'ఢీ'వాకర్‌! | special story on private bus accidents | Sakshi
Sakshi News home page

అనంతలో డేంజర్‌ ట్రావెల్స్‌

Published Thu, Jan 25 2018 9:19 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

special story on private bus accidents - Sakshi

ఆత్మకూరు వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొన్న దివాకర్‌ట్రావెల్స్‌ బస్సు (ఫైల్‌)

నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద జబ్బార్‌ ట్రావెల్స్, కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద దివాకర్‌ ట్రావెల్స్‌ నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలను పొట్టనపెట్టుకుందో తెలిసిందే. అనుభవం లేని డ్రైవర్లు.. విశ్రాంతి లేని డ్యూటీలు..     కండీషన్‌ లేని బస్సులు.. వీటన్నింటికీ మించి అధికారుల బాధ్యతారాహిత్యం.. వెరసి ప్రైవేటు జర్నీ ‘డేంజర్‌ హారన్‌’ మోగిస్తోంది. గతంలో పాలెం, ముండ్లపాడు వద్ద జరిగిన రెండు బస్సులతో పాటు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలకు సంబంధించిన ట్రావెల్స్‌ బస్సులు ‘అనంతపురం’ జిల్లాకు చెందినవి కావడం.. అందునా ఒకే ప్రైవేటు ట్రావెల్స్‌వి కావడం     కలకలం రేపుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో 28 మంది ఆపరేటర్లు ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు. వీరంతా అనంతపురంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర కేంద్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలుస్తోంది. అనంతపురంలో 28 బస్సులకు స్టేట్, 8 బస్సులకు ఆల్‌ ఇండియా పర్మిట్‌ ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులతో కలిపి 230 వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రధానంగా ఈ బస్సులు వెళ్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో చాలా వరకు అనుభవం కలిగిన డ్రైవర్లు లేరు. చాలా ట్రావెల్స్‌ ఒకే డ్రైవరుతో సర్వీసులను తిప్పుతున్నారు. రవాణాశాఖ నిబంధనలు పాటించకుండా తిప్పే సర్వీసులు చాలా ఉన్నాయి. అక్కడక్కడా ప్రమాదాలు జరిగినా, కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండా మధ్యలోనే బస్సులు మెరాయించినా, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. దీనికి కారణం ట్రావెల్స్‌ యజమానులకు, ఆర్టీఏ అధికారులకు ఉన్న సత్ససంబంధాలే.

తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యం
జిల్లాలోని చాలా ట్రావెల్స్‌లో బస్సులకు కిటికీలు లేవు. పూర్తిగా అద్దంతో క్లోజ్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న హైటెక్‌ బస్సులలో ఏదైనా ప్రమాదం జరిగితే డోర్‌లాక్‌ అయిపోతుంది. ప్రయాణికులు బస్సులో నుంచి బయట పడే మార్గమే ఉండట్లేదు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఏ అద్దాన్నైనా పగులగొట్టవచ్చనే సూచీలు ఎక్కడా లేవు. అద్దాలు పగులకొట్టినా పగిలే పరిస్థితి లేదు. కనీసం ఎమర్జెన్సీ విండోస్‌ కూడా అమర్చలేదు. స్లీపర్‌ కోచ్‌లలో అయితే పరిస్థితి మరీ దారుణం. చాలా ట్రావెల్స్‌లో స్మోక్‌ అలారమ్‌లు లేవు. బస్సులో ఏదైనా రిపేరు వచ్చినా, ప్రమాదవశాత్తు పొగవస్తే వెంటనే అలారమ్‌ మోగుతుంది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగే లోపు ప్రయాణికులు బస్సు దిగే అవకాశం ఉంది. ఈ అలారమ్‌లు ఎక్కడా కనిపించవు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు సర్వీసులు ఒకే డ్రైవర్‌ నడిపే పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఈ నిబంధనను ట్రావెల్స్‌ పట్టించుకోవడం లేదు. దీనిపై ఆర్టీఏ తనిఖీలు లేవు.

చర్యలు అసలే ఉండవు. బస్సు టాప్‌పై స్థాయికి మించి లగేజీని తీసుకెళ్తున్నా ఎవరూ ప్రశ్నించారు. చాలా ప్రైవేటు ట్రావెల్స్‌లలో బస్సులు నడిపే వారు లారీ డ్రైవర్లు అని తెలుస్తోంది. వీరు ఒకసారి డ్యూటీకి వెళితే 10–15రోజుల వరకూ ఇళ్లకు రారని సమాచారం. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయడం కూడా ప్రమాదానికి కారణమే. ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్న ట్రావెల్స్‌లో ఒకటి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే జేసీ బ్రదర్స్‌ది కావడంతో ఏ ప్రమాదం జరిగినా.. ఎలా నడిచినా అడిగే నాథుడే కరువయ్యాడు.

ఆర్టీసీ బస్‌స్టాప్‌ల వద్దే స్టాపింగ్‌లు
ప్రైవేటు ట్రావెల్స్‌ ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆపి ప్రయాణికులను ఎక్కించడం, దింపడం చేయకూడదు. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం బస్టాప్‌లకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపాలి. కానీ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాప్‌ల వద్దే ప్రైవేటు బస్సులు ఆపుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా దీన్ని అరికట్టలేకపోవడం గమనార్హం.

పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి
గతంలో జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగ్నికి ఆహుతై 45మంది దుర్మరణం చెందారు. అప్పట్లో కలెక్టర్‌ ఆదేశాలతో తనిఖీలు చేసి భారీగా బస్సులను నిలిపేశారు. బస్సులు ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా గమ్యం చేరుస్తామని అప్పట్లో లెటర్లు తీసుకుని బస్సులను అనుమతించారు. నిజానికి లెటర్లో చూపినట్లు ట్రావెల్స్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ తర్వాత అధికారులు కూడా ట్రావెల్స్‌ను తనిఖీ చేద్దాం? నిబంధనల మేరకు నడుస్తున్నాయా? లేదా? అనే దిశగా ఆలోచించని పరిస్థితి. ఈ కారణంగా ‘డేంజర్‌ జర్నీ’ తరచూ ప్రాణాలను బలితీసుకుంటోంది.

తనిఖీలు చేస్తున్నాం
ప్రయాణం 8 గంటలు దాటితే కచ్చితంగా రెండో డ్రైవర్‌ ఉండాల్సిందే. డ్రైవర్లకు హెవీలైసెన్స్‌ తప్పనిసరి. బస్సు 80–100 కిలోమీటర్ల వేగంతోనే నడపాలి. ఇప్పుడు చాలా బస్సులకు జీపీఎస్‌లు కూడా ఏర్పాటు చేశారు. బస్సు ఎంత స్పీడ్‌తో వెళ్తుందో వివరాలు ఎప్పటికప్పుడు ట్రావెల్స్‌ హెడ్‌ ఆఫీసుకు తెలిసిపోతుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. – సుందర్, డీటీసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement