volvo buses
-
వోల్వోకు ‘రాజధాని’ రంగు!
సాక్షి, హైదరాబాద్: కంచికి చేరిన ఏసీ సిటీ బస్సు కథ మలుపుతిరిగింది. ఆ బస్సులకు మంచిరోజులు వచ్చాయి. సరికొత్తరూపులో దూరప్రాంతాలకు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్ రోడ్లపై కార్ల ప్రవాహాన్ని కొంతమేర తగ్గించేందుకు అప్పట్లో వోల్వో ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టగా క్రమంగా వాటికి ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో అవి రాజధాని బస్సులుగా రూపాంతరం చెందుతున్నాయి. మియాపూర్‌లోని ఆర్టీసీ బస్‌బాడీ వర్క్‌షాపులో ఇవి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. సాధారణ సీట్లను తొలగించి కొత్తగా పుష్బ్యాక్ సీట్లను అమర్చి, రంగులు మారుస్తున్నారు. మెట్రో రైలు రాక, కోవిడ్ కాక... 2015లో వోల్వో ఏసీ బస్సులను నగరంలో ప్రవేశపెట్టారు. ఒక్కోదానికి రూ.రెండు కోట్లు వెచ్చించి 80 బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఇప్పట్లో అది ఆ సంస్థకు ఆర్థికంగా భారమే. తొలుత ఈ బస్సులకు డిమాండ్ క్రమంగా పెరిగింది. సాధారణ బస్సుల్లో కి.మీ.కు ఆదాయం (ఈపీకే) రూ.35 నుంచి రూ.40 వరకు ఉండగా, వీటిల్లో రూ.70 వరకు నమోదైంది. కొంతకాలానికి హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడంతో ఈ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గింది. మరోవైపు డీజిల్ ధరలు పెరగడం ఆరంభించాయి. సాధారణ బస్సుల్లో మైలేజీ లీటరుకు సగటున 5 కి.మీ. ఉండగా ఈ ఏసీ బస్సుల్లో 2 కి.మీ.గానే నమోదైంది. దీంతో నష్టాలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం సమ్మె దీర్ఘకాలం నడవటంతో ప్రయాణికులు ఈ బస్సులకు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. ఆ తర్వాత ఇవి మొదలైనా మునుపటి రద్దీ లేకుండా పోయింది. దీంతో అధికారులు చాలాబస్సులను పక్కన పెట్టేశారు. అదేసమయంలో కోవిడ్‌తో కథ పూర్తిగా మారిపోయింది. రోజుకు నాలుగైదు బస్సులను తిప్పినా ఎక్కేవారు లేక నష్టాలను పెంచుతుండటంతో పార్కింగ్ యార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో వాటిని ‘ఇంద్ర’గా మార్చి మళ్లీ రోడ్డెక్కించబోతున్నారు. డిమాండ్ మేరకు.. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల మధ్య ఇంద్ర బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఏసీ బస్సులు కావటం, ప్రయాణం సుఖవంతంగా ఉండటంతో కాస్త టికెట్ ధర ఎక్కువైనా ప్రయాణానికి జనం ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇంద్ర బస్సులకు ఉన్న కొరతను తీర్చేందుకుగాను ఈ వోల్వోబస్సులకు కొత్తరూపు ఇచ్చారు. గతంలో సంక్రాంతి లాంటి రద్దీ సమయంలో కొన్ని సిటీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను విజయవాడకు తిప్పారు. కానీ, సీట్లు సౌకర్యంగా లేకపోవటం, సామగ్రి పెట్టుకునే చోటు లేక ఆ ప్రయత్నం అంతగా ఫలించలేదు. దీంతో దూరప్రాంత ప్రయాణాలకు అనువుగా వీటిల్లో పుష్బ్యాక్ సీట్లను అమరుస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ సహా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పట్టణాలకు తిప్పాలని నిర్ణయించారు. -
ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వై-ఫై
తాము నడిపించే వోల్వో బస్సుల్లో ఉచితంగా వై-ఫై సేవలు అందించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఎంపిక చేసిన రూట్లలో వెళ్లే ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఈ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. తొలిదశలో ఐదు బస్సులలో వై-ఫై సేవలు ప్రారంభించామని, రాబోయే 15 రోజుల్లో మరో 10 బస్సుల్లో కూడా ఇది వస్తుందని ఒక అధికారి చెప్పారు. ప్రస్తుతం లక్న్-ఢిల్లీ, లక్నో-బహరైచ్, లక్నో-అజ్మీర్ మార్గాలలో నడిచే బస్సులలో ఉచిత వై-ఫై ఉంది. ఇందుకోసం బస్సులలో ఒక డాంగిల్‌ను ఫిట్ చేస్తున్నారు. బస్సు సిబ్బంది అందించే పాస్వర్డ్ తీసుకుని ప్రయాణికులు తాము ప్రయాణం చేసినంత సేపు ఉచితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. -
రెండు వోల్వో బస్సులు ఢీ: 27మందికి గాయాలు
