వైద్యశాల సరే... సీఆర్‌డీఏ కార్యాలయం ఎక్కడ?
► 30 పడకల ఆస్పత్రి నిర్మాణంతో సందిగ్ధత
► కార్యాలయ నిర్వహణ కష్టమంటున్న అధికారులు
తుళ్ళూరు: తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో తాత్కాలిక సీఆర్‌డీఏ కార్యాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాజధానిలో పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తుళ్లూరు పీహెచ్‌సీ ఆవరణలో 30 పడకల వైద్యశాల నిర్మాణం చేపట్టింది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ఈ పరిసరాలలో సీఆర్‌డీఏ కార్యాలయం నిర్వాహణ కష్టతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయం గుంటూరుకో లేదా, విజయవాడకో మారుస్తారని ప్రచారం జరిగింది. మరి కొంతకాలం మందడంలో శాశ్వత భవనం ఏర్పాటు చేస్తారని, లింగాయపాలెం వద్ద తుళ్ళూరు సీఆర్‌డీఏ శాశ్వత కార్యాలయం వుంటుందని రాజధాని గ్రామాలలో ప్రచారం జరిగింది. అయితే అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో సీఆర్‌డీఏ కార్యాలయం ఈ ప్రాంతంలో వుంటుందా?లేదా? అని రాజధాని గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అలాగే నాణ్యతా ప్రమాణాలతో వైద్యశాలను నిర్మించాలని తుళ్ళూరు ప్రజలు కోరుతున్నారు.