అనంతపురం సెంట్రల్: వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఏపీ05 డబ్ల్యూ 8556 నంబరుగల దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తున్నది రాంగ్ రూటేనని రోడ్డు రవాణా శాఖ అధికారులు నిర్దారించారు. రెండురోజుల క్రితం ఈ బస్సు బెళుగుప్ప మండల పరిధిలో అతివేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదానికి గురై 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గతంలో వ్యవసాయ అనుబంధ ‘ఆత్మ’ డీడీ రమణ ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టి.. ఆయన మృతికి కారణమైంది. ఇలా వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఈ బస్సు కర్ణాటక ప్రభుత్వం నుంచి పర్మిట్ పొందింది ఒక రూటైతే.. ప్రయాణికులను ఎక్కించుకుంటున్నది మరో రూట్ కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్‌వద్దీ సదరు ట్రావెల్స్ యజమాన్యానికి బుధవారం నోటీసులు పంపారు.