విలేకరులతో మాట్లాడుతున్న బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా చిత్రంలో సీఐలు కె.వెంకటేశ్వరరావు, ఎం.వెంకటనారాయణ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావుది రాజకీయ హత్యేనని పోలీసులు నిర్ధారించారు. రాజకీయంగా, సామాజికంగా మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు (టీడీపీ నాయకులు) ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. భవిష్యత్తులో మోకా రాజకీయంగా, సామాజికంగానూ మరింత బలపడితే తమకు మనుగడ ఉండదనే అక్కసుతో ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మోకాను హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మచిలీపట్నం ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఎదుగుదలను చూసి ఓర్వలేకనే...
మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు (57) బందరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి ముఖ్య అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. ముప్‌పై ఏళ్లుగా నియోజకవర్గ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న భాస్కరరావు పేర్ని నాని రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఆయనకు అనుచరుడిగా ఉంటూ 24వ వార్డుకు ఒక మారు కౌన్సిలర్‌గా పని చేశాడు. రెండు సార్లు మార్కెట్‌యార్డు చైర్మన్‌గా పని చేశారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన భాస్కరరావు అటు రాజకీయంగా, ఇటు సామాజికపరంగా మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీ తరఫున 24వ వార్డుకు నాయకుడిగా మోకా వ్యవహరిస్తున్నాడు.
అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు (మాజీ కౌన్సిలర్) చింతా చిన్నీకి, భాస్కరరావుకు మధ్య పారీ్టపరంగా, సామాజికపరంగా విభేధాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో టీడీపీ కౌన్సిలర్‌గా 24వ వార్డు ఉల్లింఘిపాలెంకు ప్రాతినిధ్యం వహించిన చింతా చిన్నీ అనేక కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడుతూ వచ్చాడు. భాస్కరరావు చిన్నీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుండగా గత ప్రభుత్వంలో చిన్నీ తన కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకుని గుమ్మటాలచెరువును ఆక్రమించి అక్రమంగా అమ్మేసుకున్నాడు. ఈ విషయంలో భాస్కరరావు పలుమార్లు చిన్నీని నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య వైరం మరింత పెరిగింది. చిన్నీ అవినీతి అక్రమాలను పదే పదే మోకా ఎండగడుతుండంతో వార్డులో చిన్నీ ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
పథకం ప్రకారమే హత్య
రాజకీయంగా, సామాజికంగా మోకా భాస్కరరావు వార్డులో మంచి పట్టు సాధించగా చింతా చిన్నీ టీడీపీ తరఫున వార్డులో పట్టు మరింత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో మోకా కారణంగా వార్డులో పట్టుకోల్పోతున్నామన్న అక్కసు పెంచుకున్న చింతా చిన్నీ తన రాజకీయ మనుగడ కోసం మోకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన పెదనాన్న కుమారుడు చింతా నాంచారయ్య అలియాస్ పులి, అన్న కుమారుడు చింతా కిషోర్ (16)లతో కలిసి మోకాను ఎలాగైనా అంతమొందించి వార్డులో తన పట్టు నిలబెట్టుకోవాలని పథకం రచించాడు. అందుకోసం నాలుగు రోజుల పాటు మోకా కదలికలను చింతా చిన్నీ గమనిస్తూ వచ్చాడు. మోకా భాస్కరరావు నాలుగు రోజులుగా చేపలమార్కెట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వస్తుండటం గమనించిన చిన్నీ గత నెల 29వ తేదీన మోకా హత్యకు పన్నాగం పన్నాడు.
ఆ రోజు ఉదయం మోకా భాస్కరరావు ఇంటి నుంచి బయలుదేరింది మొదలు ఆయన ప్రతి కదలికను చింతా చిన్నీ గమనిస్తూ వచ్చాడు. మోకా మార్కెట్ వద్దకు ఒంటరిగా రావటాన్ని గమనించిన చిన్నీ అతని బందువులైన నాంచారయ్య, కిషోర్‌లను మార్కెట్ వద్దకు పిలిచి మోకా ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో అప్పటికే ఆయుధాలతో వచ్చిన నాంచారయ్య, కిషోర్‌లు మార్కెట్‌లో ఒంటరిగా ఉన్న భాస్కరరావుపై దాడి చేసి కొబ్బరిపీచు వలిచే ఆయుధంతో గుండెల్లో మూడు పోట్లు పొడిచారు. దీంతో భాస్కరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి చేసిన ఇరువురిని చిన్నీ వాహనాలపై అక్కడి నుంచి తప్పించాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆటోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మోకా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మోకా భాస్కరరావు హత్యకేసులో చింతా చిన్నీ ప్రధాన నిందితుడు కాగా చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే జరిగిందంటూ కుటుంబసభ్యులు ఆరోపించటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతా చిన్నీ, నాంచారయ్య, కిషోర్‌లతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. మోకా హత్యకేసుకు సంబంధించి మరింత దర్యాప్తు నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించటం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. అలాగే ఈ కేసులో మరి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని పూర్తి వివరాలు అతి తొందరలోనే విలేకరులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. సమావేశంలో ఆర్‌పేట, చిలకలపూడి సీఐలు కడలి వెంకటేశ్వరరావు, మోర్ల వెంకటనారాయణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment