సాక్షి, హైదరాబాద్: కంచికి చేరిన ఏసీ సిటీ బస్సు కథ మలుపుతిరిగింది. ఆ బస్సులకు మంచిరోజులు వచ్చాయి. సరికొత్తరూపులో దూరప్రాంతాలకు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్ రోడ్లపై కార్ల ప్రవాహాన్ని కొంతమేర తగ్గించేందుకు అప్పట్లో వోల్వో ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టగా క్రమంగా వాటికి ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో అవి రాజధాని బస్సులుగా రూపాంతరం చెందుతున్నాయి. మియాపూర్‌లోని ఆర్టీసీ బస్‌బాడీ వర్క్‌షాపులో ఇవి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. సాధారణ సీట్లను తొలగించి కొత్తగా పుష్‌బ్యాక్ సీట్లను అమర్చి, రంగులు మారుస్తున్నారు.
మెట్రో రైలు రాక, కోవిడ్ కాక...
2015లో వోల్వో ఏసీ బస్సులను నగరంలో ప్రవేశపెట్టారు. ఒక్కోదానికి రూ.రెండు కోట్లు వెచ్చించి 80 బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఇప్పట్లో అది ఆ సంస్థకు ఆర్థికంగా భారమే. తొలుత ఈ బస్సులకు డిమాండ్ క్రమంగా పెరిగింది. సాధారణ బస్సుల్లో కి.మీ.కు ఆదాయం (ఈపీకే) రూ.35 నుంచి రూ.40 వరకు ఉండగా, వీటిల్లో రూ.70 వరకు నమోదైంది. కొంతకాలానికి హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడంతో ఈ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గింది.
మరోవైపు డీజిల్ ధరలు పెరగడం ఆరంభించాయి. సాధారణ బస్సుల్లో మైలేజీ లీటరుకు సగటున 5 కి.మీ. ఉండగా ఈ ఏసీ బస్సుల్లో 2 కి.మీ.గానే నమోదైంది. దీంతో నష్టాలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం సమ్మె దీర్ఘకాలం నడవటంతో ప్రయాణికులు ఈ బస్సులకు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. ఆ తర్వాత ఇవి మొదలైనా మునుపటి రద్దీ లేకుండా పోయింది. దీంతో అధికారులు చాలాబస్సులను పక్కన పెట్టేశారు. అదేసమయంలో కోవిడ్‌తో కథ పూర్తిగా మారిపోయింది. రోజుకు నాలుగైదు బస్సులను తిప్పినా ఎక్కేవారు లేక నష్టాలను పెంచుతుండటంతో పార్కింగ్ యార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో వాటిని ‘ఇంద్ర’గా మార్చి మళ్లీ రోడ్డెక్కించబోతున్నారు.
డిమాండ్ మేరకు..
హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల మధ్య ఇంద్ర బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఏసీ బస్సులు కావటం, ప్రయాణం సుఖవంతంగా ఉండటంతో కాస్త టికెట్ ధర ఎక్కువైనా ప్రయాణానికి జనం ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇంద్ర బస్సులకు ఉన్న కొరతను తీర్చేందుకుగాను ఈ వోల్వోబస్సులకు కొత్తరూపు ఇచ్చారు.
గతంలో సంక్రాంతి లాంటి రద్దీ సమయంలో కొన్ని సిటీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను విజయవాడకు తిప్పారు. కానీ, సీట్లు సౌకర్యంగా లేకపోవటం, సామగ్రి పెట్టుకునే చోటు లేక ఆ ప్రయత్నం అంతగా ఫలించలేదు. దీంతో దూరప్రాంత ప్రయాణాలకు అనువుగా వీటిల్లో పుష్‌బ్యాక్ సీట్లను అమరుస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ సహా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పట్టణాలకు తిప్పాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment