ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (ఫైల్‌ఫొటో)
సాక్షి, అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఓ రైతు చంద్రబాబుపై నిండు సభలో విమర్శలు గుప్పించాడు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడికి వచ్చిన రైతులు తమ బాధలను చంద్రబాబుతో చెప్పుకొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సభలో తనపై జరిగిన దాడిని ఓరైతు చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశాడు. సుబ్బయ్య అనే రైతు తనపై దాడిచేశాడని, ఈవిషయంపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రామాంజనేయులు అనే రైతు చంద్రబాబుకు వివరించాడు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో ఉన్న రామాంజనేయులు అమరావతిలో ప్రజలకు రక్షణ లేదన్నాడు. ఈ మాటలు సీఎంకు ఆగ్రహం తెప్పించాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దంటూ ముఖ్యమంత్రి రామాంజనేయులుకు వార్నింగ్ ఇచ్చారు. అయినా దేశానికి అన్నం పెట్టే రైతు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనే స్వాతంత్ర్యం కూడా లేదా అంటూ పలువురు రైతులు చర్చించుకున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వానికి రైతులంటే మొదటి నుంచి చిన్నచూపే. అందుకే పూర్తి రుణమాఫి చేస్తామని అన్నదాత నెత్తిన శఠగోపం పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కల్తీ విత్తనాల దెబ్బకు కుదేలై పంటకు ఉపయోగించాల్సిన పురుగుల మందుతో ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ఆవేదన సైతం వినే ఓపిక కూడ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం.
Comments
Please login to add a commentAdd a comment