హద్దురాళ్లు సరే.. మరి అభివృద్ధి? | Farmers demands development | Sakshi
Sakshi News home page

హద్దురాళ్లు సరే.. మరి అభివృద్ధి?

Published Mon, Aug 1 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

హద్దురాళ్లు సరే.. మరి అభివృద్ధి?

హద్దురాళ్లు సరే.. మరి అభివృద్ధి?

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేలపాడు రైతులు
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ వేగవంతం చేయాలని డిమాండ్‌
 
అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పొలాల్లో రాళ్లుపాతి కాగితాలపై ప్లాట్లు ఇస్తే మాకు ఉపయోగం ఏమిటని నేలపాడు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో దొండపాడు గ్రామానికి చెందిన రైతులు చాలాకాలం నుంచి ఈనాం భూముల ప్యాకేజీ వ్యవహారం పెండింగ్‌లో ఉందని, అది తేల్చకుండా హడావిడిగా ప్లాట్లు పంపిణీ చేయవద్దని అంటున్నారు. 
 
తుళ్ళూరు: తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద జూన్‌ 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేలపాడు రైతులకు 1,418 ఎకరాలకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. లాటరీ పద్ధతిలో కంప్యూటర్‌ ద్వారా 824 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఎంపిక చేసిన రైతులకు 1,147 రెసిడెన్సియల్‌ ప్లాట్లను సీఎం లాటరీ ద్వారా పంపిణీ చేయగా, మంత్రులు పత్తిపాటిపుల్లారావు, నారాయణ 769 కమర్షియల్‌ ప్లాట్లకు లాటరీ తీశారు. ఇదే క్రమంలో మరో 55 మంది రైతులకు విల్లాలు కూడా లాటరీ ద్వారా తీసి పంపిణీ చేశారు. అయితే ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ఐదు రకాలుగా అభివృద్ధి చేసి  ప్రభుత్వం ప్లాట్లు ఇస్తుందని చెప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం పొలాల్లో రాళ్లు మాత్రమే వేసిందని,  ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పేపర్లపై ప్లాట్లు ఇవ్వడం వల్ల రైతులను ఒరిగిందేమీ లేదని అంటున్నారు.  భూములు అమ్ముకునేందుకు వీలు లేకుండా చేశారని, భూములకు ధరలు వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదని రైతులు అంటున్నారు. తమ ప్లాట్లకు ధర రావాలంటే ముందుగా ప్రభుత్వం చెప్పినట్టు రహదారులు, తాగునీరు, విద్యుత్, గ్యాస్, డ్రెయినేజీ వంటి పనులు నిర్వహించాలని ఈసందర్భంగా రైతులు కోరుతున్నారు. ఇదేక్రమంలో రైతులకు ప్లాట్లు రిజిస్టర్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పేపర్లపై కాకుండా క్షేత్రస్థాయిలో ప్లాట్ల పంపిణీ జరగాలని, ఈమేరకు సీఆర్‌డీఏ అధికారులు చర్యలు వేగవంతం చేయాలని నేలపాడు  రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా దొండపాడులో కూడా ప్లాట్లు పంపిణీ చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 271.70 ఎకరాలు భూమి ఉండగా 260 మంది రైతులు 265.66 ఎకరాలకు 9.3 అనుమతి పత్రాలు అందజేశారు. వీరిలో 194 మంది రైతులకు 234.31 ఎకరాలకు 9.14 ఒప్పందపత్రాలు అందజేశారు. రైతులు మాత్రం ఈనాం భూములు వ్యవహారం, దాని ప్యాకేజీపై అధికారులు స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే అందరికీ ప్లాట్లు పంపిణీ చేయాలని కోరుతున్నట్టు  చెబుతున్నారు.  రైతుల మనోభావాలకు అనుగుణంగా సీఆర్‌డీఏ అధికారులు నడుచుకోవాలని దొండపాడు రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement