సాక్షి, ముంబై: వోల్వో బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు నానాటికీ పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భద్రతకు పెద్ద పీటవేయాలని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ముంబై-పుణే నగరాల మధ్యలో నడుస్తున్న వోల్వో ఏసీ బస్సులు గంటకు 100-120 కి.మీ.ల వేగంతో నడుస్తున్నాయి. వీటిని 85 కి.మీ. వరకు వేగ నియంత్రణ పరికరాలను బిగించాలని ఆదేశించనున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ఇటీవల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో వోల్వో బస్సులు ఘోర అగ్ని ప్రమాదానికి గురై పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమేనని తేలింది.దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ముంబై-పుణే నగరాల మధ్య తిరుగుతున్న వోల్వో బస్సులకు 85 కిలోమీటర్ల వేగాన్ని పరిమితం చేశారు.
ఎక్స్‌ప్రెస్ హైవేలపై గంటకు 80 కి.మీ. వేగంతో నడపాలని నియమాలు ఉన్నప్పటికీ గంటకు 130 నుంచి 140 కి.మీ. వేగంతో నడుపుతున్నారు. చాలా బస్సులు రాత్రి సమయంలో ఘాట్ ప్రాంతాల మీదుగా వెళుతుండగా గంటకు 100 కి.మీ. వేగంతో నడుపుతున్నారని, కార్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతవరకు ఆర్టీసీ వోల్వో బస్సులు ప్రమాదానికి గురికాకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 125 ఏసీ వోల్వో బస్సులు ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయి.
ఇందులో 20 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులుండగా మిగతా బస్సులు ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపిస్తున్నారు. ఇప్పటికే 47 వోల్వో బస్సులకు వేగ నియంత్రణ పరికరాన్ని అమర్చినట్లు ఆర్టీసీ పదాధికారి హర్ష్ కోటక్ చెప్పారు. మిగతా బస్సులకు ఈ వారం రోజుల్లో వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేస్తామని కోటక్ అన్నారు.
బస్సులో సెఫ్టీ కార్డు, జీపీఎస్
బస్సులో ప్రతీ సీటు వెనకాల ఉండే ప్యాకెట్‌లో రక్షణ కార్డులను ఉంచనున్నట్లు కోటక్ తెలిపారు. అత్యవసరం సమయంలో లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా బయటపడాలో అందులో ఉంటుందన్నారు. అలాగే ముంబై-పుణేల మధ్య నడిచే ప్రతి బస్సులో జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ఆర్టీసీ బస్సు కదలికలను తెలుసుకునే వీలుపడుతుందని, అత్యవసర సమయంలో డ్రైవర్లు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించేందుకు వీలుంటుందని ఆయన వివరించారు. వోల్వో బస్సులకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన టైర్లను, ప్రతి బస్సులో మంటలను ఆర్పివేసే రెండు అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.