-
రెండు వోల్వో బస్సులు ఢీ: 27మందికి గాయాలు
తిరుపతి: చంద్రగిరి మండలం మల్లవరంలో బుధవారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మరో 25 మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. శబరిమల నుంచి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు వోల్వో బస్సులు సీజ్
నెల్లూరు: అనుమతి లేకుండా లగేజీ తరలిస్తున్న రెండు వోల్వో బస్సులను గురువారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలంలో రోజు వారి తనిఖీల్లో భాగంగా వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో వస్తువులు తరలిస్తున్న రెండు వోల్వో బస్సులను సీజ్ చేశారు. చెన్నై నుంచి వచ్చే బస్సులో తరచుగా అక్రమంగా వస్తువులను తరలిస్తుండటంతో అధికారులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. డిప్యూటీ రవాణా కమిషనర్ శివరాం ప్రసాద్ నేతృత్యంలో ఈ సోదాలు జరిగాయి. ఆరెంజ్, ధనంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్‌చేశారు. (తడ) -
అత్యవసర ద్వారాలు లేని ‘వోల్వో’ల సీజ్
మే 1 నుంచి అమలు.. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఘోర రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అత్యవసర ద్వారాలు లేని వోల్వో బస్సులను నిషేధిస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో వోల్వో బస్సుల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో చాలా మంది అమాయక ప్రయాణికులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు అనేక మార్గదర్శకాలు జారీ చేశామని గుర్తు చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందులో భాగంగా అత్యవసర ద్వారాలు లేని వోల్వో బస్సుల సంచారాన్ని అనుమతించే ప్రసక్తే లేదని, వాటిని సీజ్ చేస్తామని చెప్పారు. బస్సుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు చాలా గడువు ఇచ్చామని తెలిపారు. అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని వోల్వో సంస్థకు కూడా సూచించామని వెల్లడించారు. బస్సుల నిర్మాణ దశలోనే అత్యవసర ద్వారాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కంపెనీలకు సైతం సూచించామని తెలిపారు. లేనట్లయితే అలాంటి బస్సులను ప్రభుత్వం ఇక కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ వోల్వో బస్సులకు అత్యవసర ద్వారాలు లేకుంటే సీజ్ చేస్తామని తేల్చిచెప్పారు. -
త్వరలో ప్రమాదరహిత వోల్వో బస్సులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రయాణికుల రక్షణార్థం ప్రమాద రహిత వోల్వో బస్సులను ప్రవేశపెట్టేలా ఆ సంస్థతో తమిళనాడు రవాణాశాఖాధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. బస్సు డిజైన్‌లో అధికారులు సూచించిన మార్పులకు వోల్వో యాజమాన్యం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న రెండు వోల్వో బస్సుప్రమాదాల్లో 52 మంది మృతి చెందడం, తమిళనాడు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేసింది. రెండు బస్సులు ప్రయివేటు సంస్థలకు చెందినవే కావడంతో తమిళనాడులోని ఆమ్నీ ప్రయివేటు బస్సుల యాజ మాన్యంతో తొలుత చర్చలు జరిపారు. 80 కిలోమీటర్ల కంటే వేగంగా నడపరాదని, ప్రతి 150 కిలోమీటర్లకు బస్సు డ్రైవర్ మారాలని, బస్సులోని భద్రతా ఏర్పాట్లను ప్రయాణికులకు వివరించాలని ఆదేశించారు. అలాగే వోల్వో బస్సు తయారీదారులతో సైతం చర్చలు నిర్వహించి కొన్ని మార్పులను సూచించారు. ప్రమాదం సం భవిస్తే ప్రయాణికులు సులభంగా బయటపడేలా డిజైన్‌లో మార్పులు తీసుకురావాలని కోరారు. అగ్నిని ఆర్పేందుకు ఆధునిక పరికరం, విమానాల్లో లాగా బ్లాక్‌బాక్స్, 85 కిలోమీటర్ల స్పీడ్ కం ట్రోల్ పరికరాన్ని అమర్చాలని కోరారు. ప్రమా దం జరిగినపుడు సులభంగా పగులగొట్టేలా బస్సు అద్దాలు అమర్చాలని సూచించారు. ప్రస్తు తం వోల్వో బస్సులో నాలుగు అద్దాలు మాత్రమే పగులగొట్టేందుకు వీలున్నాయి. డీజిల్ ట్యాంకును సైతం మార్చాలని కోరగా, ప్రస్తుతం తాము అమరుస్తున్న డీజిల్ ట్యాంకు చాలా సురక్షితమైనదని వోల్వో సంస్థ అధికారులు నచ్చజెప్పారు. తమ సూచనలన్నింటికీ వోల్వో బస్సు తయారీ సంస్థ అంగీకరించినట్లు తమిళనాడు అధికారులు తెలిపారు. -
వోల్వో బస్సుల్లో అత్యవసర ద్వారం
సాక్షి, హైదరాబాద్: ప్రమాదాల సమయంలో వినియోగించుకునేందుకు వోల్వో బస్సుల్లో అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వోల్వో కంపెనీకి లేఖ రాసింది. ప్రమాదం జరిగినప్పుడు బయటపడడానికి అద్దాలు పగలగొట్టడం మినహా వోల్వో బస్సుల్లో మరో మార్గం లేదు. అయితే అద్దాలు పగలగొట్టడం అంత సులభమైన విషయం కాదు. సాధారణ బస్సుల్లో మాదిరిగా వోల్వోలో కూడా అత్యవసర ద్వారం ఉంటే ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని ఇటీవల ఆర్టీసీ నిర్వహించిన సదస్సులో అభిప్రాయం వ్యక్తమైంది. వోల్వో బస్సు ప్రధాన ద్వారాన్ని తెరిచే స్విచ్ డ్రైవర్ వద్ద మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా ద్వారాన్ని తెరవడానికి అవకాశం కల్పించేలా మార్పులు చేసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. వోల్వో బస్సులు నడుపుతున్న డైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు వోల్వో కంపెనీ నిపుణులు రానున్నారని, వచ్చే వారం నుంచి బ్యాచ్‌ల వారీగా శిక్షణ మొదలవుతుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. -
వోల్వో బస్సుల వేగానికి కళ్లెం
సాక్షి, ముంబై: వోల్వో బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు నానాటికీ పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భద్రతకు పెద్ద పీటవేయాలని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ముంబై-పుణే నగరాల మధ్యలో నడుస్తున్న వోల్వో ఏసీ బస్సులు గంటకు 100-120 కి.మీ.ల వేగంతో నడుస్తున్నాయి. వీటిని 85 కి.మీ. వరకు వేగ నియంత్రణ పరికరాలను బిగించాలని ఆదేశించనున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ఇటీవల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో వోల్వో బస్సులు ఘోర అగ్ని ప్రమాదానికి గురై పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమేనని తేలింది.దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ముంబై-పుణే నగరాల మధ్య తిరుగుతున్న వోల్వో బస్సులకు 85 కిలోమీటర్ల వేగాన్ని పరిమితం చేశారు. ఎక్స్‌ప్రెస్ హైవేలపై గంటకు 80 కి.మీ. వేగంతో నడపాలని నియమాలు ఉన్నప్పటికీ గంటకు 130 నుంచి 140 కి.మీ. వేగంతో నడుపుతున్నారు. చాలా బస్సులు రాత్రి సమయంలో ఘాట్ ప్రాంతాల మీదుగా వెళుతుండగా గంటకు 100 కి.మీ. వేగంతో నడుపుతున్నారని, కార్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతవరకు ఆర్టీసీ వోల్వో బస్సులు ప్రమాదానికి గురికాకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 125 ఏసీ వోల్వో బస్సులు ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 20 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులుండగా మిగతా బస్సులు ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపిస్తున్నారు. ఇప్పటికే 47 వోల్వో బస్సులకు వేగ నియంత్రణ పరికరాన్ని అమర్చినట్లు ఆర్టీసీ పదాధికారి హర్ష్ కోటక్ చెప్పారు. మిగతా బస్సులకు ఈ వారం రోజుల్లో వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేస్తామని కోటక్ అన్నారు. బస్సులో సెఫ్టీ కార్డు, జీపీఎస్ బస్సులో ప్రతీ సీటు వెనకాల ఉండే ప్యాకెట్లో రక్షణ కార్డులను ఉంచనున్నట్లు కోటక్ తెలిపారు. అత్యవసరం సమయంలో లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా బయటపడాలో అందులో ఉంటుందన్నారు. అలాగే ముంబై-పుణేల మధ్య నడిచే ప్రతి బస్సులో జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ఆర్టీసీ బస్సు కదలికలను తెలుసుకునే వీలుపడుతుందని, అత్యవసర సమయంలో డ్రైవర్లు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించేందుకు వీలుంటుందని ఆయన వివరించారు. వోల్వో బస్సులకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన టైర్లను, ప్రతి బస్సులో మంటలను ఆర్పివేసే రెండు అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
నిబంధనలకు పాతర !
పట్టుబడ్డ ప్రైవేటు బస్సుల్లో సగం వోల్వోలే పాలెం ఘటన తర్వాతా బస్సుల్లో బాణసంచా తరలింపు అదనపు ఆదాయం కోసం లారీల తరహాలో సరుకు రవాణా అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న దిమ్మతిరిగే వాస్తవాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రహదారులపై పరుగులుపెడుతున్న వోల్వో బస్సుల సంఖ్య 650. పాలెం దుర్ఘటన తర్వాత రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో ఇప్పటి వరకు జప్తు చేసిన వోల్వో బస్సుల సంఖ్య 320. రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో ఈ సంఖ్యే స్పష్టం చేస్తోంది. 45 నిండుప్రాణాలను బలి తీసుకున్న పాలెం దుర్ఘటన తర్వాత కూడా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు రాలేదనటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. పాలెం దుర్ఘటన జరిగిన మూడు రోజులకే... రెండు బస్సులు లగేజీ బాక్సులో బాణసంచాను తరలిస్తూ పట్టుబడ్డాయి. రవాణా శాఖ అధికారులవి తాటాకు చప్పుళ్లే అని బలంగా విశ్వసించే ట్రావెల్స్ యజమానులు యథాప్రకారం నిబంధనలు కాలరాస్తూ బస్సులను నడుపుతున్నారు. వోల్వో ఎగ్జాస్ట్ సిస్టమ్‌కు చేరువగా ఉండే లగేజీ బాక్సులో నిప్పు పుట్టించే వస్తువులు ఉంచకూడదు. కానీ కాసుల కోసం పెద్ద సంఖ్యలో వస్తువులను తరలించే అలవాటున్న బస్సు నిర్వాహకులు బాణసంచాను కూడా తరలించేందుకు సిద్ధపడ్డారు. అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగు చూడటంతో.. ఆ రెండు బస్సులను జప్తు చేయటమే కాక.. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా శాఖ అధికారులు, పాలెం దుర్ఘటన తర్వాత ఏ ఒక్క బస్సునూ వదలకుండా తనిఖీలు చేస్తూ నిబంధనలను విస్మరిస్తున్న వాటిని అక్కడికక్కడే జప్తు చేస్తున్నారు. ఇదే పని ఇప్పటికే చేసి ఉంటే నిబంధనలు అపహాస్యం అయిఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ తనిఖీలైనా ఎంతకాలం కొనసాగుతాయన్నదే అసలు ప్రశ్న. గతఏడాది జూన్‌లో శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాదానికి గురై 32 మంది చనిపోయినప్పుడు ఇలాగే తనిఖీలు చేసి.. 500 బస్సుల వరకు సీజ్ చేసిన అధికారులు ఆ తర్వాత చూసీచూడనట్టు వ్యవహరిం చారు. ఇప్పుడు కూడా ఈ హడావుడి మధ్యలో నిలిచిపోయే అవకాశం లేకపోలేదు. ఉల్లంఘనలెన్నో: ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలుగా ఉండే అత్యవసర ద్వారం వద్ద కొంతమేర ఖాళీ వదలాలి. ఆ స్థలంలో అదనపు సీట్లను బిగించిన వ్యవహారాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. బస్సుల్లో అదనపు ప్రయాణికులు కూర్చోవటానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పాలెం ఘటనలో ఈ అదనపు సీట్ల వల్లే ప్రాణనష్టం పెరిగింది. కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి పొంది స్టేజి క్యారియర్‌గా నడుపుతున్న బస్సులపైనా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటకలో ప్రమాదానికి గురైన బస్సు ఇలాంటి నిబంధన ను అతిక్రమించిందే. మన రాష్ట్రంలోనూ మూడొంతుల బస్సులు ఇలాగే అనుమతి లేకుండా నడుస్తున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లుండాలి. ఆరు గంటల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్ మారాలి. కానీ 90% బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా లగేజీ బాక్సులో సరుకులు బట్వాడా చేస్తున్నారు. ప్రయాణికుల తాలూకు వస్తువులు ఉంచాల్సిన చోట లారీల తరహాలో సరుకు రవాణా చేస్తూ ట్రావె ల్స్ నిర్వాహకులు అదనపు ఆదాయం పొందుతున్నారు. బస్సులో ప్రయాణికుల వివరాలతో జాబితా ఉండాలి. కానీ మూడొంతుల బస్సుల్లో అది ఉండటం లేదు. ఉన్నా అందులోని వివరాలకు.. ప్రయాణిస్తున్న వారి వివరాలకు పొంతన ఉండటం లేదు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు కొందరు మృతుల వివరాలు దొరక్కపోవటానికి ఇదే కారణం. వోల్వోను వదిలించుకుందాం! చారణా కోడికి బారాణా మసాలా అనే హైదరాబాదీ సామెత రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నడుపుతున్న వోల్వో బస్సులకు అతికినట్టు సరిపోతుంది. వీటి ఖరీదు దాదాపు రూ. కోటి. పైగా చిన్న చిన్న మరమ్మతులకు కూడా లక్షల్లో చమురు వదులుతోంది. పైగా వీటితో ఆదాయం మాట అటుంచి నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. తెల్ల ఏనుగులుగా మారిన బస్సులను వదిలించుకోవాలని ఏపీటీడీసీ నిర్ణయించిందని సమాచారం. ఇకపై విదేశీ తయారీ వాహనాలను కొనుగోలు చేయబోదంటున్నారు. 2002- 2005 మధ్య కొన్న ఒక్కోటీ దాదాపు రూ.60 లక్షల చొప్పున కొన్న 11 వోల్వో బస్సులను తుక్కు కింద సంస్థ అమ్మకానికి పెట్టింది! కానీ వాటిని కొనేందుకు ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ఇవి పోను ఏపీటీడీసీ నడిపే 106 బస్సు సర్వీసుల్లో మరో 20 వోల్వోలు, 8 మెర్సిడస్ బెంజ్ వాహనాలున్నాయి. వోల్వో బస్సు ఖరీదు ప్రస్తుతం రూ.85 లక్షల నుంచి రూ. 1.08 కోట్లుంది. అదే దేశీయ తయారీ హైటెక్ ఏసీ బస్సు రూ.35 లక్షలుంది. అంటే ఒక్క వోల్వోకు వెచ్చించే మొత్తంతో మూడు హైటెక్ ఏసీ బస్సులను సమకూర్చుకోవచ్చు. -
ఆర్టీఏ తనిఖీలు: 12 బస్సులు సీజ్
శంషాబాద్, న్యూస్‌లైన్: ఇటీవల వోల్వో బస్సుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం గగన్‌పహాడ్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపి తనిఖీలు చేశారు. మొత్తం పన్నెండు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని, కొన్ని బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకే డ్రైవర్ ఉండడంతో సీజ్ చేశారు. అధికారులు వాహనాలను సీజ్ చేయడంతో బస్సుల్లో ఉన్న కొందరు ప్రయాణికులు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనిఖీలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు. -
దర్యాప్తు ముమ్మరం
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన సంఘటనపై పోలీసుశాఖ విచారణను వేగవంతం చేసింది. గతనెల 30వ తేదీన కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు 24గంటల పాటు పనిచేస్తూ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగానే కొత్తకోట సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒక బృందం హైదరాబాద్‌లోనే ఉంటూ మృతదేహాలకు సంబంధించి డీఎన్ఏ పరీక్షలు చేయించడం నుంచి బాధితుల బంధువులకు ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సమాచారం ఇస్తున్నారు. మరోబృందం వనపర్తి డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ మహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో దుర్ఘటన జరిగిన ప్రాంతంలో, దగ్ధమైన బస్సులో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే మృతులకు సంబంధించిన కొన్ని వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట ఎస్ఐ గిరి బాబు ఆధ్వర్యంలో మరో బృందం రెండు రో జులుగా బెంగళూరులో మకాం వేసి వాస్తవంగా ఆ రోజు బస్సులో ప్రయాణానికి ఎంతమంది ప్రయాణికులు సీటు రిజర్వ్ చేసుకున్నారు, ప్ర యాణంలో ఎవరెవరు ఏయే ప్రాంతంలో బ స్సులో ఎక్కారనే వివరాలను సేకరిస్తున్నారు. సోమవారం బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. పోలీసుశాఖ నుంచి విచారణ వేగవంతమవుతున్నా రవాణాశాఖ అధికారులు సంఘటన జరిగిన రోజు, మరుసటి రోజు హడావుడి చేసినా ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. వాహనాలను తనిఖీచేయడం మినహా ప్రమాదానికి గల కారణాలు ఆ శాఖ నుంచి సేకరించడంలో కొంత మేర విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటింగ్ కెపాసిటీ మొదలుకొని ఇతర అంశాలపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఓల్వో కంపెనీ ప్రతినిధులు, ఎల్అండ్టీ, ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రమాదం సంభవించిన మరుసటి రోజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వెళ్లినా ఇప్పటి వరకు వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వలేదని తెలుస్తోంది. బస్సులోనే మాంసపు ముద్దలు కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్: కొత్తకోట మండ లం పాలెం వద్ద 45 మందిని పొట్టన పెట్టుకున్న ఓల్వో బస్సు వద్ద ఇంకా మృతుల ఆనవాళ్లు బ యటపడుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన మరుసటి రోజు బస్సును ప్రమాదస్థలం నుంచి మరోచోటుకు తరలించారు. ఆ సమయంలో బ స్సు సీట్లలో మృతదేహాల మాంసపు ముద్దలు, మృతులకు సంబంధించిన ఆనవాళ్లు అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం కోత్తకోట ఎస్ఐ డీకే. మహేశ్వర్‌రావు, శిక్షణ ఎస్ఐ రమేష్‌ల ఆధ్వర్యంలో కొన్ని ఆనవాళ్లను తొలగించారు. ప్రమాదం జరిగినప్పుడు మం టల్లో కాలిపోయిన మృతుల నగలు, వాచీలు బ స్సులో ఇరుక్కున్నాయి. వాటిని బయటకు తీ శారు. అందులో నాలుగు బంగారు పుస్తెలతా డు ముక్కలు, రెండు పుస్తెలతాడు గుండ్లు, ఒక లాకెట్, ఒక చెవి దుద్దు, ఒక గోల్డ్‌చైన్, రెండు కాలిపోయిన వాచీలు ఉన్నాయి. వాటిని మృతు ల బంధువులకు అప్పగించేందుకు పోలీసులు భద్రపరిచారు. 44వ జాతీయ రహదారిపై ట్రా ఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఇప్పటి వరకు ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బస్సు ప్రమాదంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించగా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారులు కూడా ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. 19 మృతదేహాల గుర్తింపు: కలెక్టర్ బస్సులో అగ్నికి ఆహుతై గుర్తించరాని విధంగా ఉన్న మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి త రలించి మార్చురీలో ఉంచారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. వాటి ఆధారంగా సోమవారం నా టికి 19 మృతదేహాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. సోమవారం ఆ య న తన చాంబర్లో వివరాలు వెల్లడించారు. ప్ర స్తుతం డీఎన్ఏ పరీక్షల ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతోందని, మరో ఒకటి రెండు రోజు ల్లో మిగిలిన మృతదేహాలను గుర్తించి వారి కు టుంబసభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు. గుర్తించిన మృతదేహాలు ప్రశాంత్ గుప్త, శివకిరణ్, వేదవతి, రవి, ఎండీ.సర్దార్, ఆశుతోష్ పాండా, అక్షయ్‌సింగ్, ఎం.ఫణికుమార్, ఎన్ఎస్. గిరిధర్, జి.బాలసుందరరాజు, జి.మేరి విజయకుమారి, జ్యోతి రంజన్సాహు, సయ్యద్ మహ్మద్ జమాలుద్దీన్, ఎన్.రోహియా, వెంకటేష్, మోహసిన్ పాషా, రఘువీర్, కె.రమ్య, సాకిబ్ అహ్మద్ ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. అత్యాధునిక పరికరాలతో నిఘా జిల్లాలో జాతీయ రహదారిపై తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల వేగంపై అత్యాధునిక పరికరాలతో నిఘా పెంచాం. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. - ఎస్పీ డి.నాగేంద్రకుమార్