చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!: వైఎస్‌ జగన్‌

Published Thu, Nov 21 2024 4:32 AM | Last Updated on Thu, Nov 21 2024 7:32 AM

YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt

ప్రజలపై యూజర్‌ ఛార్జీలు, పన్నులు, టోల్‌ ఛార్జీలు.. అదేనా మీ సూత్రం? 

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  

దాదాపు రూ.18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల భారం వేస్తావా?

మద్యం.. ఇసుక.. అంతా స్కామ్‌లే.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం

మీ సూపర్‌ సిక్స్‌ మోసాలు, అక్రమాలపై నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తారా?

మేం తెచ్చిన మెడికల్‌ కాలేజీలు, పోర్టులను స్కామ్‌ల కోసం అమ్మేస్తున్నారు

రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు.. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు.. సభలో పెట్టిన కాగ్‌ నివేదికలోనూ అదే ఉంది

మీ బడ్జెట్‌లో చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు?

ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? 

టీడీపీ హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్, కేంద్ర ఆర్థిక సంఘం నివేదికలు సైతం నిర్ధారించాయి.

బాబు హయాంతో పోలిస్తే వార్షిక అప్పుల వృద్ధి రేటు మా హయాంలో 9% తక్కువే

ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం

గతేడాది ఆగస్టు నుంచి వలంటీర్‌ వ్యవస్థ ఉనికిలో లేదంటూ దిక్కుమాలిన అబద్ధాలు

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఉద్యోగులకు ఐఆర్‌ ఎక్కడ?

టీడీపీ ప్రమోట్‌ చేసిన వెబ్‌సైట్లలోనే తనపై దారుణమైన పోస్టింగులతో 
దుష్ప్రచారం చేశారని.. అప్పుడే నా చెల్లెలు షర్మిల చెప్పిన మాట వాస్తవం కాదా?  

అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు రూ.18 వేల కోట్లు కరెంటు బిల్లులు బాదేశారు. ఇందులో రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్‌ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో రూ.11 వేల కోట్ల బాదుడు తర్వాతి నెలలో ఉంటుంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై జీఎస్టీ మీద ఒక శాతం సర్‌చార్జ్‌ విధించి, ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా?    

చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లి దండ్రులెవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్లతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక.. వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్లిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డయినా తింటాడు. ఏ అబద్ధమైనా ఆడతాడు. ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.      
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ప్రజలపై రోడ్డు ట్యాక్స్‌ వేస్తా అంటున్నారు. అలా వసూలు చేసిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టి అట. నిజంగా ఆయన బాదుడే బాదుడును నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారు. రోడ్లన్నీ మరమ్మతులు చేస్తానని ఎన్నికల్లో గొప్పగా మాట్లాడి.. ఈ రోజు ప్రజలు రోడ్డెక్కితే పన్నుల వాత పెడతామని చెబుతున్నారు. అలా అయితేనే రోడ్లు బాగు చేయిస్తాం.. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతేనని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి సీఎం అయ్యారు.  

సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే విద్యుత్‌ చార్జీలు.. యూజర్‌ చార్జీలు, టోల్‌ చార్జీలతో బాదడమేనని వ్యాఖ్యానించారు. దాదాపు రూ.18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడే ఇందుకు నిదర్శనమన్నారు. భావితరాల కోసం గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన విలువైన సంపద మెడికల్‌ కాలేజీలు, పోర్టులను స్కామ్‌ల కోసం అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. అప్పులపై బడ్జెట్‌లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? అత నిలదీశారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతి విషయంలోనూ బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా ముఠాలే  కనిపిస్తున్నాయన్నారు. 

‘మద్యంలో స్కామ్‌.. ఇసుకలో స్కామ్‌.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులతో స్కామ్‌.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే నియోజకవర్గాల్లో పనులు సాగని దుస్థితి.. ఎటు చూసినా నాకింత.. నీకింత! అని దోచుకోవడం.. పంచుకోవడమే! ఓవైపు సూపర్‌ సిక్స్‌లు లేవు.. సూపర్‌ సెవెన్‌లు లేవు.. మరోవైపు ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో అక్రమంగా నిర్బంధిస్తున్నారు’ అని మండిపడ్డారు. 

బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా పలు అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు.  

రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు కనిపిస్తున్నాయి. మద్యంలో ఒక స్కామ్, ఇసుకలో ఇంకో స్కామ్, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఎక్కడ పరిశ్రమలు, నిర్మాణాలు జరుగుతున్నా.. మైనింగ్‌ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే పనులు సాగని పరిస్థితి. అదానీ వాళ్లు ప్లాంట్‌ కడుతుంటే కూటమి ఎమ్మెల్యే చంద్రబాబు ప్రోద్బలంతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో నాకింత.. నీకింత అని దోచుకోవడం.. పంచుకోవడమే జరుగుతోంది.  

ఎన్నికలకు ముందు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు, విద్యుత్‌ చార్జీలు, రోడ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ, అప్పులు, రాష్ట్ర ప్రగతి, ఇండస్ట్రీ, పారిశ్రామిక వేత్తలు.. ఇవన్నీ గాక తల్లి, చెల్లి అంటూ నా కుటుంబం మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చంద్రబాబు మాట్లాడుతూనే ఉన్నాడు.

సూటిగా ఆయన్ను ఓ ప్రశ్న అడుగుతున్నా. నీకూ కుటుంబం ఉంది. మా కుటుంబంలో విబేధాలు ఉండొచ్చు. నువ్వు పెట్టే పోస్టులు కానీ, క్రూరమైన రాజకీయాలు కానీ, ఎవరూ చేయరు. నీలాంటి దుర్మార్గుడైతే తప్ప. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీసులో అధికారిక ప్రతినిధితో నన్ను ‘బోస్‌డికే’ అని తిట్టించాడు. అది దుర్మార్గం కాదా? నా చెల్లెలు షరి్మల మీద హైదరాబాద్‌  జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఈయన బావమరిది, లోకేశ్‌ మామ బాలకృష్ణ సొంత టవర్‌ ఎన్‌బీకే బిల్డింగ్‌ నుంచి తప్పుడు రాతలు రాయించి ప్రచారం చేయలేదా? హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో ఇది నిజమని తేలలేదా?  
 

స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమైతే, నిందితులను ఈడీ ఎందుకు అరెస్ట్‌ చేసింది? ఈడీ వాళ్ల ప్రాపర్టీస్‌ను అటాచ్‌ చేసింది. స్కిల్‌ స్కామ్‌ నుంచే ఆ డబ్బులన్నీ వెళ్లడంతో పక్కాగా స్కామ్‌ అని తేలడంతోనే వాళ్లను ఈడీ అరెస్ట్‌ చేసింది. అలాంటప్పుడు ఈ కేసులో చంద్రబాబును కూడా అరెస్ట్‌ చేయాలి కదా? డబ్బులు ఇచ్చింది చంద్రబాబే కదా?   

వాళ్లు ‘వివేకం’పేరిట ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తే తప్పు లేదు. రాంగోపాల్‌ వర్మ సినిమా తీసి సెన్సార్‌ బోర్డు అనుమతితో రిలీజ్‌ చేస్తే ఆ సినిమాలో తమను కించపరిచారంటూ ఆయనపై కేసులు పెడుతున్నారంటే వీళ్లను ఏమనాలి? సెన్సార్‌ బోర్డు అప్రూవల్‌తో విడుదలైన సినిమాను అడ్డం పెట్టుకొని ఆయన్ని పిలిపించే కార్యక్రమం చేస్తున్నారు. అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. ఇది ఇల్లీగల్‌ డిటెన్షన్‌ కాదా? సెన్సార్‌ బోర్డులు ఎందుకున్నట్టు?

సూమో క్లాసిక్‌ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్‌ లెన్సర్‌ విస్కీ, ట్రోపికానా వీసా బ్రాందీ, షార్ట్‌ విస్కీ, బ్రాందీ 99, కేరళా మాల్టెడ్‌ ఫైన్‌ విస్కీ.. ఇవన్నీ తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏమంటే.. ఇవన్నీ రూ.99 అని చెబుతున్నారు. నాణ్యతను తగ్గించి ఈ బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇదే కేరళ మాల్టెడ్‌ విస్కీ రూ.85కే దొరుకుతుంది. చంద్రబాబు మాత్రం రూ.99కి అమ్ముతున్నారు. నాణ్యత తగ్గించిన మద్యాన్ని వైఎస్సార్‌సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు ఉండే బ్రాండ్లు ఎమ్మార్పీ ఇప్పటికీ రూ.120నే. కానీ, ఎక్కడా ఆ ధరకు అమ్మట్లేదు.  
– వైఎస్‌ జగన్‌

ఉద్యోగులకు ఐఆర్‌ ఎక్కడ?
చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒకటవ తేదీనే జీతం అన్నారు. ఈ నెలలో మూడు వారాలు అయిపోతున్నా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులు అందరూ ఐఆర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం. చంద్రబాబు వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఐఆర్‌ ఊసే ఎత్తట్లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. మరి కొత్త పీఆర్సీ చైర్మన్‌ నియమించాలా లేదా?  మరో వైపు వలంటీర్లు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న వారి ఉద్యోగాలను పీకేశారు. 104, 108 ఉద్యోగులను పీకడానికి రెడీ అవుతున్నారు. హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు.

తనకు అనుకూలంగా ఉండే ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్‌పీ ఠాకూర్, యోగానంద్‌ వంటి రిటైర్డ్‌ అధికారులను ఓ జట్టుగా తయారు చేసి, చంద్రబాబు తన వద్ద కూర్చో బెట్టుకున్నారు. వీరు జిల్లాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారి పేర్లను టీడీపీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సేకరిస్తున్నారు. ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో ఫాలో అప్‌ చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీస విచారణ లేకుండా నిబంధనలకు విరుద్దంగా కేసులు బనాయిస్తున్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత కోర్టులకు కూడా హాజరు పర్చడం లేదు. ఎక్కడున్నారో తెలుసుకునేందుకు హెబియస్‌ కార్పస్‌ పిటీషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. రోజుల తరబడి వారి వద్దే పెట్టుకుని, కళ్లకు గంతలు గట్టి రకరకాల పోలీస్‌ స్టేషన్లు తిప్పుతూ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు కొట్టడమే కాదు.. వీడియోలు తీసి పైనున్న ఈ జట్టు అధికారులకు పంపుతున్నారు.   
– వైఎస్‌ జగన్‌

వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని దారుణంగా వంచించావు..
మాపై బండవేసే ప్రయత్నంలో భాగంగా 2023 ఆగస్టు నుంచే వలంటీర్‌ వ్యవస్థ లేదంటున్నారు. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్‌ అప్రూవల్‌ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతుందా? హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ లేకుండా జీతాలు ఇస్తారా? ఈయనేమో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ లేదంటారు. అయ్యా చంద్రబాబూ.. హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌లో 2515 మేజర్‌ హెడ్, 198 మైనర్‌ హెడ్, 52 సబార్డినేట్‌ హెడ్, 290 డీటైల్డ్‌ హెడ్, 293 అబ్జెక్ట్‌ హెడ్‌.. ఇవన్నీ వలంటీర్లకు సంబంధించి హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ నంబర్లు. ఇన్నేళ్లూ ఈ హెడ్‌ల కిందే జీతాలు ఇస్తున్నారు. ఫైనాన్స్‌ కాంకరెన్స్‌తో.. బడ్జెట్‌లో పెట్టి.. చంద్రబాబు సీఎం అయ్యే వరకు జీతాలు ఇస్తున్నా కూడా.. వలంటీర్లకు ఇచ్చిన హామీని ఎగరగొట్టి అబద్ధాలు, దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? నోరు తెరిస్తే అబద్ధాలు.. నోరు తెరిస్తే మోసం. ఇదీ చంద్రబాబు పరిపాలన.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనం వివరాలు 

వలంటీర్లపై దిక్కు మాలిన అబద్ధాలాడుతున్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా  ఆగస్టు 2023లోనే.. అంటే మా హయాంలోనే ‘ప్రస్తుతం వలంటీర్లు ఎవ్వరూ పని చేయట్లేదు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్‌ వ్యవస్థ ఉనికిలో లేదు’ అని చెబుతున్నారు. కానీ, ఈ ఏడాది వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు ఎన్ని అన్న ప్రశ్నకు మాత్రం రూ.277 కోట్లు అని సమాధానం ఇచ్చారు. అంటే ఈ సంవత్సరం జీతాలు ఇచ్చినట్టే కదా! ఎన్నికలప్పుడు వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది వాస్తవం కాదా బాబూ?  

వలంటీర్ల వ్యవస్థ ఉనికిలోనే లేదని.. వారికి గౌరవ వేతనం పెంపు అన్నది ఉత్పన్నమే కాదని తేల్చిచెప్పిన సర్కార్‌..  

పోలవరంలో విధ్వంసం బాబు ఘనతే
పోలవరంలో విధ్వంసానికి కారణం చంద్రబాబు విధానాలేనని తేల్చి చెబుతూ ఇటీవల అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు కట్టాక.. గోదావరి నదికి అడ్డంగా 2.5 కి.మీల పొడవునా ప్రధాన డ్యాం నిర్మించాలి. తొలుత పునాది డయాఫ్రం వాల్‌ వేసి, ఆ తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాలి.

⇒ కానీ.. కాంక్రీట్‌ పనుల్లో కమీషన్లు ఎక్కువగా రావని.. మట్టి పనుల్లో అయితే ఎక్కువ కమీషన్లు వస్తాయని స్పిల్‌ వే పునాది స్థాయిలో ఉండగానే చంద్రబాబు ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ వేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల పనులు చేపట్టారు. వరద ప్రవాహం స్పిల్‌ వే వైపు మళ్లించడం సాధ్యం కాకపోవడంతో కాఫర్‌ డ్యాంలకు ఇరు వైపులా 400 మీటర్లు, 300 మీటర్ల చొప్పున ఖాళీ ప్రదేశాలు వదిలేశారు. 2.5 కి.మీల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి వరద.. కుంచించుకుపోయి ప్రవహించడంతో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు కోతకు గురయ్యాయి. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్‌ కోతకు గురై దెబ్బతింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. 

⇒ మేం అధికారంలోకి వచ్చాక గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌ వేను 48 గేట్లతో సహా పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలకు మురమ్మతులు చేసి పూర్తి చేశాం. స్పిల్‌ వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతానికి మరమ్మతులు చేసి, యథాస్థితికి తీసుకొచ్చాం. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? లేక కొత్తది కట్టాలా అన్నది తేల్చాలని కేంద్రాన్ని కోరాం. దాన్ని తేల్చే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్రం అప్పగించింది. 

⇒ ఇప్పుడు ఆ కమిటీ వచ్చింది. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తయిన నేపథ్యంలో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య కొత్త డయా ఫ్రం వాల్‌ వేసి, ప్రధాన డ్యాంను పూర్తి చేయడానికి మార్గం సుగమం చేశాం. అయినా చంద్రబాబు గోబెల్స్‌ మాది­రిగా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్లకున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేయతగ్గ ముఠా మా దగ్గర లేదు.

ఐదేళ్లలో ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చావా? 
⇒ చంద్రబాబు హయాంలో ఒక్క నిరుపేద కుటుంబానికి కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? మేము 30.60 లక్షల కుటుంబాలకు అక్క చెల్లెమ్మల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 9.02 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్లు పునాదులు దాటి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఏకంగా 17 వేల జగనన్న కాలనీల్లో ఏకంగా ఊళ్లే తయారవుతున్నాయి. ఆ ఇళ్లన్నీ పూర్తయితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చంద్రబాబు హౌసింగ్‌ కార్యక్రమాన్ని ఆపేశారు.

⇒ మా ప్రభుత్వ హయాంలో సిమెంట్, స్టీలు, ఇతర సామగ్రిని సబ్సిడీపై, ఇసుకను ఉచితంగా ఇచ్చే వాళ్లం. ఇవి కాకుండా రూ.35 వేలు పావలా వడ్డీకి రుణంగా ఇచ్చే వాళ్లం. రూ.1.80 లక్షల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే వాళ్లం. అంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిలిపి వేసినందుకు నిరుపేదలందరూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారు. పేదల ఇళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో.. ఎందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో వీళ్లకే తెలీదు.

బినామీలకు దోచిపెట్టేందుకే అసైన్డ్‌పై దుష్ప్రచారం
⇒ అసైన్డ్‌ భూములపై నిస్సిగ్గుగా అబద్ధాలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రాక ముందు పేరుకే దళితులకు భూమి ఉండేది. దానిని అమ్ముకునే స్వేచ్ఛ లేదు. ఇంట్లో వాళ్లకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా, వారసుల పేరుపైకి బదిలీ చేయాలన్నా అగమ్య గోచర పరిస్థితి ఉండేది. రిజిస్ట్రేషన్‌ చేసి అమ్ముకోలేని నిస్సహాయ స్థితిలో శనక్కాయలకు.. పావలాకు, పది పైసలకు వేరే వాళ్లు కొనుక్కొని అనుభవించే వారు.

⇒ మేము అధికారంలోకి వచ్చాక పేదల జీవితాలు మార్చాలని ఆలోచించాం. 20 ఏళ్లు దాటిన అసైన్డ్‌ భూమి ఉన్న వారికి చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తూ సొంత భూములుగా మార్చాం. ఆ సొంత భూములను అమ్ముకుంటారా? వాళ్ల పిల్లలకు ఇచ్చుకుంటారా? వాళ్ల ఇష్టం. ఈ లోగా ఎవరైనా భూములు కొనుగోలు చేసి ఉంటే కూడా అవన్నీ ఒరిజినల్‌ అసైనీలకు వెళ్లిపోతాయి. వాళ్ల పేరుతోనే పట్టా వస్తుంది. 

కొన్న వాళ్లకు పట్టా రాదు. ఇలా హక్కులిచ్చి 15.21 లక్షల మంది రైతులకు, పేదలకు మంచి చేస్తే కూటమి నాయకులు నిస్సిగ్గుగా బురద వేస్తున్నారు. మళ్లీ పేదల దగ్గర నుంచి హక్కులు తీసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వారి హక్కులను రద్దు చేయనున్నారు. ఆ తర్వాత అవే భూములను పెత్తందార్లు 10 పైసలకు, 20 పైసలకు కొనుక్కోవచ్చు. వీళ్లకు మాత్రమే మంచి రేటు ఉండాలి. పేదలకు మాత్రం మంచి రేటు రాకూడదు.

⇒ చంద్రబాబు ఇచ్చిన ఒక మెమో ద్వారా 2.06 లక్షల ఎకరాలను ఉద్దేశ పూర్వకంగా నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టారు. 98 వేల మంది రైతులను నానా కష్టాలకు గురి చేస్తున్నారు. మేము నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించి.. రైతుల భూమిపై చంద్రబాబు చేసిన దాష్టీకం నుంచి విడుదల చేశాం. వారి భూములపై సర్వ హక్కులు కల్పించాం. అది తప్పంటున్నారు. 

⇒ ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను రద్దు చేసి 22వేల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. ఇది మరో విప్లవం. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్యలను పరిష్కరించి ఏకంగా 1.07 లక్షల మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. 33 వేల ఎకరాల షరతుల భూములపై 22 వేల మంది రైతులకు సర్వ హక్కులు కల్పించాం. ఇదంతా వాళ్లు తప్పంటున్నారు.  

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళలు అందరూ మాయమైపోతున్నారని దుష్ప్రచారం చేశారు. ఇందుకు వలంటీర్లు కారణమని, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు.. ఇప్పుడు డెప్యూటీ సీఎం ఊగిపోయాడు. వాళ్లు చేసిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌లో ఈ దుష్ప్రచారం ఒక భాగం. సాక్షాత్తు అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఐదేళ్లలో 46 మంది మాత్రమే మానవ అక్రమ రవాణాకు గురయ్యారని, కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని వాళ్లంతకు వాళ్లే చెప్పారు. గతంలో 30 వేల మంది మానవ అక్రమ రవాణా జరిగిందనే దుష్ప్రచారానికి, వలంటీర్లపై వీళ్లు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్‌స్టాప్‌ కాదా? 
– వైఎస్‌ జగన్‌

కేవలం  46 మంది మహిళలే అక్రమ రవాణాకు గురయ్యారని తేల్చిన కూటమి సర్కార్‌ 

మోసాలు, అక్రమాలు, వైఫల్యాలు నిలదీస్తే అక్రమ కేసులా?
సూపర్‌ సిక్స్‌లు లేవు.. సూపర్‌సెవెన్‌లు లేవు.. మరో వైపు అన్ని రకాలుగా రాష్ట్రం వైఫల్యం చెందింది. ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తే చాలు దారుణంగా వేధిస్తున్నారు. పోలీసులను అన్యాయంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల ద్వారా వాళ్ల నియోజకవర్గాల్లో ప్రైవేటు మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ నిర్బంధాలు (ఇల్లీగల్‌ డిటెన్షన్‌) చేస్తున్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.

⇒ కొట్టాం.. వీడియోలు తీశాం.. చూసి ఆనందించండి.. అని స్థానిక పోలీసులు పై వాళ్లకు పంపిస్తూ శాడిజం ప్రదర్శిస్తున్నారు. పైగా థర్డ్‌ డిగ్రీ దెబ్బలు చూపిస్తున్నారు. న్యాయ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఎఫ్‌ఐ­ఆర్‌లు అప్లోడ్‌ చేయడం లేదు. ఎఫ్‌ఐ­ఆర్‌ల కోసం బాధితుల బంధువులు పోలీస్‌ స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. ఇలా తప్పుడు కేసులతో అరెస్ట్‌ అయిన వారిని న్యాయవాదులు కష్టపడి బెయిల్‌పై బయటకు తీసుకొస్తుంటే మరో కేసు పెట్టి అరెస్ట్‌ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.

⇒ చంద్రబాబు అరాచకాలు ఇంతటితో ఆగిపోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చివరకు సినీ దర్శకులపై కూడా కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటలో ఎస్పీ ప్రోద్భలంతో సీఐ ద్వారా నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేశారు. తోటలో పని చేస్తున్న 55–60 ఏళ్ల వయసున్న వృద్ధురాలిని కొట్టి ఒప్పించే కార్యక్రమం చేశారు. మేజిస్ట్రేట్‌ ఎదుట తన దెబ్బలు చూపించి, జరిగిన విషయాన్ని ఆమె చెప్పడంతో ఆ సీఐని మేజిస్ట్రేట్‌ తిట్టి పంపించిన ఘటన వారం రోజుల క్రితం జరిగింది. తుదకు సినీ దర్శకులను కూడా వదలడం లేదు. వాళ్లేమో ఇష్టానుసారం సినిమాలు తీయొచ్చట.

⇒ రాష్ట్రంలో పేకాట జరుగుతుందని, తన నియోజకవర్గంలో నడుస్తోన్న పేకాట క్లబ్‌ను ఉదాహరణగా చూపుతూ పోస్టు పెట్టినందుకు మా ఎమ్మెల్యే చంద్రన్నపై కూడా కేసు పెట్టారు. ఆయనపై ఇప్పటి వరకు 8 కేసులు పెట్టారు. మరో దళిత ఎంపీ నందిగాం సురేష్‌పై కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశం ఆఫీసుపై దాడి చేశాడని కేసు పెట్టారు. ఆ రోజు ఆయన అసలు ఊళ్లోనే లేడు. అయినా అరెస్ట్‌ చేశారు. ఒక కేసులో బెయిల్‌పై బయటకొచ్చేలోగా మరో కేసు పెడుతున్నారు. అన్నీ దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, మాజీ ఎంపీ.. 70 రోజులుగా జైలులో ఉన్నాడు. మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజాలపై కూడా ఇష్టానుసారం కేసులు పెట్టారు.

⇒ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఒక వైపు కేసులు పెట్టడం, మరొక వైపు ఎవరైనా మాట్లాడితే అన్యాయంగా దూషించడం. ఇంకొక వైపు దుష్ప్రచారాలు చేయడం. ఇది చంద్రబాబు నైజం. టాపిక్‌ డైవర్షన్, తప్పుడు ప్రచారం, అబద్ధాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు స్పెషలిస్ట్‌. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్‌ అసాస్‌నేట్‌) చేయడంలో ప్రసిద్ధుడు. లక్ష్మీపార్వతితో మొదలు నా వరకు ఎలా ప్రచారం చేశారో చూశాం.

నా చెల్లిపై దుష్ఫ్రచారం చేసింది చంద్రబాబే 
⇒ చంద్రబాబు తప్పుడు ప్రచారంపై గతంలో నా చెల్లెలు షర్మిల ఏమన్నారో చూడండి. (వీడియోను ప్రదర్శిస్తూ..) ఆ వీడియోలో షర్మిల మాట్లాడుతూ.. ‘ఎన్బీకే బిల్డింగ్‌ నుంచి దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్‌ను బట్టి పోలీసులు చెబుతున్నారు. ఈ వెబ్‌సైట్‌లన్నీ ప్రొ టీడీపీ ప్రమోట్‌ చేసినవే. ప్రత్యర్థులను కించపరిచేవి. ఈ పోస్టింగ్‌లన్నీ బాలకృష్ణ బిల్డింగ్‌ నుంచి, ప్రో టీడీపీ సైట్‌ల నుంచి జరిగాయంటే బాలకృష్ణకు సంబంధం లేదని నేను ఎలా అనుకోవాలి? సంబంధం ఉంది కనుకే బాలకృష్ణ నా మీద నింద వేశారని, పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారని నేను విశ్వసిస్తున్నా. బాలకృష్ణ ఇలా దిగజారుడు తనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే చెప్పాలి’ అన్నారు.

⇒ మా ప్రభుత్వ హయాంలో వర్రా రవీంద్రారెడ్డి పేరిట ఐ టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్‌ ఒక ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి మా అమ్మను, మా చెల్లెలిని తిట్టించాడు. వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవ­రిలోనే ఉదయ్‌ భూషణ్‌ను ఆధారాలతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు ఎంత దారుణమైన నికృష్టుడంటే తన స్వార్థం కోసం ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం చేస్తాడు. వాళ్ల సానుభూతిపరులతో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేయించి,  వాళ్లతో మన వాళ్లను తిట్టిస్తాడు.

మద్యం, ఇసుక అంతా స్కామ్‌..
⇒ రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు దోచుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్‌ ఇస్తానన్నారు. మద్యం రేటు తగ్గిస్తానన్నారు. ఆశ్చర్యం ఏమంటే.. గతంలో చంద్రబాబు హయాంలో అవే డిస్టిలరీలు.. మా హయాంలో అవే.. ఇప్పుడు కూడా అవే డిస్టిలరీలు. మద్యం ఆదాయంలో చీప్‌ లిక్కర్‌ నుంచే 85 శాతం వస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత చీప్‌ లిక్కర్‌లో నాణ్యత తగ్గించారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ఎప్పుడూ మనం వినని, చూడని బ్రాండ్లు అవి.


⇒ అన్ని చోట్లా బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో బెల్టు షాపునకు.. ఒక్కో గ్రామంలో పోటీ పెట్టి వేలం వేస్తున్నారు. రూ.2 లక్షలకు పాడుకున్న వాడికే ఇస్తున్నారు. ఇలా మాఫియా రాజ్యం నడుస్తోంది. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మకోవాలంటే పోటీ ఎందుకు? ఎమ్మెల్యేలు మనుషులను ఎందుకు కిడ్నాప్‌ చేయించాలి.. ఎందుకు ఎవరినీ పాడనివ్వకుండా చేయాలి? వేరేవాళ్లకు వచ్చినా షాపులు నడుపుకోలేని పరిస్థితికి ఎందుకు నెట్టేయాలి? ఎమ్మార్పీ ప్లస్‌ మాఫియాకు కమీషన్‌ రావాలనే ఇదంతా చేస్తున్నారు.  ఇసుక పరిస్థితి కూడా అంతే. హామీ ఇచ్చినట్లు ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement