బైక్‌ను ఢీకొట్టిన దివాకర్ ట్రావెల్స్ బస్సు
తండ్రి, కుమార్తెకు గాయాలు
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గురువారం రాత్రి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ద్విచక్ర వాహ నాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యా యి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లికి చెందిన కందుకూరి నర్సింహ ద్విచక్ర వాహనంపై అతని ఇద్దరు పిల్లలతో కలసి జాతీయ రహదారి మీదుగా చిన్నకొండూరు క్రాస్‌రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదే సమయంలో హైదరా బాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు బైకును వెనుక నుంచి ఢీకొట్టింది.
ఇది ఏమాత్రం గమనించకుండానే డ్రైవర్ సాంబయ్య బస్సును అదే వేగంతో ముందుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కిందపడి పోయిన ముగ్గురిని పైకి లేపి వెంటనే పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది వేగంగా దూసుకుపోతున్న బస్సును వెంబడించారు. అర కిలోమీటర్ దూరం వెళ్లాక బస్సు దొరికింది. డ్రైవర్‌ను కిందకు దింపి దాడి చేశారు. తీసుకెళ్లి పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. ఈ ప్రమాదంలో నర్సింహ అరికాలు మణికట్టులో ఎముక విరిగింది. అతడి కుమార్తె పల్లవికి ఎడమ చేయికి తీవ్ర గాయమైంది.