Diwakar Travels bus
-
దివాకర్ బస్సు సీజ్
కళ్యాణదుర్గం: రవాణాశాఖ అనుమతులు లేని రూట్లలో తిరుగుతున్న దివాకర్ బస్సును మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సీజ్ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించడంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నాగరాజు నాయక్, మధుసూధన్‌రెడ్డి, మణి, అనంతపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరసింహులు వివిధ రూట్లలో వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏపీ 39 ఎక్స్7699 నంబర్ గల దివాకర్ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా అడ్డుకుని రికార్డులను పరిశీలించి బస్సును సీజ్ చేశారు. అనంతపురం– మొలకాల్మూరు రాకపోకలు సాగించే దివాకర్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా మరో రూట్లో వస్తుండటంతో పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం సదరు నంబర్ గల దివాకర్ బస్సు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుండ్లపల్లి, రాయదుర్గం మీదుగా మొలకాల్మూరుకు రాకపోకలు సాగించాలి. అలా కాకుండా మొలకాల్మూరు నుంచి తిరుగు ప్రయాణంలో వస్తున్న సదరు దివాకర్ బస్సు రాయదుర్గం, గుండ్లపల్లి, బెళుగుప్ప మీదుగా వెళ్ళకుండా గుండ్లపల్లి నుంచి నేరుగా కళ్యాణదుర్గంకు వస్తుండగా బళ్ళారి బైపాస్ రోడ్డులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అడ్డుకున్నారు. 38 మంది ప్రయాణికులతో వస్తున్న దివాకర్ బస్సును సీజ్ చేసి అనంతపురంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా అధిక లోడ్‌తో చిత్రదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి వస్తున్న మరో సంస్థకు చెందిన ప్రైవేటు బస్సుపై కూడా కేసు నమోదు చేశారు. -
పంపకానికి ‘దివాకర్’ చీరలు.., సీజ్
సాక్షి, హిందూపురం: దివాకర్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 1,500 చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి బయలుదేరగా...తూమకుంట చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా రూరల్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు పది మూటల్లో ఉన్న 1,500 చీరలను గుర్తించారు. వాటికి ఎలాంటి రసీదులు లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీ చేసేందుకే చీరలు తరలిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు వాటిని స్వాధీనం చేస్తుకున్నారు. అలాగే బస్సులో సిగరేట్ బాక్సులు భారీగా ఉండగా.. వాటి రికార్డులు చూపించారు. కర్టాటక మద్యం బాటిళ్లు స్వాధీనం ఎక్సైజ్ పోలీసులు తూమకుంట చెక్‌పోస్టు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా..ఎనిమిది బాటిళ్ల కర్ణాటక మద్యం లభించింది. మద్యం అక్రమంగా తరలిస్తున్న మానేంపల్లి హనుమంతప్పను అరెస్టుచేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐలు ఉమాదేవి, మల్లికార్జున తెలిపారు. -
దివాకరా.. అదుపు లేదా!
ముదిగుబ్బ : మరమ్మతు కోసం మదనపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు గురువారం ముదిగుబ్బ వద్ద అదుపుతప్పింది. కేజీబీవీ పాఠశాల వద్ద చెట్టును ఢీ కొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సుకు ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. -
దివాకర్ బస్సుది ‘రాంగ్‌రూటే’
అనంతపురం సెంట్రల్: వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఏపీ05 డబ్ల్యూ 8556 నంబరుగల దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తున్నది రాంగ్ రూటేనని రోడ్డు రవాణా శాఖ అధికారులు నిర్దారించారు. రెండురోజుల క్రితం ఈ బస్సు బెళుగుప్ప మండల పరిధిలో అతివేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదానికి గురై 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గతంలో వ్యవసాయ అనుబంధ ‘ఆత్మ’ డీడీ రమణ ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టి.. ఆయన మృతికి కారణమైంది. ఇలా వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఈ బస్సు కర్ణాటక ప్రభుత్వం నుంచి పర్మిట్ పొందింది ఒక రూటైతే.. ప్రయాణికులను ఎక్కించుకుంటున్నది మరో రూట్ కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్‌వద్దీ సదరు ట్రావెల్స్ యజమాన్యానికి బుధవారం నోటీసులు పంపారు. -
దివాకర్’ అంటే హడల్
అనంతపురం సెంట్రల్: ప్రజల ప్రాణాలను బలిగొంటున్న దివాకర్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. లైసెన్సు లేకపోయినా...పర్మిట్ గడువు ముగిసినా ముక్కుపిండి జరిమానా విధించే అధికారులు దివాకర్‌రెడ్డి ట్రావెల్స్ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నా... చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 17 మంది గాయపడినా... దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఏపీ05డబ్ల్యూ8556 బస్సు సోమవారం బెళుగుప్ప మండల పరిధిలో అతివేగంతో వెళ్తూ గుంతల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సుకు పర్మిట్ లేకపోవడం... రవాణాశాఖ అధికారులు అడినప్పటికీ డ్రైవర్ లైసెన్స్ చూపకపోవడం గమనార్హం. వాస్తవానికి మరోదారిలో వెళ్లేందుకు కర్ణాటకలో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పొందిన ఈ బస్సును నిబంధనలకు విరుద్ధంగా వేరేదారిలో తిప్పుతున్నారు. గతేడాది నవంబర్ 3న కూడా వ్యవసాయశాఖలో ‘ఆత్మ’ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రమణను కూడా దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బలిగొంది. వరుస ప్రమాదాలకు కారణమవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నా... దివాకర్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారపార్టీ నాయకులు కావడంతోనే జీ హుజూర్ అంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
'ఢీ'వాకర్!
నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్, కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలను పొట్టనపెట్టుకుందో తెలిసిందే. అనుభవం లేని డ్రైవర్లు.. విశ్రాంతి లేని డ్యూటీలు.. కండీషన్ లేని బస్సులు.. వీటన్నింటికీ మించి అధికారుల బాధ్యతారాహిత్యం.. వెరసి ప్రైవేటు జర్నీ ‘డేంజర్ హారన్’ మోగిస్తోంది. గతంలో పాలెం, ముండ్లపాడు వద్ద జరిగిన రెండు బస్సులతో పాటు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలకు సంబంధించిన ట్రావెల్స్ బస్సులు ‘అనంతపురం’ జిల్లాకు చెందినవి కావడం.. అందునా ఒకే ప్రైవేటు ట్రావెల్స్‌వి కావడం కలకలం రేపుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో 28 మంది ఆపరేటర్లు ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు. వీరంతా అనంతపురంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర కేంద్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అనంతపురంలో 28 బస్సులకు స్టేట్, 8 బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులతో కలిపి 230 వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రధానంగా ఈ బస్సులు వెళ్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో చాలా వరకు అనుభవం కలిగిన డ్రైవర్లు లేరు. చాలా ట్రావెల్స్ ఒకే డ్రైవరుతో సర్వీసులను తిప్పుతున్నారు. రవాణాశాఖ నిబంధనలు పాటించకుండా తిప్పే సర్వీసులు చాలా ఉన్నాయి. అక్కడక్కడా ప్రమాదాలు జరిగినా, కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండా మధ్యలోనే బస్సులు మెరాయించినా, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. దీనికి కారణం ట్రావెల్స్ యజమానులకు, ఆర్టీఏ అధికారులకు ఉన్న సత్ససంబంధాలే. తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యం జిల్లాలోని చాలా ట్రావెల్స్‌లో బస్సులకు కిటికీలు లేవు. పూర్తిగా అద్దంతో క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న హైటెక్ బస్సులలో ఏదైనా ప్రమాదం జరిగితే డోర్‌లాక్ అయిపోతుంది. ప్రయాణికులు బస్సులో నుంచి బయట పడే మార్గమే ఉండట్లేదు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఏ అద్దాన్నైనా పగులగొట్టవచ్చనే సూచీలు ఎక్కడా లేవు. అద్దాలు పగులకొట్టినా పగిలే పరిస్థితి లేదు. కనీసం ఎమర్జెన్సీ విండోస్ కూడా అమర్చలేదు. స్లీపర్ కోచ్‌లలో అయితే పరిస్థితి మరీ దారుణం. చాలా ట్రావెల్స్‌లో స్మోక్ అలారమ్‌లు లేవు. బస్సులో ఏదైనా రిపేరు వచ్చినా, ప్రమాదవశాత్తు పొగవస్తే వెంటనే అలారమ్ మోగుతుంది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగే లోపు ప్రయాణికులు బస్సు దిగే అవకాశం ఉంది. ఈ అలారమ్‌లు ఎక్కడా కనిపించవు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు సర్వీసులు ఒకే డ్రైవర్ నడిపే పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఈ నిబంధనను ట్రావెల్స్ పట్టించుకోవడం లేదు. దీనిపై ఆర్టీఏ తనిఖీలు లేవు. చర్యలు అసలే ఉండవు. బస్సు టాప్‌పై స్థాయికి మించి లగేజీని తీసుకెళ్తున్నా ఎవరూ ప్రశ్నించారు. చాలా ప్రైవేటు ట్రావెల్స్‌లలో బస్సులు నడిపే వారు లారీ డ్రైవర్లు అని తెలుస్తోంది. వీరు ఒకసారి డ్యూటీకి వెళితే 10–15రోజుల వరకూ ఇళ్లకు రారని సమాచారం. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయడం కూడా ప్రమాదానికి కారణమే. ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్న ట్రావెల్స్‌లో ఒకటి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే జేసీ బ్రదర్స్‌ది కావడంతో ఏ ప్రమాదం జరిగినా.. ఎలా నడిచినా అడిగే నాథుడే కరువయ్యాడు. ఆర్టీసీ బస్‌స్టాప్‌ల వద్దే స్టాపింగ్‌లు ప్రైవేటు ట్రావెల్స్ ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆపి ప్రయాణికులను ఎక్కించడం, దింపడం చేయకూడదు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బస్టాప్‌లకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపాలి. కానీ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాప్‌ల వద్దే ప్రైవేటు బస్సులు ఆపుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా దీన్ని అరికట్టలేకపోవడం గమనార్హం. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి గతంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఆగ్నికి ఆహుతై 45మంది దుర్మరణం చెందారు. అప్పట్లో కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేసి భారీగా బస్సులను నిలిపేశారు. బస్సులు ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా గమ్యం చేరుస్తామని అప్పట్లో లెటర్లు తీసుకుని బస్సులను అనుమతించారు. నిజానికి లెటర్లో చూపినట్లు ట్రావెల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ తర్వాత అధికారులు కూడా ట్రావెల్స్‌ను తనిఖీ చేద్దాం? నిబంధనల మేరకు నడుస్తున్నాయా? లేదా? అనే దిశగా ఆలోచించని పరిస్థితి. ఈ కారణంగా ‘డేంజర్ జర్నీ’ తరచూ ప్రాణాలను బలితీసుకుంటోంది. తనిఖీలు చేస్తున్నాం ప్రయాణం 8 గంటలు దాటితే కచ్చితంగా రెండో డ్రైవర్ ఉండాల్సిందే. డ్రైవర్లకు హెవీలైసెన్స్ తప్పనిసరి. బస్సు 80–100 కిలోమీటర్ల వేగంతోనే నడపాలి. ఇప్పుడు చాలా బస్సులకు జీపీఎస్‌లు కూడా ఏర్పాటు చేశారు. బస్సు ఎంత స్పీడ్‌తో వెళ్తుందో వివరాలు ఎప్పటికప్పుడు ట్రావెల్స్ హెడ్ ఆఫీసుకు తెలిసిపోతుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. – సుందర్, డీటీసీ -
మృత్యు శకటం
మలుపు ప్రాంతంలో అతివేగంగా దూసుకొచ్చిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రిప్రాంతం మిన్నంటింది. తనకల్లు: నల్లచెరువు మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మండలం దేవరింటిపల్లికి చెందిన ఆనంద్ (45) ఇదే మండలం తవలంమర్రి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. స్నేహితుని భార్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చూసేందుకని సోమవారం తన ద్విచక్రవాహనాన్ని నల్లచెరువులో ఉంచి.. బస్సులో అనంతపురం వెళ్లాడు. అక్కడ ఆస్పత్రికెళ్లి పరామర్శించిన అనంతరం తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు తిరుగుపయనమయ్యాడు. నల్లచెరువుకు చేరుకునే సరికి బాగా పొద్దుపోయింది. అక్కడి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. సాయిబాబా గుడి సమీపంలోని మలుపువద్దకు రాగానే మదనపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 02 టీసీ 9666) వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు ఆనంద్ ఎగిరి కిందపడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. విషాదఛాయలు నలుగురికీ సహాయం చేసే గుణం, అందరినీ కలుపుకుపోయే తత్వం, మంచి మనిషిగా పేరున్న ఉపాధ్యాయుడు ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో నల్లచెరువు మండల వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆనంద్‌కు భార్య అమరజ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన దివాకర్ ట్రావెల్స్ బస్సు
తండ్రి, కుమార్తెకు గాయాలు చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గురువారం రాత్రి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ద్విచక్ర వాహ నాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యా యి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లికి చెందిన కందుకూరి నర్సింహ ద్విచక్ర వాహనంపై అతని ఇద్దరు పిల్లలతో కలసి జాతీయ రహదారి మీదుగా చిన్నకొండూరు క్రాస్‌రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదే సమయంలో హైదరా బాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. ఇది ఏమాత్రం గమనించకుండానే డ్రైవర్ సాంబయ్య బస్సును అదే వేగంతో ముందుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కిందపడి పోయిన ముగ్గురిని పైకి లేపి వెంటనే పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది వేగంగా దూసుకుపోతున్న బస్సును వెంబడించారు. అర కిలోమీటర్ దూరం వెళ్లాక బస్సు దొరికింది. డ్రైవర్‌ను కిందకు దింపి దాడి చేశారు. తీసుకెళ్లి పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఈ ప్రమాదంలో నర్సింహ అరికాలు మణికట్టులో ఎముక విరిగింది. అతడి కుమార్తె పల్లవికి ఎడమ చేయికి తీవ్ర గాయమైంది. -
ఏపీలో రాక్షస పాలనకు నేడు నిరసనలు
-
రూ.20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కొలుసు పార్ధసారథి నందిగామ రూరల్ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొలుసు పార్ధసారథి స్పష్టం చేశారు. పెనుగంచిప్రోలు మండలం, ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది మృత్యువాత పడగా, మిగిలిన వారు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సారథి నందిగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించడంతో పాటు క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్న నేపథ్యంలో అధికారులు హడావుడిగా తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి తరలించే ప్రయత్నం చేశారు. ఈ చర్యను సారథితో పాటు పలువురు పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం, ట్రావెల్స్ యాజమాన్యం స్వార్థం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. మృతులు, క్షతగాత్రులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. చనిపోయిన వారితో పాటు గాయపడిన వారిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారని, వారికి చంద్రన్న బీమా పథకం ఎలా వర్తిస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల వంతున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము డిమాండ్ చేసిన విధంగా నష్ట పరిహారం చెల్లించే వరకు మృతదేహాలను తరలించేందుకు అంగీకరించబోమని భీష్మించారు. దీంతో కలెక్టర్ బాబు.ఎ, ఎస్పీ జి.విజయకుమార్ నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూనే మరో పక్క పోలీసుల సాయంతో వారిని అక్కడ నుంచి పంపివేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సామినేని ఉదయభాను, తిరువూరు శాసనసభ్యుడు రక్షణ నిధి, అధికార ప్రతినిధి జోగి రమేష్, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగ న్మోహనరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఘోరం..!
