రోదిస్తున్న కుటుంబ సభ్యులు, ఇన్‌సెట్‌లో ఆనంద్ (ఫైల్) ప్రమాదానికి కారణమైన దివాకర్ బస్సు
మలుపు ప్రాంతంలో అతివేగంగా దూసుకొచ్చిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రిప్రాంతం మిన్నంటింది.
తనకల్లు: నల్లచెరువు మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మండలం దేవరింటిపల్లికి చెందిన ఆనంద్ (45) ఇదే మండలం తవలంమర్రి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. స్నేహితుని భార్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చూసేందుకని సోమవారం తన ద్విచక్రవాహనాన్ని నల్లచెరువులో ఉంచి.. బస్సులో అనంతపురం వెళ్లాడు. అక్కడ ఆస్పత్రికెళ్లి పరామర్శించిన అనంతరం తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు తిరుగుపయనమయ్యాడు.
నల్లచెరువుకు చేరుకునే సరికి బాగా పొద్దుపోయింది. అక్కడి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. సాయిబాబా గుడి సమీపంలోని మలుపువద్దకు రాగానే మదనపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 02 టీసీ 9666) వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు ఆనంద్ ఎగిరి కిందపడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ ప్రసాద్‌బాబు తెలిపారు.
విషాదఛాయలు
నలుగురికీ సహాయం చేసే గుణం, అందరినీ కలుపుకుపోయే తత్వం, మంచి మనిషిగా పేరున్న ఉపాధ్యాయుడు ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో నల్లచెరువు మండల వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆనంద్‌కు భార్య అమరజ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment