ప్రమాదాల సమయంలో వినియోగించుకునేందుకు వోల్వో బస్సుల్లో అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: ప్రమాదాల సమయంలో వినియోగించుకునేందుకు వోల్వో బస్సుల్లో అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వోల్వో కంపెనీకి లేఖ రాసింది. ప్రమాదం జరిగినప్పుడు బయటపడడానికి అద్దాలు పగలగొట్టడం మినహా వోల్వో బస్సుల్లో మరో మార్గం లేదు. అయితే అద్దాలు పగలగొట్టడం అంత సులభమైన విషయం కాదు.
సాధారణ బస్సుల్లో మాదిరిగా వోల్వోలో కూడా అత్యవసర ద్వారం ఉంటే ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని ఇటీవల ఆర్టీసీ నిర్వహించిన సదస్సులో అభిప్రాయం వ్యక్తమైంది. వోల్వో బస్సు ప్రధాన ద్వారాన్ని తెరిచే స్విచ్ డ్రైవర్ వద్ద మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా ద్వారాన్ని తెరవడానికి అవకాశం కల్పించేలా మార్పులు చేసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. వోల్వో బస్సులు నడుపుతున్న డైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు వోల్వో కంపెనీ నిపుణులు రానున్నారని, వచ్చే వారం నుంచి బ్యాచ్‌ల వారీగా శిక్షణ మొదలవుతుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.