ప్రైవేట్ బస్సు ప్రమాదంలో పది మంది దుర్మరణం ⇒ మరో 32 మందికి గాయాలు.. ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు ⇒ దుర్ఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒ బాధిత కుటుంబాలకు పరామర్శ... ధైర్యం కోల్పోవద్దని ఓదార్పు.. ⇒ మృతదేహాలను పోస్టుమార్టం చేయకుండానే మూట కట్టటంపై ఆగ్రహం మృత్యువు మింగేసింది..... నిద్ర మత్తులోనే కర్కశంగా కబళించింది... వేకువ వెలుగుకు ముందే ప్రాణాల్ని తోడేసింది.... నెత్తుటి ముద్దల్ని మిగిల్చింది... మృతదేహాల్ని మూటగట్టింది... ఆశల్ని, ఆశయాల్ని, బతుకుల్ని, బంగారు కలల్ని చిదిమేసింది... కన్నవారికి, కట్టుకున్న వారికి, తోబుట్టువులకు, బంధువులకు విషాదాన్ని మిగిల్చింది... ప్రైవేట్ బస్సురూపంలో దూసుకొచ్చిన మృత్యువు కల్వర్టులో కాపు కాసి 10 మందిని బలిగొంది..మరో 32 మందిని గాయపరిచింది... భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారు జామున 5.45 గంటలకు పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. సాక్షి, అమరావతి బ్యూరో : ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం వెరసి పది మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 32మంది గాయాలపాలయ్యారు. కొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన సమయంలో ఆ పది మంది అయినవారి చూపునకు శాశ్వతంగా దూరమయ్యారు. పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం తెల్లవారు జామున బందరు–ముంబై జాతీయ రహదారిపై దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా దుర్ఘటన సంభవించినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. దీంతో అటువైపు వెళ్తున్న కొందరు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని నందిగామ, విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత బంధువులు ఆసుపత్రులకు చేరుకుని అయినవారి కోసం ఆరా తీశారు. ప్రమాదంలో మృతి చెందిన పదిమందిలో ఎక్కువ మంది వివాహితులే . ప్రమాదం నుంచి బయటపడిన వారు దుర్ఘటనను తలచుకుని భయభ్రాంతులకు గురయ్యారు. భువనేశ్వర్ నుంచి అతివేగంగా హైదరాబాద్ వెళ్తున్న బస్సు రహదారి డివైడర్‌ను ఢీకొట్టి..ఆ వెంటనే గాల్లోకి లేచి 150 మీటర్ల దూరంలో ఉన్న కల్వర్టులో పడిపోవటం భయం గొల్పిందన్నారు. టీడీపీ నేతల రాజకీయంపై బాధితుల ఆగ్రహం ... దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ నేతల చేస్తున్న రాజకీయం స్థానికులు, బాధితుల బంధువులకు ఆగ్రహం తెప్పించింది. వారికి కొందరు అధికారులు వంతపాడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం కనిపించింది. బాధితులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి తరలిరావటం వారికి మనోధైర్యాన్నిచ్చింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేయకుండానే తెల్ల సంచిలో మూటగట్టి అప్పగించటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల కోసం బంధువుల ఆర్తనాదాలు ఓ వైపు.. బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇంకో వైపు టీడీపీ నేతల ఆరాచకాలతో నందిగామ అట్టుడికింది. ఏమి జరిగిందో తెలియదు.. గాఢనిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి బస్సులో అందరూ చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఏమయిందో తెలీదు. కొంత సేపటికి ప్రమాదం జరిగిందని తెలిసింది. చుట్టూ చీకటి ఉంది. స్థానికులు వచ్చి బయటకు తీశారు. వైజాగ్‌లో బస్సు ఎక్కి హైదరాబాద్ వెళుతున్నాను. సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాను. – ఏ.కృష్ణవర్ధన్, వైజాగ్, ప్రయాణికుడు ఆరు గంటల పాటు క్షతగాత్రులకు సేవలు బస్సు ప్రమాదానికి ముందు నా కారుని ఓవర్ టేక్ చేసి వెళ్లింది. కొద్ది నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది. ఆసమయంలో ఎవరూ లేరు. బస్సులో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు సాయం చేశాను. – శ్రీనివాసరావు, నూజివీడు కన్నీరు.. మున్నీరు ... ప్రమాదంలో మరణించిన వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలం, ఆసుపత్రుల వద్ద కన్నీరు మున్నీరుగా విలపించటం కనిపించింది. చనిపోయిన వారి జ్ఞాపకాలు, నివాసం నుంచి వెళ్లే సమయంలో వారి చివరి మాటలను గుర్తుచేసుకుంటూ రోదించిన తీరు చూపరుల కంట తడిపెట్టించింది. నందిగామ ఆసుపత్రి వద్ద తొమ్మిదేళ్ల చిన్నారి ‘అమ్మా.. నాన్నను చూడాలి’ అంటూ తన తల్లిని పలుమార్లు అడుగుతుండటాన్ని చూసిన బంధువులు.. ‘మీ నాన్న ఇకలేరమ్మా’ అంటూ రోదించడం కనిపించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నల్లబోతు కృష్ణారెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటనా స్థలంలో మృతిచెందిన నల్లబోతు శేఖర్‌రెడ్డికి ఈయన స్వయానా సోదరుడు. ఇద్దరూ నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందినవారు. అన్నదమ్ముల మృతి గురించి తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించటం కనిపించింది.