త్వరలో ప్రమాదరహిత వోల్వో బస్సులు
Published Sat, Nov 30 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రయాణికుల రక్షణార్థం ప్రమాద రహిత వోల్వో బస్సులను ప్రవేశపెట్టేలా ఆ సంస్థతో తమిళనాడు రవాణాశాఖాధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. బస్సు డిజైన్‌లో అధికారులు సూచించిన మార్పులకు వోల్వో యాజమాన్యం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న రెండు వోల్వో బస్సుప్రమాదాల్లో 52 మంది మృతి చెందడం, తమిళనాడు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేసింది. రెండు బస్సులు ప్రయివేటు సంస్థలకు చెందినవే కావడంతో తమిళనాడులోని ఆమ్నీ ప్రయివేటు బస్సుల యాజ మాన్యంతో తొలుత చర్చలు జరిపారు. 80 కిలోమీటర్ల కంటే వేగంగా నడపరాదని, ప్రతి 150 కిలోమీటర్లకు బస్సు డ్రైవర్ మారాలని, బస్సులోని భద్రతా ఏర్పాట్లను ప్రయాణికులకు వివరించాలని ఆదేశించారు.
అలాగే వోల్వో బస్సు తయారీదారులతో సైతం చర్చలు నిర్వహించి కొన్ని మార్పులను సూచించారు. ప్రమాదం సం భవిస్తే ప్రయాణికులు సులభంగా బయటపడేలా డిజైన్‌లో మార్పులు తీసుకురావాలని కోరారు. అగ్నిని ఆర్పేందుకు ఆధునిక పరికరం, విమానాల్లో లాగా బ్లాక్‌బాక్స్, 85 కిలోమీటర్ల స్పీడ్ కం ట్రోల్ పరికరాన్ని అమర్చాలని కోరారు. ప్రమా దం జరిగినపుడు సులభంగా పగులగొట్టేలా బస్సు అద్దాలు అమర్చాలని సూచించారు. ప్రస్తు తం వోల్వో బస్సులో నాలుగు అద్దాలు మాత్రమే పగులగొట్టేందుకు వీలున్నాయి. డీజిల్ ట్యాంకును సైతం మార్చాలని కోరగా, ప్రస్తుతం తాము అమరుస్తున్న డీజిల్ ట్యాంకు చాలా సురక్షితమైనదని వోల్వో సంస్థ అధికారులు నచ్చజెప్పారు. తమ సూచనలన్నింటికీ వోల్వో బస్సు తయారీ సంస్థ అంగీకరించినట్లు తమిళనాడు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement