speed controllers
-
ప్రమాదాల జోరుకు కళ్లెం..!
ప్రమాదాల జోరుకు కళ్లెం వేసేందుకు పోలీస్ శాఖ ‘స్పీడ్‌గన్’లను ఎక్కుపెట్టింది. జాతీయ, ప్రధాన రోడ్లలో వేగంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి ఇ–చలానాలతో ఆర్థిక భారం వేయనుంది. మార్పురాకుంటే వాహనదారుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనుంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డు నిబంధనలను కఠినతరం చేసింది. సాక్షి, విజయనగరం టౌన్ : అతివేగం ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రాణాలు తీస్తోంది. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అపరాధ రుసుం వసూలు చేస్తున్నా చాలామంది వాహనచోదకుల్లో మార్పురావడం లేదు. రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. ప్రమాదాలకు కారణమవుతూ ఎదుటివారి ప్రాణాలను హరిస్తున్నారు. దీనిని నివారించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. అతివేగంగా వాహనాలు నడిపే వారికి కళ్లెంవేసే చర్యలు చేపట్టింది. స్పీడ్ గన్‌తో వాహన వేగాన్ని లెక్కించి మితిమీరితే కొరడా ఝుళిపించనుంది. ఇటీవల పోలీస్ అధికారులు జిల్లాకు నాలుగు స్పీడ్ కంట్రోల్ లేజర్ గన్స్‌ను తెప్పించారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అతివేగంగా వచ్చే వాహనాల ఫొటో తీసి డాప్లర్ సిద్ధా్దంతం ఆధారంగా స్పీడ్ లేజర్ గన్ పరికరంతో వేగాన్ని లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే ఇ–చలానా ద్వారా ఇంటివద్దకే జరిమానా రసీదులు పంపిస్తారు. గాలిలో కలుస్తున్న ప్రాణాలు అతివేగంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 454 ప్రమాదాలు సంభవించారు. ఇందులో 157 మంది వరకు మృత్యువాత పడ్డారు. 758 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో టూ వీలర్స్ ప్రయాణికులు 179 మంది ఉంటే ఆటోల్లో ప్రయాణించేవారు 77 మంది, కారులు, జీపుల్లో ప్రయాణించేవారు 85 మంది, బస్సుల ద్వారా 30మంది, ట్రక్లు, ట్రాక్టర్స్ ద్వారా 96 మంది, ఇతర వాహనాల వల్ల 17 మంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వీటిని నివారించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాలో ఉన్న ప్రధాన హైవేలను, ప్రమాదకర స్థలాలను గుర్తించింది. భోగాపురం హైవే, విశాఖ హైవే, గజపతినగరం హైవే, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ గన్లను ఏర్పాటు చేసింది. ఎక్కువగా ప్రమాదాలు హైవేలపైన జరుగుతుండడంతో వాటిపైన దృష్టిసారించింది. పట్టణంలో స్పోర్ట్స్ బైక్‌లు వాడే విద్యార్థులు, రైడర్లతో ప్రయాణికులు భయపడుతున్నారు. వారిని గుర్తించేందుకు లేజర్‌గన్‌ను ఏర్పాటుచేశారు. అటువంటి వారికి చలానాతో పాటు శిక్ష కూడా వేసే అవకాశాలున్నాయని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. స్పీడ్‌కి బ్రేక్... స్పీడ్ గన్‌తో వాహనాలు మితిమీరిన వేగానికి చెక్ పడే అవకాశం ఉంది. కేవలం 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని బోర్డులు చూపిస్తున్నా వంద కిలోమీటర్ల స్పీడ్‌లో వాహనాలు నడుపుతారు. జాతీయరహదారులపై అయితే కార్లు, లారీలు అతివేగంతో వెళ్తే స్పీడ్‌గన్‌తో దాన్ని వేగాన్ని లెక్కించి ఇ–చలాన్ ద్వారా ఇంటివద్దకే జరీమానాలు పంపుతారు. 14 కంటే ఎక్కువ జరీమానాలు పడిన వ్యక్తులు డబ్బులు చెల్లించకుంటే పోలీసులు సంబంధిత వాహన యజమానులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. జరిమానా మొత్తంతో పాటు పెనాల్టీ కడితేనే వదిలిపెడతారు. నిబంధనలు పాటించాలి వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలనే విషయం సైన్ బోర్డులపై ఉంటుంది. ఆ వేగానికి మించి వెళ్తే స్పీడ్గన్ల ద్వారా ఇ–చలానా రూపంలో జరిమానాలు విధిస్తాం. మితిమీరిన వేగం ప్రమాద కరం. దీనివల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముంది. వాహన పత్రాలు, లైసెన్సులు లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయవద్దు. ప్రస్తుతం జాతీయరహదారిపై స్పీడ్గన్లు ఏర్పాటుచేశాం. – బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం -
వేగ నియంత్రణకు ‘స్టాప్ లైన్’
జనగామ: జాతీయ రహదారితో పాటు రాష్ట్ర హైవేపై ప్రమాదాలను నివారించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్–వరంగల్ నేషనల్ హైవేతో పాటు సిద్ధిపేట–విజయవాడ రహదారిలోని ప్రధాన కూడళ్ల వద్ద స్టాప్ లైన్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ లైన్లు వేగంగా దూసుకొచ్చే వాహనాలను నియంత్రించేందుకు కొంత మేరకు ఉపయోగపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా కేంద్రంతో పాటు హైవేలపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యి. దీనికి ప్రధాన కారణం వాహనాలు అతివేగంగా రావడమేనని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నేషనల్ హైవే అధికారులతో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీసీపీ మల్లారెడ్డి.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రమాదకర కూడళ్లను తెలియజేస్తూ చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై స్పీడు బ్రేకర్లను వేసేందుకు నిబంధనలు అడ్డురావ డంతో.. స్టాప్లైన్లను వేయిస్తున్నారు. ఇంచు ఎత్తులో ఉండే ఈ స్టాప్‌లైన్లు వరుసగా ఏడు నుంచి ఎనిమిది వేయడంతో.. వేగంగా వచ్చే వాహనాల స్పీడ్‌ను కంట్రోలు చేస్తున్నాయి. స్టాప్ లైన్‌పై వెళ్లే క్రమంలో కుదుపునకు లోనవుతుండడంతో.. డ్రైవర్లు బ్రేకులు వేయడం పరి పాటిగా మారిపోతుంది. ప్రమాదాలను వందశాతం నియంత్రించ లేకపోయినప్పటికీ, ఎంతో కొంత మేర వేగం తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతి ప్రమాదకరమైన ప్రదేశాల్లో పది లైన్లు, ఇతర చోట్ల ఎనిమిది వరకు ఏర్పాటు చేస్తున్నారు. జనగామ జిల్లా పరిధిలోని హైదరాబాద్ రోడ్డు, ఆర్టీసీ చౌరస్తాతో పాటు అంబేడ్కర్ సెంటర్, నెహ్రూపార్కు, ఫ్లై ఓవర్, చంపక్ హిల్స్ ప్రధాన మలుపులు, మాతాశిశు ఆరోగ్య కేంద్రం తదితర పాంతాల్లో స్టాప్ లైన్ ఏర్పాటు చేశారు. స్టాప్లైన్తో వేగ నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణకు వేసిన స్టాప్‌లైన్లు కొంత మేరకు ఉపయోగపడుతున్నాయి. ఒక్క సారిగా కుదుపునకు లోనయ్యే అవకాశం ఉండడంతో.. డ్రైవర్లు వేగాన్ని అదుపు చేసుకుంటున్నారు. ఇలా చేయడంతో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువయ్యే అవకాశం ఉంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రమాద ప్రదేశాలను గుర్తించి, వాహన డ్రైవర్లతో పాటు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. –శ్రీనివాస్, ఎస్సై, జనగామ -
వేగానికి కళ్లెం!
నగరంలో తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇంకెందరో క్షతగాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకర రహదారుల్లో వేగ పరిమితులు విధించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా యాక్సెస్ కంట్రోల్ లేని మార్గాల్లో గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.లుగా నిర్ణయించారు. డిజైన్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లుగా నిర్ణయించారు. తరచు జరుగుతున్న ప్రమాదాలు.. వాటి ద్వారా ఏయే మార్గాలు ప్రమాదకరంగా ఉన్నాయో ఎంపిక చేయనున్నారు. రవాణా విభాగం, పోలీసులతో కలిసి వేగపరిమితి నిర్ణయించే అధికారం ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్లకు అప్పగించింది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో స్థానిక పోలీసులు, రవాణా విభాగం అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాదకర రహదారుల్ని గుర్తిస్తారు. సదరు మార్గాల్లో వాహన రద్దీ, రోడ్డు వెడల్పు, మలుపులు, రోడ్డు ఎంత దూరం వరకు స్పష్టంగా కనబడుతుంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సంబంధిత మార్గాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తారు. తద్వారా తరచూ తీవ్ర ప్రమాదాలు జరుగుతున్న రహదారులను గుర్తించడంతోపాటు అందుకు కారణాలను కూడా తెలుసుకుంటారు. రోడ్డు దెబ్బతినడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా.. లేక మలుపుల వల్ల ప్రమాదం ఉందా తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని అక్కడ గరిష్ట వేగపరిమితిని నిర్ధారిస్తారు. ఒకవేళ రోడ్డు దెబ్బతినడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే..అవసరమైన మరమ్మతుల్ని జీహెచ్ఎంసీలోని ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇంజినీరింగ్ విభాగాలు చేపడతాయి. జీహెచ్ఎంసీలో అన్ని రోడ్లు వెరసి 9వేల కి.మీ.ల పైచిలుకు రోడ్లుండగా, వీటిల్లో ప్రధాన రహదారుల్లోని మార్గాల్లో దాదాపు 900 కి.మీ.లున్నాయి. వీటిల్లో 320 కి.మీలను హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్)కు తరలించారు. దాని పరిధిలోకి వెళ్లిన మార్గాల్లో వేగపరిమితుల్ని హెచ్ఆర్డీసీఎల్ ఇంజినీర్లు నిర్ధారిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు 580 కి.మీ. పరిధిలోని ప్రమాదకర రోడ్లలో వేగపరిమితుల్ని జీహెచ్ఎంసీ ఎస్ఈలు నిర్ధారిస్తారు. వేగపరిమితుల్ని నిర్ధారించాక సదరు వివరాలు తెలిపే బోర్డులు, సైనేజీలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ తెలిపారు. అంతకుమించి వేగంతో వెళ్లేవారిని గుర్తించి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తారు. వేగ పరిమితుల్ని అతిక్రమించే వారికి దాదాపు రూ.1400 జరిమానా విధించనున్నట్లు సమాచారం. నగరంలోని రద్దీ రహదారుల్లో వాహనాలు గంటకు 20 కి.మీ.లు మించి వెళ్లే పరిస్థితి లేదు.అవే రహదారుల్లో రాత్రివేళల్లో మాత్రం 80 నుంచి 120 కి.మీల వేగంతో వెళ్తున్న వారున్నారు. రాత్రుళ్లు జరుగుతున్న ప్రమాదాలకు మితిమీరిన వేగమూ కారణమేనని అధికారులు చెబుతున్నారు. -
వోల్వో బస్సుల వేగానికి కళ్లెం
సాక్షి, ముంబై: వోల్వో బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు నానాటికీ పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భద్రతకు పెద్ద పీటవేయాలని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ముంబై-పుణే నగరాల మధ్యలో నడుస్తున్న వోల్వో ఏసీ బస్సులు గంటకు 100-120 కి.మీ.ల వేగంతో నడుస్తున్నాయి. వీటిని 85 కి.మీ. వరకు వేగ నియంత్రణ పరికరాలను బిగించాలని ఆదేశించనున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ఇటీవల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో వోల్వో బస్సులు ఘోర అగ్ని ప్రమాదానికి గురై పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమేనని తేలింది.దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ముంబై-పుణే నగరాల మధ్య తిరుగుతున్న వోల్వో బస్సులకు 85 కిలోమీటర్ల వేగాన్ని పరిమితం చేశారు. ఎక్స్‌ప్రెస్ హైవేలపై గంటకు 80 కి.మీ. వేగంతో నడపాలని నియమాలు ఉన్నప్పటికీ గంటకు 130 నుంచి 140 కి.మీ. వేగంతో నడుపుతున్నారు. చాలా బస్సులు రాత్రి సమయంలో ఘాట్ ప్రాంతాల మీదుగా వెళుతుండగా గంటకు 100 కి.మీ. వేగంతో నడుపుతున్నారని, కార్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతవరకు ఆర్టీసీ వోల్వో బస్సులు ప్రమాదానికి గురికాకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 125 ఏసీ వోల్వో బస్సులు ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 20 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులుండగా మిగతా బస్సులు ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపిస్తున్నారు. ఇప్పటికే 47 వోల్వో బస్సులకు వేగ నియంత్రణ పరికరాన్ని అమర్చినట్లు ఆర్టీసీ పదాధికారి హర్ష్ కోటక్ చెప్పారు. మిగతా బస్సులకు ఈ వారం రోజుల్లో వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేస్తామని కోటక్ అన్నారు. బస్సులో సెఫ్టీ కార్డు, జీపీఎస్ బస్సులో ప్రతీ సీటు వెనకాల ఉండే ప్యాకెట్లో రక్షణ కార్డులను ఉంచనున్నట్లు కోటక్ తెలిపారు. అత్యవసరం సమయంలో లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా బయటపడాలో అందులో ఉంటుందన్నారు. అలాగే ముంబై-పుణేల మధ్య నడిచే ప్రతి బస్సులో జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ఆర్టీసీ బస్సు కదలికలను తెలుసుకునే వీలుపడుతుందని, అత్యవసర సమయంలో డ్రైవర్లు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించేందుకు వీలుంటుందని ఆయన వివరించారు. వోల్వో బస్సులకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన టైర్లను, ప్రతి బస్సులో మంటలను ఆర్పివేసే రెండు అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.