సేకరిస్తే రణమే
పోరాటాల ఖిల్లా బెజవాడ బెబ్బులిలా గర్జించింది. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను లాక్కోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు నిరసన తెలియజేస్తూ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రైతులకు అండగా నిలుస్తూ విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద బుధవారం ఆయన చేసిన ధర్నాతో నగరం దద్దరిల్లింది. లెనిన్ సెంటర్ జన కెరటంతో పోటెత్తింది. భూసేకరణకు వ్యతిరేకంగా నేతలు గర్జించారు. ఈ ధర్నాలో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలతోపాటు వారికి మద్దతుగా జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ పిలుపునకు స్పందించి రాజధాని రైతుకు అండగా నిలిచిన ఆ జనవాహినిని చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. - గాంధీనగర్
భూ సేకరణ నోటిఫికేషన్ బెదిరింపుల్లో భాగమే
భూసేకరణ చట్టం ప్రయోగించి నోటిఫికేషన్ జారీచేయడం బెదిరింపుల్లో భాగమే. భూమి ఇవ్వకపోతే ఎంత వేధిస్తారో తుళ్లూరుకు చెందిన బోయపాటి సుధారాణి ఉదంతమే నిదర్శనం. ఆమె వద్దకు పోలీసులను, అధికారులను పంపి ఒత్తిడి చేశారు. నాయకులను కూడా పంపి కులం కార్డు ప్రయోగించారు. ఒత్తిళ్లు భరించలేక ఆమె భూములు ఇచ్చివేశారు. ప్రజల కన్నీళ్లతో, వారి కడుపుకొట్టి నిర్మించే రాజధాని అక్కర్లేదు. -అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే
రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ
మూడు పంటలు పండే భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కోవడం అన్యాయం. భూ సేకరణ నిలుపుదల చేయాలి. రైతులకు అండగా వైఎస్‌ఆర్ సీపీ ఉంటుంది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా కోసం ఈనెల 29న నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలి. కేసుల్ని లెక్క చేయకుండా అందరూ ముందుకు రావాలి. - జలీల్‌ఖాన్, ఎమ్మెల్యే
అడ్డగోలు భూసేకరణ తగదు
రాజధాని ప్రాంత రైతులు పిల్లల చదువులు, పెళ్లిళ్ల నేపథ్యంలో భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేపడుతోంది, ఇప్పటికే వేల ఎకరాల భూములు లాక్కుం ది. అవి చాలవన్నట్లు ఇంకా లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజల తరపున ఆందోళన చేసేందుకు వైఎస్ జగన్ రోడ్డుపైకి వచ్చారు. రాష్ట్రానికి చంద్రబాబు పాలన అతి త్వరలో అంతమవుతుంది.
-మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే
రైతుల కన్నీరు రాజధానికి మంచిది కాదు
రైతుల కన్నీరు రాజధాని నిర్మాణానికి మంచిదికాదు. రైతుల ఇష్టాఇష్టాలతో సంబంధంలేకుండా భూములు బలవం తంగా లాక్కోవద్దు. మూడు పంటలు పండే భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవద్దు. రాజధానిలో రైతన్నల ఆక్రోశం గుర్తించిన జగన్ సీఆర్‌డిఏ ఎదుట ఆందోళన చేపట్టారు. - పి గౌతంరెడ్డి, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
రూపాలు మారుస్తున్న చంద్రబాబు
చంద్రబాబు అవసరాన్ని బట్టి అనేక రూపాలు మారుస్తుంటారు. అధికారం కోసం మోసాలు చేసే అవతారం, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన అవతారం. తాజాగా రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భూ బకాసురుడి అవతారం ఎత్తారు. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయే ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ, కన్నీటి వ్యథ. అయినా చంద్రబాబు గుండె కరగడం లేదు. ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.
-ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే, పామర్రు
పేదలకు బెజవాడలో ఉండే హక్కులేదా?
విజయవాడ వన్‌టౌన్‌లో 1400 కుటుంబాలకు చెందిన పేదల ఇళ్లు తొలగిస్తామంటున్నారు. వాళ్లేం పాపం చేశారు. టీడీపీకీ ఓటెయ్యడమేనా వారు చేసిన పాపం. ప్రజలు ఆగ్రహిస్తే టీడీపీ ప్రభుత్వాన్ని తరిమికొడతారు. -వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్‌సీపీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వ కుట్రలు సాగనివ్వం
ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో రాజధాని ప్రాంతంలోని భూములు గుంజుకుంటోంది. ఆందోళనలతో రైతులు కంటి మీద కునుకులేకుండా జీవిస్తున్నారు.గ్రామకంఠాలను సైతం తీసు కుంటామని ప్రకటించడంతో రైతులు మనోవేదన కు గురవుతున్నారు. దౌర్జన్యంగా భూములు సేకరించడం ఆపాలి. - మర్రి రాజశేఖర్, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే
అన్యాయంగా రైతుల భూములను లాక్కుంటున్నారు. రైతు కూలీల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుం ది. గతంలో ఏర్పడ్డ ఏ రాష్ర్టంలోనూ రాజధానికి ఇంతగా భూములు తీసుకోలే దు. ఐదువేల ఎకరాలకు మించి అవసరంలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వేల ఎకరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు.
-సామినేని ఉదయభాను, అధికార ప్రతినిధి
అదరొద్దు, బెదరొద్దు
రాజధాని ప్రాంతంలో రైతులు, కూలీలకు భరోసా ఇచ్చేందుకే వైఎస్ జగన్ ఈ ధర్నా చేపట్టా రు. రైతులు, కూలీలు ప్రభుత్వ బెది రింపులకు అదరొద్దు, బెదరొద్దు. ఎవరు ఎప్పుడు కష్టాలలో ఉన్నా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. బలవంతపు భూసేకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని అడ్డుకుందాం. -కొలుసు పార్థసారథి, అధికార ప్రతినిధి
బాబుకు కనువిప్పు కలగాలి
చంద్రబాబుకు కనువిప్పుకలగాలి. అభివృద్ధికి మా పార్టీ వ్యతిరేకం కాదు. రైతుల్ని క్షోభపెట్టి భూమలు తీసుకోవడం సరికాదు. ఇలాగే వేలాది ఎకరాలు విదేశీ సంస్థలకు కట్టబెడుతూ పోతే రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత వస్తుంది. చంద్రబాబు చేస్తున్న మోసం, దుర్మార్గం ప్రజలు క్షమించరు. -జోగి రమేష్, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి,
మంత్రి నారాయణకు రైతుల గురించి ఏం తెలుసు?
విద్యా వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించిన మంత్రి నారాయణకు రైతు బాధలు ఏలా తెలుస్తాయి? ఎన్నికల్లో టీడీపీకి డబ్బు పెట్టుబడిగా పెడితే ఆ కృతజ్ఞతతో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. రైతుల ఇళ్లకొచ్చి మంత్రులు బెదిరింపులకు దిగడం సరికాదు. - లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు