నిబంధనలకు పాతర !
పట్టుబడ్డ ప్రైవేటు బస్సుల్లో సగం వోల్వోలే
పాలెం ఘటన తర్వాతా బస్సుల్లో బాణసంచా తరలింపు
అదనపు ఆదాయం కోసం లారీల తరహాలో సరుకు రవాణా
అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న దిమ్మతిరిగే వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రహదారులపై పరుగులుపెడుతున్న వోల్వో బస్సుల సంఖ్య 650. పాలెం దుర్ఘటన తర్వాత రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో ఇప్పటి వరకు జప్తు చేసిన వోల్వో బస్సుల సంఖ్య 320. రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో ఈ సంఖ్యే స్పష్టం చేస్తోంది. 45 నిండుప్రాణాలను బలి తీసుకున్న పాలెం దుర్ఘటన తర్వాత కూడా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు రాలేదనటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. పాలెం దుర్ఘటన జరిగిన మూడు రోజులకే... రెండు బస్సులు లగేజీ బాక్సులో బాణసంచాను తరలిస్తూ పట్టుబడ్డాయి. రవాణా శాఖ అధికారులవి తాటాకు చప్పుళ్లే అని బలంగా విశ్వసించే ట్రావెల్స్ యజమానులు యథాప్రకారం నిబంధనలు కాలరాస్తూ బస్సులను నడుపుతున్నారు. వోల్వో ఎగ్జాస్ట్ సిస్టమ్‌కు చేరువగా ఉండే లగేజీ బాక్సులో నిప్పు పుట్టించే వస్తువులు ఉంచకూడదు.
కానీ కాసుల కోసం పెద్ద సంఖ్యలో వస్తువులను తరలించే అలవాటున్న బస్సు నిర్వాహకులు బాణసంచాను కూడా తరలించేందుకు సిద్ధపడ్డారు. అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగు చూడటంతో.. ఆ రెండు బస్సులను జప్తు చేయటమే కాక.. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా శాఖ అధికారులు, పాలెం దుర్ఘటన తర్వాత ఏ ఒక్క బస్సునూ వదలకుండా తనిఖీలు చేస్తూ నిబంధనలను విస్మరిస్తున్న వాటిని అక్కడికక్కడే జప్తు చేస్తున్నారు. ఇదే పని ఇప్పటికే చేసి ఉంటే నిబంధనలు అపహాస్యం అయిఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ తనిఖీలైనా ఎంతకాలం కొనసాగుతాయన్నదే అసలు ప్రశ్న. గతఏడాది జూన్‌లో శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాదానికి గురై 32 మంది చనిపోయినప్పుడు ఇలాగే తనిఖీలు చేసి.. 500 బస్సుల వరకు సీజ్ చేసిన అధికారులు ఆ తర్వాత చూసీచూడనట్టు వ్యవహరిం చారు. ఇప్పుడు కూడా ఈ హడావుడి మధ్యలో నిలిచిపోయే అవకాశం లేకపోలేదు.
ఉల్లంఘనలెన్నో: ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలుగా ఉండే అత్యవసర ద్వారం వద్ద కొంతమేర ఖాళీ వదలాలి. ఆ స్థలంలో అదనపు సీట్లను బిగించిన వ్యవహారాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. బస్సుల్లో అదనపు ప్రయాణికులు కూర్చోవటానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పాలెం ఘటనలో ఈ అదనపు సీట్ల వల్లే ప్రాణనష్టం పెరిగింది. కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి పొంది స్టేజి క్యారియర్‌గా నడుపుతున్న బస్సులపైనా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటకలో ప్రమాదానికి గురైన బస్సు ఇలాంటి నిబంధన ను అతిక్రమించిందే.
మన రాష్ట్రంలోనూ మూడొంతుల బస్సులు ఇలాగే అనుమతి లేకుండా నడుస్తున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లుండాలి. ఆరు గంటల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్ మారాలి. కానీ 90% బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా లగేజీ బాక్సులో సరుకులు బట్వాడా చేస్తున్నారు. ప్రయాణికుల తాలూకు వస్తువులు ఉంచాల్సిన చోట లారీల తరహాలో సరుకు రవాణా చేస్తూ ట్రావె ల్స్ నిర్వాహకులు అదనపు ఆదాయం పొందుతున్నారు. బస్సులో ప్రయాణికుల వివరాలతో జాబితా ఉండాలి. కానీ మూడొంతుల బస్సుల్లో అది ఉండటం లేదు. ఉన్నా అందులోని వివరాలకు.. ప్రయాణిస్తున్న వారి వివరాలకు పొంతన ఉండటం లేదు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు కొందరు మృతుల వివరాలు దొరక్కపోవటానికి ఇదే కారణం.
వోల్వోను వదిలించుకుందాం!
చారణా కోడికి బారాణా మసాలా అనే హైదరాబాదీ సామెత రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నడుపుతున్న వోల్వో బస్సులకు అతికినట్టు సరిపోతుంది. వీటి ఖరీదు దాదాపు రూ. కోటి. పైగా చిన్న చిన్న మరమ్మతులకు కూడా లక్షల్లో చమురు వదులుతోంది. పైగా వీటితో ఆదాయం మాట అటుంచి నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. తెల్ల ఏనుగులుగా మారిన బస్సులను వదిలించుకోవాలని ఏపీటీడీసీ నిర్ణయించిందని సమాచారం. ఇకపై విదేశీ తయారీ వాహనాలను కొనుగోలు చేయబోదంటున్నారు.
2002- 2005 మధ్య కొన్న ఒక్కోటీ దాదాపు రూ.60 లక్షల చొప్పున కొన్న 11 వోల్వో బస్సులను తుక్కు కింద సంస్థ అమ్మకానికి పెట్టింది! కానీ వాటిని కొనేందుకు ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ఇవి పోను ఏపీటీడీసీ నడిపే 106 బస్సు సర్వీసుల్లో మరో 20 వోల్వోలు, 8 మెర్సిడస్ బెంజ్ వాహనాలున్నాయి. వోల్వో బస్సు ఖరీదు ప్రస్తుతం రూ.85 లక్షల నుంచి రూ. 1.08 కోట్లుంది. అదే దేశీయ తయారీ హైటెక్ ఏసీ బస్సు రూ.35 లక్షలుంది. అంటే ఒక్క వోల్వోకు వెచ్చించే మొత్తంతో మూడు హైటెక్ ఏసీ బస్సులను సమకూర్చుకోవచ్చు.