మృతిచెందిన మహాలక్ష్మి
తుళ్లూరు (తాడికొండ) : రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో టీడీపీ వర్గీయులు రాక్షసంగా ప్రవర్తించారు. నెక్కల్లు గ్రామంలో నడకదారి విషయమై ఏర్పడిన వివాదంలో న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళుతున్న బీసీలను కారుతో తొక్కించేశారు. ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతిచెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో పసుపులేటి భూపతిరావు, ఆలూరి బ్రహ్మయ్య ఇళ్ల మధ్య నడిచే దారి విషయంలో వివాదం చెలరేగింది. బీసీలైన భూపతిరావు, అక్కడున్న మహిళలను టీడీపీకి చెందిన ఆలూరి బ్రహ్మయ్య దుర్భాషలాడి మహిళలపై దాడి చేశారు. బాధితులు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు.
రోడ్డుపక్కనున్న వారిపైకి కారు నడిపి..
పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్డు మీద ఆటోకోసం ఎదురుచూస్తున్న వారి మీదుగా ఆలూరు బ్రహ్మయ్య కొడుకు ఆలూరు సుధాకర్‌బాబు కారు నడిపి తొక్కించేశాడు. ఆ సమయంలో కారులో బ్రహ్మయ్య, అతడి మరో కుమారుడు ఆలూరి అజయ్, వారి బంధువు యర్రమాసు శ్రీనివాసరావు ఉన్నారు. కారు కింద నలిగి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో పసుపులేటి మహాలక్ష్మి (65) మృతి చెందింది. వీరమ్మ, పసుపులేటి కాటరాలు, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాపయ్య, పసుపులేటి శిరీష, పసుపులేటి పిచ్చయ్య, వెంకటలక్ష్మి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణంపై తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తొలుత పరారైన నిందితులు తరువాత పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment