
రూ.20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కొలుసు పార్ధసారథి
నందిగామ రూరల్ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొలుసు పార్ధసారథి స్పష్టం చేశారు. పెనుగంచిప్రోలు మండలం, ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది మృత్యువాత పడగా, మిగిలిన వారు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సారథి నందిగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించడంతో పాటు క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో అధికారులు హడావుడిగా తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి తరలించే ప్రయత్నం చేశారు.
ఈ చర్యను సారథితో పాటు పలువురు పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం, ట్రావెల్స్ యాజమాన్యం స్వార్థం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. మృతులు, క్షతగాత్రులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. చనిపోయిన వారితో పాటు గాయపడిన వారిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారని, వారికి చంద్రన్న బీమా పథకం ఎలా వర్తిస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల వంతున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము డిమాండ్ చేసిన విధంగా నష్ట పరిహారం చెల్లించే వరకు మృతదేహాలను తరలించేందుకు అంగీకరించబోమని భీష్మించారు. దీంతో కలెక్టర్ బాబు.ఎ, ఎస్పీ జి.విజయకుమార్ నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూనే మరో పక్క పోలీసుల సాయంతో వారిని అక్కడ నుంచి పంపివేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సామినేని ఉదయభాను, తిరువూరు శాసనసభ్యుడు రక్షణ నిధి, అధికార ప్రతినిధి జోగి రమేష్, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగ న్మోహనరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.