limit stones
-
వేగానికి కళ్లెం!
నగరంలో తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇంకెందరో క్షతగాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకర రహదారుల్లో వేగ పరిమితులు విధించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా యాక్సెస్ కంట్రోల్ లేని మార్గాల్లో గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.లుగా నిర్ణయించారు. డిజైన్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లుగా నిర్ణయించారు. తరచు జరుగుతున్న ప్రమాదాలు.. వాటి ద్వారా ఏయే మార్గాలు ప్రమాదకరంగా ఉన్నాయో ఎంపిక చేయనున్నారు. రవాణా విభాగం, పోలీసులతో కలిసి వేగపరిమితి నిర్ణయించే అధికారం ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్లకు అప్పగించింది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో స్థానిక పోలీసులు, రవాణా విభాగం అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాదకర రహదారుల్ని గుర్తిస్తారు. సదరు మార్గాల్లో వాహన రద్దీ, రోడ్డు వెడల్పు, మలుపులు, రోడ్డు ఎంత దూరం వరకు స్పష్టంగా కనబడుతుంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సంబంధిత మార్గాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తారు. తద్వారా తరచూ తీవ్ర ప్రమాదాలు జరుగుతున్న రహదారులను గుర్తించడంతోపాటు అందుకు కారణాలను కూడా తెలుసుకుంటారు. రోడ్డు దెబ్బతినడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా.. లేక మలుపుల వల్ల ప్రమాదం ఉందా తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని అక్కడ గరిష్ట వేగపరిమితిని నిర్ధారిస్తారు. ఒకవేళ రోడ్డు దెబ్బతినడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే..అవసరమైన మరమ్మతుల్ని జీహెచ్ఎంసీలోని ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇంజినీరింగ్ విభాగాలు చేపడతాయి. జీహెచ్ఎంసీలో అన్ని రోడ్లు వెరసి 9వేల కి.మీ.ల పైచిలుకు రోడ్లుండగా, వీటిల్లో ప్రధాన రహదారుల్లోని మార్గాల్లో దాదాపు 900 కి.మీ.లున్నాయి. వీటిల్లో 320 కి.మీలను హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్)కు తరలించారు. దాని పరిధిలోకి వెళ్లిన మార్గాల్లో వేగపరిమితుల్ని హెచ్ఆర్డీసీఎల్ ఇంజినీర్లు నిర్ధారిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు 580 కి.మీ. పరిధిలోని ప్రమాదకర రోడ్లలో వేగపరిమితుల్ని జీహెచ్ఎంసీ ఎస్ఈలు నిర్ధారిస్తారు. వేగపరిమితుల్ని నిర్ధారించాక సదరు వివరాలు తెలిపే బోర్డులు, సైనేజీలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ తెలిపారు. అంతకుమించి వేగంతో వెళ్లేవారిని గుర్తించి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తారు. వేగ పరిమితుల్ని అతిక్రమించే వారికి దాదాపు రూ.1400 జరిమానా విధించనున్నట్లు సమాచారం. నగరంలోని రద్దీ రహదారుల్లో వాహనాలు గంటకు 20 కి.మీ.లు మించి వెళ్లే పరిస్థితి లేదు.అవే రహదారుల్లో రాత్రివేళల్లో మాత్రం 80 నుంచి 120 కి.మీల వేగంతో వెళ్తున్న వారున్నారు. రాత్రుళ్లు జరుగుతున్న ప్రమాదాలకు మితిమీరిన వేగమూ కారణమేనని అధికారులు చెబుతున్నారు. -
హద్దురాళ్లు సరే.. మరి అభివృద్ధి?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేలపాడు రైతులు ప్లాట్ల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని డిమాండ్ అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పొలాల్లో రాళ్లుపాతి కాగితాలపై ప్లాట్లు ఇస్తే మాకు ఉపయోగం ఏమిటని నేలపాడు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో దొండపాడు గ్రామానికి చెందిన రైతులు చాలాకాలం నుంచి ఈనాం భూముల ప్యాకేజీ వ్యవహారం పెండింగ్‌లో ఉందని, అది తేల్చకుండా హడావిడిగా ప్లాట్లు పంపిణీ చేయవద్దని అంటున్నారు. తుళ్ళూరు: తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద జూన్ 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేలపాడు రైతులకు 1,418 ఎకరాలకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. లాటరీ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా 824 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఎంపిక చేసిన రైతులకు 1,147 రెసిడెన్సియల్ ప్లాట్లను సీఎం లాటరీ ద్వారా పంపిణీ చేయగా, మంత్రులు పత్తిపాటిపుల్లారావు, నారాయణ 769 కమర్షియల్ ప్లాట్లకు లాటరీ తీశారు. ఇదే క్రమంలో మరో 55 మంది రైతులకు విల్లాలు కూడా లాటరీ ద్వారా తీసి పంపిణీ చేశారు. అయితే ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ఐదు రకాలుగా అభివృద్ధి చేసి ప్రభుత్వం ప్లాట్లు ఇస్తుందని చెప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం పొలాల్లో రాళ్లు మాత్రమే వేసిందని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పేపర్లపై ప్లాట్లు ఇవ్వడం వల్ల రైతులను ఒరిగిందేమీ లేదని అంటున్నారు. భూములు అమ్ముకునేందుకు వీలు లేకుండా చేశారని, భూములకు ధరలు వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదని రైతులు అంటున్నారు. తమ ప్లాట్లకు ధర రావాలంటే ముందుగా ప్రభుత్వం చెప్పినట్టు రహదారులు, తాగునీరు, విద్యుత్, గ్యాస్, డ్రెయినేజీ వంటి పనులు నిర్వహించాలని ఈసందర్భంగా రైతులు కోరుతున్నారు. ఇదేక్రమంలో రైతులకు ప్లాట్లు రిజిస్టర్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్లపై కాకుండా క్షేత్రస్థాయిలో ప్లాట్ల పంపిణీ జరగాలని, ఈమేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు వేగవంతం చేయాలని నేలపాడు రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా దొండపాడులో కూడా ప్లాట్లు పంపిణీ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 271.70 ఎకరాలు భూమి ఉండగా 260 మంది రైతులు 265.66 ఎకరాలకు 9.3 అనుమతి పత్రాలు అందజేశారు. వీరిలో 194 మంది రైతులకు 234.31 ఎకరాలకు 9.14 ఒప్పందపత్రాలు అందజేశారు. రైతులు మాత్రం ఈనాం భూములు వ్యవహారం, దాని ప్యాకేజీపై అధికారులు స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే అందరికీ ప్లాట్లు పంపిణీ చేయాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. రైతుల మనోభావాలకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారులు నడుచుకోవాలని దొండపాడు రైతులు కోరుతున్నారు.