నగరంలో తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇంకెందరో క్షతగాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకర రహదారుల్లో వేగ పరిమితులు విధించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా యాక్సెస్ కంట్రోల్ లేని మార్గాల్లో గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.లుగా నిర్ణయించారు. డిజైన్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లుగా నిర్ణయించారు. తరచు జరుగుతున్న ప్రమాదాలు.. వాటి ద్వారా ఏయే మార్గాలు ప్రమాదకరంగా ఉన్నాయో ఎంపిక చేయనున్నారు. రవాణా విభాగం, పోలీసులతో కలిసి వేగపరిమితి నిర్ణయించే అధికారం ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్లకు అప్పగించింది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో స్థానిక పోలీసులు, రవాణా విభాగం అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రమాదకర రహదారుల్ని గుర్తిస్తారు. సదరు మార్గాల్లో వాహన రద్దీ, రోడ్డు వెడల్పు, మలుపులు, రోడ్డు ఎంత దూరం వరకు స్పష్టంగా కనబడుతుంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సంబంధిత మార్గాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తారు. తద్వారా తరచూ తీవ్ర ప్రమాదాలు జరుగుతున్న రహదారులను గుర్తించడంతోపాటు అందుకు కారణాలను కూడా తెలుసుకుంటారు. రోడ్డు దెబ్బతినడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా.. లేక మలుపుల వల్ల ప్రమాదం ఉందా తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని అక్కడ గరిష్ట వేగపరిమితిని నిర్ధారిస్తారు. ఒకవేళ రోడ్డు దెబ్బతినడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే..అవసరమైన మరమ్మతుల్ని జీహెచ్‌ఎంసీలోని ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్, ఇంజినీరింగ్ విభాగాలు చేపడతాయి.
జీహెచ్‌ఎంసీలో అన్ని రోడ్లు వెరసి 9వేల కి.మీ.ల పైచిలుకు రోడ్లుండగా, వీటిల్లో ప్రధాన రహదారుల్లోని మార్గాల్లో దాదాపు 900 కి.మీ.లున్నాయి. వీటిల్లో 320 కి.మీలను హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఆర్‌డీసీఎల్)కు తరలించారు. దాని పరిధిలోకి వెళ్లిన మార్గాల్లో వేగపరిమితుల్ని హెచ్‌ఆర్‌డీసీఎల్ ఇంజినీర్లు నిర్ధారిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు 580 కి.మీ. పరిధిలోని ప్రమాదకర రోడ్లలో వేగపరిమితుల్ని జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈలు నిర్ధారిస్తారు. వేగపరిమితుల్ని నిర్ధారించాక సదరు వివరాలు తెలిపే బోర్డులు, సైనేజీలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ తెలిపారు. అంతకుమించి వేగంతో వెళ్లేవారిని గుర్తించి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తారు. వేగ పరిమితుల్ని అతిక్రమించే వారికి దాదాపు రూ.1400 జరిమానా విధించనున్నట్లు సమాచారం. నగరంలోని రద్దీ రహదారుల్లో వాహనాలు గంటకు 20 కి.మీ.లు మించి వెళ్లే పరిస్థితి లేదు.అవే రహదారుల్లో రాత్రివేళల్లో మాత్రం 80 నుంచి 120 కి.మీల వేగంతో వెళ్తున్న వారున్నారు. రాత్రుళ్లు జరుగుతున్న ప్రమాదాలకు మితిమీరిన వేగమూ కారణమేనని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment