Travels Owners
-
ముంబై నుంచి తెలంగాణ: ఈ జర్నీ చాలా కాస్ట్లీ గురూ!
సాక్షి, హైదరాబాద్: కరోనా భయంతో సొంతూళ్లకు బయలుదేరిన వలసజీవికి ఎంత కష్టం.. ఎంత నష్టం! పట్నంలో ఉండలేమని పల్లెబాట పట్టినవారికి ఎంత కష్టం.. ఎంత నష్టం! వారిని ప్రైవేట్ బస్ ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. టికెట్ల ధరలు విపరీతంగా పెంచి ఇక్కట్ల పాలు చేస్తున్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్న ముంబై నగరం నుంచి తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చేరాల్సిన తమకు ఈ బస్సుల్లో ప్రయాణించే పరిస్థితిలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి రోజుకు వేలాది మంది తెలంగాణకు వస్తున్నారు. ఇందులో చాలామంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైళ్లలో సీట్లు దొరకనివారు, అత్యవసరంగా వెళ్లాలనుకున్నవారు మాత్రం బస్సులను ఆశ్రయిస్తున్నారు. వలసజీవుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు ముంబై నుంచి నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల వరకు అమాంతం టికెట్ ధరలు పెంచేశారు. రూ.700 ఉన్న టికెట్ ధరను రూ.1200లకు, రూ.900 ఉన్న టికెట్‌ను రూ.1,800–2,000 వరకు పెంచారని వలసకారి్మకులు వాపోతున్నారు. ముంబై నుంచి రైల్లో నిజామాబాద్ వరకు స్లీపర్‌లో వెళితేనే రూ.400 టికెట్ ఉందని, కానీ ఈ బస్సుల్లో సిట్టింగ్‌కే విపరీతంగా వసూలు చేయడంతో బస్సులు ఎక్కాలంటే భయమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా విపరీతంగా వసూలు చేయడమే కాకుండా ముంబై దాటిన తర్వాత చంబూరు, మాన్కూరు వద్ద పుణె వెళ్లే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, మధ్యలో సీట్లు వేసి కూర్చోబెడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. బస్సు కిటకిటలాడే విధంగా ప్రయాణికులను ఎక్కించడమే కాకుండా కనీసం శానిటైజర్లు కూడా బస్సుల్లో ఉంచడం లేదని చెబుతున్నారు. దీనికితోడు బస్సుల్లో విపరీతమైన దుర్గంధం వస్తోందని అంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, ఏం చేయలేని పరిస్థితుల్లో సొంత గ్రామాలకు వెళ్లేందుకు వేరే అవకాశం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నామని వాపోతున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ‘ముంబై నుంచి తెలంగాణలోని సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్న వలసజీవులను ప్రైవేటు బస్ ఆపరేటర్లు దోపిడీ చేస్తున్నారు. అమాంతం టికెట్ ధరలు పెంచి ఇష్టమైతే బస్ ఎక్కాలని, లేదంటే వెళ్లిపోవాలని హుకూం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఐదు ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండింతల ధర పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న ఆపరేటర్లు బస్సుల్లో కనీసం కరోనా నిబంధనలు పాటించడం లేదు. ప్రయాణించినంత సేపు దుర్గంధం మధ్య ఉండాల్సి వస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ దోపిడీని అరికట్టాలి’ – మూల్నివాసి మాల, తెలంగాణ జేఏసీ చైర్మన్, ముంబై చదవండి: కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్ -
కార్ల లీజు పేరుతో దందా
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. కార్ల లీజుతో దందా నడుపుతున్న గ్యాంగును బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. అడపా ప్రసాద్, పోతురాజు షణ్ముక ప్రసాద్ గ్యాంగ్ ట్రావెల్స్ యాజమానులను మాయమాటలతో బుట్టలో వేసుకున్నారు. అత్యధిక అద్దె చెల్లిస్తామని చెప్పి వారి దగ్గర కార్లను లీజుకు తీసుకున్నారు. వాటిని ఎంఎన్సీ కంపెనీలలో అద్దెకు ఇస్తామని నమ్మబలికి అగ్రిమెంట్లు సైతం రాసుకున్నారు. అలా సుమారు వంద కార్లను తీసుకుని ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టుపెట్టి రూ.4.5 కోట్ల వరకు అప్పు తీసుకుని జల్సాలు చేశారు. తీరా అగ్రిమెంట్ మేరకు తమకు నెలవారీ రెంట్లు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన ట్రావెల్స్ యాజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు బండారం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా వెల్లడించారు. -
నిబంధనలకు పాతర !
పట్టుబడ్డ ప్రైవేటు బస్సుల్లో సగం వోల్వోలే పాలెం ఘటన తర్వాతా బస్సుల్లో బాణసంచా తరలింపు అదనపు ఆదాయం కోసం లారీల తరహాలో సరుకు రవాణా అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న దిమ్మతిరిగే వాస్తవాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రహదారులపై పరుగులుపెడుతున్న వోల్వో బస్సుల సంఖ్య 650. పాలెం దుర్ఘటన తర్వాత రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో ఇప్పటి వరకు జప్తు చేసిన వోల్వో బస్సుల సంఖ్య 320. రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో ఈ సంఖ్యే స్పష్టం చేస్తోంది. 45 నిండుప్రాణాలను బలి తీసుకున్న పాలెం దుర్ఘటన తర్వాత కూడా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు రాలేదనటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. పాలెం దుర్ఘటన జరిగిన మూడు రోజులకే... రెండు బస్సులు లగేజీ బాక్సులో బాణసంచాను తరలిస్తూ పట్టుబడ్డాయి. రవాణా శాఖ అధికారులవి తాటాకు చప్పుళ్లే అని బలంగా విశ్వసించే ట్రావెల్స్ యజమానులు యథాప్రకారం నిబంధనలు కాలరాస్తూ బస్సులను నడుపుతున్నారు. వోల్వో ఎగ్జాస్ట్ సిస్టమ్‌కు చేరువగా ఉండే లగేజీ బాక్సులో నిప్పు పుట్టించే వస్తువులు ఉంచకూడదు. కానీ కాసుల కోసం పెద్ద సంఖ్యలో వస్తువులను తరలించే అలవాటున్న బస్సు నిర్వాహకులు బాణసంచాను కూడా తరలించేందుకు సిద్ధపడ్డారు. అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగు చూడటంతో.. ఆ రెండు బస్సులను జప్తు చేయటమే కాక.. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా శాఖ అధికారులు, పాలెం దుర్ఘటన తర్వాత ఏ ఒక్క బస్సునూ వదలకుండా తనిఖీలు చేస్తూ నిబంధనలను విస్మరిస్తున్న వాటిని అక్కడికక్కడే జప్తు చేస్తున్నారు. ఇదే పని ఇప్పటికే చేసి ఉంటే నిబంధనలు అపహాస్యం అయిఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ తనిఖీలైనా ఎంతకాలం కొనసాగుతాయన్నదే అసలు ప్రశ్న. గతఏడాది జూన్‌లో శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాదానికి గురై 32 మంది చనిపోయినప్పుడు ఇలాగే తనిఖీలు చేసి.. 500 బస్సుల వరకు సీజ్ చేసిన అధికారులు ఆ తర్వాత చూసీచూడనట్టు వ్యవహరిం చారు. ఇప్పుడు కూడా ఈ హడావుడి మధ్యలో నిలిచిపోయే అవకాశం లేకపోలేదు. ఉల్లంఘనలెన్నో: ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలుగా ఉండే అత్యవసర ద్వారం వద్ద కొంతమేర ఖాళీ వదలాలి. ఆ స్థలంలో అదనపు సీట్లను బిగించిన వ్యవహారాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. బస్సుల్లో అదనపు ప్రయాణికులు కూర్చోవటానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పాలెం ఘటనలో ఈ అదనపు సీట్ల వల్లే ప్రాణనష్టం పెరిగింది. కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి పొంది స్టేజి క్యారియర్‌గా నడుపుతున్న బస్సులపైనా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటకలో ప్రమాదానికి గురైన బస్సు ఇలాంటి నిబంధన ను అతిక్రమించిందే. మన రాష్ట్రంలోనూ మూడొంతుల బస్సులు ఇలాగే అనుమతి లేకుండా నడుస్తున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లుండాలి. ఆరు గంటల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్ మారాలి. కానీ 90% బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా లగేజీ బాక్సులో సరుకులు బట్వాడా చేస్తున్నారు. ప్రయాణికుల తాలూకు వస్తువులు ఉంచాల్సిన చోట లారీల తరహాలో సరుకు రవాణా చేస్తూ ట్రావె ల్స్ నిర్వాహకులు అదనపు ఆదాయం పొందుతున్నారు. బస్సులో ప్రయాణికుల వివరాలతో జాబితా ఉండాలి. కానీ మూడొంతుల బస్సుల్లో అది ఉండటం లేదు. ఉన్నా అందులోని వివరాలకు.. ప్రయాణిస్తున్న వారి వివరాలకు పొంతన ఉండటం లేదు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు కొందరు మృతుల వివరాలు దొరక్కపోవటానికి ఇదే కారణం. వోల్వోను వదిలించుకుందాం! చారణా కోడికి బారాణా మసాలా అనే హైదరాబాదీ సామెత రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నడుపుతున్న వోల్వో బస్సులకు అతికినట్టు సరిపోతుంది. వీటి ఖరీదు దాదాపు రూ. కోటి. పైగా చిన్న చిన్న మరమ్మతులకు కూడా లక్షల్లో చమురు వదులుతోంది. పైగా వీటితో ఆదాయం మాట అటుంచి నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. తెల్ల ఏనుగులుగా మారిన బస్సులను వదిలించుకోవాలని ఏపీటీడీసీ నిర్ణయించిందని సమాచారం. ఇకపై విదేశీ తయారీ వాహనాలను కొనుగోలు చేయబోదంటున్నారు. 2002- 2005 మధ్య కొన్న ఒక్కోటీ దాదాపు రూ.60 లక్షల చొప్పున కొన్న 11 వోల్వో బస్సులను తుక్కు కింద సంస్థ అమ్మకానికి పెట్టింది! కానీ వాటిని కొనేందుకు ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ఇవి పోను ఏపీటీడీసీ నడిపే 106 బస్సు సర్వీసుల్లో మరో 20 వోల్వోలు, 8 మెర్సిడస్ బెంజ్ వాహనాలున్నాయి. వోల్వో బస్సు ఖరీదు ప్రస్తుతం రూ.85 లక్షల నుంచి రూ. 1.08 కోట్లుంది. అదే దేశీయ తయారీ హైటెక్ ఏసీ బస్సు రూ.35 లక్షలుంది. అంటే ఒక్క వోల్వోకు వెచ్చించే మొత్తంతో మూడు హైటెక్ ఏసీ బస్సులను సమకూర్చుకోవచ్చు.