ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుని వెంటనే భూసేకరణను నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. మరోవైపు భూసేకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాసంఘాలు, రైతుసంఘాలు, అఖిలపక్షాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
రాజధాని కోసమని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూదందాపై నిరసనలు చేపట్టేందుకు అఖిలపక్షాలు కార్యాచరణ రూపొందించాయి. భూసేకరణకు వ్యతిరేకంగా దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన ప్రకాశం బ్యారేజిపై రాస్తారోకో, 24న నిడమర్రులోని సీఆర్డీఏ కార్యాలయం ముట్టడి, అదే రోజు సాయంత్రం అక్కడ బహిరంగసభ ఉంటాయి. ఆగస్టు 25న నిడమర్రు, బేతపూడి, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మండలాల్లో సీఆర్డీఏ కింద భూములు సేకరించే గ్రామాల్లో బంద్ పాటించనున్నారు. అలాగే 26న విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చేపట్టే దీక్షల్లో పాల్గొంటారు. ఈ మేరకు వివిధ పక్షాలతో చర్చించి, ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నేతలు ప్రకటించారు.