
ఘోరం..!
ప్రైవేట్ బస్సు ప్రమాదంలో పది మంది దుర్మరణం
⇒ మరో 32 మందికి గాయాలు.. ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు
⇒ దుర్ఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
⇒ బాధిత కుటుంబాలకు పరామర్శ... ధైర్యం కోల్పోవద్దని ఓదార్పు..
⇒ మృతదేహాలను పోస్టుమార్టం చేయకుండానే మూట కట్టటంపై ఆగ్రహం
మృత్యువు మింగేసింది..... నిద్ర మత్తులోనే కర్కశంగా కబళించింది... వేకువ వెలుగుకు ముందే ప్రాణాల్ని తోడేసింది.... నెత్తుటి ముద్దల్ని మిగిల్చింది... మృతదేహాల్ని మూటగట్టింది... ఆశల్ని, ఆశయాల్ని, బతుకుల్ని, బంగారు కలల్ని చిదిమేసింది... కన్నవారికి, కట్టుకున్న వారికి, తోబుట్టువులకు, బంధువులకు విషాదాన్ని మిగిల్చింది... ప్రైవేట్ బస్సురూపంలో దూసుకొచ్చిన మృత్యువు కల్వర్టులో కాపు కాసి 10 మందిని బలిగొంది..మరో 32 మందిని గాయపరిచింది... భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారు జామున 5.45 గంటలకు పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది.
సాక్షి, అమరావతి బ్యూరో : ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం వెరసి పది మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 32మంది గాయాలపాలయ్యారు. కొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన సమయంలో ఆ పది మంది అయినవారి చూపునకు శాశ్వతంగా దూరమయ్యారు. పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం తెల్లవారు జామున బందరు–ముంబై జాతీయ రహదారిపై దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా దుర్ఘటన సంభవించినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. దీంతో అటువైపు వెళ్తున్న కొందరు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ తరువాత ఒక్కొక్కరుగా చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని నందిగామ, విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత బంధువులు ఆసుపత్రులకు చేరుకుని అయినవారి కోసం ఆరా తీశారు. ప్రమాదంలో మృతి చెందిన పదిమందిలో ఎక్కువ మంది వివాహితులే . ప్రమాదం నుంచి బయటపడిన వారు దుర్ఘటనను తలచుకుని భయభ్రాంతులకు గురయ్యారు. భువనేశ్వర్ నుంచి అతివేగంగా హైదరాబాద్ వెళ్తున్న బస్సు రహదారి డివైడర్‌ను ఢీకొట్టి..ఆ వెంటనే గాల్లోకి లేచి 150 మీటర్ల దూరంలో ఉన్న కల్వర్టులో పడిపోవటం భయం గొల్పిందన్నారు.
టీడీపీ నేతల రాజకీయంపై బాధితుల ఆగ్రహం ...
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ నేతల చేస్తున్న రాజకీయం స్థానికులు, బాధితుల బంధువులకు ఆగ్రహం తెప్పించింది. వారికి కొందరు అధికారులు వంతపాడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం కనిపించింది. బాధితులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి తరలిరావటం వారికి మనోధైర్యాన్నిచ్చింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేయకుండానే తెల్ల సంచిలో మూటగట్టి అప్పగించటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల కోసం బంధువుల ఆర్తనాదాలు ఓ వైపు.. బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇంకో వైపు టీడీపీ నేతల ఆరాచకాలతో నందిగామ అట్టుడికింది.
ఏమి జరిగిందో తెలియదు..
గాఢనిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి బస్సులో అందరూ చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఏమయిందో తెలీదు. కొంత సేపటికి ప్రమాదం జరిగిందని తెలిసింది. చుట్టూ చీకటి ఉంది. స్థానికులు వచ్చి బయటకు తీశారు. వైజాగ్‌లో బస్సు ఎక్కి హైదరాబాద్ వెళుతున్నాను. సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాను.
– ఏ.కృష్ణవర్ధన్, వైజాగ్, ప్రయాణికుడు
ఆరు గంటల పాటు క్షతగాత్రులకు సేవలు
బస్సు ప్రమాదానికి ముందు నా కారుని ఓవర్ టేక్ చేసి వెళ్లింది. కొద్ది నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది. ఆసమయంలో ఎవరూ లేరు. బస్సులో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు సాయం చేశాను.
– శ్రీనివాసరావు, నూజివీడు
కన్నీరు.. మున్నీరు ...
ప్రమాదంలో మరణించిన వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలం, ఆసుపత్రుల వద్ద కన్నీరు మున్నీరుగా విలపించటం కనిపించింది. చనిపోయిన వారి జ్ఞాపకాలు, నివాసం నుంచి వెళ్లే సమయంలో వారి చివరి మాటలను గుర్తుచేసుకుంటూ రోదించిన తీరు చూపరుల కంట తడిపెట్టించింది. నందిగామ ఆసుపత్రి వద్ద తొమ్మిదేళ్ల చిన్నారి ‘అమ్మా.. నాన్నను చూడాలి’ అంటూ తన తల్లిని పలుమార్లు అడుగుతుండటాన్ని చూసిన బంధువులు.. ‘మీ నాన్న ఇకలేరమ్మా’ అంటూ రోదించడం కనిపించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నల్లబోతు కృష్ణారెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటనా స్థలంలో మృతిచెందిన నల్లబోతు శేఖర్‌రెడ్డికి ఈయన స్వయానా సోదరుడు. ఇద్దరూ నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందినవారు. అన్నదమ్ముల మృతి గురించి తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించటం కనిపించింది.