట మండ లం పాలెం వద్ద 45 మందిని పొట్టన పెట్టుకున్న ఓల్వో బస్సు వద్ద ఇంకా మృతుల ఆనవాళ్లు బ యటపడుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన మరుసటి రోజు బస్సును ప్రమాదస్థలం నుంచి మరోచోటుకు తరలించారు. ఆ సమయంలో బ స్సు సీట్లలో మృతదేహాల మాంసపు ముద్దలు, మృతులకు సంబంధించిన ఆనవాళ్లు అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం కోత్తకోట ఎస్‌ఐ డీకే. మహేశ్వర్‌రావు, శిక్షణ ఎస్‌ఐ రమేష్‌ల ఆధ్వర్యంలో కొన్ని ఆనవాళ్లను తొలగించారు. ప్రమాదం జరిగినప్పుడు మం టల్లో కాలిపోయిన మృతుల నగలు, వాచీలు బ స్సులో ఇరుక్కున్నాయి. వాటిని బయటకు తీ శారు. అందులో నాలుగు బంగారు పుస్తెలతా డు ముక్కలు, రెండు పుస్తెలతాడు గుండ్లు, ఒక లాకెట్, ఒక చెవి దుద్దు, ఒక గోల్డ్‌చైన్, రెండు కాలిపోయిన వాచీలు ఉన్నాయి. వాటిని మృతు ల బంధువులకు అప్పగించేందుకు పోలీసులు భద్రపరిచారు. 44వ జాతీయ రహదారిపై ట్రా ఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఇప్పటి వరకు ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బస్సు ప్రమాదంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించగా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారులు కూడా ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
19 మృతదేహాల గుర్తింపు: కలెక్టర్
బస్సులో అగ్నికి ఆహుతై గుర్తించరాని విధంగా ఉన్న మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి త రలించి మార్చురీలో ఉంచారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. వాటి ఆధారంగా సోమవారం నా టికి 19 మృతదేహాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. సోమవారం ఆ య న తన చాంబర్‌లో వివరాలు వెల్లడించారు. ప్ర స్తుతం డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతోందని, మరో ఒకటి రెండు రోజు ల్లో మిగిలిన మృతదేహాలను గుర్తించి వారి కు టుంబసభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు.
గుర్తించిన మృతదేహాలు
ప్రశాంత్ గుప్త, శివకిరణ్, వేదవతి, రవి, ఎండీ.సర్దార్, ఆశుతోష్ పాండా, అక్షయ్‌సింగ్, ఎం.ఫణికుమార్, ఎన్‌ఎస్. గిరిధర్, జి.బాలసుందరరాజు, జి.మేరి విజయకుమారి, జ్యోతి రంజన్‌సాహు, సయ్యద్ మహ్మద్ జమాలుద్దీన్, ఎన్.రోహియా, వెంకటేష్, మోహసిన్ పాషా, రఘువీర్, కె.రమ్య, సాకిబ్ అహ్మద్ ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.
అత్యాధునిక పరికరాలతో నిఘా
జిల్లాలో జాతీయ రహదారిపై తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల వేగంపై అత్యాధునిక పరికరాలతో నిఘా పెంచాం. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.
- ఎస్పీ డి.నాగేంద్రకుమార్
దర్యాప్తు ముమ్మరం
Published Tue, Nov 5 2013 6:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement